మంగళవారం 02 మార్చి 2021
Zindagi - Jan 27, 2021 , 02:13:22

భర్త బాటలోనే..

భర్త బాటలోనే..

2018 ఏప్రిల్‌ 10, కశ్మీర్‌లోని కుల్గామ్‌ ప్రాంతం.తుపాకుల మోత. బుల్లెట్ల వర్షం. దారికాచి దాడికి దిగిన టెర్రరిస్టులపై ఎదురుదాడి జరుగుతున్నది. 17 గంటల సుదీర్ఘ పోరు. ఈ ఆపరేషన్‌లో పాల్గొన్న సైనికుల్లో నాయక్‌ దీపక్‌ నైనవాల్‌ ఒకరు. హోరాహోరీగా జరిగిన కాల్పుల్లో దీపక్‌ శరీరాన్ని బుల్లెట్లు తూట్లు పొడిచాయి. నలభై రోజులు ప్రాణాలతో పోరాడి మే 20న అమరుడయ్యారు ఆయన.చిన్నారి కూతురు, ముద్దులొలికే కొడుకు, తన మీదే ప్రాణాలు పెట్టుకున్న భార్య జ్యోతి. వారందరినీ వదిలి వెళ్లిపోతున్న బాధ కన్నా.. దేశం కోసం తనువు చాలిస్తున్న తృప్తే ఆయనలో ఎక్కువగా కనిపించింది. ‘నేను పోయినంత మాత్రాన నీ జీవితం చీకటి అయిపోదు. ధైర్యంగా ఉండు. నేను లేని లోటు ఏర్పడకుండా బిడ్డలను పెంచు’ అని చెబుతూ భార్య కండ్లలోకి చూస్తూ కన్నుమూశారు దీపక్‌.

2011లో ఒక్కటయ్యారు దీపక్‌, జ్యోతి. ఎప్పుడూ దేశం గురించే మాట్లాడే భర్తను చూస్తూ గర్వంగా భావించేది. అన్యోన్య దాంపత్యానికి గుర్తుగా కూతురు లావణ్య పుట్టింది. ఆ చిట్టితల్లి బుడిబుడి అడుగులు వేస్తున్న రోజుల్లోనే కొడుకు రేయాంశ్‌ పుట్టాడు. హాయిగా సాగిపోతున్న జీవితం అతలాకుతలం అయింది. ఆరోప్రాణం విడిచి వెళ్లిపోయినా.. బిడ్డల కోసం ఆ బాధనంతా దిగమింగుకుంది జ్యోతి. ఇదంతా జరిగి రెండున్నరేండ్లు గడిచిపోయాయి. ఇప్పుడు అదే ఇంటి నుంచి మరో వ్యక్తి సైన్యంలోకి వస్తున్నారు. ఎవరో కాదు.. దీపక్‌ భార్య జ్యోతి నైనవాల్‌. భర్త ఆశయాన్ని కొనసాగించడానికి ఆమె సైన్యంలోకి అడుగుపెడుతున్నారు. ఈ నెల 29న శిక్షణ కోసం చెన్నైలోని ఆఫీసర్స్‌ ట్రైనింగ్‌ అకాడమీలో అడుగుపెట్టనున్నారు కొండంత ధైర్యంతో.. రవ్వంత గర్వంతో!దీపక్‌ తాత స్వాతంత్య్ర సమరయోధుడు. తండ్రి సైనికుడు. 1971లో పాకిస్థాన్‌తో జరిగిన యుద్ధంలో పాల్గొన్నారు. తండ్రి బాటలో ఈ కొడుకు కూడా సైన్యంలోకి అడుగుపెట్టారు. ఇప్పుడు భర్త బాటలోనే జ్యోతి పయనిస్తున్నది. ఆయన కన్న కలలు నెరవేరుస్తానని చెబుతున్నది.

VIDEOS

logo