ఆదివారం 25 అక్టోబర్ 2020
Zindagi - Aug 13, 2020 , 23:25:06

రాకెట్లకు రైట్‌ రైట్‌

రాకెట్లకు రైట్‌ రైట్‌

గత నెల మన దేశం నుంచి ఓ చిన్న రాకెట్‌ అంతరిక్షంలోకి దూసుకుపోయింది. అబ్బే అందులో వార్త ఏముంది! మన ఘన ఇస్రో... తారాజువ్వలంత తేలికగా రాకెట్లని సంధించగలదు కదా అనుకుంటున్నారేమో! ఆ రాకెట్‌ను ప్రయోగించింది ఓ ప్రైవేట్‌ సంస్థ. దాన్ని స్థాపించింది ఓ తెలుగువాడు. ఇది వార్తే కదా!

‘నిప్పులు చిమ్ముకుంటూ... నింగికి నేనెగిరిపోతే’ అన్న శ్రీశ్రీ కవిత చదివే ఉంటాడు పవన్‌ కుమార్‌ చందన. అందుకే అవధులు లేని ఆకాశానికే తన లక్ష్యాన్ని గురిపెట్టాడు. పవన్‌ నెలకొల్పిన ‘స్కై రూట్‌'.. మన దేశంలో రాకెట్‌ను ప్రయోగించిన తొలి ప్రభుత్వేతర సంస్థగా చరిత్ర సృష్టించింది. ఈ ప్రయాణం ఇప్పుడే మొదలైంది కాదు.. అప్పుడే ముగిసిపోయేదీ కాదు. చాలా కథే ఉంది... ఉంటుంది!
పవన్‌ కుమార్‌ ఖరగ్‌పూర్‌లో ఐఐటీ చేశాడు. చదువు పూర్తయిన వెంటనే ఇస్రోలో శాస్త్రవేత్తగా ఉద్యోగం వచ్చింది. అందులో రాకెట్‌ డిజైన్‌ సెంటర్‌లో ఆరేళ్లు పనిచేశాడు. దేశ చరిత్రలోనే అతి భారీ రాకెట్‌ జీఎస్‌ఎల్‌వీ ఎమ్‌కే-III రూపకల్పనలో పాలుపంచుకున్నాడు. అలా సొంతగా రాకెట్‌ నిర్మించగల అనుభవం సంపాదించుకున్నాడు. ఇంతలో ఓ ప్రకటన అతన్ని ఆకర్షించింది. అప్పటి వరకు అంతరిక్ష రంగంలోకి ప్రైవేటు సంస్థలు ప్రవేశించడానికి వీల్లేదు. రాకెట్ల తయారీ, ఉపగ్రహాల రవాణా... వీటన్నింటి మీదా ప్రభుత్వానిదే బాధ్యత. కానీ, 2017లో ‘స్పేస్‌ యాక్టివిటీస్‌ బిల్లు’ ద్వారా ప్రైవేటు సంస్థలకు కూడా అనుమతివ్వాలనే ఆలోచన వచ్చింది తనకు. దీనికి ఇస్రో అండ కూడా ఉండటంతో ఎప్పటికైనా బిల్లు పాస్‌ కావడం తథ్యం అనుకున్నాడు పవన్‌. వెంటనే తన సహోద్యోగిని నాగ భర్తతో  కలిసి ‘స్కై రూట్‌'ని స్థాపించాడు.

రవాణాదే రాజ్యం!

ఉపగ్రహం తయారు చేయడం కష్టమేమీ కాదు. కానీ, దాన్ని నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టడమే అసలైన పరీక్ష. వందల కోట్లతో కూడుకున్న వ్యవహారం. ఏమాత్రం తేడా వచ్చినా.. కోట్ల రూపాయలు బూడిద పాలవుతాయి. అందుకే చాలా దేశాలు.. తమ ఉపగ్రహాలను పంపేందుకు ఇతర దేశాల మీద ఆధారపడుతూ ఉంటాయి. దిగ్గజ సంస్థలు కూడా తమ వ్యాపార అవసరాల కోసం సొంత ఉపగ్రహాలను పంపుతుంటాయి. ఓ అంచనా ప్రకారం 2027 నాటికి ఆరువేలకు పైగా ఉపగ్రహాలు, రోదసిలోకి చేరే అవకాశం ఉంది. ఒక్క అమెజాన్‌ సంస్థే, మారుమూల ప్రదేశాలకు ఇంటర్నెట్‌ సదుపాయం కల్పించేందుకు మూడు వేలకు పైగా ఉపగ్రహాలను ప్రవేశపెట్టనుంది. ఇన్నేసి ఉపగ్రహాలను రవాణా చేయడం ఓ లాభసాటి వ్యాపారంగా మారనుంది. ఇస్రోకు మరిన్ని ముఖ్యమైన బాధ్యతలు ఉండటంతో... ఈ రంగంలో ప్రైవేటు సంస్థలను ప్రోత్సహిస్తోంది.

ప్రయోగాలు మొదలు

ఇప్పటి వరకూ ఏం చెయ్యగలమో చెబుతూ వచ్చిన స్కై రూట్‌ ప్రయోగాలు మొదలుపెట్టింది. అందులో భాగంగానే సివి రామన్‌ పేరు మీదుగా ‘రామన్‌' అనే రాకెట్‌ తొలి దశను విజయవంతంగా ప్రయోగించింది. వేర్వేరు ఉపగ్రహాలను వేర్వేరు కక్ష్యలలోకి ప్రవేశపెట్టగలగడం దీని ప్రత్యేకత. మిగతా రాకెట్లతో పోలిస్తే సగం బరువే ఉండటం మరో విశేషం. అందువల్ల ఐదో వంతు సమయంలోనే రాకెట్‌ లక్ష్యాన్ని చేరుకుంటుంది. ఇక దేశంలోనే 3డి ప్రింటింగ్‌ ద్వారా రూపొందించిన తొలి రాకెట్‌ కావడం మరో చరిత్ర. సాధారణంగా ఉపగ్రహాన్ని లాంచ్‌ చేసేందుకు ఉపయోగించే రాకెట్లు ‘సాలిడ్‌ ప్రొపల్షన్‌' అనే సాంకేతికతను వాడుతుంటాయి. ఖరీదు ఎక్కువైనా, క్రయోజనిక్‌ అనే సాంకేతికత మరింత మెరుగ్గా పనిచేస్తుంది. స్కై రూట్‌ సంస్థ ఈ రెంటికీ సిద్ధపడే ఉంది. పవన్‌ను ప్రపంచం ఇప్పటికే గుర్తించింది. ఈ ఏడాది ఫోర్బ్స్‌ 30.. అండర్‌ 30 జాబితాలో అతడికి చోటు దక్కింది. స్కై రూట్‌ వ్యూహాలను గమనిస్తున్న వాళ్లు, ఇవన్నీ పవన్‌ విజయాలకు ఆరంభం మాత్రమే అంటున్నారు.

రెడీమేడ్‌ రాకెట్‌!

ఇంతకుముందు చెప్పుకున్నట్లు రాకెట్ల తయారీ కోట్లతో కూడుకున్న పని. తేడా వస్తే.. డబ్బంతా సముద్రం పాలే! అయినా పవన్‌ ప్రతిభను నమ్మి ‘క్యూర్‌ ఫిట్‌' అనే సంస్థ పెట్టుబడికి సిద్ధపడింది. వారి నమ్మకం వృధా పోలేదు. విక్రమ్‌ సారాభాయ్‌ పేరిట విక్రమ్‌ I, II, III అనే రాకెట్ల నమూనాలను సిద్ధం చేసింది స్కై రూట్‌. ఇవి 700 కిలోల బరువున్న ఉపగ్రహాలను, 500 కిలోమీటర్ల ఎత్తువరకు చేర్చగలవు. 3డి ప్రింటింగ్‌ను ఉపయోగించి ఒకే ఒక్క రోజులో రాకెట్‌ను తయారు చేసే స్థాయికి చేరుకుంటాం అంటున్నాడు పవన్‌.
రాకెట్లంటే నాకు చిన్నప్పటి నుంచీ ఇష్టం. అదే ఈ స్థాయికి చేర్చింది. రాకెట్లు లేకుండా భవిష్యత్తు లేదని నా నమ్మకం. రాకెట్లని చవకగా, తేలికగా 
తయారు చేయగలిగితే మరో అడుగు ముందుకు వేయవచ్చు. అదే అంతరిక్షయానం! విమానాలు ఎలాగైతే ఖండాల మధ్య దూరాన్ని చెరిపివేశాయో, రాకెట్లు గ్రహాల మధ్య వారధిగా మారతాయని నా నమ్మకం. మనం ఇప్పటివరకు జీవనాన్ని భూమికే పరిమితం చేశాం. రాకెట్లు మనల్ని విశ్వమానవులుగా మార్చేయగలవు. వేరే గ్రహాల నుంచి ఖనిజాలు తెచ్చుకోవచ్చు. అవకాశం ఉన్న చోట మనిషి తన సామ్రాజ్యాన్ని నిర్మించుకోవడానికి సాయపడతాయి.- పవన్‌ కుమార్‌ చందన


logo