గురువారం 04 మార్చి 2021
Zindagi - Nov 27, 2020 , 00:27:25

కంఠ షోయగం

కంఠ  షోయగం

  • ‘నగ’ధగలు

మగువల మెడను శంఖంతో పోలుస్తారు సౌందర్య పిపాసులు. శంఖం లాంటి మెడకు కంఠాభరణాన్ని ధరిస్తేనే అందం. పచ్చల హారం మెడను చుట్టుకుంటే మనోహరంగా ఉంటుంది. ఇంపుసొంపుల కెంపుల దండ ఇంతి సొగసును రెండింతలు చేస్తుంది. పగడాలు, గోమేధికాలు, పుష్యరాగాలు, ముత్యాలు, వజ్రాలు.. ఇలా నవరత్న ఖచిత ఆభరణాలు మగువ కంఠాన్ని హత్తుకొని మరింతగా మెరిసిపోతాయి. కంఠాభరణాలు తాతల నాటి నుంచీ ఉన్నా.. ఈ కాలానికి తగ్గట్టుగా సరికొత్త డిజైన్లతో  ఫ్యాషన్‌ ప్రపంచంలో శంఖం పూరిస్తున్నాయి.


నగలను నిగనిగలాడే బంగారంతో తీర్చిదిద్దినా.. అందులో ధగధగలాడే రాళ్లు పొదిగితేనే అసలైన అందం.  అందుకే నగల్లో పొదిగే రాళ్ల మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. నానారత్న ఖచిత కంఠాభరణాల్లో చెప్పుకోదగిన రకాలు ఎన్నో. వాటిని రూపొందించే పద్ధతులూ ప్రత్యేకమైనవే! జడావ్‌ టెక్నిక్‌.. నగల తయారీలో అనుసరించే ఓ పద్ధతి. కుందన్‌, పోల్కీ నగల తయారీలో జడావ్‌ పద్ధతిని ఉపయోగిస్తారు. ద్రవరూపంలోని బంగారంలో రాళ్లు అద్దుతారు. రాళ్ల చుట్టంతా బంగారం అలుముకునేలా చేస్తారు. మీనాకారీ పద్ధతిని అనుసరించి అడుగు బాగాన్ని తీర్చిదిద్దుతారు. మిగతా నగల్లో మాదిరిగా రాళ్లను పట్టి ఉంచే కొక్కేలు ఇక్కడ కనిపించవు. పాత ట్రెండే అయినా.. జడావ్‌ పద్ధతిలో తయారైన నగలకు సదా డిమాండ్‌ ఉంటున్నది. 

పేపర్‌ నెక్లెస్‌


ప్రస్తుత కాలంలో పేపర్‌తో చేసిన నెక్లెస్‌లు బాగా ప్రాచుర్యం పొందుతున్నాయి. వీటిని ధరించడం చాలా తేలిక. పైగా రిచ్‌ లుక్‌తో కనిపిస్తాయి. రకరకాల రంగు రాళ్లతో తయారైన పేపర్‌ కంఠాభరణాలు యువతుల మనసులను దోచేస్తున్నాయి. కాకపోతే, వీటిని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాల్సి ఉంటుంది.

కేరళ బీడెడ్‌ మల్టీ రోప్‌ నెక్లెస్‌


ఇవి చాలా తేలికైనవి, మన్నికైనవి కూడా. సింపుల్‌గా, అందంగా ఉంటాయి. చూడచక్కని చిన్న చిన్న పూసలు వరుసలు వరుసలుగా రూపుదిద్దుకొని ఉంటాయి. వివిధ రంగుల్లో మెరిసిపోయే ఈ  కంఠాభరణాలు.. ఫ్యాన్సీ లుక్‌ తెచ్చిపెడతాయి. ‘సింపుల్‌ అండ్‌ సూపర్బ్‌' అనిపిస్తాయి.

పూసల నగలు 


చీరలు లాంటి సంప్రదాయ వస్త్రధారణకూ, గౌన్ల లాంటి ఆధునిక దుస్తులకూ ... రెండిటికీ బీడ్స్‌ జువెలరీ బావుంటాయి. కాస్త భారీగా కనిపించే చోకర్స్‌, ఇయర్‌ రింగ్స్‌ గౌన్స్‌కు నప్పుతాయి. భారీ ఇయర్‌ రింగ్స్‌ ధరిస్తే మెడలో నెక్లెస్‌ ధరించకపోయినా అందంగానే కనిపించడం ఈ నగల ప్రత్యేకత. 

ముత్యాల నెక్లెస్‌


ముత్యానికుండే సహజ సిద్ధమైన మెరుపు మరే రత్నానికీ ఉండదు. అందుకే, ముత్యాల ఆభరణాలు ఎవర్‌గ్రీన్‌ లిస్ట్‌లో చేరిపోయాయి. బీరువాలో నగలెన్ని ఉన్నా.. ముత్యాల సెట్‌ లేకపోతే వెలితిగానే ఉంటుంది.  ముత్యాలకున్న డిమాండ్‌ అలాంటిది మరి. వీటిలో చిన్నా, పెద్దా సైజుతో పాటు మీడియం సైజు ముత్యాలతో చేసిన కంఠాభరణాలకు గిరాకీ ఎక్కువ. తెల్లనివే కాదు,  లేత గోధుమ రంగులో మెరిసిపోయే ముత్యాల హారం మరింత రిచ్‌ లుక్‌ను ఇస్తుంది.

వజ్రాల మెరుపులు


అన్‌కట్‌ డైమండ్స్‌కు మెరుపు అధికం. కాబట్టే భారీ చోకర్లు, జడావ్‌ పోల్కీలు, నెక్లెస్‌ సెట్లు అన్‌కట్‌ డైమండ్స్‌తోనే ఎక్కువగా తయారవుతూ ఉంటాయి. పచ్చలు, కెంపులు, ముత్యాలతో జత చేసి వీటిని ధరిస్తే వజ్రాల మెరుపు మరింత స్పష్టంగా పరావర్తనం చెందుతుంది. 

నగల వరుసలు


లేయర్డ్‌ నెక్‌ పీస్‌లు లేటెస్ట్‌ ట్రెండ్‌. ఒక లాంగ్‌ చైన్‌, ఒక షార్ట్‌ చైన్‌ వీటికి కాంబినేషన్‌గా ఓ అందమైన నెక్లెస్‌ ధరిస్తే అదిరిపోతుంది. మెడకు హత్తుకుని ఉండే చోకర్‌ విషయంలో అన్‌కట్‌ డైమండ్స్‌తో తయారైనవే ఎంచుకోవాలి. ఇలాంటి నగల అలంకరణ నిండుదనంతోపాటు భారీ లుక్‌ను తెచ్చిపెడుతుంది. 

రకాన్ని బట్టి ధరలు

ప్రెషియస్‌, సెమీ ప్రెషియస్‌ అనే రెండు రకాల బీడ్స్‌ దొరుకుతాయి. స్థోమతనుబట్టి ఎంచుకోవచ్చు. కొనే సమయంలో, నగలో వాడిన బీడ్స్‌ నాణ్యతా  ధ్రువపత్రం  తప్పనిసరిగా తీసుకోవాలి. మార్పిడి సమయంలో నూటికి నూరు శాతం ధర రాదు కాబట్టి, తక్కువ పెట్టుబడితో ఎక్కువ సందర్భాలకు, దుస్తులకు ఉపయోగపడేలా నగలు ఎంచుకోవాలి. 


VIDEOS

logo