e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, June 16, 2021
Home జిందగీ సివంగుల కార్ఖానా

సివంగుల కార్ఖానా

దేశానికి సేవ చేయాలన్న సంకల్పం ఉన్నంత మాత్రాన సరిపోతుందా! తగిన దేహదారుఢ్యం ఉండాలి. విన్యాసాలు చేసే శక్తి సామర్థ్యాలను ప్రోది చేసుకోవాలి. అప్పుడే సైన్యంలో అవకాశాల తలుపులు తెరుచుకుంటాయి. ఆ నిఖార్సయిన నైపుణ్యాలను విద్యార్థినులకు నూరి పోస్తున్నారు బీబీనగర్‌ సైనిక కళాశాలలో! ఇక్కడ, దేశసేవకోసం బాలికలను మిస్సైల్స్‌లా తీర్చిదిద్దుతున్నారు. ఆలోచనా దృక్పథంలో మార్పు తెస్తున్నారు. నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తున్నారు. దేశభక్తిని ఇనుమడింప చేస్తున్నారు. వ్యక్తిత్వ వికాసానికి దోహదం చేస్తున్నారు.

సివంగుల కార్ఖానా

‘పెద్దయ్యాక ఆర్మీలో చేరుతా’- బాలికలు చిన్నతనంలోనైనా అనడానికి వెనుకడుగు వేసే మాట ఇది. నిజమే, సైన్యంలో చేరడం తేలిక కాదు. త్రివిధ దళాల్లో పనిచేయడం అనుకున్నంత సులభమూ కాదు. చాలామందికి దేశ సరిహద్దులు తెలుసు కానీ, అక్కడ గస్తీ కాసే కొలువులకోసం ఎలా సన్నద్ధం కావాలో తెలియదు. అమ్మాయిల విషయంలో అయితే, రక్షణ రంగం కెరీర్‌ ఆప్షనే కాదు. ఈ బూజు పట్టిన ధోరణికి చరమగీతం పాడుతున్నది.. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల సైనిక మహిళా డిగ్రీ కళాశాల. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్‌లో ఉన్న ఈ విద్యా సంస్థ దేశంలోనే మొట్టమొదటి సైనిక కళాశాలగా గుర్తింపు పొందింది.

బీబీనగర్‌ సైనిక కళాశాలలో డిగ్రీ విద్యను అందిస్తూనే విద్యార్థినులను త్రివిధ దళాల్లో ప్రవేశానికి అనువుగా తీర్చిదిద్దుతున్నారు. రోజూ ఆరుగంటలపాటు పాఠ్యాంశాల బోధన ఉంటుంది. మరో ఆరు గంటలు శారీరక, మానసిక శిక్షణ తరగతులు ఉంటాయి. ఇందుకు ప్రత్యేక సిబ్బంది ఉంది. రక్షణరంగ పోటీ పరీక్షలకు విద్యార్థులను సన్నద్ధం చేయడానికి ఐదుగురు ప్రత్యేక అధ్యాపకులను నియమించారు. వ్యాయామ పర్యవేక్షణ, డిఫెన్స్‌ శిక్షణ కోసం ముగ్గురు రిటైర్డ్‌ ఆర్మీ జవాన్లు ఉన్నారు. ఉదయం యోగసాధన నుంచి రాత్రి నిద్రపోయే వరకు విద్యార్థినుల రోజువారీ కార్యక్రమాలన్నీ క్రమపద్ధతిలో ఉంటాయి. క్లాసులు పూర్తయ్యాక, మూడు క్లబ్బులుగా విభజించి శారీరక దారుఢ్యం, వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన అంశాల్లో శిక్షణ ఇస్తారు. ఉదయం, సాయంత్రం 2.42 కి.మీ. చొప్పున రోజూ సుమారు 5 కిలోమీటర్లు రన్నింగ్‌ చేయిస్తారు. డిఫెన్స్‌ ఎంపికలో భాగమైన విన్యాసాల్లోనూ శిక్షణ ఇస్తారు. ఆంగ్లభాషలో పట్టు సాధించేలా డిబేట్స్‌ నిర్వహిస్తారు. ఆంగ్ల నవలలు చదివించి సమీక్షలు రాయిస్తారు. పట్టా చేతికి వచ్చే సమయానికి, రక్షణ దళాల్లో చేరి తీరాలన్న పట్టుదల పెరుగుతుంది.

సివంగుల కార్ఖానా

పక్కా తర్ఫీదు
ఆడపిల్లలు అన్ని విధాలా ప్రతిభావంతులని నిరూపించేందుకు తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే మొదటిసారిగా ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌ ప్రిపరేటరీ కళాశాలను స్థాపించింది. విద్యార్థినులకు మిలటరీ, నేవీ, ఎయిర్‌ ఫోర్స్‌, సీఆర్‌పీఎఫ్‌, సీఐఎస్‌ఎఫ్‌ వంటి రక్షణ బలగాల్లో చేరేందుకు అవసరమైన శిక్షణను కాలేజీ రోజుల్లోనే ఇస్తున్నారు. 2018 జూన్‌ 25న ఈ కళాశాలను ప్రారంభించారు. 2018-19 విద్యా సంవత్సరంలో 118 మంది, 2019-20లో 140 మంది, 2020-21లో 118 మంది విద్యార్థినులు ప్రవేశం పొంది డిగ్రీ సిలబస్‌తోపాటు రక్షణ రంగంలో చేరేందుకు తర్ఫీదునూ పొందుతున్నారు. చదువుల్లో అసాధారణ ప్రతిభ చూపుతూనే సైనిక పాటవాలను కూడగట్టుకొంటున్నారు. మొదటి బ్యాచ్‌కు చెందిన బీఎస్సీ ఫైనలియర్‌ విద్యార్థి చాముండేశ్వరి ఇటీవల మైసూర్‌ సర్వీస్‌ సెలక్షన్‌ బోర్డు నిర్వహించిన 16 టెస్టుల్లో పాసై, వాయుసేన అడ్మినిస్ట్రేటివ్‌ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగం సాధించింది. ఇదే కళాశాలలో ప్రస్తుతం శిక్షణ పొందుతున్న లయ, తేజశ్రీ, సీతారావమ్మ ఎయిర్‌ఫోర్స్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్టులో అర్హత సాధించారు. త్వరలో జరిగే సర్వీస్‌ సెలక్షన్‌ బోర్డు (ఎస్‌ఎస్‌బి) టెస్టులకు హాజరు కానున్నారు. దేశసేవ చేయాలనుకునే యువతుల స్వప్నాన్ని సాకారం చేస్తున్నది ఈ సైనిక కళాశాల. తొలిరోజుల్లో బిక్కుబిక్కుమంటూ బడి ఆవరణలోకి కాలు పెట్టిన విద్యార్థులు, పట్టా అందుకునే సమయానికి ప్రపంచాన్నే గెలువగలమన్న ధీమానూ సొంతం చేసుకుంటున్నారు.

నోటిఫికేషన్‌ విడుదల
బీబీనగర్‌లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల సైనిక మహిళా డిగ్రీ కళాశాలలో 2021-22 విద్యా సంవత్సరం ప్రవేశాల కోసం నోటిఫికేషన్‌ విడుదలైంది. మిలటరీ కోచింగ్‌తో కూడిన మొదటి సంవత్సరం బీఎస్సీ(ఎంపీసీ), బీఏ (హెచ్‌ఈపీ) డిగ్రీ కోర్సులలో ప్రవేశాల కోసం ఆన్‌లైన్‌లో
దరఖాస్తు చేసుకోవాలి. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. బాలికలు మాత్రమే అర్హులు. www.tswreis.in వెబ్‌సైట్‌ద్వారా మే 31వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

సివంగుల కార్ఖానా

నిరుపేదలకు వరం
దేశవ్యాప్తంగా ఎన్నో సైనిక్‌ స్కూల్స్‌, కళాశాలలు ఉన్నాయి. కానీ, వాటి ఫీజులు లక్షల్లోనే! దేశంలోనే మొదటిసారిగా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సైనిక మహిళా డిగ్రీ కళాశాల నిరుపేదలకు ఒక వరం. ఒక్కో విద్యార్థిపై ప్రభుత్వం ఏటా రూ.1.42 లక్షలు వెచ్చిస్తున్నది. కళాశాల ప్రవేశాలలో ఎస్సీ, ఎస్టీలకు ప్రాధాన్య క్రమంలో సీట్లను కేటాయిస్తాం. ఎస్సీ, ఎస్టీ విద్యార్థినులు తగినంతమంది లేకపోతే ఆ సీట్లను జనరల్‌ కేటగిరీ అభ్యర్థులకు కేటాయిస్తాం. మొదటి బ్యాచ్‌ విద్యార్థినులు అసాధారణ ప్రతిభ కనబరచడం ఆనందంగా ఉంది. త్రివిధ దళాల్లో చేరడం ఎలాగో తెలియనివాళ్లు సైతం ఈ కళాశాల కారణంగా దేశ రక్షణలో భాగస్వాములవుతున్నారు.

  • మేజర్‌ యుకె శర్మ, కళాశాల డైరెక్టర్‌
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
సివంగుల కార్ఖానా

ట్రెండింగ్‌

Advertisement