నలభైలకే మోకాళ్ల నొప్పులు. యాభైలకే వృద్ధాప్య ఛాయలు. ఆరవైలకే అర్థం లేని వైరాగ్యాలు. ఏడు పదులు వచ్చేసరికి మృత్యువుకోసం మొహం వాచినట్టు ఎదురుచూపులు! మహిళ శారీరకంగా కంటే, మానసికంగానే త్వరగా వృద్ధురాలై పోతున్నది. వయసు ఓ మామూలు అంకేననీ, ఆనందానికి దానితో లంకె పెట్టాల్సిన పని లేదనీ నిరూపిస్తున్నారు ఈ ఎనిమిది పదుల మహిళలు. కొత్త కళలు అభ్యసిస్తూనో, కొత్త భాషలు నేర్చుకుంటూనో, కొత్త ప్రదేశాల్ని సందర్శిస్తూనో.. జీవితాన్ని నిత్యనూతనంగా తీర్చిదిద్దుకుంటున్నారు.
ఐరిస్ అప్‌ఫెల్
99 ఏండ్ల వయసులో ‘ఫ్యాషన్ ఐకాన్’గా నిలిచారు ఐరిస్ అప్‌ఫెల్. ఈ అమెరికన్ బిజినెస్ ఉమెన్ చేయి తిరిగిన ఇంటీరియర్ డిజైనర్ కూడా. టెక్స్టైల్ బిజినెస్‌లో భాగంగా ప్రపంచమంతా పర్యటించారు. న్యూయార్క్‌లోని మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్‌లో ఐరిస్ కాస్ట్యూమ్స్, జువెలరీ ఎగ్జిబిషన్ పెట్టారు. పెద్దపెద్ద కండ్లద్దాలు ఆమె సిగ్నేచర్ మార్క్. వయసు గురించి అడిగితే, ‘నేను వయసును పట్టించుకోను. చేస్తున్న పనిని ప్రేమిస్తాను. దానిమీదే మనసును లగ్నం చేస్తాను’ అని
సమాధానమిచ్చారు.
ఎర్నైస్టెన్ షెపర్డ్
వయసుతో సంబంధం లేకుండా మహిళలు ఏమైనా సాధించగలరని నిరూపించారు 84 ఏండ్ల ఎర్నైస్టెన్ షెపర్డ్. ఈ వయసులో ‘వరల్డ్స్ ఓల్డెస్ట్ కాంపిటీటివ్ ఫిమేల్ బాడీ బిల్డర్’గా రికార్డు సృష్టించారామె. 50 ఏండ్ల వయసులో షెపర్డ్‌కు బాడీ బిల్డింగ్ మీద ఆసక్తి కలిగింది. వెంటనే, కండరాలు పెంచుకునే ప్రయత్నం ప్రారంభించారు. ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. ఇప్పటికీ రకరకాల టోర్నమెంట్లలో పాల్గొంటున్నారు. పర్సనల్ ట్రైనర్‌గా శిక్షణ ఇస్తూ, మహిళలను ప్రోత్సహిస్తున్నారు షెపర్డ్.
ఉషా సోమన్
సోషల్ మీడియా అభిమానులకు ఉషా సోమన్ సుపరిచితురాలే. ఈ వయసులోనూ మారథాన్స్‌లో పాల్గొంటున్నారు. నటుడు, సూపర్ మోడల్, ఫిల్మ్ ప్రొడ్యూసర్, ఫిట్నెస్ ప్రమోటర్ మిళింద్ సోమన్ తల్లి ఈ ఉషా సోమన్. గత ఏడాది తన 81వ పుట్టినరోజును పుషప్స్ చేస్తూ సెలబ్రేట్ చేసుకున్నారు. ఆమె చేసిన పదిహేను పుషప్స్‌కి సంబంధించిన వీడియోను మిళింద్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ, తల్లికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. తన తల్లిని ‘ఫిట్నెస్ అడిక్ట్’గా అభివర్ణిస్తారు మిళింద్.
మార్గరెట్ అత్వూద్
కెనడియన్ సాహితీ సరస్వతి మార్గరెట్ అత్వూద్ వయసు 81 ఏండ్లు. ఆమె నవలా రచయిత్రి, కవయిత్రి, వ్యాసకర్త, ప్రొఫెసర్, పర్యావరణ కార్యకర్త కూడా. 1985లో అత్వూద్ రాసిన ‘హ్యాండ్ మెయిడ్స్ టెయిల్’ నవలను టీవీ సిరీస్‌గా చిత్రీకరించారు. అది నాలుగు కేటగిరీల్లో ఎమ్మీ అవార్డ్స్‌ను అందుకున్నది. ఆమె రచనలను సినిమాలుగా తీశారు. రెండేండ్ల క్రితం ‘డియర్లీ’ అనే కవితా సంకలనం విడుదల చేశారు. ‘వృద్ధాప్యాన్ని సద్వినియోగం చేసుకోవాలే కానీ, బాల్యం కంటే కూడా మధురంగా ఉంటుంది’ అంటారామె.
వహీదా రెహమాన్
నటి వహీదా రెహమాన్ గురించి తెలియని వారుండరు. హిందీతోపాటు తెలుగు, తమిళ, మలయాళ, బెంగాలీ సినిమాల్లో నటించారు. 1955లో ‘రోజులు మారాయి’ అనే తెలుగు సినిమాతో తన కెరీర్ మొదలుపెట్టి, ఇప్పటికీ నటిస్తున్నారు. ఇంగ్లిష్, హిందీ ద్విభాషా చిత్రం ‘డెసెర్ట్ డాల్ఫిన్’తో తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. 83 ఏండ్ల వయసులో వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రఫీపట్ల మక్కువ పెంచుకొన్నారు. స్క్యూబా డైవింగ్ చేస్తూ అందరినీ ఆశ్చర్య పరుస్తున్నారు. తాను తీసిన వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రాఫ్లతో ఒక ఎగ్జిబిషన్ కూడా ఏర్పాటుచేశారు. యుక్తవయసులో తనకు ఫొటోగ్రఫీ నేర్చుకోవాలని ఉన్నా ఎక్కడా ట్రైనింగ్ సెంటర్లు లేవనీ, ఆ తర్వాత సినిమాల కారణంగా తీరిక దొరక లేదనీ, ఇప్పుడు ఆ కలను నిజం చేసుకుంటున్నానని చెబుతారు వహీదా.
శత్రువును గెలువాలనుకుంటే, ముందు ఆ శత్రువు ఉనికిని విస్మరించాలి. అలాగే, వయసును గెలువాలంటే, దానిని అస్సలు పట్టించుకోకూడదు. మనసు చెప్పినట్టే వినాలి. అప్పుడు బతుకు ఎక్కాలు మారిపోతాయి. ఏడు పదులు పదహారే! ఎనిమిది పదులూ పదహారే!