పరిచయం అవసరంలేని నటి నయనతార. ‘లక్ష్మీ’బావకు ముద్దుల మరదలుగా, అందమైన ‘బాస్’కు తెలివైన సెక్రటరీగా, కండల ‘యోగి’ని కవ్వించే నాయికగా, ‘దుబాయ్ శీను’కు మనసైన మధుమతిగా.. ఇలా తన పాత్రల ద్వారా ప్రేక్షకులకు దగ్గరైంది నయనతార. 18 ఏండ్ల కెరీర్లో కమర్షియల్ నటిగా, మహిళా ప్రధాన చిత్రాలకథానాయికగా ఎన్నో విజయాలు అందుకున్నది. ఆమె చేతిలో అరడజను సినిమాలు ఉన్నాయి. అన్నీ పెద్ద చిత్రాలే! తన నటనలో మరో కోణాన్ని ఆవిష్కరించేవే! ప్రతిష్ఠాత్మక ఫోర్బ్స్ మ్యాగజైన్‌పై నయనతార చిత్తరువు తళుక్కుమంది. ఆ పత్రిక ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. దానికి సంక్షిప్త రూపం ..
పద్దెనిమిదేండ్ల క్రితం.. మలయాళం సినిమా ‘మనస్సినక్కరే’ కోసం మొదటిసారి కెమెరా ముందుకు వచ్చింది నయనతార. అప్పటి నుంచి గ్యాప్ ఆమె తీసుకుంటే వచ్చింది కానీ, తనకు తానుగా ఎప్పుడూ రాలేదు. ‘అప్పుడు నాకు 18 ఏండ్లు. సినిమాల్లోకి అయితే వచ్చాను గానీ, ఎలా నటించాలో అస్సలు తెలియదు. ఒక్క సీన్ కోసం వంద సలహాలు ఇచ్చారు. అవన్నీ ఏకకాలంలో పాటించాలనీ చెప్పారు. నా పరిస్థితి ఊహించుకుంటే ఇప్పటికీ నవ్వు వస్తుంటుంది’ అంటూ తొలినాటి అనుభవాలను గుర్తు చేసుకుంటారు నయన్.
డయానా మేరియమ్ కురియన్.. నయన తార అసలుపేరు. బెంగళూరు, ఢిల్లీలో సాగింది బాల్యం. ఇంగ్లిష్ లిటరేచర్‌లో డిగ్రీ అందుకుంది. ఓ ఫ్యాషన్ కాంటెస్ట్‌లో విజేతగా నిలిచిన నయన తార ఫొటో ఓ మ్యాగజైన్లో ప్రచురితమైంది. దాన్ని చూసిన ‘మనస్సినక్కరే’ దర్శకుడు పిలిచి మరీ ఆఫర్ ఇచ్చాడు. ‘చిన్నప్పుడు నేను చాలా సైలెంట్. బిడియపడుతూ ఉండేదాన్ని. మా అమ్మా, నాన్న నన్నెంతో ప్రేమగా, జాగ్రత్తగా చూసుకునేవారు. నేను ఇండస్ట్రీకి వచ్చాక కూడా, మూడో సినిమా వరకూ షూటింగ్స్‌కు, సెట్స్‌కు నాతోపాటూ వచ్చేవాళ్లు. సినిమా వాతావరణంలో నేను ఇమిడిపోయానన్న నమ్మకం కలిగాక.. నన్ను ఒంటరిగా పంపడానికి అంగీకరించారు’ అని చెప్పుకొచ్చింది నయనతార.
ఇండస్ట్రీలో అవకాశం రావడం ఎంత కష్టమో, దాన్ని నిలబెట్టుకోవడం అంతకన్నా కష్టం. కానీ, ఈ విషయంలో తను అదృష్టవంతురాలిననే అంటుంది నయన్. తొలినాళ్లలోనే వరుస అవకాశాలు తలుపుతట్టాయి. “మలయాళంలో మూడు సినిమాలు చేసిన తర్వాత, తమిళంలో ‘అయ్యా’ చిత్రంతో రంగప్రవేశం చేశా. తర్వాత రజనీకాంత్ హీరోగా వచ్చిన ‘చంద్రముఖి’ నా కెరీర్‌కు ఊహించని బ్రేక్ ఇచ్చింది. తర్వాత వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పరిస్థితి రాలేదు. నటనే నా కెరీర్‌గా ఫిక్సయ్యాను” అంటుంది నయనతార.
చంద్రముఖి తర్వాత వచ్చిన ప్రతి అవకాశాన్నీ తన ఎదుగుదలకు నిచ్చెనగా చేసుకుంది నయన్. తెలుగులోనూ మంచి ఆఫర్లు రావడంతో స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్నది. వరుసగా కమర్షియల్ సినిమాల్లో అవకాశాలు చేజిక్కించుకుంది. అయితే, కొన్ని సందర్భాల్లో తనకూ అవకాశాలు ముఖం చాటేశాయి. అయినా, ధైర్యం కోల్పోలేదు. దొరికిన సినిమాలతో తన సత్తా చాటుకుంటూ ‘లేడీ సూపర్‌స్టార్’ అన్న పేరు సంపాదించుకుంది నయనతార. ‘ఏ కెరీర్లో అయినా ఒడుదొడుకులు సహజం. అప్పుడు నిరుత్సాహపడితే మళ్లీ పుంజుకోలేం. నమ్మకంతో ముందడుగు వేయాలి. ముఖ్యంగా దైవాన్ని విశ్వసించి సరైన నిర్ణయాలు తీసుకోవాలి. అలాగని అదృష్టం కోసం ఎదురుచూస్తూ కూర్చోవద్దు. మనలో కష్టపడే తత్వం, నిబద్ధత, నిజాయతీ ఉన్నప్పుడు అదృష్టం కూడా తోడవుతుంది’ అంటుంది నయన్.
సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే ఆమె.. సాధారణ ప్రసార సాధనాలకు మాత్రం వీలైనంత దూరం పాటిస్తుంది. సినిమా గురించి తప్ప మరే విషయాలపైనా అంత త్వరగా స్పందించదు. స్టార్ హీరోయిన్గా గుర్తింపు సాధించినా, నయన్ ఇప్పటికీ నిత్య విద్యార్థినే! ‘దర్శకుడు చెప్పిన సమయానికి అరగంట ముందు సెట్లో విత్ మేకప్ ఉంటుంది. పాత్ర తీరు తెన్నులను లోతుగా అడిగి తెలుసుకుంటుంది. సెట్లో అందరితోనూ సఖ్యతగా ఉంటుంద’ని చెబుతారు నిర్మాత శివన్.
ఇటీవల ఓటీటీలో విడుదలైన‘నెట్రికన్’ నయన్లోని అసలు సిసలు నటిని ప్రేక్షకులకు పరిచయం చేసింది. అంధురాలిగా ఆమె నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. సీబీఐ మాజీ అధికారిణిగా, ఓ అంధురాలిగా ఆమె అద్భుతంగా మెప్పించగలిగింది. ఈ సినిమా మొత్తాన్ని నయన్ తన భుజస్కందాలపై మోసిందని చెబుతారు చిత్ర దర్శకుడు మిలింద్ రావ్. ఇలాంటి పాత్రలు చేయాలంటే అనుభవం ఉంటే సరిపోదు.. అంతకుమించిన గట్స్ కావాలంటారు ఆయన.