జీవించడానికి కావాల్సింది మంచి ఆదాయం, ఇష్టమైన ఆహారం. ఇదే సమయంలో బతకడానికి ప్రాణవాయువు తప్పనిసరి. ప్రస్తుత సంక్లిష్ట వేళ ఆక్సిజన్ అందక ఆగమవుతున్న ప్రాణాలెన్నో! ప్రకృతి సిద్ధంగా దొరికే ప్రాణవాయువును గ్రహించలేక ఆక్సిజన్‌కోసం పడిగాపులు కాయవలసిన దుస్థితి. ఈ సమస్యకు పరిష్కారం ‘ఆక్సిజన్ కాన్సెంట్రేటర్’. కరోనా ఆపత్కాలంలో ఈ యంత్రాన్ని సమకూర్చుకోగలిగితే ప్రాణాల గురించిన చింత కొంతవరకు తీరినట్టే.
శరీరం మనకు కావలసిన ఆక్సిజన్‌ను వాతావరణం నుంచి సేకరించుకుంటుంది. ఈ పనిలో శ్వాసవ్యవస్థ నిరంతరం పనిచేస్తుంటుంది. ముక్కుద్వారా తీసుకున్న గాలి ఊపిరితిత్తుల్లో చివరన ఉండే ‘అల్వియోలై’ అనే భాగానికి చేరుతుంది. ఇక్కడి నుంచి ఆక్సిజన్ రక్తనాళాల్లోని రక్తం ద్వారా వివిధ భాగాలకు చేరుతుంది. గాలి వదిలినప్పుడు రక్తం ద్వారా ఊపిరితిత్తులకు చేరిన ‘కార్బన్ డై ఆక్సైడ్’ శ్వాసవ్యవస్థ ద్వారా బయటకు వస్తుంది. అయితే, ఊపిరితిత్తుల పనితీరుపైనే శరీరానికి కావలసిన ఆక్సిజన్ సరఫరా ఆధారపడి ఉంటుంది. శ్వాసవ్యవస్థలో సమస్యలు తలెత్తినా, న్యుమోనియా, ఆస్తమా వంటి జబ్బులు వచ్చినా, ప్రస్తుత కరోనా వంటి వ్యాధులు సోకినా ఊపిరితిత్తుల పనితీరు మందగిస్తుంది. ఫలితంగా శరీరానికి సరిపడా ఆక్సిజన్‌ను గ్రహించడంలో అవి విఫలం అవుతాయి. ఇతర మార్గాల ద్వారా ఆక్సిజన్‌ను పొందాల్సి వస్తుంది.
ఇలాంటి సమయాల్లో ఇంటిదగ్గర ఆక్సిజన్ అందివ్వగలిగితే రోగి ప్రాణాలను కాపాడవచ్చు. ప్రస్తుత తరుణంలో ఆక్సిజన్ సిలిండర్ల లభ్యత చాలా కష్టమవుతున్నది. సిలిండర్ అందుబాటులో ఉన్నా, బయట ప్రాణవాయువు దొరకని పరిస్థితి. ఈ సమస్యకు పరిష్కారం ‘ఆక్సిజన్ కాన్సెంట్రేటర్’. ఈ పోర్టబుల్ పరికరం సమర్థంగా ఆక్సిజన్‌ను అందిస్తుంది. ఈ యంత్రం మన పరిసరాల్లోని గాలినుంచి ఆక్సిజన్‌ను వేరు చేసి అందిస్తుంది. ఇది ప్రమాదరహితం. బరువు, పరిమాణం తక్కువ కాబట్టి, ఎక్కడైనా అమర్చుకునే వెసులుబాటు ఉంటుంది.
ఈ పరికరం ఒక ఏసీలా పని చేస్తుంది. వాతావరణం నుంచి గాలిని తీసుకొని ఆక్సిజన్‌ను విడుదల చేస్తుంది. సాధారణంగా గాలిలో 79 శాతం నైట్రోజన్, 21 శాతం ఆక్సిజన్ ఉంటుంది. ఈ కాన్సెంట్రేటర్ గాలినుంచి నైట్రోజన్, ఇతర వాయువులను వేరు చేసి 95 శాతం స్వచ్ఛత కలిగిన ‘మెడికల్ గ్రేడ్ ఆక్సిజన్’ను సరఫరా చేస్తుంది. ప్రెషర్ వాల్వ్ సాయంతో ఆక్సిజన్‌ను ఒక లీటర్ నుంచి 10 లీటర్ల వరకు ఇవ్వవచ్చు. ఇది రోజులో 24 గంటలూ పనిచేస్తుంది. ఈ యంత్రం జీవితకాలం దాదాపు ఐదేండ్లు. దీనిలోని సెన్సర్ ఆక్సిజన్ స్వచ్ఛతను తెలుపుతుంది. ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లోని ఫిల్టర్లు, జల్లెడలను కొన్నేండ్ల తర్వాత మార్చాలి. మోడల్‌నుబట్టి దీని ధర రూ.40 వేల నుంచి రూ.90 వేల వరకు ఉంటుంది. ఇది విద్యుచ్ఛక్తిపై ఆధారపడి పనిచేస్తుంది. ఇతరత్రా ఖర్చులేమీ ఉండవు.
డాక్టర్ కర్రా రమేష్‌రెడ్డి
పిల్లల వైద్య నిపుణులు