సదా మీ సేవలో.. ఎఫ్ఐఆర్ అంటే?

స్టేషన్ బెయిల్ అంటే?జీరో ఎఫ్ఐఆర్ అంటే?ఈ ప్రశ్నలు సామాన్యులను అడిగితే సమాధానం ‘ఏమో..! తెలీదు’ అనే వస్తుంది. చట్టం ఒక్క ఫోన్‌కాల్ దూరంలో ఉన్నా చాలామంది స్టేషన్ తలుపు తట్టడానికి సంకోచిస్తారు. ఈ విషయంలో ఆడవాళ్లయితే మరింత భయపడతారు! పల్లెపడుచులు, పట్నాల్లో ఉద్యోగాలు చేస్తున్న మహిళలు సైతం.. ఆపదలోనూ పోలీసులను ఆశ్రయించడానికి వెనుకంజ వేస్తారు. కారణం చట్టంపై అవగాహనా లేమి. న్యాయవ్యవస్థను ఎలా సంప్రదించాలో తెలియనితనం. మహిళల హక్కులు, వారి కోసం ప్రత్యేకంగా చేసిన చట్టాలను ఒక్క దగ్గరకు చేర్చి ‘పింక్ లీగల్' వేదికగా అవగాహన కల్పిసున్నారు లాయర్ మానసి చౌదరి.
మానసి తండ్రి శంతన్ చౌదరి ఆర్కిటెక్ట్. తల్లి మధుర చౌదరి హోమియోపతి డాక్టర్. వారిది మరాఠీ కుటుంబం. మానసి పుట్టింది మహారాష్ట్రలో. కానీ, పెరిగిందంతా హైదరాబాద్‌లోనే. మానసి తాతయ్య ముంబయి హైకోర్టు జడ్జిగా పనిచేశారు. చిన్నప్పుడు అడపాదడపా తాతయ్యతో కోర్టుకు వెళ్లేది. అక్కడ లాయర్ల వాదప్రతివాదనలు చాలా ఆసక్తిగా అనిపించేవి ఆమెకు. ఇంటికి వచ్చాక కూడా కోర్టు సీన్లు ఆమె మనసు తెరపై కదలాడుతూనే ఉండేవి. దీంతో పెద్దయ్యాక లాయర్ కావాలని ఆనాడే నిర్ణయించుకుంది మానసి. ఇంటర్ తర్వాత ఢిల్లీలో ‘జిందాల్ గ్లోబల్ లా స్కూల్'లో బీఏ ఎల్ఎల్బీ చేసింది. హైదరాబాద్‌కు వచ్చి హైకోర్టులో సీనియర్ అడ్వొకేట్ ఎస్.నిరంజన్‌రెడ్డి దగ్గర మూడేండ్లు ప్రాక్టీస్ చేసింది. 2018లో మళ్లీ ఢిల్లీకి వెళ్లి జస్టిస్ చంద్రచూడ్ ఆఫీస్‌లో కొన్ని నెలలు పనిచేసింది. ఆ సమయంలోనే ఆర్టికల్ 377, శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశం వంటి కేసుల్లో రీసెర్చ్, ఫైలింగ్ వర్క్‌లో పాలుపంచుకుంది మానసి. 2019లో తిరిగి హైదరాబాద్‌కు వచ్చి కార్పొరేట్ అండ్ రియల్ఎస్టేట్ అడ్వకేట్‌గా ‘ఎంసీ లీగల్' పేరుతో సొంత ప్రాక్టీస్ పెట్టుకున్నది.
చట్టాలపై అవగాహన కోసం..
తన వాదనను బలంగా వినిపించే తత్వం చిన్నప్పటి నుంచే ఆమెకు అలవడింది. స్కూల్లో జెండర్ ఈక్వాలిటీ మీద బల్లగుద్ది వాదించేది మానసి. ‘స్టూడెంట్ లీడర్స్‌గా ఒక అమ్మాయి, అబ్బాయి ఉండేవారు. ఏ కార్యక్రమం జరిగినా అబ్బాయికే ప్రాధాన్యం ఇస్తుండేవారు. ఎందుకో అర్థమయ్యేది కాదు! ‘అబ్బాయిలెంతో.. అమ్మాయిలూ అంతే కదా’ అని వాదించేదాన్ని. ఆ వివక్షను పెద్దయ్యాక కూడా చాలా చోట్ల గమనించాను’ అంటుంది మానసి. చిన్నప్పుడు లోలోపల ఆలోచించే మానసి.. ఇప్పుడు అలాంటి పరిస్థితులు ఎదురైతే చూస్తూ ఊరుకోదు. వెంటనే తన వాదన వినిపించి అవతలి వాళ్ల నోళ్లు మూయిస్తుంది. ఈ క్రమంలోనే మహిళలకు అండగా, చట్టంపై అవగాహన కల్పించే ఉద్దేశంతో ఓ వేదికను ఏర్పాటు చేసింది. న్యాయవిద్యను అభ్యసిస్తున్న యువతులతో కలిసి ‘పింక్లీగల్' (pinklegal.in) వెబ్సైట్ నిర్వహిస్తున్నది.
న్యాయం కావాలంటే..
తన జీవితంలో ఎదురైన ఓ సంఘటన పింక్లీగల్ ఏర్పాటుకు దారితీసిందని చెబుతుంది మానసి. ‘ఓసారి జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ దగ్గర నా కారును.. మరో కారు ఢీకొట్టింది. తప్పువారిదే అయినా.. కారులోని ఇద్దరు యువకులు వాదనకు దిగారు. నా కారు అద్దాలను కొడుతూ అరగంట గొడవ చేశారు. చుట్టుపక్కల ఉన్నవాళ్లు ఎవరూ మావైపు రాలేదు. వాళ్ల కారు నంబర్ ఫొటో తీశాను. పోలీస్ కంప్లయింట్ చేస్తానంటే.. ఇంట్లో వాళ్లు ‘ఎందుకు గొడవ?’ అన్నట్టుగా మాట్లాడారు. ‘లా చదివిన నేనే కేసు పెట్టడానికి వెనుకంజ వేస్తే.. సామాన్యుల పరిస్థితి ఏమిటి?’ అనిపించింది. నేరుగా స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాను. ఐదురోజుల తర్వాత స్టేషన్ నుంచి ఫోన్ వచ్చింది. ఆ ఆగంతకులు దొరికారని చెప్పారు. నేను స్టేషన్‌కు వెళ్లి గట్టిగా మాట్లాడితే.. క్షమాపణ కోరుతూ లెటర్ రాసిచ్చారు. ‘మళ్లీ ఇలాంటి తప్పు చేయమ’ని బతిమాలడంతో కేస్ విత్‌డ్రా చేసుకున్నా. పోలీస్ స్టేషన్‌కు వెళ్లబట్టే ఆ ఆగంతకుల ఆచూకీ లభించింది. వాళ్లలో పరివర్తన సాధ్యమైంది. చాలామంది కంప్లెయింట్ చేయడానికి కూడా ఇష్టపడరు. కానీ, ఆపదలో పోలీసులను ఆశ్రయించాలి. అప్పుడే న్యాయం జరుగుతుంది. చట్టంపై అవగాహన కల్పిస్తే గానీ, స్టేషన్‌కు వెళ్లాలనే ఆలోచన రాదు. అందుకే పింక్లీగల్ ఏర్పాటు చేశాను’ అంటుంది మానసి.
తేలికైన భాషలో..
‘చట్టం చెబుతున్న విషయం గురించి పేరాలకు పేరాలు ఆరాలు తీసినా అర్థం కానట్టే ఉంటుంది. అందుకే మన న్యాయవ్యవస్థ మహిళలకు కల్పించిన హక్కులు, చట్టాలు తేలికైన భాషలో తీసుకురావాలనుకున్నా. దేశవ్యాప్తంగా కొందరు లా విద్యార్థినులతో కలిసి 2019లో పింక్ లీగల్ పని మొదలుపెట్టాను. గతేడాది, అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి 8న వెబ్సైట్ మొదలుపెట్టాం’ అని వివరించింది మానసి. ‘పింక్ లీగల్' ఇండియాలోనే మహిళల హక్కులు, చట్టాల గురించి పూర్తి వివరాలు ఉన్న మొదటి వెబ్‌పోర్టల్. పోలీసులను ఎప్పుడు సంప్రదించాలి, ఎలా కంప్లెయింట్ చేయాలి, ఎఫ్ఐఆర్ అంటే ఏమిటి?, బెయిల్ ఎలా పొందాలి? ఇలా చట్టపరమైన అంశాలన్నీ వెబ్సైట్లో పొందుపరిచారు. మహిళలకు కల్పించిన హక్కుల వివరాలూ ఇందులో చూడొచ్చు. వెబ్సైట్ లాంచ్ అయిన వారం రోజుల్లోనే 65వేల హిట్స్ సాధించింది. వాట్సాప్ గ్రూపుల్లో బాగా వైరల్ అయింది.
బాధితుల పక్షాన..
ఈ వెబ్సైట్ మహిళలకు మూడు విధాలుగా సాయం అందిస్తుంది. వాళ్లకు ఉన్న హక్కులు, ప్రత్యేక చట్టాలను సులభమైన శైలిలో అందిస్తుంది. న్యాయపరమైన అంశాల్లో ప్రశ్న-జవాబు పద్ధతిలో సమాచారం ఇస్తుంది. ‘మహిళలు తమకున్న సమస్యలు, దానికి తగిన పరిష్కార మార్గాల గురించి ఈ-మెయిల్ ద్వారా ప్రశ్నలు అడగవచ్చు. ఏడాదిలో మేం వందలాది మంది మహిళలకు లీగల్ కౌన్సెలింగ్ ఇచ్చాం. సామాజిక మాధ్యమాల ద్వారా కూడా అవగాహన కల్పిస్తున్నాం. చాలామంది వాళ్ల కేసు కోసం న్యాయవాదుల వివరాలు అడుగుతున్నారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లోని వందమందికిపైగా న్యాయవాదులను సంప్రదించి, తమ నగరాల నుంచి వచ్చే కేసులు టేకప్ చేసేందుకు ఒప్పించగలిగాం. అలా మమ్మల్ని ఆశ్రయించిన బాధిత మహిళలకు లాయర్లను అటాచ్ చేస్తూ బాధితుల పక్షాన నిలుస్తున్నాం’ అని వివరించింది మానసి. చట్టాలపై అవగాహన కల్పించడమే కాదు, న్యాయవ్యవస్థపై నమ్మకాన్నీ పెంచుతున్నది పింక్లీగల్.
95 శాతం గృహహింస బాధితులే
పింక్లీగల్ను సంప్రదిస్తున్న వారిలో 95 శాతం మంది డొమెస్టిక్ వయొలెన్స్ బాధితులే. భర్త, అత్తమామల పోరు పడలేక న్యాయం కోసం ఎదురుచూస్తున్న వారు ఎందరో. కుటుంబసభ్యుల వల్ల ఏ రకమైన ఇబ్బంది ఎదురైనా డొమెస్టిక్ వయొలెన్స్ కింద కేస్ ఫైల్ చేయొచ్చు. కుటుంబ మర్యాద పోతుందనో, బంధువులు ఏమనుకుంటారనో హింసను భరించొద్దు. చాలా కేసులు కోర్టుకు వెళ్లకముందే పోలీసుల చొరవతోనే పరిష్కారం అవుతాయి. మన రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉంది. ఎలాంటి భయాలు పెట్టుకోకుండా.. సమస్య ఎదురైన వెంటనే 100కి ఫోన్ చేయడం మర్చిపోవద్దు.పోలీస్ స్టేషన్‌కు వెళ్లడాన్ని నామోషీగా భావించి చాలామంది కంప్లెయింట్ చేయడానికీ ఇష్టపడరు. కానీ, ఆపదలో పోలీసులను ఆశ్రయించాలి. అప్పుడే న్యాయం జరుగుతుంది. చట్టంపై అవగాహన ఉంటేగానీ స్టేషన్‌కు వెళ్లాలనే ఆలోచన రాదు.
-నిఖిత నెల్లుట్ల