e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, July 28, 2021
Home జిందగీ తీరొక్క రాగం ఆరోగ్య యోగం

తీరొక్క రాగం ఆరోగ్య యోగం

తీరొక్క రాగం ఆరోగ్య యోగం

ఒక రాగం మనసు పొరల్లో నిరంతరం ప్రతిధ్వనిస్తుంటుంది. ఒక పాట నాల్కపై సదా నర్తిస్తూ ఉంటుంది. అనుక్షణం ఆ రాగాల ఒడిలో ఓలలాడటానికి కారణం అవి మనసును అంతలా హత్తుకోవడమే అంటారు మ్యూజిక్‌ థెరపిస్ట్‌ రాజం శంకర్‌. సంగీతం రాకపోయినా, రాగాల థియరీలు తెలియకపోయినా, వీనులకు విందు చేసిన గాత్రం నాడులనూ స్పందింపజేస్తుంటుందని చెబుతారామె. మానసిక ఆనందానికి దోహదం చేసిన రాగాలకు శారీరక, మానసిక రోగాలనూ నయం చేసే శక్తి ఉందంటారు. హైదరాబాద్‌కు చెందిన 70 ఏండ్ల పెద్దావిడ డాక్టర్‌ కోర్సు చదువకపోయినా, సంగీత వైద్యురాలిగా ఔషధ రాగాలను పలికిస్తున్నారు. ఆరోగ్య తరంగాలను ప్రసరింపజేస్తున్నారు. మ్యూజిక్‌ థెరపీతో మ్యాజిక్‌ చేస్తున్న రాజం శంకర్‌ ‘జిందగీ’తో పంచుకున్న అనుభవాలు ఆమె మాటల్లోనే..

సంగీతంలో స్వరమే సర్వం. ఆ స్వరం శరీరంలో భాగం అవ్వాలని మా గురువుగారు చెబుతుండేవారు. నాదం ఆత్మలో నుంచి రావాలి. సాహిత్యం, తాళం మెదడులో జనించాలి. అప్పుడే ఆ రాగం మనతో సంధానం అవుతుంది. అలా సుస్వరార్చనతో మనసును ట్యూన్‌ చేయగలిగితే ప్రతి రాగమూ దివ్యౌషధమే! చిన్నప్పటి నుంచి నేను డాక్టర్‌ చదివి రోగులకు సేవ చేయాలనుకున్నా. కానీ, 1968-69 సమయంలో నాన్‌-ముల్కీ అన్న కారణంగా నాకు మెడిసిన్‌లో సీటు రాలేదు. దాంతో సైన్స్‌లో డిగ్రీ చేశాను. చిన్నప్పుడు మూడేండ్లు శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నా. చదువు, పెండ్లి, పిల్లలతో చూస్తుండగానే కొన్నేండ్లు గడిచిపోయాయి. పిల్లలు స్కూల్‌కు వెళ్లడం మొదలుపెట్టాక 30 ఏండ్ల వయసులో మళ్లీ సంగీతం నేర్చుకోవడం మొదలుపెట్టాను.

- Advertisement -

గురువు ఆశీర్వాదంతో..
సంగీతంలో అప్పటికే ప్రవేశం ఉండటంతో వడివడిగానే రాగాలపై పట్టుసాధించాను. నా భర్త ప్రోత్సాహంతో కర్ణాటక సంగీతంలో డిగ్రీ, మాస్టర్స్‌ చేశాను. అలాగే వేదిక్‌ ఆస్ట్రాలజీ చదివాను. ఆ సమయంలోనే మా గురువు సుందరి జానకిరామ్‌ గారు ‘నీలో మంచి గురువు కాగల లక్షణాలు ఉన్నా’యన్నారు. పాఠాలు బోధించడంలో మెలకువలు నేర్పించారు. అలా మెల్లమెల్లగా సంగీతం క్లాసులు చెప్పడం ప్రారంభించాను. మొదట్లో ఇద్దరు విద్యార్థులు వచ్చే వారు. కొన్నాళ్లకు వందమంది అయ్యారు. అలా సంగీతం మళ్లీ నా జీవితంలో భాగమైంది. మరోవైపు సంగీతంపై పరిశోధనలు ప్రారంభించాను. 1996 నుంచి మా గురువు, సంగీత విద్వాంసులు శ్రీ కొల్లిగల్‌ ఆర్‌. సుబ్రహ్మణ్యంగారి దగ్గర సాధన చేయడం మొదలుపెట్టాను. రాగాలు, స్వరాలను అనుభవిస్తూ పాడటం ఆయన దగ్గరే నేర్చుకున్నాను. ఆ సమయంలోనే మ్యూజిక్‌ థెరపీ పరిశోధన ప్రారంభించాను.

ప్రాక్టికల్‌ మ్యూజిక్‌ థెరపీ
పరిశోధనకే పరిమితమైన నా మ్యూజిక్‌ థెరపీ ప్రాక్టికల్‌గా మారడం వెనుక చిన్న కథ ఉంది. హోమియోపతిలో సీనియర్‌ డాక్టర్‌ శ్రీనివాసరావుగారు మా కుటుంబానికి ఆప్తుడు. నేను ఎప్పుడైనా దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చినప్పుడు ఆయన్ను కలిసి ఎమర్జెన్సీ మెడిసిన్‌ తీసుకునేదాన్ని. అలా ఒకసారి ఆస్ట్రేలియా వెళ్తున్నప్పుడు వారిని కలిశాను. ఆయన కూడా ఏదో కాన్ఫరెన్స్‌ కోసం ఆ దేశానికి వస్తున్నట్టు చెప్పారు. ఆస్ట్రేలియాలో కలిసినప్పుడు ‘ఇక్కడ కొందరు వైద్యులు భారతీయ రాగాల గురించి క్లుప్తంగా తెలుసుకోవాలని అనుకుంటున్నార’ని చెప్పారు. అలా అక్కడి వైద్యులతో రెండురోజులు డిస్కషన్స్‌ జరిగాయి. సంగీతంపై నాకున్న అవగాహన మా డాక్టర్‌గారికి కూడా అప్పుడే తెలిసింది. హైదరాబాద్‌కు వచ్చేశాక నియోనాటాలిస్ట్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ పీడియాట్రిషియన్‌ డాక్టర్‌ లక్ష్మి ప్రసన్న మ్యూజికల్‌ థెరపిస్ట్‌ల కోసం వెతుకుతున్నట్లు నాతో అన్నారు. ఆమెను కలిశాక ప్రాక్టికల్‌గా మ్యూజిక్‌ థెరపీ గురించి ఆలోచించాను. నా సంగీత గురువు ఆశీర్వాదంతో కొత్త ప్రయాణం మొదలుపెట్టాను. అలా డాక్టర్లతో కలిసి శాస్త్రీయ సంగీతంతో చికిత్స చేసేందుకు ముందడుగు వేశాను. మెడికల్‌ ట్రీట్‌మెంట్‌కి మ్యూజిక్‌ థెరపీ సపోర్టివ్‌ సిస్టమ్‌ మాత్రమే. ఇందుకోసం నా దగ్గరికి వచ్చే వ్యక్తుల ఫ్యామిలీ హిస్టరీ, ప్రస్తుత పరిస్థితులను అడిగి తెలుసుకుంటాను. ఏ సమస్యకైనా మూలం తెలుసుకుంటే చికిత్స ఫలితాలు బాగుంటాయి.

ఒక్కొక్కరికీ ఒక్కో రాగం
సంగీతంలో ఎన్నో రాగాలుంటాయి. కొన్ని రాగాలు, స్వరాలు తెలియని అనుభూతిని కలిగిస్తాయి. శారీరకంగా అలసటకు గురైతే పండ్లరసం ఎలాగైతే సత్తువనిస్తుందో, అలాగే మానసిక ఒత్తిడి నుంచి బాడీరాగా ఉపయోగపడుతుంది. అయితే, ఎవరి బాడీరాగా ఏంటో తెలుసుకుంటే మ్యూజిక్‌ థెరపీ ఫలితాలు కచ్చితంగా ఉంటాయి. ఒక వ్యక్తి బాడీరాగా తెలుసుకోవడానికి మూడు విధానాలు ఉంటాయి. సంగీతంపై అవగాహన ఉండి, కచేరీలకు వెళ్లేవాళ్లకు.. ఏ రాగం వింటున్నప్పుడు మనసు, శరీరం తన్మయం చెంది మేఘాల్లో విహరిస్తున్నట్టు ఉంటుందో అది వాళ్ల బాడీరాగా అన్నమాట. సంగీతంపై అవగాహన లేని వాళ్లు తమకు ఇష్టమైన రాగాన్ని కనిపెట్టడం సులువే. సినిమా పాటలు, జానపద గీతాలు వింటున్నప్పుడు.. ఒక పాట ఎంతో అలరిస్తుంది. పదేపదే అదే వినాలనిపిస్తుంటుంది. ఆ పాట రాగమే తమ బాడీరాగాగా గుర్తించాలి. ఒక్కోసారి మనకు తెలియకుండానే కొన్ని రాగాలను అలపిస్తుంటాం. స్నానం చేసేటప్పుడో, ఏదైనా పనిలో ఉన్నప్పుడో ఏదో కూనిరాగం తీస్తూ సంతోషం పొందుతుంటాం. ఆ రాగాన్ని బట్టి బాడీరాగాను తెలుసుకోవచ్చు. అలా మనసుకు దగ్గరైన రాగాన్ని తెలుసుకొని, మానసిక చికిత్స కోసం ఆ రాగాన్ని ఉపయోగించాలి. అప్పుడు ఫలితాలు మరింత మెరుగ్గా ఉంటాయి.

డాక్టర్‌ సిఫారసు చేస్తేనే..
ఎన్నో పరిశోధనల తర్వాత గుర్తించిన ఈ విధానాన్ని నేను అనుసరిస్తున్నాను. డాక్టర్ల టీమ్‌తో కలిసి దాదాపు పదేండ్లుగా మ్యూజిక్‌ థెరపీ అందిస్తున్నాను. ముఖ్యంగా ఆటిజం పిల్లల విషయంలో నేను, డాక్టర్లు కలిసి కృషి చేస్తున్నాం. ఆటిజం పిల్లలతోపాటు ఇతర మానసిక రుగ్మతలున్న వాళ్లు కూడా నన్ను సంప్రదిస్తున్నారు. అయితే, చికిత్స మొదలుపెట్టడానికి ముందు వైద్యులు వాళ్లకు మ్యూజిక్‌ థెరపీ సిఫారసు చేశారా, లేదా చూస్తాను. మెడికల్‌ రిపోర్ట్స్‌ పరిశీంచిన తర్వాతే థెరపీ ప్రారంభిస్తాను. నాకున్న సమయంలో 99 శాతం మ్యూజిక్‌ థెరపీ కోసమే వినియోగిస్తున్నాను. ఇద్దరు, ముగ్గురు విద్యార్థులకు మాత్రమే సంగీతం పాఠాలు చెబుతున్నాను.

రాగాల పుస్తకం
రోగాలను నయం చేసే శక్తి రాగాలకు ఉంది. ఈ విషయం ముందు తరాలకు తెలియాలంటే పరిశోధనాత్మక గ్రంథం రాయాల్సిందిగా మా వారు, కూతురు, పలువురు మిత్రులు, పూర్వ విద్యార్థులు ఒత్తిడి చేశారు. అలా రెండేండ్ల కిందట నా మొదటి పుస్తకం ‘ది హీలింగ్‌ పవర్‌ ఆఫ్‌ ఇండియన్‌ రాగాస్‌’ తయారైంది. అందులో మ్యూజిక్‌ థెరపీపై నా పరిశోధన మొదలు దాని వల్ల కలిగే లాభాలు, నా క్లయింట్స్‌ అనుభవాలు అన్నీ పొందుపరిచాను. అలాగే మ్యూజిక్‌ థెరపీలో 35 రాగాలు, నాద అనుసంధానాలను వివరంగా తెలిపాను. మ్యూజిక్‌ థెరపీపైనే మరో పుస్తకం రాస్తున్నాను.

కుటుంబ ప్రోత్సాహంతోనే..

కరోనాకు ముందువరకు కొన్నేండ్లు మ్యూజిక్‌ థెరపీపై వివిధ చానల్స్‌లో వందల ప్రోగ్రామ్‌లు ఇచ్చాను. కొవిడ్‌ నేపథ్యంలో ఏడాదిన్నరగా ఆన్‌లైన్‌లోనే థెరపీ అందిస్తున్నాను. వైద్యులకు కష్టంగా పరిణమించిన ఈ కాలంలో మనదేశంతోపాటు విదేశాల్లోని వైద్యులు, వాళ్ల కుటుంబసభ్యులు తీవ్ర మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. మ్యూజిక్‌ థెరపీ కోసం నన్ను సంప్రదిస్తున్నారు. ఈ వయసులోనూ ఇలా కష్టపడగలుగుతున్నానంటే దానికి వెనుక ఉన్న అతిపెద్ద బలం మావారు శంకర్‌. ఆయన ప్రోత్సాహంతోనే ఇదంతా సాధ్యమవుతున్నది. ఆయన నాకు చిన్నప్పటి నుంచీ తెలుసు. మా పరిచయం స్నేహంగా మారి, ప్రేమగా చిగురించి, వైవాహిక బంధంగా మారింది. మాకు పెండ్లయి 50 ఏండ్లు అయినా ఇప్పటికీ మేం చిన్ననాటి స్నేహితులమే. నా పిల్లలు కూడా మొదట్నుంచీ సపోర్టివ్‌గా ఉంటున్నారు. వాళ్ల చిన్నతనంలో నేను నాలుగు చోట్లకు వెళ్లి మ్యూజిక్‌ క్లాసెస్‌ చెప్పేదాన్ని. అప్పుడు ఏరోజూ మారాం చేయకుండా, వాళ్ల పనులు వాళ్లు చేసుకునేవాళ్లు. ఇప్పుడు పిల్లలంతా వారి వారి రంగాల్లో బాగా సెటిలయ్యారు.

… నిఖిత నెల్లుట్ల

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
తీరొక్క రాగం ఆరోగ్య యోగం
తీరొక్క రాగం ఆరోగ్య యోగం
తీరొక్క రాగం ఆరోగ్య యోగం

ట్రెండింగ్‌

Advertisement