ఒక్క కన్నుగీటుతో యువతరం హృదయాలను కొల్లగొట్టింది. రెండు బొమ్మలెగరేసి ఇండస్ట్రీని ఊపేసిన మలబారు ముద్దుగుమ్మ.. ప్రియా ప్రకాశ్ వారియర్. మలయాళ చిత్రం ‘ఒరు అదార్ లవ్’తో ఓవర్‌నైట్ స్టార్ అయిన ఈ కేరళ కుట్టి , ఇప్పుడు ఇండస్ట్రీలో వరుస
అవకాశాలు అందుకుంటున్నది. ‘సినిమాలపై ఇష్టంతో నటనను తప్ప మరో కెరీర్‌ను ఊహించుకోలేకపోయా. సినిమాల్లో నటించడమే లక్ష్యంగా పెట్టుకున్నా. ఎన్ని అవరోధాలు ఎదురైనా నా కలల సాధన కోసం ప్రయాణాన్ని కొనసాగిస్తా’ అంటున్న ప్రియ ‘జిందగీ’తో పంచుకున్న విశేషాలివి..
నేను ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి రెండున్నరేండ్లు అయ్యింది. ఈ చిన్న ప్రయాణమే ఎన్నో పాఠాలు నేర్పింది. వ్యక్తిగతంగా, వృత్తిపరంగా నన్ను బలంగా మార్చింది. సాధారణంగా తొలి సినిమా విడుదలైన తర్వాత విరామం తీసుకోవాలని ఎవరూ అనుకోరు. నేను మాత్రం రెండేండ్లు సినిమాలకు దూరంగా ఉన్నా. కావాలనే ఆ నిర్ణయం తీసుకున్నా. ఈ గ్యాప్‌లో కెరీర్‌ను ఎలా తీర్చిదిద్దుకోవాలనే ప్రణాళికలు వేసుకున్నా. కొవిడ్ వల్ల గతేడాది నేను నటించిన సినిమాలు కొన్ని విడుదల కాలేదు. విరామానికి అదీ ఓ కారణమే.
ఈ గ్యాప్‌లో చాలా కథలు విన్నా. ప్రేమ, ఎంటర్టైన్మెంట్ కథాంశాలతో పలువురు దర్శకులు నన్ను వెతుక్కుంటూ వచ్చారు. అవేవీ నాకు నచ్చలేదు. ఒకసారి చేసిన పాత్రలో మళ్లీ కనిపించడం వల్ల కెరీర్‌కు ఉపయోగం ఉండదని నా నమ్మకం. అందుకే వాటన్నిటినీ తిరస్కరించా. డిగ్రీ మధ్యలో ఉండగా ‘ఒరు అదార్ లవ్’లో నటించా. గ్రాడ్యుయేషన్ పూర్తిచేయాలనే ఆలోచనతో మంచి
అవకాశాలు వచ్చినా చేయలేదు.
సోషల్ మీడియా వల్ల లాభనష్టాలు రెండూ ఉంటాయి. మంచి కోసం సరైన రీతిలో సామాజిక మాధ్యమాల్ని ఉపయోగించుకోవడం అవసరం. కానీ, నేడు చాలామంది ట్విటర్, ఫేస్‌బుక్‌లను నెగెటివ్ పబ్లిసిటీ కోసం, ఇతరుల్ని ట్రోల్ చేయడానికే ఉపయోగిస్తున్నారు. ట్రోల్స్, మీమ్స్ మనలోని తప్పుల్ని సరిదిద్దుకునేలా ఆరోగ్యకరంగా ఉండాలి. ఏదైనా శ్రుతి మించితే అనర్థాలకు దారి
తీస్తుంది. ఇతరుల మనోభావాలను కించపరిచే హక్కు ఎవరికీ లేదు. కెరీర్ తొలినాళ్లలో బాడీషేమింగ్, డ్రెస్సింగ్ విషయంలో నాపై చాలా ట్రోల్స్ వచ్చాయి. అవన్నీ చూసి బాధపడేదాన్ని. మానసిక ప్రశాంతత కోసం కొన్నాళ్లు సోషల్ మీడియాకు దూరంగా ఉన్నా. ఇప్పుడు అలాంటి విమర్శల్ని సమర్థంగా ఎదుర్కొనే ధైర్యం వచ్చింది.
ముందుగా కథ బాగుండాలి. తర్వాత ఆ సినిమాలో నా పాత్రకు ఎంతవరకు ప్రాధాన్యం ఉందో చూస్తా. ఈ రెండూ నచ్చితేనే అంగీకరిస్తా. కథ బాగుంటే, ఆ సినిమాలో ఎంతమంది హీరోయిన్లు ఉన్నారు? నా పాత్ర నిడివి ఎంత? అనేది పట్టించుకోను. ‘చెక్’ సినిమాను అలాగే అంగీకరించా.
వింక్‌గాళ్ ఇమేజ్ను ప్లస్గానే భావిస్తున్నా. అదే నన్ను స్టార్‌ను చేసింది. గొప్ప పేరు తెచ్చింది. ఆ ఇమేజ్‌కే కట్టుబడిపోకుండా, మంచి నటిగా ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోవాలన్నదే నా ఆశయం. ప్రతి సినిమాలో భిన్న పార్శాలున్న పాత్రతో నటిగా నన్ను నేను కొత్తగా ఆవిష్కరించుకునేందుకు ప్రయత్నిస్తున్నా. తొలి సినిమా తీసుకొచ్చిన గుర్తింపును నిలబెట్టుకోవడం చాలెంజింగ్‌గా మారింది. ఎలాంటి వారసత్వం లేకుండా ఇండస్ట్రీలో అడుగుపెట్టా. అవుట్‌సైడర్స్ ఇండస్ట్రీలో రాణించడం అనుకున్నంత సులభం కాదు. మంచి కథలు, పాత్రలను ఎన్నుకున్నప్పుడే నిలదొక్కుకోగలమని అర్థమైంది. అందుకే సినిమాల ఎంపికలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నా.
ఒకరి పేరు చెప్పడం కష్టమే. అందరినీ అభిమానిస్తా. వ్యక్తిగతంగా కంటే, పాత్రల పరంగానే నేను హీరోల్ని ఇష్టపడుతుంటా. రెండేండ్ల నుంచీ తెలుగు సినిమాలు ఎక్కువగా చూస్తున్నా. తెలుగు భాషపై పట్టు సాధించా.
ప్రస్తుతం తెలుగు సినిమాలపైనే దృష్టి పెట్టా. అలాగని ఇతర భాషలకు దూరం కాను. తెలుగు సినిమాల్లో కమర్షియల్ అంశాలతోపాటు ఎంటర్టైన్మెంట్కు ఎక్కువ ప్రాధాన్యమిస్తారు. పాటలు, ఫైట్స్ లేకుండా తెలుగు సినిమాను ఊహించలేం. మలయాళంలో వాణిజ్య అంశాల కంటే కథకే ప్రాముఖ్యం ఎక్కువ ఉంటుంది. సినిమాల నుంచి ప్రేక్షకులు ఏం కోరుకుంటున్నారో, వాటిని అందించడమే ముఖ్యమని నా అభిప్రాయం.