e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, July 24, 2021
Home జిందగీ నాన్నతో కలిస్తే.. నవ్వులే నవ్వులు!

నాన్నతో కలిస్తే.. నవ్వులే నవ్వులు!

నాన్నతో కలిస్తే.. నవ్వులే నవ్వులు!

కమల్‌ హాసన్‌ గారాలపట్టి. పట్టువదలని మొండిఘటం. హిట్‌ సినిమాలెన్నో తన ఖాతాలో ఉన్నా, చెప్పాపెట్టకుండా ఇండస్ట్రీని వదిలేసింది. మైక్‌ పట్టింది, గిటారు మీటింది. లండన్‌ ఆడిటోరియంలో చప్పట్లు కొట్టించుకుంది. మూడేండ్ల కిందట ముచ్చటగా మరోసారి ఇండస్ట్రీలోకి వచ్చిన ఈ ముద్దుగుమ్మ, బొద్దు బొమ్మలా తయారైందన్న విమర్శలకు చెక్‌ పెడుతూ ‘క్రాక్‌’ సినిమాలో కిర్రాక్‌ పెర్ఫార్మెన్స్‌తో అదరగొట్టింది. ఓటీటీ ‘పిట్ట కథలు’ పొట్టి స్టోరీలో తళుక్కున మెరిసింది. మళ్లీ హిట్‌ ట్రాక్‌ మీదికొచ్చిన శ్రుతిహాసన్‌ అనుభవాల లిస్ట్‌..

నాకు పదమూడేండ్లు ఉన్నప్పుడు స్క్రిప్ట్‌ రైటింగ్‌, డైరెక్షన్‌పై ఆసక్తి కలిగింది. అంతేగానీ, సినిమా యాక్టర్‌ అవుతానని ఎప్పుడూ ఊహించలేదు. దానికి చాలా కారణాలే ఉన్నాయి. నేను అందంగా ఉంటానని అస్సలు అనుకోలేదు. ఎందుకంటే, ఒక్క వాలంటైన్స్‌ డేకి కూడా నాకు గ్రీటింగ్స్‌ రాలేదు. ఎప్పుడూ నాకున్న టాలెంట్స్‌ పెంచుకోవాలని భావిస్తుండేదాన్ని. అందుకు తగ్గట్టుగా కష్టపడేదాన్ని.

- Advertisement -

చిన్నప్పటి నుంచీ నాకు స్వతంత్ర భావాలు ఎక్కువ. మనసులో అనుకుంటే చేసేయడమే! హఠాత్తుగా ఓసారి, నటిగా నా అభిప్రాయాలను స్పష్టంగా చెప్పలేకపోతున్నానేమో అనిపించింది. మ్యూజిక్‌మీద దృష్టి పెట్టాలనిపించింది. మరేం ఆలోచించకుండా కెరీర్‌కు కామా పెట్టేసి, లండన్‌కు వెళ్లిపోయా. కొన్నాళ్లు అక్కడే ఉన్నా. ‘నువ్వు నీలా ఉండలేనప్పుడు కొన్నాళ్లు అందరికీ దూరంగా ఉండమ’ని చెబుతుంటాను. ఈ ఉద్దేశంతోనే నేను లండన్‌ వెళ్లాను. కొన్నాళ్లు హ్యాపీగా గడిపాను. రచనా వ్యాసంగంతో, మ్యూజిక్‌తో కాలక్షేపం చేశాను. యూకేలో లైవ్‌ పెర్ఫార్మెన్స్‌లు కూడా ఇచ్చాను. ఒక రకంగా చెప్పాలంటే నన్ను నేను కొత్తగా ఆవిష్కరించుకున్నా.

క్యాలిఫోర్నియాలో మ్యూజిక్‌ కోర్సు చేస్తున్నప్పుడు మా సిలబస్‌లో యాక్టింగ్‌కూడా ఉండేది. అలా నటనలో ఓనమాలు నేర్చుకున్నా. ఓసారి నాన్న సడెన్‌గా ఫోన్‌ చేసి, ఓ పెర్ఫార్మెన్స్‌ అడిగారు. తర్వాత కొన్నాళ్లకు హిందీ చిత్రం ‘లక్‌’లో అవకాశం వచ్చింది. ‘మా మ్యూజిక్‌ బ్యాండ్‌కు ఎక్విప్‌మెంట్‌ కొనడానికి డబ్బులు వస్తాయి కదా!’ అనే ఉద్దేశంతో ఆ సినిమా అంగీకరించా. సెట్స్‌కి వెళ్లాక గొప్పగా అనిపించింది. బిగ్‌స్క్రీన్‌ మీద నన్ను నేను చూసుకున్నాక, బాగానే ఉన్నాననిపించింది. సినిమాల్లో కొనసాగాలని అప్పుడే నిర్ణయించుకున్నా. తొలినాళ్లలో నాన్న ఫ్యాన్స్‌ చాలామంది ‘మీరు సినిమాలు చేయొద్దు’ అని ఉత్తరాలు రాశారు. సెవెన్త్‌ సెన్స్‌, గబ్బర్‌సింగ్‌ సినిమాల తర్వాతే నన్ను ఆదరించారు. కొందరు మాత్రం, ఆ తర్వాత కూడా నటించొద్దంటూ లెటర్స్‌ రాసేవాళ్లు. అయినా, ఎవరి కోసమో నేను నటించాలని అనుకోలేదు. యాక్టింగ్‌ బాగా నచ్చడంతోనే కంటిన్యూ అయ్యాను.

మా నాన్న పెద్ద స్టార్‌ కావడంతోనే నాకు అవకాశాలు వచ్చాయని చాలామంది అభిప్రాయం. కానీ, నాన్న ఎప్పుడూ ఎవరికీ సిఫారసు చేయలేదు. నేను సినిమాల్లోకి రావడం అనేది పూర్తిగా నా వ్యక్తిగత నిర్ణయం. నాన్నకు చెబితే ఓకే అన్నారు. నాకు వచ్చిన అవకాశాలన్నీ నా టాలెంట్‌ ఆధారంగా వచ్చినవే! ఏదైనా సలహా కావాలంటే మాత్రం, నాన్నను తప్పకుండా సంప్రదిస్తాను. ఆయన మార్గనిర్దేశనం చేస్తారు. అంతేకానీ, అవకాశాలు సృష్టించి ఇవ్వరు. నా సక్సెస్‌, ఫెయిల్యూర్‌ దేనికైనా పూర్తి క్రెడిట్‌ నాదే. నా జీవితానికి సంబంధించిన నిర్ణయాలు స్వేచ్ఛగా, తెలివిగా తీసుకోగలను. నా జీవితానుభవాలే నన్ను మరింతగా తీర్చిదిద్దాయి.

నటులకు, అభిమానులకు ఇప్పుడు సోషల్‌ మీడియా ఓ వేదిక. ఈ విషయంలో వాటికి బిగ్‌ థ్యాంక్స్‌ చెప్పాలి. అభిమానులు సామాజిక మాధ్యమాల ద్వారా నా క్షేమ సమాచారాలు తెలుసుకుంటూనే ఉంటారు. వారు నన్ను ఆదరించే తీరు గొప్పగా ఉంటుంది. నేను సినిమాలకు విరామం ఇచ్చినప్పుడు
‘ఎందుకు సినిమాలు మానేశారు? మళ్లీ ఎప్పుడు వస్తారు?’ .. లాంటి ప్రశ్నలేవీ అడుగలేదు. ‘మీరు అనుకున్నది చేయండి. మీ కోసం మేమెప్పుడూ ఉంటాం’ అంటూ అండగా నిలిచారు. వారికి ఎప్పుడూ రుణపడి ఉంటాను. నా సోషల్‌ మీడియా అకౌంట్లను స్వయంగా నేనే చూస్తాను. ఫ్యాన్‌ పేజెస్‌ నిర్వాహకులతో మాట్లాడుతుంటాను కూడా.

లాక్‌డౌన్‌లో బద్ధకం పెరిగింది. మరీ రెగ్యులర్‌గా కాకపోయినా వారంలో నాలుగు రోజులు తప్పకుండా వర్కవుట్లు చేస్తుంటాను. ఇంటిని శుభ్రం చేయడం కూడా వ్యాయామమే కదా! ఒక్కోసారి అదే నా కసరత్తు. ఒక్కోరోజు డ్యాన్స్‌ కూడా చేస్తాను. నాకు పీసీఓడీ, హార్మోనల్‌ ఇంబ్యాలెన్స్‌ సమస్యలు ఉన్నాయి. అందుకే శారీరకంగా ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండటానికి ప్రాధాన్యం ఇస్తాను.

చిన్నప్పుడు నేను రాసిన కథలను నాన్నకు చదివి వినిపించేదాన్ని. ఓపిగ్గా విని.. రకరకాల ప్రశ్నలు వేసేవారు. నాన్న ప్రశ్నించడం వల్లేనేమో రైటింగ్‌ స్కిల్స్‌ ఇంప్రూవ్‌ అయ్యాయి. ఏ సందర్భాన్ని ఎలా వ్యక్తీకరించాలి, ఎలాంటి పదాలు ప్రయోగించాలి అన్న విషయాలు తెలిశాయి. ‘నేను మ్యూజిక్‌ నేర్చుకుంటాను’ అనగానే ఓకే చెప్పారు. నేను ఏదైనా సాధించగలననే నమ్మకం ఆయనది. నన్నెంతో ప్రోత్సహించారు. విలువైన సలహాలు ఇస్తుంటారు.

చదువు గురించి చెబితే ఓ సినిమా కథ అవుతుంది. చెన్నైలోని మాంటిస్సొరీ స్కూల్‌లో నా విద్యాభ్యాసం సాగింది. చదువుతోపాటు ఆటల్లో, కల్చరల్‌ యాక్టివిటీస్‌లో పాల్గొనేదాన్ని. మా టీచర్లు బాగా ప్రోత్సహించేవారు. పదో తరగతిలో అనుకుంటా, మాకు మ్యూజిక్‌ ఒక సబ్జెక్ట్‌గా ఉండేది. మ్యాథ్స్‌, మ్యూజిక్‌ రెండిటిలో ఏదో ఒకటి ఎంచుకునే అవకాశం ఉండేది. నేను మ్యూజిక్‌ తీసుకున్నా. పరీక్షల్లో హిందుస్థానీ క్లాసికల్‌ పెర్ఫార్మెన్స్‌ ఇచ్చాను. అలా పదిలో, లెక్కలకు బదులు సరిగమలు చదివాను. ఇంటర్‌ ముంబయిలోని సెయింట్‌ ఆండ్రూస్‌లో. కొన్నాళ్లకే, నాలుగు గోడల చదువు నాకు సెట్‌ అవ్వదని అర్థమైంది. ఆ తర్వాత ఎందుకో సైకాలజీ చదువాలనుకున్నా. మళ్లీ అంతలోనే, అదీ వద్దనుకున్నా. తర్వాత ఆడియో ఇంజినీరింగ్‌ చేద్దామనుకున్నా. అందులోకి వెళ్లాక టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ మన ఒంటికి పడదనిపించింది. చివరికి, క్యాలిఫోర్నియాలో మ్యూజిక్‌ ఎడ్యుకేషన్‌లో కోర్సు చేశాను.

గ్యాప్‌ తర్వాత మళ్లీ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాను. వచ్చీ రావడంతోనే తమిళ చిత్రం ‘లాబమ్‌’ ఒప్పుకొన్నా. ఆ సినిమా షూటింగ్‌ మూడేండ్లుగా కొనసాగుతూనే ఉంది. ఈలోపు ఓ హిందీ సినిమా కూడా చేశాను. అయితే, సినిమా షూటింగ్‌ ప్రారంభంలో ఉన్న సంతోషం అది పూర్తయ్యేటప్పటికి లేదనిపించింది. వెబ్‌సిరీస్‌లోనూ నటించా. ‘క్రాక్‌’లో మంచి పాత్ర పోషించా. ప్రస్తుతం ప్రశాంత్‌నీల్‌ దర్శకత్వంలో ప్రభాస్‌ హీరోగా ‘సలార్‌’ చేస్తున్నా. అమెజాన్‌ వెబ్‌సిరీస్‌లోనూ నటిస్తున్నా.

సంగీతం అంటే ప్రాణం. మ్యుజీషియన్‌గా కొనసాగాలనుకున్నా. రెండు పడవలపై ప్రయాణం ఎందుకని.. ప్రస్తుతానికి నటిగా కంటిన్యూ అవుతున్నా. పాకశాస్త్రంలో నాకు ప్రావీణ్యం ఉంది. కిచెన్‌లో రకరకాల ప్రయోగాలు చేస్తుంటా. క్రాఫ్ట్‌, ఆర్ట్స్‌లోనూ ప్రవేశం ఉంది. హ్యాండ్‌మేడ్‌ సబ్బులు చేస్తుంటా. ల్యాండ్‌స్కేప్‌ డిజైనింగ్‌కూడా చేయగలను. నేనెప్పుడూ బిజీగా ఉండాలనుకుంటాను. చేతినిండా పని కోరుకుంటాను. స్టోరీ టెల్లింగ్‌ నా డ్రీమ్‌. నాకు తెలిసిన కళలను అందంగా ప్రదర్శించాలనుకుంటున్నా. సంగీత కళాకారిణిగా నా జర్నీ ఆలస్యంగానే మొదలైంది. దాన్ని కంటిన్యూ చేస్తాను.

నాన్న సమక్షంలో ప్రతిక్షణం మరుపురానిదే! ఆయన్ని నేను ఎంతగానో గౌరవిస్తాను. అదే సమయంలో నాన్న దగ్గర బిడియాలు, మొహమాటాలు ఉండవు. గంటల తరబడి మాట్లాడుకుంటూనే ఉంటాం. మా ఇద్దరి మధ్యా ఎక్కువగా కళల గురించి చర్చలు వస్తుంటాయి. ఎంత సీరియస్‌ టాపిక్‌ అయినా, స్పాంటేనియస్‌గా జోకులు పేలుతుంటాయి. నవ్వులు విరబూస్తూనే ఉంటాయి. మా చుట్టూ ఉన్నవారిని కూడా నవ్వుల్లో ముంచెత్తుతాం. ఫుడ్‌ అంటే ఇద్దరికీ ఇష్టమే. నాన్నను కలిసినప్పుడు మంచి భోజనం, ఉపయోగపడే మాటలు, మనసుకు హాయినిచ్చే నవ్వులు దొరుకుతాయి.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
నాన్నతో కలిస్తే.. నవ్వులే నవ్వులు!
నాన్నతో కలిస్తే.. నవ్వులే నవ్వులు!
నాన్నతో కలిస్తే.. నవ్వులే నవ్వులు!

ట్రెండింగ్‌

Advertisement