మంగళవారం 02 మార్చి 2021
Zindagi - Jan 19, 2021 , 00:12:17

అభినిత.. ముగ్గురికి ప్రాణదాత!

అభినిత.. ముగ్గురికి ప్రాణదాత!

అభినిత రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాల పాలైంది. ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లింది. తను బతికినా బతకనట్టే, వైద్య పరిభాషలో చెప్పాలంటే.. ‘బ్రెయిన్‌ డెడ్‌'! సముద్రమంత దుఃఖాన్ని భరిస్తూనే ఆమె తల్లిదండ్రులు అవయవ దానానికి ఆమోదం తెలిపారు. ‘బాల్యం నుంచీ మా అభినిత నలుగురికీ మంచి చేయాలని తపించేది. ఈ నిర్ణయం మాదే కావచ్చు, కానీ స్ఫూర్తి తనే’అంటారా అమ్మానాన్నలు.

ఇరవయ్యేళ్ళు అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు, మరికొన్ని రోజుల్లో ఇంజినీరింగ్‌ పాసై తమ కలల్ని నెరవేరుస్తుందని అనుకున్నారు. కానీ, ఆ బంగారు తల్లి కన్నవారి కళ్ళముందే కండ్లు మూసింది. హన్మకొండకు చెందిన చేర్యాల చంద్ర శేఖర్‌-కృష్ణవేణి దంపతులకు ఇద్దరు పిల్లలు. కూతురు అభినిత బీటెక్‌ ఫైనలియర్‌, కొడుకు అభినవ్‌ థర్డ్‌ ఇయర్‌. వారం రోజుల క్రితం స్నేహితుల ఇంటికి వెళ్ళొస్తానని ద్విచక్రవాహనంపై బయటకు వెళ్లింది. అనుకోని ప్రమాదానికి గురై ఆసుపత్రి పాలైంది. తలకు బలమైన గాయాలు అయ్యాయి. డాక్టర్లు ఎంత శ్రమించినా ఫలితం దక్కలేదు. ‘బ్రెయిన్‌ డెడ్‌' అని తేల్చారు. ఆ స్థితిలో చావుబతుకుల మధ్య ఓ సన్నని విభజన రేఖ మాత్రమే ఉంటుంది. ‘జీవన్‌దాన్‌' ప్రతినిధులు అభినిత తల్లిదండ్రులను కలిసి, అవయవ దానంపై అవగాహన కల్పించారు. ‘మీ కూతురు ప్రాణాలతో లేకపోయినా, ఆమె అవయవాలు ముగ్గురి ఊపిరిని నిలుపగలవు’ అని చెప్పారు. మహాదానానికి ఒప్పించారు. అభినిత మూత్రపిండాలు, కాలేయం, ఊపిరితిత్తులు ప్రాణాపాయ స్థితిలో ఉన్న ముగ్గురికి అమర్చారు. ఎవరన్నారు అభినిత మరణించిందని? నిన్న మొన్నటి వరకూ ఒక అభినితే. ఇప్పుడు ముగ్గురు అభినితలు!  


VIDEOS

logo