గురువారం 22 అక్టోబర్ 2020
Zindagi - Aug 13, 2020 , 22:36:27

వార్తల్లో మహిళ కాంతామూర్తి కలాన్‌

వార్తల్లో మహిళ కాంతామూర్తి కలాన్‌

చినుకు పడితే.. ఏ చూరు కిందో దూరిపోతాం. వరద ముంచెత్తితే.. ఎలాగో అలా ఇంటికి చేరుకొని బతుకు జీవుడా అనుకుంటాం. కానీ, ఈ 50 ఏండ్ల పెద్దమ్మ మాత్రం.. ఏడు గంటలు వర్షంలో, వరదలో నిల్చుంది. ఆమె పేరు కాంతామూర్తి కలాన్‌. ముంబైలో పూలమ్ముకుని జీవనం సాగిస్తుంటుంది. ఇటీవల ముంబైలో భారీ వర్షాలు కురిశాయి. మాతుంగా అనే ప్రాంతంలో వరద బీభత్సం సృష్టించింది. ఆ ప్రాంతంలోనే ఉండే కాంతామూర్తి.. రహదారిపై మ్యాన్‌హోల్‌ తెరిచి ఉండటాన్ని గమనించింది. వర్షం పడుతున్నా.. వరద పోటెత్తుతున్నా.. మ్యాన్‌హోల్‌ దగ్గరే నిల్చుండిపోయింది, అటుగా వచ్చే వాహనదారులను, పాదచారులను హెచ్చరిస్తూ ఏడు గంటలు వరదలోనే ఉంది.  జీవితంలో కష్టాల కడలి ఈదుతున్న తనకు ఈ వరద పెద్ద లెక్క కాదంటోందామె. పక్షవాతానికి గురైన భర్త మంచానికే పరిమితం కావడంతో.. పూలమ్ముతూ పిల్లలను చదివిస్తున్నానని చెప్పుకొచ్చింది. సాటి మనుషులను కాపాడేందుకు సాహసించిన కాంతమ్మ సామాజిక స్పృహకు ముంబైకర్లు ఫిదా అయ్యారు. ఆమె కుటుంబాన్ని ఆదుకోవాలనుకున్నారు. సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ ర్యాలీ నిర్వహించి రూ.1.50 లక్షలు సేకరించారు. ఈ మొత్తాన్నీ ఆమె బ్యాంకు ఖాతాకు బదిలీ చేసి కృతజ్ఞత చాటుకున్నారు.logo