చీరె.. మన దేశ సంస్కృతి. మన శారీ ట్రెండ్ పాకిస్థాన్ కట్టుబాట్లను ఓ కుదుపు కుదిపేస్తున్నది. ‘శారీస్ ఫర్ ఆల్ సైజెస్’ అనే హ్యాష్‌ట్యాగ్‌తో పాకిస్థానీ యువతులు ట్రెండ్ సెట్ చేస్తున్నారు. దీనికి మూలకారణం రమ్షా సోహైబ్. అన్ని వయసులవారికి అనువైన శారీలు రూపొందిస్తూ, నవశకానికి నాంది పలికింది రమ్షా. పాకిస్థాన్ అమ్మాయిలు చీరెలు ధరించే అవకాశం లేదు. ఆ దేశపు కట్టుబాట్లు అలాంటివి. శరీరాన్ని బహిర్గతం చేసే దుస్తులు ఆ గడ్డమీద నేరం. అయితే, చీరె అందుకు మినహాయింపని అంటున్నది పాకిస్థాన్ ఫ్యాషన్ డిజైనర్ రమ్షా సోహైబ్. పాక్ ఇండియానుంచి విడిపోక మునుపు ముస్లిం మహిళలు కూడా చీరెలు ధరించారని, చీరె తమ సంస్కృతిలో భాగమని వాదిస్తున్నది రమ్షా. తనకు టీనేజ్‌నుంచే చీరె కట్టుకోవాలని ఆశగా ఉన్నా కట్టుబాట్లకు లోబడి ధైర్యం చేయలేదని వెల్లడించింది. ‘పాకిస్థాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైన్’లో డిగ్రీ చేశాక చీరెలను కొత్తగా పరిచయం చేస్తున్నట్లు చెప్పారు రమ్షా. ‘సారీక’ పేరుతో ఓ కంపెనీని ప్రారంభించి, పాకిస్థాన్‌లోని అన్ని వయసుల మహిళలకు సరసమైన ధరల్లో చీరెలు మార్కెటింగ్ చేస్తున్నది. రమ్షాకు మద్దతుగా #Sarisforallsizes ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లలో హ్యాష్‌ట్యాగ్‌ను ట్రెండింగ్ చేస్తున్నారు పాక్ యువతులు. పాకిస్థాన్ వంటి పితృస్వామ్య దేశంలో భారతదేశపు చీరె ఓ కొత్త ఒరవడిని సృష్టిస్తున్నది. దీనికంతటికీ ఫ్యాషన్ డిజైనర్ రమ్షా సోహైబ్ కారణం.