e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, June 19, 2021
Home జిందగీ మహేష్‌ అమ్మగారు..మెచ్చుకున్నారు!

మహేష్‌ అమ్మగారు..మెచ్చుకున్నారు!

సినిమాల్లో నటించి పేరు, గుర్తింపు పొందాలని చాలామంది కలలు కంటారు. కానీ, ప్రయత్నంతోపాటు అదృష్టం కూడా తోడవ్వాలి. అక్కడే తేడా కొట్టింది. సినిమా హీరో కావాలని కలలుగన్నా, టెలివిజన్‌ హీరోగా స్థిరపడ్డాడు.అయితేనేం, వెండితెర హీరో స్థాయిలో ఆదరాభిమానాలు పొందుతున్నాడు ప్రముఖ యాంకర్‌, నటుడు అకుల్‌ బాలాజీ. ఆ కలను నెరవేర్చుకునేందుకు చేసిన ప్రయత్నాలను, మూటగట్టుకొన్న అనుభవాలను, సాధించిన విజయాలను ‘జిందగీ’తో ఇలా పంచుకొన్నారు.

మహేష్‌ అమ్మగారు..మెచ్చుకున్నారు!

ఎన్టీఆర్‌, ఏఎన్‌ఆర్‌, కృష్ణ, చిరంజీవి, బాలకృష్ణ… ఇలా రెండు తరాల హీరోల సినిమాలు చూస్తూ పెరిగాన్నేను. నాన్నతో కలిసి చెన్నై వెళ్ళేవాణ్ణి. రోజంతా హీరో హీరోయిన్లతో మాట్లాడటం, ఫొటోలు దిగడం, షూటింగ్స్‌ చూస్తూ గడిపేయడం.. ఆ నాలుగు రోజులూ అదే ప్రపంచం. నేను పుట్టి, పెరిగింది ఆంధ్రాలోనే. అమ్మది నెల్లూరు. నాన్నది కడపజిల్లా రైల్వే కోడూరు. మాకు కడపలో లక్ష్మీ ప్యారడైజ్‌ అనే థియేటర్‌ ఉండేది. చిన్నప్పటినుంచీ ఇల్లు, స్కూలుకంటే కూడా థియేటర్లలోనే ఎక్కువగా ఉండేవాణ్ణి. హీరో వెంకటేష్‌గారి పెండ్లికి వెళ్ళా. అక్కడ చాలామంది నటీనటులను దగ్గరగా చూశా. చాలా సంతోషంగా అనిపించింది. నటుడు కావాలనే కోరిక అప్పుడే దృఢ పడింది. స్కూల్లో టీచర్లు ‘పెద్దయ్యాక ఏమవుతావని’ అడిగితే, అందరూ డాక్టర్‌, ఇంజినీర్‌ అని చెబితే నేను మాత్రం ‘యాక్టర్‌’ అని చెప్పేవాణ్ణి. అమ్మకేమో నేను బాగా చదివి మంచి పొజిషన్లో ఉండాలని కోరిక. సినిమాల పిచ్చిలో పడి చదువుకోవట్లేదని హాస్టల్‌కు పంపింది. పరిస్థితులు అనుకూలించక, ప్రోత్సహించేవారు లేక అంత సులభంగా నా కలను నిజం చేసుకోలేకపోయాను.

18 ఏండ్లకే సంపాదన
నేను పదో తరగతిలో ఉండగా పరిస్థితుల ప్రభావం వల్ల మా కుటుంబం బెంగళూరుకు మారింది. భాష రాదు, కొత్త ప్రాంతం. నా కలల్ని పక్కన పెట్టి మల్టీమీడియాలో డిప్లొమా చేశాను. ఫ్యాకల్టీగా పనిచేశాను. పద్దెనిమిదేండ్లకే సంపాదించడం మొదలుపెట్టాను. మార్కెటింగ్‌ మేనేజర్‌ స్థాయికి చేరుకున్నాను.

‘సాగర సంగమం’ సినిమాలో కమల్‌హాసన్‌ను చూసి, నాన్న నన్ను భరతనాట్యం నేర్చుకోమన్నారు. భరతనాట్యంతోపాటు కథక్‌కూడా నేర్చుకుని ‘స్టెమ్‌ డాన్స్‌ ట్రూప్‌’లో చేరాను. ఐదేండ్లలో ప్రపంచవ్యాప్తంగా 600 ప్రదర్శనలిచ్చాను. ఎన్ని చేసినా, నటన మాత్రం మదిలో మెదలుతూనే ఉండేది. మాతృభాష తెలుగు కాబట్టి, నా కన్నడ ఉచ్ఛారణపై ఆ ప్రభావం ఉండేది. అప్పుడే ఉదయ టీవీలో ‘అగాథ’ అనే సీరియల్లో అవకాశం వచ్చింది. అనూహ్యంగా కన్నడ ప్రజలు నన్నూ, నా భాషనూ ఆదరించారు. అలా, ఓ నాలుగేండ్లు సీరియల్స్‌లో చేస్తూనే మార్షల్‌ ఆర్ట్స్‌, హార్స్‌ రైడింగ్‌ నేర్చుకొన్నా. సినిమాల్లో చిన్నచిన్న పాత్రలు చేసేవాణ్ణి. అప్పుడే కన్నడ పూర్తిగా నేర్చుకున్నా. 2004లో మొదటిసారిగా యాంకరింగ్‌ చాన్స్‌ వచ్చింది. తెలుగులో వచ్చిన ‘ఆట’ ప్రోగ్రామ్‌ని కన్నడలో చేశాను.

మహేష్‌ అమ్మగారు..మెచ్చుకున్నారు!

హీరోగా సక్సెస్‌ రాలేదు
సీరియల్‌ నటుడిగా, యాంకర్‌గా మంచిపేరు సంపాదించినా, హీరో కాలేకపోయాననే బాధ ఉండేది. ఆ కలా నిజమైంది. నేను హీరోగా కన్నడలో ‘ఆత్మీయ’, ‘బన్నీ’ సినిమాలు విడుదలయ్యాయి. ఏడు సినిమాలు చేశాను గానీ, అనుకున్న స్థాయిలో సక్సెస్‌ రాలేదు. సినిమాలపై ఫోకస్‌ పెట్టాలని సీరియల్స్‌ వదిలేశా. అప్పుడే, విజయనిర్మలగారి మేనకోడలితో నా పెండ్లి జరిగింది. విజయనిర్మలగారు నాతో సినిమా తీస్తానని మాటిచ్చారు. ఆమె చివరగా డైరెక్ట్‌ చేసిన ‘నేరము-శిక్ష’లో కృష్ణగారితో కలిసి నటించే అవకాశం ఇచ్చారు. అయితే, ఆ సినిమా అంతగా ఆడలేదు. దాంతో సినిమాలు వదిలేసి, నాకు సక్సెస్‌ రుచి చూపించిన టెలివిజన్‌ రంగంలోనే సెటిలయ్యా.

బిగ్‌బాస్‌ విజేతగా..
హీరోగా సక్సెస్‌ కాలేకపోయినా, టెలివిజన్‌ నన్ను అక్కున చేర్చుకుంది. ‘కిచ్చ’ సుదీప్‌ జడ్జ్‌గా వచ్చిన రియాల్టీ షో ద్వారా మళ్లీ గెలుపు బాటలో నడిచా. సిటీ అమ్మాయిలను పల్లెలకు తీసుకెళ్లి చేసిన షో అది. 2014లో కన్నడ బిగ్‌బాస్‌ సెకండ్‌ సీజన్‌ విజేతగా నిలిచా. దాదాపు నలభై రియాల్టీ షోలకు వ్యాఖ్యాతగా చేశా. ఒకానొక టైంలో ‘మోస్‌ ్టపాపులర్‌’, ‘హయ్యెస్ట్‌ పెయిడ్‌ మేల్‌ యాంకర్‌ ఇన్‌ సౌతిండియా’గా పేరొచ్చింది. సినిమా హీరోలకు ఏ మాత్రం తీసిపోని విధంగా నా ఫొటోగ్రాఫ్‌లు, ఆటోగ్రాఫ్‌ల కోసం జనం ఎగబడేవారు. నా దృష్టిలో టీవీ.. సినిమాకి ఏ మాత్రం తక్కువ కాదు.

తేడా తగ్గింది..
సినిమా, టెలివిజన్‌ల మధ్య ఒకప్పుడు సన్నని గీత ఉండేది. కానీ, అమితాబ్‌ బచ్చన్‌, చిరంజీవి, నాగార్జున, సల్మాన్‌ ఖాన్‌… ఇలా వెండితెర హీరోలు టెలివిజన్‌లో కూడా షోస్‌ చేస్తున్నారు. మేకింగ్‌ పరంగానూ రెండిటికీ పెద్ద తేడా లేదు. టెలివిజన్‌ హీరోలకు అభిమానులు, గుర్తింపుకూడా తక్కువేమీ కాదు. స్వశక్తితో పైకొచ్చిన చిరంజీవిగారంటే నాకు అభిమానం. చిన్నాపెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఆర్టిస్ట్‌నీ గౌరవిస్తా. వాళ్ళకు నేను తెలియకపోయినా, నన్ను నేను పరిచయం చేసుకుంటా.

తెలుగులోనూ…
కన్నడలో ఎంత పేరు వచ్చినా మాతృభాష తెలుగులో చేయలేదనే వెలితి ఉండేది. మా కుటుంబమంతా ఇక్కడే ఉంది. వాళ్ళెవ్వరికీ నేను చేసే షోలు, సీరియళ్ళు తెలియదు. ఎలాగైనా, తెలుగులో నటించాలని ‘భాగవతం’ సీరియల్‌ ఆడిషన్స్‌కి వచ్చా. కానీ, సెలెక్ట్‌ కాలేదు. తమ్మారెడ్డి భరద్వాజగారిని సంప్రదిస్తే, ‘నువ్వు ఎక్కడ మొదలు పెట్టావో అక్కడ సక్సెస్‌ సాధించు. ఆటోమేటిక్‌గా తెలుగులో అవకాశాలు వస్తాయి’ అన్నారు. అప్పుడే, జీ తెలుగు నుంచి ‘పెళ్ళినాటి ప్రమాణాలు’ అనే సీరియల్‌ అవకాశం వచ్చింది. అప్పటికి రియాలిటీ షోస్‌తో చాలా బిజీగా ఉన్నా. కానీ, తెలుగులో చేయాలనే బలమైన కోరికతో ఒప్పుకొన్నా. ఆ సీరియల్‌ బాగా హిట్‌ అయ్యింది. విజయనిర్మలగారు, మహేష్‌బాబు అమ్మగారు ఇందిరమ్మగారు కూడా కూర్చుని చూసేవాళ్ళు. వాళ్ళంతా నన్ను బాగా మెచ్చుకునేవాళ్ళు. తెలుగులో ‘దేశముదుర్లు’, ‘సై అంటే సై’తోపాటు మరో రెండు రియాల్టీ షోలుకూడా చేశా. ఓ రెండేండ్లు చేశాక షెడ్యూల్‌ బిజీ అవడంతో తెలుగునుంచి తప్పుకొన్నా. తెలుగు అభిమానులు మాత్రం నన్ను మర్చిపోలేదు. కాల్స్‌, మెసేజెస్‌ వస్తూనే ఉండేవి. నా భార్యే నా మేనేజర్‌. నా సోషల్‌ మీడియా అకౌంట్లన్నీ తనే చూస్తుంది. ‘అందరూ అడుగుతున్నారు కదా, తెలుగులో చేయమని’ తను చెప్పడంతో ఆరేండ్ల తర్వాత ‘ఊహలు గుసగుసలాడే’అనే సరికొత్త కథాంశంతో తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చా.

ప్రవళిక వేముల

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
మహేష్‌ అమ్మగారు..మెచ్చుకున్నారు!

ట్రెండింగ్‌

Advertisement