e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, June 21, 2021
Home జిందగీ తీన్‌మార్‌

తీన్‌మార్‌

తీన్‌మార్‌

మూడు నెలలు.. ఆరు హిట్లు
ఎన్నాళ్లయింది ఈలలు విని! ఎన్ని రోజులైంది కాగితాలు గాల్లోకెగిరి!

కడుపుబ్బా నవ్వులు. కన్నీరొలికించే కండ్లు. చప్పట్లు చరిచే చేతులు. అన్ని భావనలూ మళ్లీ రాజుకున్నాయి. సినీప్రియులకు పసందైన చిత్రాలతో సిసలైన విందు మొదలైంది. డిసెంబర్‌ నెలాఖరున మొదలైన సినిమాల సందడి 2021 ఆరంభంలో ఊపందుకుంది. తొలి త్రైమాసికంలో హిట్‌ చిత్రాల జోరు, ఫ్లాప్‌ చిత్రాల బేజారు సంగతి అటుంచితే, కామన్‌ ప్రేక్షకుల నీరాజనాలు వెండితెరకు సదా ఉంటాయని నిరూపితమైంది.
లాక్‌డౌన్‌ కష్టాలను అధిగమించిన టాలీవుడ్‌, ‘టాక్‌ ఆఫ్‌ ద టౌన్‌’ చిత్రాలతో అలరించడం మొదలుపెట్టింది. కరోనా కారణంగా నవమాసాలూ వినోదానికి దూరమైన సినీప్రియులు బొమ్మ పడింది మొదలు ఉప్పెనలా థియేటర్లకు దూసుకొచ్చి భవిష్యత్తుపై భరోసా కల్పించారు. గత డిసెంబర్‌ ఆఖరులో థియేటర్లు అందుబాటులోకి వచ్చాయి. ఆంక్షల నడుమ సినిమా వీక్షణ ఎలా ఉంటుందోనని చాలామంది సందేహించారు. వాటన్నిటినీ పటాపంచలు చేస్తూ థియేటర్లలో ప్రేక్షకులు సినిమాల్ని ఆస్వాదిస్తున్నారు. ఈ ఏడాది తొలి త్రైమాసికం ఆశాజనకమైన ఫలితాల్ని సాధించిపెట్టింది. ‘సోలో బ్రతుకే సో బెటర్‌’ మొదలు ఇటీవల విడుదలైన
‘జాతి రత్నాలు’, ‘అరణ్య’, ‘రంగ్‌దే’ వరకు తెలుగు చిత్రసీమకు చక్కటి విజయాలు దక్కాయి. మున్ముందు ప్రేక్షకుల్ని అలరించేందుకు భారీ చిత్రాలు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. గతేడాది క్రిస్మస్‌ సమయంలో విడుదలైన సాయితేజ్‌ ‘సోలో బ్రతుకే సో బెటర్‌’ తెలుగు చిత్ర
సీమలో నూతనోత్సాహాన్ని నింపింది. కరోనా భయాల్ని వీడి ప్రేక్షకులు థియేటర్లకు వస్తారా? పూర్వ వైభవం కనిపిస్తుందా? అన్న అనుమానాల్ని దూరం చేస్తూ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా మంచి వసూళ్లను సాధించింది. సినిమాల్ని విడుదల చేయవచ్చనే నమ్మకాన్ని దర్శక
నిర్మాతల్లో నింపింది. కరోనా కారణంగా తెలుగు చిత్రసీమలో అలుముకున్న చీకట్లను పారదోలుతూ, 2021కి ఘనస్వాగతం పలికింది.
సంక్రాంతి విన్నర్‌ ‘క్రాక్‌’
సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదలైన ‘క్రాక్‌’ 2021లో తెలుగు చిత్రసీమకు శుభారంభాన్ని అందించింది. లాక్‌డౌన్‌ తర్వాత ఈ సినిమాతో మళ్లీ థియేటర్లు కళకళలాడాయి. యాభై శాతం ఆక్యుపెన్సీతో సంక్రాంతి సినిమాలు ప్రదర్శితం కావడంతో ఓ మోస్తరు వసూళ్లనైనా సాధిస్తాయా అనుకున్నాయి ట్రేడ్‌ వర్గాలు. వారి అంచనాలను తలకిందులను చేస్తూ ‘క్రాక్‌’ అద్వితీయ విజయాన్ని దక్కించుకున్నది. ‘క్రాక్‌’కు పోటీగా సంక్రాంతి బరిలో నిలిచిన రామ్‌ ‘రెడ్‌’ యావరేజ్‌ సినిమాగా నిలిచింది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ నటించిన ‘అల్లుడు అదుర్స్‌’ ప్రేక్షకుల తిరస్కారానికి గురైంది. పాటలు, ప్రచార చిత్రాలతో ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించిన అల్లరి నరేష్‌ ‘బంగారు బుల్లోడు’, ప్రదీప్‌ మాచిరాజు ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ సినిమాలు జనవరిలోనే ప్రేక్షకుల్ని పలకరించాయి. కానీ, అంచనాల్ని చేరుకోలేక ప్రేక్షకుల్ని నిరాశ పరిచాయి.
‘జాంబీరెడ్డి’తో మొదలు
‘క్రాక్‌’ విజయ పరంపరను ఫిబ్రవరిలో ‘జాంబీరెడ్డి’ కొనసాగించింది. తెలుగు తెరకు జాంబీ కాన్సెప్ట్‌ను తొలిసారిగా పరిచయం చేస్తూ దర్శకుడు ప్రశాంత్‌వర్మ ప్రయోగాత్మకంగా తెరకెక్కించిన ఈ చిత్రం యువతరాన్ని ఆకట్టుకుంది. కామెడీకి పెద్దపీట వేస్తూ నిర్మాతలకు మంచి లాభాల్ని తెచ్చిపెట్టింది. లాక్‌డౌన్‌ తర్వాత నెలకొన్న పరిస్థితుల్లో ఓ సినిమా వంద కోట్ల మైలురాయిని చేరుకోవడం అసాధ్యమనే అంచనాకు వచ్చాయి ట్రేడ్‌ వర్గాలు. కానీ, దాన్ని సుసాధ్యం చేసిన సినిమా ‘ఉప్పెన’. ప్రేమికుల రోజు సమయంలో విడుదలైన ఈ చిత్రం తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకున్నది. సంపన్న కుటుంబానికి చెందిన అమ్మాయి, నిరుపేద అబ్బాయి ప్రేమకథ ఇది. కానీ, ఇలాంటి కథకు వెండితెరపై ఇప్పటివరకు ఎవరూ స్పృశించని సరికొత్త పాయింట్‌ను జోడిస్తూ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు దర్శకుడు బుచ్చిబాబు సానా. నాయకానాయికలు వైష్ణవ్‌తేజ్‌, కృతిశెట్టి కెమిస్ట్రీకి తోడు దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం, మైత్రీ మూవీస్‌ సుకుమార్‌ రైటింగ్స్‌ సంస్థల నిర్మాణ విలువలు వెరసి ఈ సినిమా వంద కోట్లకుపైగా వసూళ్లను సాధించింది. లాక్‌డౌన్‌ అనంతరం దేశవ్యాప్తంగా విడుదలైన చిత్రాల్లో వంద కోట్లు దాటిన తొలి సినిమాగా ‘ఉప్పెన’ నిలిచింది. కామెడీ పంథాకు భిన్నంగా సందేశాత్మక కథాంశాన్ని ఎంచుకొని అల్లరి నరేష్‌ నటించిన ‘నాంది’ చిత్రం మంచి సినిమాగా విమర్శకుల మన్ననల్ని అందుకున్నది. అండర్‌ ట్రయల్‌ ఖైదీల సమస్యల్ని ఇతివృత్తంగా తీసుకొని దర్శకుడు విజయ్‌ కనకమేడల వైవిధ్యంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఫిబ్రవరిలో విడుదలైన నితిన్‌ ‘చెక్‌’, సుమంత్‌ ‘కపటధారి’ చిత్రాలు పరాజయాలుగా నిలిచాయి.
మార్చిలో మెరిసిన ‘జాతి రత్నాలు’
ఈ నెల తెలుగు చిత్రసీమకు సానుకూల ఫలితాల్ని అందించింది. తొలివారంలో విడుదలైన ‘ఏ1 ఎక్స్‌ప్రెస్‌’ చిత్రం భిన్నమైన ప్రయత్నంగా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. సందీప్‌ కిషన్‌ హీరోగా హాకీ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం చక్కటి ఓపెనింగ్స్‌ను రాబట్టింది. దిల్‌రాజు నిర్మాణంలో రూపొందిన ‘షాదీ ముబారక్‌’ మంచి సినిమాగా నిలిచినా, సరైన వసూళ్లు సాధించలేకపోయింది. రెండో వారంలో విడుదలైన శర్వానంద్‌ ‘శ్రీకారం’ సందేశాత్మక సినిమాగా ప్రేక్షకుల మెప్పును పొందింది. వ్యవసాయం గొప్పతనాన్ని ఆవిష్కరిస్తూ కుటుంబ విలువలు, భావోద్వేగాల కలబోతగా రూపొందిన ఈ చిత్రం మంచి వసూళ్లను సాధించింది. దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ నిర్మాణంలో నవీన్‌ పొలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్‌ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో రూపొందిన ‘జాతి రత్నాలు’ చిత్రం ఈ ఏడాదిలో ఇప్పటి వరకూ అతిపెద్ద విజయాల్లో ఒకటిగా నిలిచింది. విలక్షణ హాస్యంతో దర్శకుడు అనుదీప్‌ తెరకెక్కించిన ఈ సినిమా చక్కటి వసూళ్లతో దూసుకుపోతున్నది. తొలి వారంలోనే నలభై కోట్లకుపైగా గ్రాస్‌ను సాధించి నిర్మాతలకు లాభాల్ని తెచ్చి
పెట్టింది. మూడో వారంలో విడుదలైన కార్తికేయ ‘చావు కబురు చల్లగా’, మంచువిష్ణు ‘మోసగాళ్లు’ ఆది సాయికుమార్‌ ‘శశి’ చిత్రాలు ఫర్వాలేదనిపించాయి. నితిన్‌ ‘రంగ్‌ దే’, రానా ‘అరణ్య’ చిత్రాలు అభిమానులను అలరిస్తున్నాయి. ఇప్పటికైతే, పరిశ్రమ ఊపిరి పీల్చుకున్నట్టే! చిన్నాచితకా కష్టాలు ఎదురైనా తట్టుకోగలమనే ధైర్యం వచ్చినట్టే!

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
తీన్‌మార్‌

ట్రెండింగ్‌

Advertisement