e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, July 24, 2021
Home జిందగీ ఆమె మాటే మంత్రం!

ఆమె మాటే మంత్రం!

ఆమె మాటే మంత్రం!

పైలట్‌ కావాలనుకున్నాడు. అందుకు తగ్గట్టుగా చదువుల్లో రాణించాడు. రాష్ట్రస్థాయి క్రీడాకారుడిగా గుర్తింపు పొందాడు. కానీ, అనుకోని ఓ అవకాశం అతడిని బుల్లితెర హీరోను చేసింది. ఓ స్నేహితురాలి సలహా తన జీవితాన్నే మార్చేసిందంటున్నాడు జీ తెలుగు ‘వైదేహి పరిణయం’ హీరో పవన్‌ రవీంద్ర. తన ప్రతి అడుగులోనూ కుటుంబంతోపాటు స్నేహితులుకూడా ఉన్నారంటున్న పవన్‌ ‘జిందగీ’తో పంచుకున్న ముచ్చట్లు..

మనం కోరుకున్నట్టుగా జీవితం ఉండదు. అనుకోకుండా జరిగే కొన్ని సంఘటనలు జీవితాన్ని ఊహించనంతగా మార్చేస్తాయనడానికి నేనే ఉదాహరణ. మాది బెంగళూరు. పైలట్‌ అవ్వాలన్నది నా కల. చిన్నప్పటినుంచీ 90 పర్సెంట్‌కి పైగా మార్కులు సాధించేవాడిని. అయితే, డిగ్రీ చదువుతున్నప్పుడు నా ఫ్రెండ్‌ సలహాతో ఓ ఫ్యాషన్‌ షోలో పాల్గొన్నా. అసలు, షో ఎలా ఉంటుందో చూద్దామనుకున్నా, అంతే. అనుకోకుండా, ఆడిషన్స్‌కు సెలక్ట్‌ అయ్యాను. ఓ ప్రముఖ సంస్థ నిర్వహించిన ఆ షోలో దేశవ్యాప్తంగా 3,000 మంది మోడల్స్‌ పాల్గొన్నారు. నేను మొదటి మూడు స్థానాల్లో నిలిచా. ఏటా జరిగే ఆ షోలో దక్షిణాదినుంచి టాప్‌ త్రీలో నిలిచిన మొదటి వ్యక్తిని నేనే. షోలో పాల్గొన్నప్పుడు మోడలింగ్‌ మాత్రమే చేద్దామనుకున్నా. కానీ, తర్వాత కన్నడ పరిశ్రమ నుంచి అవకాశాలు వచ్చాయి. ‘జానకి రాఘవ’ సీరియల్‌తో మొదటిసారి ప్రేక్షకుల ముందుకొచ్చా.

- Advertisement -

మూడు నెలల విరామం: ‘జానకి రాఘవ’ సీరియల్‌తో మంచి పేరొచ్చింది. వంద ఎపిసోడ్లు పూర్తయ్యాక కొన్ని కారణాలవల్ల ఆగిపోయింది. అనుకోకుండా మూడు నెలల విరామం వచ్చింది. ఈ టైమ్‌లో నాలోని నటుడిని మెరుగు పర్చుకున్నా. కన్నడ, తెలుగు, మలయాళం, తమిళం, హిందీ సినిమాలు చూస్తూ రకరకాల సన్నివేశాల్లో ఆయా హీరోలు ఎలా నటిస్తున్నారో గమనించా. అలా నాకు నేను నటనలో మెలకువలు నేర్చుకున్నా. అప్పుడే కలర్స్‌ కన్నడ చానల్‌ ‘రంగనాయకి’ సీరియల్‌ అవకాశం వచ్చింది. మూడు నెలల్లో నేర్చుకున్న విషయాలు ఎంతగానో ఉపయోగపడ్డాయి. ఆ సీరియల్‌ పెద్ద విజయం సాధించింది. అదే సమయంలో తెలుగునుంచి స్టార్‌ మా ‘మౌనరాగం’ సీరియల్లో హీరోగా ఎంపికయ్యా. అందులో అంధుడిగా నటించా. బుల్లితెరపై హీరో ఓ అంధుడిగా వచ్చిన మొదటి సీరియల్‌ అది. ఆ పాత్రతో నాకు మంచి గుర్తింపు లభించింది. తెలుగు సీరియల్స్‌ చేసే నాటికి నాకు భాష అర్థమయ్యేది. ఇప్పుడు చక్కగా మాట్లాడగలను కూడా.

అందరి ప్రోత్సాహంతో: ప్రస్తుతం జీ తెలుగులో ‘వైదేహి పరిణయం’ సీరియల్‌తోపాటు కన్నడ ఉదయ చానల్‌లో ‘కావ్యాంజలి’ చేస్తున్నా. ఆ సీరియల్‌ మొదలైన నాటి నుంచి టాప్‌ రేటింగ్‌లో కొనసాగుతున్నది. తెలుగు ప్రేక్షకులు కూడా బాగా ఆదరిస్తున్నారు. నా నటనను మెచ్చుకుంటూ సోషల్‌ మీడియాలో రోజూ కొన్ని వందల మెసెజ్‌లు, కామెంట్లు పెడుతున్నారు. అభిమానుల ప్రోత్సాహం ఎప్పటికీ మరిచిపోలేను.

స్నేహితురాలి మాటతో: చిన్నప్పటినుంచీ నేనేం చేసినా నా కుటుంబం ప్రోత్సహిస్తూనే ఉంది. చదువు వదిలేసి నటుణ్ణి అవ్వాలనుకున్నప్పుడు కూడా నాతో అంతా ఏకీభవించారు. కుటుంబంతోపాటు స్నేహితులు నా ప్రతి అడుగులోనూ తోడున్నారు. ‘చదువే కెరీర్‌’ అని భావిస్తున్న సమయంలో నా స్నేహితురాలు మెహ్రీన్‌ థార్‌ఫర్‌ ఫ్యాషన్‌ షోలో పాల్గొనమని ప్రోత్సహించింది. తన సలహాతోనే మోడలింగ్‌, యాక్టింగ్‌ రంగంలోకి వచ్చాను. ఆమె సలహా నా జీవితాన్ని మలుపు తిప్పింది. అనుకోకుండా ఈ రంగంలోకి వచ్చినా, ఇప్పుడు మాత్రం నటనని పూర్తిగా ఆస్వాదిస్తూ ఆనందకరమైన జీవితాన్ని గడుపుతున్నా.

భవిష్యత్తులో సినిమా హీరోగా చేస్తాను. కొన్ని కథలు విన్నాను కానీ, ఇంకా ఫైనల్‌ కాలేదు. తమిళంలోనూ అవకాశాలు వస్తున్నాయి. కానీ, ఇప్పటికే కన్నడ, తెలుగులో బిజీగా
ఉండటంతో డేట్స్‌ కుదరడం లేదు. తెలుగులో ప్రభాస్‌, అల్లు అర్జున్‌ నటన అంటే చాలా ఇష్టం. వారిద్దరికీ వీరాభిమానిని. కన్నడలో కిచ్చ సుదీప్‌ అంటే ఇష్టం.

ప్రవళిక వేముల

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఆమె మాటే మంత్రం!
ఆమె మాటే మంత్రం!
ఆమె మాటే మంత్రం!

ట్రెండింగ్‌

Advertisement