e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, June 18, 2021
Home జిందగీ ఆన్‌లైన్‌ అవధాని

ఆన్‌లైన్‌ అవధాని


తెలుగుభాషకు వన్నెలద్దిన ఘనత పద్యానిది. దానికి పట్టం కట్టిన సాహితీ ప్రక్రియ అవధానం. ఎందరో కవులు అప్రమేయ పూరణతో, అసాధారణ ధారణతో అవధాన కళకు వన్నె తెచ్చారు. వారి బాటలోనే నడుస్తున్నారు మహబూబ్‌నగర్‌కు చెందిన కవయిత్రి చుక్కాయపల్లి శ్రీదేవి.ఐదు పదులు దాటాక అవధాని అవతారం ఎత్తిన శ్రీదేవి, ఆన్‌లైన్‌లో పద్యసేద్యం చేస్తున్నారు. సామాజిక మాధ్యమాలు వేదికగా శతాధిక అవధానాలు చేశారు. ఒకే రోజు ఏకబిగిన 12 అవధానాలు నిర్వహించి‘భళా’ అనిపించుకున్నారు.

ఆన్‌లైన్‌ అవధాని

‘కవుల పాటవానికి పద్యం సోపానమైతే, అవధానం సమున్నతమైన మజిలీ’ అంటారు సాహితీవేత్తలు. ఈ అరుదైన ప్రక్రియలో మెరిసిన మహిళలు చాలా అరుదు. ఆ కొద్దిమందిలో ఒకరు శ్రీదేవి. ఆన్‌లైన్‌ వేదికగా అవధానాల్లో పాల్గొంటూ, చకచకా పద్యాలు పూరిస్తూ, గంట వ్యవధిలోనే ‘అష్టావధానం’ పూర్తి చేస్తున్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని శ్రీరంగాపురం శ్రీదేవి స్వగ్రామం. ‘మా నాన్న శ్రీనివాసాచార్యులు. అమ్మ సీతమ్మ. నాన్న పూజారి. కొద్దిగా వ్యవసాయం ఉండేది. మేం నలుగురం ఆడపిల్లలం. బాగా చదువుకోమని ప్రోత్సహించేవారు నాన్న. శ్రీరంగాపురంలో 10వ తరగతి వరకు విద్యాభ్యాసం సాగింది. ఆడపిల్ల గడప దాటితేనే వింతగా చూసే రోజుల్లో ఉన్నత విద్యకోసం నాన్న మమ్మల్ని వనపర్తి, మహబూబ్‌నగర్‌ పంపారు. నేను 8, 9 తరగతుల్లోనే ఏవో కవితలు రాస్తుండేదాన్ని. 10వ తరగతిలో తెలుగు మాస్టారు సహదేవ్‌ సార్‌ నా కవితలు చూసి, పద్యాలు రాయమని ప్రోత్సహించారు. పది పూర్తయ్యాక సెలవుల్లో ఆటవెలది, తేటగీతి ప్రయత్నించాను. యతి, ప్రాసలు గతి తప్పేవి. ఇంటర్‌లో మా తెలుగు అధ్యాపకులకు చూపిస్తే వాటిని సరిచేసి, ‘ప్రయత్నం కొనసాగించ’మన్నారు. అలా పద్యం అలవడింది. పదిహేనేండ్లు ఉన్నప్పుడు ఒక అముద్రిత నవల రాశాను’ అని బాల్యాన్ని గుర్తు చేసుకున్నారు 55 ఏండ్ల శ్రీదేవి.

లాక్‌డౌన్‌ చూపిన దారి
తెలుగు ఎం.ఎ, పండిత్‌ ట్రైనింగ్‌ పూర్తయ్యాక తెలుగు పండితురాలిగా వివిధ పాఠశాలల్లో పనిచేశారు శ్రీదేవి. ఉపాధ్యాయ వృత్తితోపాటే పద్య రచనా సమాంతరంగా కొనసాగించారు. ఈ క్రమంలో 216 పద్యాలతో గీతాసారాన్ని వివరిస్తూ ‘గీతాభక్తి ద్విశతి’ కావ్యం రచించారు.
‘సాత్వికోత్తమ’ అనే మకుటంతో ‘సామాజిక శతక పద్యహేళ’ కావ్యం రాశారు.

‘యాదాద్రి కళా వైభవం’, ‘జల కవితోత్సవం’.. ..ఇలా సందర్భోచితంగా పద్యకావ్యాలు రాస్తూ వచ్చారామె. 2005లో ‘శ్రీరంగాపుర వైభవం’ కావ్యం రచించారు. అదే ఏడాది మహబూబ్‌నగర్‌లో జరిగిన మహాసహస్ర అవధాని మాడుగుల నాగఫణి శర్మ ‘శతావధానం’లో శ్రీదేవి పృచ్ఛకురాలిగా పాల్గొన్నారు. అప్పుడే అవధానంపై తనకు ఆసక్తి ఏర్పడిందని చెబుతారామె. అయితే, తనను అవధానిగా మార్చింది మాత్రం సామాజిక మాధ్యమాలేనని అంటారు. గతేడాది లాక్‌డౌన్‌ సమయంలో వాట్సాప్‌లో పరిచయమైన కవి సమూహాలు తన కవిత్వానికి కొత్త దిశను చూపాయని చెప్పారు. ‘లాక్‌డౌన్‌ సమయంలో అనేక సాహితీ వాట్సాప్‌ బృందాలతో పరిచయం ఏర్పడింది. రామం భజే శ్యామలం, మెదక్‌ జిల్లా రచయితల సంఘం, తెలంగాణ మహిళా సాహిత్య సాంస్కృతిక సంస్థ, వనపర్తి జిల్లా రచయిత్రుల సంఘం.. ఇలా పలు వాట్సాప్‌ గ్రూపులతో అనుబంధం ఏర్పడింది. వాటిలో పద్యాలు రాయడం, సాహితీ విశేషాలను పంచుకోవడం చేస్తుండేదాన్ని. పలువురు ఆన్‌లైన్‌ వేదికగా నిర్వహించే అవధానాలకు పృచ్ఛకురాలిగానూ వ్యవహరించాను. కొన్నాళ్లకు నన్నూ అవధానం చేయాల్సిందిగా కోరారు. అలా, గతేడాది మొదటిసారి ఆన్‌లైన్‌లో అవధానం చేశాను. రోజుల వ్యవధిలో నాలుగు అవధానాలు చేయడంతో నాకూ చేయగలననే నమ్మకం ఏర్పడింది’ అంటారు శ్రీదేవి.

120 అవధానాలు పూర్తి
లాక్‌డౌన్‌ పూర్తవ్వడం, మళ్లీ పాఠశాలలు తెరుచుకోవడంతో అవధానాలకు తాత్కాలికంగా కామా పడింది. కానీ, కొన్నాళ్లకే ఆన్‌లైన్‌లో అవధానాలు చేయాలంటూ పలువురు ప్రోత్సహించడంతో మళ్లీ కొనసాగించారు శ్రీదేవి. ‘నాలుగు అవధానాలు చేస్తే చాలనుకున్నా. కానీ, చూస్తుండగానే 108 అష్టావధానాలు పూర్తయ్యాయి. 116 అవధానాలు చేయాలనుకున్నా. ఇప్పటికి మొత్తంగా 120 అవధానాలు చేశాను. ఆఫ్‌లైన్‌లోనూ 5 అవధానాలు నిర్వహించాను. అందులో 2 శతావధానాలూ వున్నాయి. ఒకటిన్నర రోజులలో ఒక అవధానం పూర్తి చేశాను. మొత్తం 8 శతావధానాలు పూర్తి చేయాలన్నది నా సంకల్పం. సాధారణంగా అవధానాల్లో పూరణ, ధారణ ప్రక్రియలు వుంటాయి. పృచ్ఛకులు అడిగిన సమస్యకు నాలుగు ఆవృతాల్లో ఒక్కో పాదం పూర్తి చేసి, వాటిని ధారణ చేసి అప్పగించాల్సి ఉంటుంది. అయితే, నేను చేస్తున్న ఆన్‌లైన్‌ అవధానాల్లో పూరణ వరకే నిర్వహిస్తున్నా. పృచ్ఛకుడు అడిగిన సమస్యకు నాలుగు పాదాలు ఒకేసారి చెబుతున్నా. కొన్ని సందర్భాల్లో నాలుగు ఆవృతాల పద్ధతిలోనూ పద్యాలు పూరిస్తున్నా. ఆన్‌లైన్‌ కాబట్టి, పద్యాన్ని టైప్‌ చేసి సమాధానం ఇస్తున్నా. అవధానాలను విజయవంతం చేయడంలో ధ్యానం వల్ల అబ్బిన ఏకాగ్రత ఎంతగానో ఉపయోగపడింది. కుటుంబసభ్యుల సహకారం, మనోశక్తి కారణంగానే ఈ కళలో రాణించగలుగుతున్నాను’ అన్నారు శ్రీదేవి. ఈ అవధాన సరస్వతిని వివిధ సంస్థల తరఫున 11 పురస్కారాలు వరించాయి.

ఆన్‌లైన్‌ అవధాని

కుటుంబ ప్రోత్సాహం
తెలుగు ఉపాధ్యాయురాలిగా 17 ఏండ్లు చేశాను. పిల్లలతో తెలుగులో కవితలు, కథలు రాయించేదాన్ని. కొన్నేండ్లు డైట్‌ కాలేజీలో పనిచేశాను. అక్కడి విద్యార్థులతోనూ సాహితీ సాగు చేయించాను. ఓ విద్యార్థిని ఏకంగా రెండు శతకాలు రాయడం విశేషం. మా ఆయన రవికుమార్‌ పోస్టల్‌ డిపార్ట్‌మెంట్‌లో పనిచేసి రిటైర్‌ అయ్యారు. మాకు ఇద్దరు అబ్బాయిలు. సాఫ్ట్‌వేర్‌ రంగంలో ఉన్నారు. అందరూ నన్ను చాలా ప్రోత్సహిస్తారు.

రయమున వ్యాప్తి జెందెనిక రక్షణ జేయగ చేయిదాటె విస్మయముగ నీ కరోనకు సమానము లేదతి శక్తివంతమై భయమున విశ్వమే వణికె, భౌతిక దూరము నోటిగుడ్డచే జయమిక సాధ్యమౌను, పలు సాకులు బల్కి చరింపబోకుమా!

మెచ్చు తునక ..ఒక అవధానం దత్తపదిలో రయము, మయము, భయము, జయము.. అనే పదాలు ఇచ్చి ప్రస్తుత కరోనా పరిస్థితులను వివరించమని పృచ్ఛకుడు అడిగిన ప్రశ్నకు శ్రీదేవి చేసిన పూరణ ఇది.

ఒకే రోజులో పన్నెండు
“ఒకే రోజులో నాలుగు అవధానాలు చేయాలనుకున్నా. కానీ, 8 చేయాలనే సంకల్పం వచ్చింది. వాట్సాప్‌ బృందాల సహకారంతో ఒక్కో అవధానానికి 8 మంది పృచ్ఛకుల చొప్పున 64 మంది ఏర్పాటయ్యారు. ఈ నెల 6వ తేదీన ఉదయం 7 గంటలకు మొదటి అవధానం మొదలైంది. ఉదయం 11 గంటలకల్లా నాలుగు పూర్తయ్యాయి. కాసేపు విరామం తర్వాత, మధ్యాహ్నం 3.20 గంటలకల్లా 8 అవధానాలూ పూర్తి చేయగలిగా. బృంద సభ్యుల ప్రోత్సాహంతో అప్పటికప్పుడు మరో 4 అవధానాలు చేయాలని నిర్ణయించుకొని రాత్రి 8.15 గంటల కల్లా మొత్తంగా 12 పూర్తి చేశాను.”

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఆన్‌లైన్‌ అవధాని

ట్రెండింగ్‌

Advertisement