‘దృశ్యం-2’లో తండ్రి పాత్రలో మోహన్‌లాల్ జీవించారు. కుటుంబం కోసం, పిల్లల కోసం నాన్న ఎంతటి త్యాగానికైనా సిద్ధపడగలడని నిరూపించారు. నిజ జీవితంలోనూ ఆయన బంధాలకు ప్రాణమిచ్చే త్ంరడ్రే. కూతురు విస్మయ అంటే ప్రాణం! ఆమెలో ఓ కళాకారిణి ఉంది. విస్మయ కలం పట్టి కవితలు రాస్తూ, అందరి మన్ననలు పొందుతున్నది. తండ్రి ప్రశంసలనూ అందుకున్నది.
విస్మయ మోహన్‌లాల్.. పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నది. కారణం, తన కవితలను ఆమె ‘గ్రెయిన్స్ ఆఫ్ స్టార్‌డస్ట్’ పేరుతో సంకలనంగా తీసుకొచ్చారు. ఆ పుస్తకంలో తాను గీసిన బొమ్మలనే వాడారు. పుస్తక ఆవిష్కరణ సందర్భంగా కూతురి గురించి మాట్లాడుతూ..
“నేనెప్పుడూ విస్మయను సినిమా రంగంలోకి తీసుకురావాలని అనుకోలేదు. స్కూల్లో ఉన్నప్పుడు థియేటర్ ప్రొడక్షన్ వర్క్ చేసేది. కళల పట్ల్ల ఆసక్తి ఉంది. తను ఏ రంగాన్ని ఎంచుకోవాలనుకున్నా నా ఆశీస్సులు ఉంటాయి. అయితే ఇప్పుడు తన ఆసక్తిని రాతల్లో చూస్తున్నాను. పుస్తకంలోని అన్ని కవితలూ చదివాను. వాటిలోని తాత్వికత, భావుకత చాలా లోతైంది. ఇంత చిన్న వయసులో అంత పరిణతి ఎలా సాధ్యమో మరి!’ అని విస్మయంగా చెప్పుకొచ్చారు మోహన్‌లాల్. కూతురి పుస్తకానికి తనే ముందుమాట కూడా రాశారు.
కాలక్షేపానికి రాసింది కాదు!: ‘గ్రెయిన్స్ ఆఫ్ స్టార్‌డస్ట్’లోని ఏ కవితా రాయాలనుకొని రాయలేదు. అవన్నీ అప్పటికప్పుడు స్ఫురించిన ఆలోచనలే. ప్రయాణంలో ఉన్నప్పుడు, నచ్చిన సంగీతం వింటున్నప్పుడు, ప్రకృతినో అందమైన పెయింటింగ్‌నో చూసినప్పుడు పెల్లుబికిన భావాలను కవితలుగా రాశాను’ అంటూ తన రచనల నేపథ్యాన్ని వివరించారు విస్మయ. ‘నా స్కూలింగ్ అంతా ఊటీలోని ఇంటర్నేషనల్ బోర్డింగ్ స్కూల్లో జరిగింది. అక్కడ ఎవరికీ నేను నటుడు మోహన్‌లాల్ కూతురిని అని తెలియదు. అందరు పిల్లల్లానే స్కూల్ లైఫ్ గడిపాను. తర్వాత అమెరికా, యూరప్‌లలో ఆర్ట్ అండ్ థియేటర్లో కోర్సులు చేశాను’ అంటూ తన బాల్యాన్ని నెమరేసుకున్నారు. మోహన్‌లాల్‌లో ఓ పాక నిపుణుడూ ఉన్నాడట. ఆయన చేతి రుచుల్ని తాను ఇష్టంగా తింటానని చెబుతారు విస్మయ. కొత్త కథకు ఓకే చెప్పేముంది మోహన్‌లాల్ తన ముద్దుల కూతురి అభిప్రాయాన్ని తీసుకుంటారట. ఈ తండ్రీకూతుళ్ల బంధంలో ‘దృశ్యం-3’ తీయడానికి సరిపడా ముడిసరుకు ఉంది.