కడుపులోని బిడ్డ ఎంత బరువున్నా మోసే తల్లికి ఎప్పుడూ భారం కాదు. భూమి మీదకు వచ్చాక కూడా ఆ పసికందునుకంటికిరెప్పలా చూసుకోవడంలోనే ఆనందాన్ని వెతుక్కుంటుంది. ఒకవేళ తన బిడ్డ మిగతావారిలా వయసుకు తగ్గట్టు ఆటపాటల్లో, చదువుల్లో చురుగ్గా లేకపోయినా కన్నప్రేమలో ఇసుమంతైనా మార్పు ఉండదు. అవసరమైతే, ఆ బిడ్డ కోసం ఓ వ్యవస్థను నిర్మిస్తుంది. ఆ ప్రయత్నంలో తన కెరీర్‌నూ త్యాగం చేస్తుంది. హైదరాబాద్‌లోని ‘అనన్య చైల్డ్ డెవలప్మెంట్ అండ్ ఎర్లీ ఇంటర్వెన్షన్ క్లినిక్’ స్థాపన వెనుక మాధవి అనే ఓ మూతృమూర్తి ప్రేమ ఉంది. తన బిడ్డ భవిష్యత్తును తీర్చిదిద్దాలన్నతపనా ఉంది. ఆటిజంపై ప్రజల్లో అవగాహన పెంచేందుకుతనవంతు కృషి చేస్తున్న మాధవిని ‘జిందగీ’ పలకరించింది.
మా స్వస్థలం ఉమ్మడి నల్లగొండ జిల్లా. నేను స్కూల్లో చదువుకునే రోజుల్లోనే మా కుటుంబం హైదరాబాద్‌లో స్థిరపడింది. చదువంతా ఇక్కడే. ఉస్మానియాలో ఎంఏ ఇంగ్లిష్ చదివాను. ఇఫ్లూ నుంచి ఎంఫిల్ చేశాను. ఐటీ కంపెనీలో మంచి ఉద్యోగం చేసేదాన్ని. మా పెద్దబ్బాయికి రెండేండ్ల వయసప్పుడు, తనకు చిన్నచిన్న సమస్యలు ఉన్నాయన్న విషయం అర్థమైంది. డాక్టర్ దగ్గరకు వెళ్తే ‘ఆటిజం’ అని చెప్పారు. అప్పటికి, అదేమిటో కూడా నాకు తెలియదు. స్కూల్లో వేద్దామంటే, ‘మీ బాబుకు ఎలా నేర్పించాలో అర్థం కావట్లేదు’ అని టీచర్లు చేతులెత్తేశారు. నేరుగా, ఆఫీసుకు వెళ్లి మా బాస్‌తో మాట్లాడాను. బాబును విదేశాలకు తీసుకెళ్లాలన్నది నా ఆలోచన. సరిగ్గా నెలరోజుల్లోనే నన్ను యూకేలో ఉన్న మా కంపెనీ ప్రాజెక్ట్‌కు పంపారు. ఆటిజం పిల్లలకు ఎలా శిక్షణ ఇవ్వాలో యూకే, అమెరికా దేశాల్లోని టీచర్లకు బాగా తెలుసు. కొన్నేండ్లు అక్కడే పనిచేస్తూ బాబును చూసుకున్నాం.
తన కోసమే అనన్య సెంటర్
యూకే నుంచి 2007లో భారతదేశానికి తిరిగొచ్చాం. ఇన్నేండ్లయినా ఇక్కడి స్కూళ్లు, టీచర్లలో ఎలాంటి మార్పూ కనిపించలేదు. ఏ స్కూల్‌కు వెళ్లినా, తమకు ట్రైనింగ్ లేదని చెప్పేవారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఉద్యోగానికి రాజీనామా చేసి, బాబును చేర్పించిన స్కూల్లోనే టీచర్‌గా చేరాను. అయినా ఏదీ సాఫీగా జరగలేదు. ఎలాగూ ఉద్యోగం మానేశాను కదా, అదేదో ఇంట్లోనే బాబును ట్రెయిన్ చేసుకోవచ్చని అనిపించింది. వెంటనే గగన్ మహల్‌లోని మా ఇంటికి ఎదురుగా ఒక భవనం అద్దెకు తీసుకున్నాను. నా కొడుకుతో పాటు ఇంకొంతమంది ఆటిజం పిల్లలకు శిక్షణ ఇవ్వడం మొదలుపెట్టాను. అలా 2007లో ‘అనన్య చైల్డ్ డెవలప్మెంట్ అండ్ ఎర్లీ ఇంటర్వెన్షన్ క్లినిక్’ ప్రారంభించాను. క్రమంగా పిల్లల సంఖ్య పెరుగుతూ వచ్చింది. ప్రస్తుతం మా సెంటర్లు బంజారాహిల్స్, మాదాపూర్, ఖాజాగూడలో ఉన్నాయి. పిల్లలకు ఆటిజం, స్పీచ్, ఆక్యుపేషనల్, బిహేవియర్.. ఇలా అన్నిరకాల థెరపీలు చేయిస్తాం. దీన్ని స్కూల్ అంటే నేను ఒప్పుకోను. ఎందుకంటే అందరు పిల్లలూ ఒకే స్కూల్‌కు వెళ్లాలన్నదే నా ఆశ. మా దగ్గరకు వచ్చే పిల్లలకు ట్రైనింగ్ ఇచ్చి, మామూలు స్కూళ్లకు వెళ్లేందుకు సిద్ధం చేస్తాం.
తీవ్ర ఒత్తిడిలో అమ్మలు
స్పెషల్ కిడ్స్ ఉన్న తల్లులు నిరంతరం మానసిక ఒత్తిడికి లోనవుతూ ఉంటారు. ఒక అధ్యయనం ప్రకారం, ఆ ఒత్తిడి సరిహద్దుల్లో తుపాకీ పట్టుకుని పహరాకాసే సైనికుల ఒత్తిడికి సమానమట. అలాంటి తల్లుల కోసం స్ట్రెస్ మేనేజ్మెంట్ సెషన్స్ తీసుకుంటాను. పెద్ద చదువులు చదువుకున్న అమ్మలు కూడా ఈ విషయంలో డిప్రెస్ అయిపోతున్నారు. అది చాలా పొరపాటు. దేవుడు ఒక తల్లికి బిడ్డను ఇచ్చాడంటేనే, వాళ్ల బంధానికి ఒక అర్థం ఉన్నట్టు. ‘ఎస్.. అయామ్ ఎ మదర్ ఆఫ్ ఆటిజం కిడ్’ అని తల్లి గర్వంగా చెప్పగలగాలి. యూకేలో ఉన్నప్పుడే నా బిడ్డకు సంగీతం అంటే ఆసక్తి అని తెలుసుకున్నాను. ఇండియాకు రాగానే హిందుస్థానీ నేర్పించాను. తను పెద్దపెద్ద వేదికలపై
కచేరీలు చేశాడు. అవార్డులు అందుకున్నాడు. ఇలా ప్రతి ఒక్కరిలో ఏదో ఒక ప్రతిభ ఉంటుంది. దాన్ని గుర్తించాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. నా బిడ్డకు ఆటిజం అని తెలియక ముందే, పేద విద్యార్థులకు సాయపడాలన్న ఉద్దేశ్యంతో ప్రవర ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఏర్పాటు చేశాను. ప్రస్తుతం ఆ ట్రస్ట్ ద్వారానే ఆటిజంపై ఉచిత అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాను. అనన్య సంస్థ ద్వారా వచ్చే ఆదాయాన్ని ట్రస్ట్ ద్వారా పేదల కోసం, పిల్లల కోసం ఖర్చు
చేస్తుంటాను.
అవగాహన కోసం ఓ యాప్
మన దేశంలో చాలామందికి ఆటిజం గురించి తెలియదు. రెండు, మూడేండ్ల వయసులోనే గుర్తించకుండా పెద్దయ్యాక తీసుకొస్తుంటారు. ఆ దశలో పిల్లల్లో మార్పు తీసుకురావడం కష్టమైపోతుంది. మన దగ్గర స్పెషలిస్ట్ డాక్టర్లు కూడా తక్కువే. కాబట్టి, ఒక్కోపిల్లాడిని గంటలకొద్దీ పరీక్షించేంత సమయం వాళ్లకు ఉండదు. అందుకే, మేం ఒక యాప్‌ను తయారు చేస్తున్నాం. అందులో పిల్లల ప్రవర్తనలు, వయసులవారీగా ఉండాల్సిన ఎదుగుదల, రావాల్సిన మార్పుల గురించి వివరంగా తెలియజేస్తాం. ఈ ప్రయత్నంలో ఎంతోమంది వైద్యులను సంప్రదించాం. ఈ యాప్ సాయంతో తల్లిదండ్రులు తమ పిల్లల మానసిక, శారీరక ఎదుగుదలను ఎప్పటికప్పుడు పరీక్షించుకోవచ్చు. ఏమాత్రం వేరుగా అనిపించినా సంబంధిత డాక్టర్‌ను సంప్రదించవచ్చు.
… నిఖిత నెల్లుట్ల