ఐదారేండ్లుగా ప్రజల్లో సేంద్రియ ఉత్పత్తుల వాడకంపై అవగాహన అధికమైంది. దీంతో మార్కెట్లో ఆర్గానిక్ స్టోర్ల సంఖ్యా పెరుగుతున్నది. అయితే, అచ్చంగా పిల్లలే నడిపే ఆర్గానిక్ స్టోర్‌ను ఎక్కడైనా చూశారా? హైదరాబాద్‌లోని స్వచ్ఛ ఆర్గానిక్ బజార్లో అన్నీ సేంద్రియ ఉత్పత్తులే. సుపర్ణ బజాజ్, పూజా రైనాల ఆలోచనకు రూపం ఇది. రసాయనాల జాడ లేకుండా పండించిన కూరగాయలు, ఆకుకూరల నుంచి పప్పు ధాన్యాలవరకు అన్నీ విక్రయిస్తున్నారు. గానుగ నూనె, బియ్యం, ఇంట్లో వండిన ఫలహారాలు కూడా ఉంటాయి. నిజానికి ఈ స్వచ్ఛ ఆర్గానిక్ బజార్.. పిల్లల హోమ్ స్కూలింగ్ సెంటర్. ఇందులో చేరే పిల్లలకు అన్ని విషయాలనూ నేర్చుకునే స్వేచ్ఛ ఉంటుంది. వాట్సాప్, ఫోన్ కాల్స్ ద్వారా కస్టమర్ల నుంచి ఆర్డర్లు తీసుకోవడం నుంచి బిల్లింగ్ వరకు అన్నీ తామే చూసుకుంటారు. ప్రతి సోమవారం ఆర్డర్లను రైతులకు పంపిస్తారు. బుధవారం నాటికి సరుకులు హైదరాబాద్ చేరుకుంటాయి. గురువారం కస్టమర్ల ఆర్డర్లను బట్టి తూకం వేసి, ప్యాక్ చేసి డెలివరీ చేస్తారు. ఈ మధ్యే హోమ్‌సైన్స్ కరికులమ్‌లో భాగంగా బ్రెడ్ మొదలైన బేకరీ పదార్థాలనూ చేస్తున్నారు. ఈ బజార్‌కు చెందిన మొబైల్ స్టోర్ కస్టమర్ల వద్దకే వెళ్తున్నది.