అవకాశం ఇస్తే ఆడవారు అద్భుతాలు చేస్తారని మరోమారు నిరూపించింది యువ ఐపీఎస్ రంజీత శర్మ. ఆరోసారి పట్టువీడక ప్రయత్నించి సివిల్స్ సాధించిన ఆమె.. ట్రైనింగ్‌లో మాత్రం అతివ శక్తిని చాటింది. ఐపీఎస్ ఔట్‌డోర్ ట్రైనింగ్‌లో మగవారిని పక్కకు నెట్టి ప్రథమ స్థానాన్నికైవసం చేసుకొని ప్రధానమంత్రి బ్యాటన్, హోం మినిస్టర్ రివాల్వర్ అందుకుంది. బెస్ట్ ఆల్రౌండ్లేడీ ఐపీఎస్ ప్రొబెషనరీ ఆఫీసర్ సహా ఐదు ఉత్తమ అవార్డులను సొంతం చేసుకుంది. శుక్రవారం సర్దార్ వల్లభ్‌బాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో జరిగే 2019 బ్యాచ్ఐపీఎస్ల దీక్షాంత్ పరేడ్‌కు పరేడ్ కమాండర్‌గా వ్యవహరించనున్నది రంజీత శర్మ. ఈ ఘనతను సాధించిన తొలి మహిళా ఐపీఎస్ అధికారిగా నిలిచిన రంజీతను ‘జిందగీ’ పలకరించింది. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే..
‘బేటా! నువ్వు ఐపీఎస్ ఆఫీసర్ అయితే, నలుగురికీ సేవ చేయగలుగుతావు. నువ్వు కోరుకుంటున్న సామాజిక మార్పు అప్పుడే సాధ్యం అవుతుంది’ అనేవారు నాన్న. సివిల్స్‌ను లక్ష్యంగా ఎంచుకోమని సూచించిన మా నాన్న ఐఏఎస్ కాదు, ఐపీఎస్ కాదు. ఓ పల్లెలో చిన్న వ్యాపారి. మా చదువుల కోసం ఎంతో కష్టపడేవారు. మాది హరియాణాలోని ఫరీదాబాద్ జిల్లా ధైనా గ్రామం. నాన్న సతీశ్‌కుమార్ శర్మ, అమ్మ సవిత. ఇద్దరు అన్నయ్యలు, నేను. నా విద్యాభ్యాసమంతా ఢిల్లీలోని ప్రైవేట్ పాఠశాలలో సాగింది. ఢిల్లీ యూనివర్సిటీ నుంచి ఇంగ్లిష్ లిటరేచర్‌లో గ్రాడ్యుయేషన్ చేశాను. తర్వాత ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్స్ నుంచి పబ్లిక్ రిలేషన్స్‌లో పీజీ చేశాను. ఎనిమిదేండ్లు ప్రైవేట్ కంపెనీల్లో పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్‌గా చేశాను. కానీ, లోలోపల అసంతృప్తి ఉండేది. ప్రజలకు ఏదో చేయాలనిపించేది. ప్రైవేట్ ఉద్యోగాలతో అది సాధ్యం కాదనిపించేది. ఇదే విషయం నాన్నతో చెబితే సివిల్స్ లక్ష్యం చేసుకోమన్నారు. ఆయన ప్రోత్సాహమే లేకుంటే ఇప్పుడిక్కడ ఇలా ఉండేదాన్నే కాదు.
జీవితం ఒక చాలెంజ్. కంఫర్ట్ జోన్లో ఉండాలనుకోవద్దు. అవకాశాలు సృష్టించుకుంటూ, మన శక్తిసామర్థ్యాలను నిరూపించుకోవాలి. నేషనల్ పోలీస్ అకాడమీలో అడుగుపెట్టాక అనుక్షణం కష్టపడ్డాను. ఈ ట్రైనింగ్‌లో ఎన్నో చాలెంజ్‌లు ఉంటాయి. ఒక ఐపీఎస్ అధికారిగా విధుల్లో చేరిన తర్వాత రకరకాల పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. వాటిని తట్టుకోవడమే కాదు, టీమ్‌ను ముందుండి నడిపించగల లీడర్‌గా ఎదగాలి. అప్పుడే విజయం సాధిస్తాం.
అందుకు తగ్గట్టుగానే మా శిక్షణ కొనసాగింది. అకాడమీలో అడుగుపెట్టిన తర్వాత ఆడ, మగ అన్న తేడాలేం ఉండవు. అన్నిటిలో, అందరికీ సమాన శిక్షణ, సమాన అవకాశాలు ఉంటాయి. శిక్షకులు, అధికారులు చెబుతున్న విషయాలను పక్కాగా ఆచరిస్తూ, మనలోని నైపుణ్యాలు పెంచుకోవాలి. అకాడమీలోకి వచ్చిన కొత్తలో నేను కాస్త నెమ్మదిగా ఉండేదాన్ని. అధికారుల ప్రోత్సాహంతో రోజురోజుకూ పుంజుకున్నా. ట్రైనింగ్ విజయవంతంగా పూర్తి చేయాలనుకున్నా. బ్యాచ్టాపర్గా నిలవాలన్న లక్ష్యం ఏమీ మొదట్లో పెట్టుకోలేదు. ట్రైనింగ్ సాగే కొద్దీ ఆత్మవిశ్వాసం పెరిగింది. మొదటిస్థానం కోసం పోటీ పడకుండా, నన్ను నేను ఉత్తమంగా తీర్చిదిద్దుకోవాలని శ్రమించాను. ఒకరోజు కష్టపడితే సరిపోదు. నిత్యం నన్ను నేను నిరూపించుకున్నాను. ఫైనల్‌గా బ్యాచ్ టాపర్‌గా నిలవడం సంతోషాన్నిచ్చింది.
ఐపీఎస్ అధికారి పాత్ర ఒక సమస్యకో, అంశానికో పరిమితం కాదు. క్షేత్రస్థాయి పరిస్థితులను అర్థం చేసుకుంటూ ప్రజలకు ఏది అవసరమో అది ఇచ్చేందుకు కృషి చేయాలి. ఒకవైపు నేరాలను నియంత్రిస్తూనే, శాంతి భద్రతలను పరిరక్షించాలి. ఒక్కసారి ఖాకీ యూనిఫామ్ వేసుకున్న తర్వాత ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. బాధ్యతలూ పెరుగుతాయి. పోలీస్ యూనిఫామ్‌లో ఉన్న మహిళా అధికారి మరింతమంది యువతులకు, బాలికలకు ప్రేరణ అవుతుంది. అలా స్ఫూర్తినిస్తున్న మహిళా అధికారుల్లో నేనూ ఉండటం గర్వంగా ఉంది. ఈ వృత్తి ఒక పెద్ద బాధ్యత. ఇందులో ఎంతో గౌరవం ఉంది. మరింత మంది యువతులు పోలీస్ సర్వీస్‌లోకి రావాలని కోరుకుంటున్నా. మహిళా అధికారుల సంఖ్య పెరిగితేనే స్త్రీ సాధికారతకు అవకాశాలు ఏర్పడతాయి.
లక్ష్యంపై స్పష్టత ఉంటే సివిల్స్ సాధించడం కష్టమైన పని కాదని నా నమ్మకం. అయితే, మనకు కావాల్సిన మెటీరియల్ ఏమిటన్నది ముందుగా ఎంపిక చేసుకోవాలి. మనం సలహాలు తీసుకునేవారు సరైన వారై ఉండాలి. తర్వాత, మనదగ్గర ఉన్న మెటీరియల్‌ను పూర్తిగా చదివేలా ప్రణాళిక వేసుకోవాలి. రెండు రోజులు చదివి విశ్రాంతి తీసుకుంటానంటే కుదరదు. అలాగని రోజంతా పుస్తకాలకు అతుక్కుపోవాల్సిన పనీలేదు. పక్కా ప్రణాళికతో క్రమం తప్పకుండా ప్రిపరేషన్ కొనసాగేలా చూసుకోవాలి. నేను రోజుకు ఆరేడు గంటలు మాత్రమే చదివేదాన్ని. వారాంతాల్లో కొంచెం ఎక్కువ సమయం ప్రిపేరయ్యేదాన్ని. ప్రిపరేషన్ సమయంలో ఫోకస్ పోకుండా చూసుకోవాలి. అప్పుడే, చిటారు కొమ్మన ఉన్న మిఠాయి స్వప్నాన్ని అందుకుంటాం.
భవిష్యత్తులో సైబర్ నేరాల సంఖ్య విపరీతంగా పెరిగే ప్రమాదం ఉంది. సైబర్ నేరాల దర్యాప్తు విషయంలో మాకు ప్రత్యేక తర్ఫీదు ఇచ్చారు. కేవలం థియరీకే పరిమితం కాకుండా ప్రాక్టికల్‌గా కూడా కొన్ని కేసులు మాతో దర్యాప్తు చేయించారు. ఆ క్రమంలో చాలా విషయాలు నేర్చుకున్నాం. సైబర్ క్రైం ఏరియాలో ఎంతోమంది నిపుణులతో కలిసి పనిచేసే అవకాశం వచ్చింది. ఆ అనుభవం మాకు తప్పక ఉపయోగపడుతుంది. ప్రత్యేకించి సైబర్ నేరగాళ్ల ఉచ్చులో మహిళలు, చిన్నారులు పడకుండా కాపాడేందుకు ఓవైపు అవగాహన పెంచుతూనే, మరోవైపు నేరాల బారిన పడినవారికి తగిన న్యాయం చేయాలన్నది నా లక్ష్యం.
… నాగోజు సత్యనారాయణ
వీరగోని రజినీకాంత్‌గౌడ్