e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, September 18, 2021
Home జిందగీ వస్తున్నాం.. మిత్రమా!

వస్తున్నాం.. మిత్రమా!

ఇంటి ముందు అరుగు.
వీధి మలుపులో పిట్టగోడ.
ఊరు చివరన క్రికెట్‌ గ్రౌండ్‌.

ఇవన్నీ అసలైన స్నేహానికి చిరునామాలే! ఆ మిత్రులందరికీ క్లోజ్‌ఫ్రెండ్‌ మాత్రం సినిమా థియేటరే! మళ్లీ ఆ ఫ్రెండ్‌ పిలుస్తున్నది. తన ఒడికి చేరి బడలిక మర్చిపోమంటున్నది. నెలలుగా దూరమైన స్నేహితులను కలవాలని ఆరాటపడుతున్నది.వారి కేరింతలు చూసి మురిసిపోవాలనుకుంటున్నది. తను పలికించే స్నేహగీతానికి ఈలలతో కోరస్‌ పలుకమంటున్నది. లెట్స్‌ సెలబ్రేట్‌ ‘ఫ్రెండ్‌షిప్‌ డే’ విత్‌ ఎవర్‌గ్రీన్‌ దోస్త్‌!

బుక్‌ మై షో నోటిఫికేషన్‌. ఎన్ని రోజులైందో స్నేహితుడి ఆహ్వానం అందుకొని! ఇప్పుడంటే ఇలా ఆన్‌లైన్‌లో పిలుపు అందుతుంది కానీ, ఒకప్పుడు ‘నమో వేంకటేశ.. నమో తిరుమలేశా..’ అంటూ ఊరు ఊరంతా వినిపించేలా మిత్ర బృందాన్ని పిలిచే మనసున్న నేస్తం.. టాకీస్‌. ఇప్పటి స్నేహమా ఇది! దశాబ్దాలు దాటిపోయాయి. శతాబ్దానికి చేరువ అవుతున్నది. తరాలు మారినా, తన తీరుతెన్నులు మారినా ఆ స్నేహం చెక్కు చెదరలేదు. నేస్తాల అభిరుచి, అవసరాలకు తగ్గట్టుగా తనను తాను మార్చుకొని, కొత్త సొబగులు అద్దుకొని సదా సిద్ధంగా ఉంటుంది. టూరింగ్‌ టాకీస్‌ నుంచి మినీ థియేటర్‌గా, ఆపై భారీ టాకీస్‌గా, తర్వాత గాలిని సైతం కండిషన్‌లో పెట్టే ‘చలి’కాడుగా, 35 ఎమ్‌ఎమ్‌ అనీ, 70 ఎమ్‌ఎమ్‌ అనీ ఎంతలా అప్‌డేట్‌ అయినా ప్రేక్షకుడికి మాత్రం దూరం కాలేదు. వారానికో కొత్త బొమ్మతో పలుకరిస్తూ, ఆట మీద ఆట చొప్పున రోజుకు నాలుగు ఆటలు ఆడిస్తూ ప్రేక్షక స్నేహితులను ఉర్రూతలూగిస్తూనే ఉంది.

- Advertisement -

అందరూ ఒక్కటే
‘కుల, మతాల తారతమ్యాలు లేనిది, ధనిక, పేద భేదాలు ఉండనిదే నిజమైన స్నేహం’ అంటారు. ఫ్రెండ్‌షిప్‌లోని ఈ ప్రాథమిక సూత్రాన్ని నిర్ద్వంద్వంగా పాటించే ఏకైక నేస్తం థియేటర్‌! నేల టికెట్‌ వారికి, బాల్కనీలో ఉన్నవారికీ ఒకే బొమ్మ చూపుతుంది. ఒకే శబ్దం వినిపిస్తుంది. లోనికి వచ్చినవారంతా తన వారేనన్న ఫీలింగ్‌. బొమ్మ బాగున్నా, బాగోకపోయినా.. సీట్లు నిండుగా ఉన్నా, ఖాళీగా ఉన్నా.. తన స్నేహధర్మాన్ని విస్మరించదు. వెండితెరపై నిండుమనసుతో రెండున్నర గంటలు ఏకధాటిగా చలనచిత్రాన్ని ఆడిస్తుంది. వచ్చినవారిని అలరిస్తుంది. మధ్యలో పాప్‌కార్న్‌తో ఆతిథ్యం ఇస్తుంది. కూల్‌డ్రింక్‌తో మర్యాద చేస్తుంది. చిట్టి సమోసాలతో బంధం గట్టిపడేలా చేస్తుంది. చిక్కని చాయ్‌తో చక్కని అనుబంధాలకు తెరతీస్తుంది.

ఆనందన వనం
పచ్చగా కళకళలాడే చెట్టుపైకే గువ్వలన్నీ చేరుకుంటాయి. రోజుకు నాలుగు పూటలా ఆనందనవనంలా అలరారే ఈ దోస్త్‌ సన్నిధికి స్నేహితులు ఎందరో తరలి వస్తుంటారు. కూడబలుక్కొని వస్తారు. కూడు కూడా వదులుకొని వస్తారు. రిలీజ్‌ రోజే వాలిపోయే అభిమానధనులు, కాలేజీకి బంక్‌ కొట్టి వచ్చే ఒకటో నెంబర్‌ కుర్రాళ్లు, కాలక్షేపం కోసం విచ్చేసే కాటమరాయుళ్లు, పని ఒత్తిడి నుంచి రిలాక్సేషన్‌ కోసం వచ్చే మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌లు, పనులన్నీ పక్కనపెట్టి వచ్చే జల్సారాయుళ్లు, ఇంట్లోవాళ్లకు తెలియకుండా లోపలికి చాటుగా దూరే అబ్బాయిగార్లు, భర్తలకు తెలియకుండా వచ్చే భార్యామణులు.. అబ్బో! ఏ కేటగిరీకి చెందిన వాళ్లకయినా ఆనందాన్ని పంచుకోవడానికి థియేటర్‌ను మించిన అడ్డా మరొకటి ఉండదు. క్యూలైన్‌లో తోసుకోవడాలు, పడిపడి నవ్వడాలు, ఒకరినొకరు గేలి చేసుకోవడాలు, ఓరగా చూడటాలు ప్రతి సీనూ అదుర్స్‌! టాకీస్‌ ప్రాంగణంలో వాలే ప్రేమపక్షులకు కొదువుండదు. చిలిపి ఊసులు పంచుకుంటూ, వలపు సీనులు పండించేస్తారు. చివరి సీట్లను వెతుక్కుంటూ వాళ్లు పడే శ్రమను తప్పించడానికి పిండివెన్నెల కురిపిస్తూ వెండితెర సాయం చేస్తుంది. ఆల్‌రెడీ స్నేహితులే కాదు, థియేటర్‌లోనే చిగురించే స్నేహాలెన్నో. టికెట్‌ బుకింగ్‌లో, షేరింగ్‌లో, సీట్ల మార్పిడిలో ప్రతి క్షణం విలక్షణ స్నేహాలు పుడుతూనే ఉంటాయి. కొన్ని పరిచయాలు పరిణయాలకూ దారితీస్తాయి. ఆ ప్రణయజీవుల పాలిట ఈ టాకీసే మ్యారేజ్‌ టాకింగ్స్‌కు వేదిక. దేవుడి దయతో ఆ జంట ఒక్కటైతే, దైవ దర్శనానికి ముందు తమను కలిపిన థియేటర్‌కు వచ్చి కృతజ్ఞతగా మరో సినిమా చూస్తారు. ఇలా చెబుతూపోతే అజబ్‌ దోస్తానాకా గజబ్‌ కహానీలు కోకొల్లలుగా కనిపిస్తూనే, వినిపిస్తూనే ఉంటాయి.

రిపీట్‌ ఫ్రెండ్‌షిప్‌
ఎంత మంచి సినిమా అయినా సూపర్‌హిట్‌ అవ్వాలంటే రిపీట్‌ ఆడియన్స్‌ కావాల్సిందే! కానీ, ప్రేక్షకుడిని పదేపదే అదే సినిమాకు రప్పించగలగడం దిగ్గజ దర్శకులకు కూడా అంత ఈజీ కాదు. స్నేహితుడికి మాత్రం అది సింపుల్‌ టాస్క్‌. చూసిన సినిమా మళ్లీ చూడాలంటే అందులో ఉన్న విషయం కన్నా గొప్ప వ్యవహారం ఉండాలి. దటీజ్‌ ఫ్రెండ్‌షిప్‌. ప్రియమిత్రుడి నుంచి చిన్న సందేశం చాలు, ఉన్న పనులన్నీ వదిలేసుకొని థియేటర్‌కు వచ్చేసే స్నేహితులు ఎందరో!
‘నిన్ననే చూసిన మామా!’ అన్నాడా.. ‘నాకు చెప్పకుండా పోయినవ్‌లే!!’ అని నిలదీస్తాడేమోనన్న భయం. ధైర్యం చేసి చెప్పినా.. ‘మళ్లీ చూద్దాం తీరా బై’ అంటూ తన వెంట తీసుకెళ్లే చొరవ స్నేహితుడి ప్లస్‌ పాయింట్‌. ప్రేక్షకుడిని రిపీట్‌ ఆడియన్స్‌గా మార్చేశక్తి స్నేహితుడు. ఇక ఆ సినిమాలో కథావస్తువు స్నేహమే అయిందా, బాక్సాఫీస్‌ రికార్డులు ఖాయం! ఈ దోస్తులందరినీ అలరించే మెగా దోస్త్‌ సినిమా టాకీస్‌.

భవిష్యత్తు మన చేతుల్లోనే..
కొన్నాళ్లుగా మన దోస్త్‌కు కష్టాలొచ్చాయి. కరోనా మనిషి బతుకును ప్రభావితం చేసినట్టే థియేటర్‌ మనుగడనూ ప్రశ్నార్థకం చేసింది. వారాలకు వారాలు ప్రేక్షకులతో కిటకిటలాడే టాకీసులు నెలలకు నెలలుగా మూతబడి ఉన్నాయి. కొవిడ్‌ మొదటి వేవ్‌ ముగిసిన తర్వాత ప్రజలకు కొన్ని రోజులు ఊరటనిచ్చిన సినిమా హాల్‌ను సెకండ్‌వేవ్‌ ముప్పు తిప్పలుపెట్టింది. ఈ ఆటంకాన్నీ దాటుకొని మళ్లీ తెరుచుకుంది థియేటర్‌. ఆన్‌లైన్‌కు అంటకాగిన నేస్తాలకు సాదరంగా ఆహ్వానం పలుకుతున్నది. చెదిరిపోతున్న కళను ఆదుకోవడానికి అదిరిపోయే ఓపెనింగ్స్‌ ఆకాంక్షిస్తున్నది. వ్యాక్సిన్‌ రక్షణ ఉన్నా మాస్కులు ధరిస్తూ, దూరం పాటిస్తూ సినిమా థియేటర్‌ను కాపాడుకుందాం. ఈ స్నేహితుల దినోత్సవాన్ని దగ్గరి స్నేహితులతో కలిసి దోస్తానా టాకీస్‌లో జరుపుకొందాం.

ఓటీటీ, ఏటీటీ రూటు మార్చి.. సిటీ బస్సు ఎక్కి, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో దిగి ‘దేవి’ని కలిసొద్దాం. ‘సంధ్య’ను చూసి మురిసిపోదాం. ‘సుదర్శన్‌’గాడి ఆతిథ్యం స్వీకరిద్దాం. ‘సప్తగిరి’కి దండం పెట్టుకుందాం. ‘శాంతి’ ఒడిలో మనశ్శాంతి పొందుదాం. మల్టీప్లెక్స్‌లో మల్టిపుల్‌ స్నేహితుల మధ్య కాలాన్ని మర్చిపోదాం. ఏ ఊరి దోస్తులు ఆ ఊరి మెగాదోస్త్‌ను మనసారా పలుకరించండి. కనులారా చూసి రండి. పిక్చర్‌ అబీ బాకీ హై.. మేరా దోస్త్‌!

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana