ప్రజలకు ఏదైనా విషయం మీద అవగాహన కల్పించాలంటే, వాళ్లకు అందుబాటులో ఉండే మాధ్యమాన్నే ఎంచుకోవాలి. అందువల్లే ఈమధ్య సోషల్ మీడియా క్యాంపెయిన్లు పెరిగాయి. హ్యాష్
ట్యాగ్‌తో తాము చెప్పాలనుకున్న విషయాన్ని సూటిగా ప్రచారం చేస్తున్నారు. ప్రస్తుతం ‘హ్యాష్‌ట్యాగ్ నార్మలైజ్ ది శారీ’ పేరుతో ఒక ఆన్లైన్ ప్రచారం విస్తృతంగా
జరుగుతున్నది.
#normalisethesaree.. ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే కాకుండా రోజువారీగా కూడా చీరను కట్టుకోవాలనే నినాదంతో ఈ ఆన్లైన్ క్యాంపెయిన్ మొదలైంది. హైదరాబాద్‌లోని ఓ బట్టల దుకాణంవారు ఈ ప్రచారాన్ని ప్రారంభించారు. చేనేత గొప్పదనాన్ని ఇప్పటి తరానికి తెలియజెప్పాలని ఫ్యాషన్ డిజైనర్లతో పాటు ఆంత్రప్రెన్యూర్లు ప్రయత్నిస్తున్నారు. చేనేత కార్మికుల కోసం స్వచ్ఛంద సంస్థలూ కృషి చేస్తున్నాయి. తాజాగా, ‘నార్మలైజ్ ది శారీ’ క్యాంపెయిన్ ప్రచారంలోకి వచ్చింది. ‘దేశవ్యాప్తంగా మేం మొత్తం 40 చేనేత క్లస్టర్లను ఏర్పాటు చేసి, కళాకారులకు ఉపాధి కల్పిస్తున్నాం. మన సంప్రదాయాలకు అద్దంపట్టే చేనేత చీరలను ప్రోత్సహించేందుకు ఈ క్యాంపెయిన్‌ను మొదలుపెట్టాం. చేనేత కళను గౌరవించడం మనందరి బాధ్యత’ అన్నారు క్యాంపెయిన్ సారథి అనిరుధ్ కంకటాల.