e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, June 25, 2021
Home ఆరోగ్యం ఇమ్యూనిటీ.. అడ్రస్‌ ఏమిటి?

ఇమ్యూనిటీ.. అడ్రస్‌ ఏమిటి?

ఇమ్యూనిటీ.. అడ్రస్‌ ఏమిటి?

కరోనా వేళ రోగ నిరోధక శక్తి ఒక్కటే మనిషిని రక్షిస్తుందనేది సుస్పష్టం. మరి, ఆ ఇమ్యూనిటీ ఎక్కడ దొరుకుతుంది?మెడికల్‌ షాపుల్లోనా? ఖరీదైన మందుల్లోనా? ఆన్‌లైన్‌ దుకాణాల్లోనా? ఆహారం, జీవనశైలి మాత్రమే పరిపూర్ణమైన రోగ నిరోధక శక్తిని ఇస్తాయంటున్నారు నిపుణులు.

శారీరక వ్యాయామం: పిల్లలైనా, పెద్దలైనా రోజూ అరగంట నుంచి గంటసేపు వ్యాయామం చేయాల్సిందే. కసరత్తువల్ల శరీరంలోని కార్టికో స్టెరాయిడ్స్‌, సెరటోనియన్‌, ఎండార్ఫిన్స్‌ విడుదలవుతాయి. ఇవన్నీ మంచి హార్మోన్లు. వీటి ఉత్పత్తి పెరిగితే శరీరంలో సహజంగానే వ్యాధి నిరోధకత పెరుగుతుంది.

8 గంటల సుఖనిద్ర: రోజు కనీసం 8-9 గంటల నిద్ర అవసరం. రాత్రిళ్లు ఎక్కువసేపు మేల్కొని, పగటిపూట నిద్ర పోవడం మంచిది కాదు. మన శరీరంలో పగలు, రాత్రి విడుదలయ్యే హార్మోన్లు వేర్వేరుగా ఉంటాయి. ఉదయాన్నే నిద్రలేస్తే మన శరీరంలో కొన్ని హార్మోన్లు వాటంతటవే ఉత్పత్తి అవుతాయి. ముఖ్యంగా చిన్న పిల్లలు కచ్చితంగా రాత్రి 9 లోపు పడుకునేలా చూడాలి. అలా చేయడం వల్ల ‘సర్కేడియన్‌ రిథమ్‌’ (శరీరంలో జరిగే మార్పులు) సక్రమంగా ఉంటుంది.

ఆహార నియమాలు: ఇమ్యూనిటీని పెంచుకోవడంలో ఆహార నియమాలు ముఖ్యమైనవి. ఇంటి భోజనానికే ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రొటీన్స్‌ ఎక్కువగా తీసుకోవాలి. పప్పులు తప్పనిసరి. చిక్కుడు గింజలు, శనగలు, బీన్స్‌, మటన్‌ ఆహారంలో తరుచూ ఉండేలా చూసుకోవాలి. నట్స్‌, ఆల్మండ్స్‌, సిరిధాన్యాలు తీసుకోవాలి. ఈ సమయంలో సిరిధాన్యాలను ఎంత ఎక్కువ తీసుకుంటే అంత మంచిది. రెయిన్‌బో వెజిటేబుల్స్‌ (అన్ని రంగుల కూరగాయలు) మరీ ఉత్తమం. సమతుల ఆహారం వల్లే ఇమ్యూనిటీ పెరుగుతుంది. అంతేగానీ, మార్కెట్‌లో దొరికే కృతకమైన ప్రొటీన్‌ డ్రింక్‌తో ఏమీ సాధ్యం కాదు. ట్యాబ్లెట్ల రూపంలో తీసుకొనే విటమిన్లు పూర్తిగా శరీరానికి అందవు. అదే విధంగా ఒకేసారి అన్నేసి విటమిన్‌ ట్యాబ్లెట్స్‌ తీసుకుంటే, ఉపయోగం తక్కువే. మన శరీరంలో ఏ విటమిన్‌ తక్కువగా ఉందో గుర్తించి, ఆ ట్యాబ్లెట్‌ మాత్రమే వేసుకోవాలి. అప్పుడు మాత్రమే కొంత ప్రయోజనం ఉంటుంది. ఏం తిన్నామన్నది ఎంత ముఖ్యమో, ఎప్పుడు తిన్నామన్నదీ అంతే ముఖ్యం. రాత్రి 8 గంటలలోపు భోజనం పూర్తి చేయాలి.

అలవాట్లు మార్చుకోండి: ప్రస్తుత పరిస్థితుల్లో ఆహారపు అలవాట్లను మార్చుకోవాల్సిందే. అయితే, అది ఒక్క రోజులో సాధ్యం కాకపోవచ్చు. ఉదా॥కు రాగి జావ చాలా మంచిది. ఇది కొందరికి అలవాటు ఉండకపోవచ్చు. కాబట్టి, ఇడ్లీలోనో, దోసెలోనే కాస్త రాగిపిండి కలుపుకోవాలి. కొన్ని రోజులకు మన నాలుక, శరీరం రాగి రుచికి అలవాటు పడుతుంది. ముఖ్యంగా ఉసిరికాయను ప్రతి ఒక్కరూ ఆహారంలో భాగం చేసుకోవాలి. ఇది రోగ నిరోధక శక్తిని పెంచడంలో కీలకపాత్ర పోషిస్తుంది. అలానే, ఎండనూ ప్రేమించాలి. శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడంలో ‘విటమిన్‌-డి’ ముఖ్యమైంది. ఉదయం కన్నా మధ్యాహ్నం ఎండలోనే శరీరానికి అవసరమైన ‘విటమిన్‌-డి’ ఎక్కువ వస్తుందని నిపుణులు చెబుతున్నారు.

డా.॥ టి.ఎన్‌.జె. రాజేష్‌
జనరల్‌ ఫిజీషియన్‌ ,స్టార్‌ హాస్పిటల్‌

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఇమ్యూనిటీ.. అడ్రస్‌ ఏమిటి?

ట్రెండింగ్‌

Advertisement