కన్నడ సీమలో పుట్టిపెరిగిన తెలుగు అందం ఆమె. చిన్నప్పటి నుంచీ నటనపై మక్కువ పెంచుకుని బుల్లితెరకు దగ్గరైంది. మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. జీ తెలుగులో ‘ప్రేమ ఎంత మధురం’ సీరియల్‌తో రాజనందినిగా తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైంది మానసా మనోహర్. వ్యక్తిగత జీవితం ఆనందంగా ఉంటేనే వృత్తిపరంగా అద్భుతాలు సాధించగలమని చెబుతున్న నటి మానస ముచ్చట్లు..
2014లో ‘మిస్ కర్ణాటక’గా ఎంపికయ్యా. అదే సంవత్సరం ‘మోస్ట్ డిజైరబుల్ విమన్ ఇన్ కర్ణాటక’ అవార్డు అందుకున్నా. గత ఏడాది ‘జీ కుటుంబం’ అవార్డుల్లో ఉత్తమ నటి పురస్కారం స్వీకరించా.
ఇండస్ట్రీకి ఎలా వచ్చారు?
చిన్నప్పటి నుంచీ బాగా చదివేదాన్ని. ఎప్పుడూ మంచి మార్కులు తెచ్చుకునేదాన్ని. ఎంబీఏ చివరి సంవత్సరంలో మీడియా అండ్ ఈవెంట్ మేనేజ్మెంట్లో స్పెషలైజేషన్ చేశాను. ఇంటర్న్‌షిప్ కోసం స్థానిక ‘రాజ్ మ్యూజిక్’ చానల్లో పనిచేశాను. ఓసారి, అందులోనే ఓ లైవ్ షో కోసం ఆడిషన్స్ జరిగాయి. దాదాపు రెండున్నర వేలమందిలో నేను సెలెక్టయ్యాను. అలా ఓ మ్యూజిక్ ప్రోగ్రామ్ వీడియో జాకీగా నా కెరీర్ ప్రారంభమైంది.
ఇప్పటివరకు ఎన్ని సీరియల్స్‌లో?
వీడియో జాకీగా చేస్తున్నప్పుడే ‘అశ్వినీ నక్షత్ర’ అనే కన్నడ సీరియల్లో ఓ చిన్న పాత్రలో నటించా. అప్పటికి నా చదువు ఇంకా పూర్తవలేదు. ఎంబీఏ తర్వాతే నటనపైనే దృష్టిపెట్టా. మొదటి సీరియల్ డైరెక్టరే, తర్వాత రెండు సీరియల్స్‌లోనూ ప్రధాన పాత్రల్లో అవకాశం ఇచ్చారు. జీ కన్నడలో ప్రసారమైన ‘అమృత వర్షిణి’ నా కెరీర్‌ను మలుపుతిప్పింది. ప్రస్తుతం నటిస్తున్న ‘జొతె జొతెయలి’ కూడా మంచి ఆదరణ పొందుతున్నది. ఇప్పటివరకు ఆరు సీరియల్స్‌లో నటించా. ప్రస్తుతం జీ తెలుగులో ప్రసారం అవుతున్న ‘ప్రేమ ఎంత మధురం’ సీరియల్లో రాజ నందిని పాత్రతో మొదటిసారి తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చాను.
సినిమాల్లో నటించారా?
కన్నడ, తమిళ, తెలుగు భాషల్లో ఒక్కో సినిమా చేశా. కన్నడలో ‘మై డార్లింగ్’ నా మొదటి సినిమా. తమిళంలో ‘2015 లవ్‌స్టోరీ’ ఓటీటీలో విడుదలకు సిద్ధంగా ఉంది. తెలుగులో ‘నాకు నేనే’ సినిమా చేశా. ప్రస్తుతం తెలుగులో రెండు, తమిళంలో ఒక సినిమాలో నటిస్తున్నా. లాక్డౌన్ కారణంగా షూటింగ్స్‌కి గ్యాప్ వచ్చింది. త్వరలోనే అవీ పూర్తి కానున్నాయి.
తెలుగులో భాషా పరమైన ఇబ్బందులున్నాయా?
మా నాన్నగారు తెలుగువారు కావడంతో బంధువులంతా ఇక్కడి వాళ్లే. నాకు తెలుగు మాట్లాడటం పూర్తిగా రాకపోయినా, బాగా అర్థం అవుతుంది. చదువగలను కూడా. నా డైలాగులన్నీ నేనే చదువుకుని ప్రామ్టింగ్ లేకుండా చెబుతాను. కన్నడలో ఆదరణ పొందిన పాత్రకు కొనసాగింపుగానే తెలుగులో అడుగుపెట్టాను. రాజ నందినిగా తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నా.
మీ అభిమాన నటీనటులు ఎవరు?
నా చిన్నప్పటి క్రష్ హృతిక్ రోషన్. కన్నడలో యష్ అంటే అభిమానం. ఆయన నటన, అంకితభావం నాకు ఆదర్శం. తెలుగులో అల్లు అర్జున్ వీరాభిమానిని. మొదటి సినిమా నుంచి ఇప్పటివరకు ఆయన నటన, లుక్స్‌లో వచ్చిన మార్పు సూపర్బ్ అనిపిస్తుంటుంది. ఆయన ైస్టెల్, డ్యాన్స్, టైమింగ్.. బాగుంటాయి.
ఎక్కువగా ఇష్టపడే ప్రాంతం?
పుట్టిపెరిగిన బెంగళూరు అంటే ఇష్టం. ఖాళీ సమయాల్లో గోవా బీచ్‌లో సముద్రాన్ని చూస్తూ గడపడానికి ఇష్టపడతా. సమయం దొరికితే కుటుంబంతో గడపడానికి ప్రాధాన్యం ఇస్తా. నాకు జంతువులంటే ఇష్టం. సమయం దొరికితే పెట్స్‌తో స్పెండ్ చేస్తా.
ఎవరిని ఆదర్శంగా తీసుకుంటారు?
చదువుకునే రోజులనుంచీ నాకు కల్పనా చావ్లా అంటే అభిమానం. ఆమె బయోగ్రఫీ మాకు పాఠ్యాంశంగా ఉండేది. ఆమె కుటుంబ నేపథ్యం, ఉన్నత లక్ష్యం స్ఫూర్తినిచ్చాయి. మామూలు కుటుంబంలో పుట్టిన ఓ ఆడపిల్ల అంతరిక్షంలోకి వెళ్లాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం గొప్ప విషయం. అనుకున్నది సాధించడానికి ఆమె చేసిన కృషి వృథా కాలేదు. చావ్లాను ఆదర్శంగా తీసుకుని ఎంబీఏ చదివినా.. నాకు నచ్చిన రంగంలో రాణించాలని నిర్ణయించుకున్నా. ఎక్కడైనా ఒడుదొడుకులు ఉంటాయి. వాటిని తట్టుకుని నిలబడితే అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవచ్చని బలంగా నమ్ముతాను.
ప్రేమ, పెండ్లిపై మీ అభిప్రాయం?
ఈ రెండూ జీవితంలో ముఖ్యమైన విషయాలే. కానీ, మన జీవితంలోకి వచ్చే వ్యక్తిని ఎంచుకోవడంలోనే ఉంటుందంతా. సరైన వ్యక్తిని ఎంచుకుంటే జీవితం హాయిగా, ఆనందంగా ఉంటుంది. లేకపోతే నరకమవుతుంది. సరైన జీవిత భాగస్వామిని ఎంచుకోలేక అర్ధాంతరంగా విడిపోతున్న ఎన్నో జంటలను చూస్తున్నాం. ముఖ్యంగా భాగస్వామి ఎంపికలో తల్లిదండ్రుల అభిప్రాయం తప్పకుండా పరిగణనలోకి తీసుకోవాలి. వ్యక్తిగతంగా జీవితం బాగుంటేనే వృత్తిపరంగా ఉన్నత లక్ష్యాలను చేరుకోగలం. పనిలో తప్పు చేస్తే సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది. కానీ, జీవితంలో అలాంటి అవకాశం రాకపోవచ్చు. అందుకే, ప్రేమ, పెండ్లి విషయాల్లో ఆచితూచి నిర్ణయం తీసుకోవాలి.
చిన్నప్పటి నుంచీ అంతే..
మా నాన్నది హిందూపూర్. కానీ, నేను పుట్టి పెరిగింది బెంగళూర్లోనే. ఊహ తెలియనప్పటి నుంచే అందంగా అలంకరించుకునేదాన్నట. మూడు, నాలుగేండ్ల వయసులో అద్దం ముందు నిల్చొని మేకప్ వేసుకొనేదాన్నట. డ్యాన్స్ చేసేదాన్నట. నాలుగేండ్ల పాటు భరతనాట్యం కూడా నేర్చుకున్నా. కాలేజీలో చాలా ప్రదర్శనలు ఇచ్చాను. డ్యాన్స్, డిబేట్, డ్రామా.. ఏ ఈవెంట్ జరిగినా వేదికపై ఉండేందుకు ఇష్టపడేదాన్ని. ఆ అభిరుచే నన్ను ఇండస్ట్రీ
వైపు నడిపించిందని నమ్ముతాను.
… ప్రవళిక వేముల