e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, October 22, 2021
Home జిందగీ Bathukamma song : బతుకమ్మకు కొత్తరాగం!

Bathukamma song : బతుకమ్మకు కొత్తరాగం!

అల్లిపూల వెన్నెల.. చెరువులోన కురవగా..
పూలకింద్ర ధనసులే.. నేల మీద నిలవగా..
కొమ్మలన్ని అమ్మలై.. వేల పూలు విరియగా..
పుట్ట మన్ను మట్టిలో మట్టి గౌరి పుట్టగా..

తెలంగాణ ఆడబిడ్డలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసే పండుగ బతుకమ్మ. ఈ వేడుకలో పూలకెంత ప్రాధాన్యం ఇచ్చారో, తెలంగాణ జనజీవనంలో భాగమైన పాటకూ అంతే పెద్దపీట వేశారు. ఈ ఏడాది వేడుకల కోసం‘ తెలంగాణ జాగృతి’ఆధ్వర్యంలో రూపొందిన బతుకమ్మ పాట విశ్వవ్యాప్తంగా ఆదరణ పొందుతున్నది. పల్లెపల్లెలో మారుమోగుతున్నది. పాట చిత్రీకరణలో పాలుపంచుకొన్న దర్శకుడు గౌతమ్‌ వాసుదేవ్‌ మీనన్‌ ఆ ‘అల్లిపూల వెన్నెల’ అనుభవాలను‘జిందగీ’తో పంచుకొన్నారు.

- Advertisement -

తెలుగులో ఎంతోమంది దర్శకులు ఉన్నా, బతుకమ్మ పాట చిత్రీకరణకు నన్నే ఎంచుకోవడం సంతోషంగా అనిపించింది. దీన్నో గౌరవంగా భావిస్తున్నాను. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితగారు బతుకమ్మ గొప్పదనం గురించి చెప్పినప్పుడు ఈ పండుగపై ప్రత్యేక అభిమానం ఏర్పడింది. ఆడపడుచులంతా రకరకాల పూలతో బతుకమ్మను ఎలా పేరుస్తారో, ఆటపాటలతో గౌరమ్మను ఎలా పూజిస్తారో తెలుసుకున్నప్పుడు ఆశ్చర్యంగా అనిపించింది. పూలను పూజించే సంస్కృతి, సంస్కారం ఒక్క తెలంగాణలోనే ఉంది. చిత్రీకరణకు ముందు కూడా బతుకమ్మ పండుగ గురించి చాలా అధ్యయనం చేశాను.

రెహమాన్‌ మ్యూజిక్‌ వల్లే..
ఈ పాట గురించి ఏఆర్‌ రెహమాన్‌తో ప్రస్తావించినప్పుడు, ఆయన ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఒప్పుకొన్నారు. నిజానికి, అప్పటికే ఆయన ఎన్నో ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నారు. అయినా సరే, తన సమయాన్ని కేటాయించారు. వారం రోజుల్లోనే స్వరాలు సమకూర్చి పాటకు ప్రాణం పోశారు. మా టీమ్‌లోని ప్రతి ఒక్కరమూ బతుకమ్మపై వచ్చిన అన్ని ఆల్బమ్స్‌ విన్నాం. ఏటా విడుదలవుతున్న కొత్త పాటలనూ పరిశీలించాం. ఆ తర్వాత నేను, రెహమాన్‌ అనుకున్నది ఒక్కటే.. ‘మనం చేసే పాట బతుకమ్మ పాటలన్నిటిలోకి కొత్తగా, ప్రత్యేకంగా ఉండాలి’. ఎందుకంటే, అసలు ఈ పండుగలోనే ఎంతో వైవిధ్యం ఉంది. పూలతో బతుకమ్మను ముస్తాబు చేయడం, పసుపుతో గౌరమ్మను తయారు చేయడం, బతుకమ్మలను ఒకచోటకు చేర్చి, ఆడపడుచులంతా పాటలు పాడటం, ఆటలు ఆడటం, అంతా చెరువు దగ్గరకు చేరి నిమజ్జనం చేయడం.. ప్రతి మలుపులోనూ ఓ మెరుపు.

హోమ్‌వర్క్‌ చేశాం..
ఈ పాటను ప్రయోగాత్మకంగా చేశాం. జనాలు అలవాటుపడ్డ ఫార్మాట్‌కి భిన్నంగా చేశాం. మా టీమంతా హార్డ్‌వర్క్‌ చేసింది, హోమ్‌వర్క్‌ కూడా చేసింది. రెహమాన్‌ అద్భుతమైన ట్యూన్‌ ఇచ్చారు. మిట్టపల్లి సురేందర్‌ అందమైన సాహిత్యం అందించారు. తొలిసారి పాట వినగానే నాకు ఒక విజన్‌ వచ్చేసింది. డ్యాన్సర్స్‌ను, సపోర్టింగ్‌ యాక్టర్స్‌ను సిద్ధం చేసుకున్నాను. షూటింగ్‌ కోసం పోచంపల్లి వెళ్లాం. అక్కడి మహిళలూ మా టీమ్‌తో కలిసి పాటలో పాల్గొన్నారు. కాబట్టే, అంత నేటివిటీ వచ్చింది. కవితగారు కూడా పాటకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్‌డేట్స్‌ అడిగేవారు. తనూ పాటలో పాల్గొనడం నాకు ప్రోత్సాహకరంగా అనిపించింది. పాట చిత్రీకరణ సమయంలో ‘గౌరమ్మను ఇలా చేయాలి. బతుకమ్మను ఇలా పేర్చాలి’ అంటూ స్థానికులు అనేక సలహాలిచ్చారు. అందరి సహకారం వల్లే రెండు రోజుల్లోనే అనుకున్న స్థాయిలో పాటను తీసుకొచ్చాం. నా బతుకమ్మ అనుభవాలను ఇంట్లోవాళ్లతో, స్నేహితులతో పంచుకున్నాను. నాకు చెట్లు, పూలు అంటే ఇష్టం. మా ఇంట్లో కూడా గార్డెన్‌ ఉంది. కుదిరినప్పుడల్లా పూలతో, చెట్లతో గడిపేందుకు ఇష్టపడతాను. నేను బతుకమ్మతో కనెక్ట్‌ కావడానికి ఇది కూడా
ఒక కారణం కావొచ్చు.

… నిఖిత నెల్లుట్ల

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement