e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, September 18, 2021
Home జిందగీ నా హీరో.. కేటీఆర్‌

నా హీరో.. కేటీఆర్‌

సోనుసూద్‌.. తెరమీద ప్రతినాయకుడు. ఎదలోతుల్లో నిజ నాయకుడు! పేదల కష్టాలకు స్పందిస్తారు. తక్షణసాయం అందిస్తారు. ఆయన నిలబెట్టిన జీవితాలు, ఊపిరి పోసిన ప్రాణాలు అనేకం! ఒక దశలో ప్రభుత్వాలు కూడా సోనుసూద్‌ వైపు ఆశగా చూశాయి. ఇటీవల హైదరాబాద్‌కు వచ్చినప్పుడు, ‘రియల్‌ స్టార్‌’ సోనుసూద్‌ ‘నమస్తే తెలంగాణ’కు ప్రత్యేకఇంటర్వ్యూ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి విస్మయపరచిందన్నారు. రాష్ట్ర ఐటీ, పురపాలక, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్‌ నిజమైన హీరో అని కితాబు ఇచ్చారు. అనేక విషయాలపై తన అభిప్రాయాలను వెల్లడించారు.

సినిమాల్లో విలన్‌గా నటించే మీరు, నిజ జీవితంలో మాత్రం పేరుకు తగ్గట్టే.. స్వచ్ఛమైన బంగారం! ఇంతటి సేవాగుణం ఎలా అబ్బింది?
కరోనా నాకు అతిపెద్ద జీవిత పాఠం నేర్పింది. తోటివారు ఆపదలో ఉన్నప్పుడు ఆదుకోవాలన్న ఆలోచన కలిగించింది. ఇక సమయానికి వనరులు సమకూరడం, వాటిని అవసరం ఉన్నవారికి చేర్చగలగడం నా అదృష్టం. ఇదంతా ప్రారంభం మాత్రమే. చేయాల్సింది చాలా ఉంది. సినిమాల్లో విలన్‌ పాత్ర పోషించాను కానీ, నిజ జీవితంలో మాత్రం సమాజంలో నాకంటూ ఓ ప్రత్యేక పాత్ర ఉండాలని కోరుకుంటున్నా.

- Advertisement -

మీ సంపాదనలో అత్యధిక భాగాన్ని సేవా కార్యక్రమాలకే వినియోగిస్తున్నట్టు విన్నాం. మీకు ప్రేరణ ఏమిటి?
నిజమే. నా సంపాదనలో ఎక్కువ భాగం సమాజానికే కేటాయిస్తున్నా. సినిమాల ద్వారా, బ్రాండ్‌ ప్రమోషన్‌ ద్వారా నాకు ఆదాయం వస్తున్నది. ఆ డబ్బును సమాజ సేవకు మళ్లిస్తున్నా. ఈ ప్రయాణంలో ఎంతోమంది బాసటగా నిలుస్తున్నారు. ఆత్మీయులు చేతులు కలిపారు. వారి నిస్వార్థ గుణమే నన్ను ముందుకు నడుపుతున్నది.

సేవ విషయంలో మీకు స్ఫూర్తి ఎవరు?
మా అమ్మానాన్న కొండంత స్ఫూర్తి. వారి దయాగుణాన్ని మాటల్లో చెప్పలేను. ఆకలితో ఇంటికి వచ్చేవాళ్లకు కడుపునిండా అన్నం పెట్టాలని అమ్మ తరచూ చెప్పేవారు. నాన్నకూడా అంతే. ఎదుటివారికి సాయపడితేనే మన జీవితం సార్థకమవుతుందని అనేవారు. మనకు ఎన్నో ఇచ్చిన ఈ సమాజానికి, ఎంతోకొంత తిరిగి ఇవ్వాలని బోధించారు. ఆ మాటలే, మంత్రంలా నన్ను ప్రభావితం చేశాయి.

ప్రజాసేవ కోసం మీరు ఇంత పెద్ద ఎత్తున ఖర్చు చేస్తున్నారు. మీ భార్య స్పందన ఎలా ఉంటుంది?
నా భార్య, ఇద్దరు కొడుకులు నాకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నారు. లేకపోతే, నేనీ స్థాయిలో నిలబడేవాడినే కాదు. సహాయం కోసం వచ్చే ఉత్తరాలను నా భార్య స్వయంగా చదువుతుంది. సాయం చేయమని ప్రోత్సహిస్తుంది. నా పిల్లలుకూడా చురుగ్గా పాల్గొనడం నా అదృష్టం.

సోనుసూద్‌ ప్రత్యక్ష రాజకీయాల్లో రాబోతున్నారని, ఆ ప్రయత్నంలో భాగంగానే వివిధ కార్యక్రమాలు చేపడుతున్నారని చాలామంది అనుకొంటున్నారు. నిజమేనా?
రాజకీయాల్లోకి రావాలన్న ఆసక్తి ఏమాత్రం లేదు. పాలిటిక్స్‌లో రకరకాల ప్రొటోకాల్స్‌ ఉంటాయి. అందరూ చెప్పేది వినాల్సి ఉంటుంది. ఆ చట్రంలో ఇరుక్కుపోతానేమో అని నా భయం. అందుకే, ఆవైపు ఆసక్తి లేదు. నాకు సినిమాలంటే ఇష్టం. ఈ రంగంలోనే కొనసాగుతా. నేనిప్పుడు జీవితాన్ని మంచిగానే ఆస్వాదిస్తున్నా. అనేకమంది ప్రార్థనలు, దీవెనలు నాపై, నా కుటుంబంపై ఉన్నాయి. ఇంతకన్నా నాకేం కావాలి?

తెలంగాణ ఐటీ, ఇండస్ట్రీస్‌, పురపాలక శాఖ మంత్రి, టీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ మిమ్మల్ని ఉద్దేశించి ‘రియల్‌ హీరో’ అన్నారు కదా!
కేటీఆర్‌ గారు ఒక గొప్ప దార్శనికుడు (విజనరీ లీడర్‌). గతంలో ఇలాంటి నేతను నేను చూడలేదు. గ్రేట్‌.. గ్రేట్‌..గ్రేట్‌ గాయ్‌! తెలంగాణ రాష్ర్టాన్ని అభివృద్ధి పథంలో నడుపుతున్న నాయకుడాయన. చాలా అరుదైన వ్యక్తిత్వం. సానుకూల దృక్పథం ఉన్న మనిషి. తాను పనిచేస్తూనే ఇతరులను హార్డ్‌వర్క్‌ దిశగా ఇన్‌స్పైర్‌ చేస్తారు. కేటీఆర్‌గారు చేపడుతున్న వివిధ కార్యక్రమాల్లో నేను కూడా భాగస్వామిని కావడం ఒక మంచి అనుభూతి. నన్ను ‘రియల్‌ హీరో’ అనడం ఆయన గొప్ప మనసుకు నిదర్శనం. తెలంగాణలో ఇన్ని మంచి పనులు చేస్తున్న కేటీఆర్‌గారే నా దృష్టిలో నిజమైన హీరో.

కరోనా రెండు దశల్లోకూడా మీరు చాలా చురుగ్గా సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మీరొక్కరే ఇదంతా ఎలా చేయగలిగారు? రాజకీయ, సినిమా, వ్యాపార, పారిశ్రామిక వర్గాల నుంచి తోడ్పాటు లభించిందా?
క్లిష్ట సమయాల్లో ఎవరికి వారు సహాయం చేయడానికి సిద్ధంగా ఉండాలి. ఎవరో వస్తారని ఎదురు చూడకూడదు. మనకో టీమ్‌ ఉంటేనే ప్రభుత్వమో, మరో వ్యవస్థనో సహకరిస్తుందని అనుకోవడం సరికాదు. ఎక్కడో ఒక దగ్గర మనం చేయాలనుకొన్న పనిని మొదలుపెట్టాలి. వనరులు వాటంతట అవే సర్దుబాటు అవుతాయి. మన సంకల్పం మంచిదైనప్పుడు దయగల హృదయాలు మనతో కలిసి నడుస్తాయి. ఈ విషయంలో నాకు అనుమానమే లేదు. నా అనుభవాన్నే మీకు చెబుతున్నా. కరోనా సమయంలో నేను సహాయ కార్యక్రమాలు ప్రారంభించిన వెంటనే, ఎంతోమంది నాతో కలిసి వచ్చారు. అప్పటి వరకూ వాళ్లలో చాలామందితో నాకు ప్రత్యక్ష పరిచయం లేదు. సాయం కోసం వచ్చేవారి మొహంలో చిరునవ్వు కోసమే మా ప్రయత్నమంతా.

కేటీఆర్‌ గారి పనులపై అనేక సందర్భాల్లో మీరు ట్వీట్లు చేశారు. మొదటిసారి ఆయనను ఎప్పుడు కలిశారు? కేటీఆర్‌గారిలో మీకు నచ్చిన విషయం ఏమిటి?
నేను ఇదివరకే చెప్పినట్టు, కేటీఆర్‌గారు గొప్ప విజనరీ. ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధే ఆయన సమర్థ్ధతకు నిదర్శనం. ఫార్మా, ఆరోగ్య రంగాల్లో తెలంగాణలో అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇక్కడ అద్భుతమైన సౌకర్యాలున్నాయి. గొప్ప నాయకులు ఉన్నప్పుడే, వారినుంచి అనేక విషయాలను తెలుసుకోగలుగుతాం. ఇటీవలే నేను ఆయనను తొలిసారిగా కలిశాను. మళ్లీమళ్లీ కలుస్తాననే అనుకుంటున్నా. వచ్చేసారి కుటుంబాన్ని కూడా తీసుకురమ్మని ఆహ్వానించారు. నాకు మంచి బిర్యానీతో భోజనం పెట్టారు.

కేటీఆర్‌గారు, మీరు.. ఇద్దరూ మీమీ రంగాల్లో విజయాలు సాధించినవారే. ఇద్దరూ కలిసినప్పుడు ఏం మాట్లాడుకుంటారు?
నేను నాదైన సినిమా రంగంలో విజయం సాధించాను. కేటీఆర్‌గారు తనదైన రాజకీయ రంగంలో స్ఫూర్తిప్రదాత, విజయ సాధకుడు. ఆయననుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. నేను ఆయనను ‘బ్రదర్‌’ అని సంబోధిస్తాను, ఆయన కూడా నన్ను అలాగే పిలుస్తారు. మా ఇద్దరిమధ్య చాలా పోలికలు ఉన్నాయి. తెలియని బంధమేదో ఉన్నట్టు అనిపిస్తున్నది. ‘అసలు, మొదటిసారే కలిశానా?’ అన్న అనుమానమూ కలిగింది. ఎంతో కాలం నుంచీ తెలిసిన వ్యక్తిలా అనిపించారు. కేటీఆర్‌ గారు గొప్ప
పాజిటివ్‌ పర్సన్‌.

మీరు తెలుగింటి అల్లుడు కదా! హైదరాబాద్‌లో స్థిరపడే ఆలోచన ఉందా? మీ శ్రీమతి అభిప్రాయం ఏమిటి?
అవును. నేను తెలుగింటి అల్లుడినే. హైదరాబాద్‌ను కూడా స్వస్థలంగా (సెకండ్‌ హోమ్‌గా) భావిస్తాను. హైదరాబాద్‌లో ఇల్లు కొనుక్కోవడమే కాదు, ఇంకా చాలా చేయాలని ఉంది.

తెలంగాణలో మీ ఫౌండేషన్‌ ప్రణాళికలు ఏమిటి?
తెలంగాణాలో నా ఫౌండేషన్‌ ద్వారా ఎన్నో మంచి పనులు చేయాలని ఉంది. వీలైనంత త్వరగా నా ఆలోచనలను ఆచరణలో పెడతాను. త్వరలోనే మీకు శుభవార్త అందుతుంది.

మిమ్మల్ని ప్రజలు విలన్‌గా అంగీకరించగలరా?
అంగీకరించకపోవచ్చు (నవ్వు). ప్రేక్షకులు కోరుకున్న పాత్రలు చేయడానికే నేను ఇష్టపడతా. ఆ పాత్రలో పూర్తిస్థాయిలో ఒదిగిపోవడానికి ప్రయత్నిస్తా.

కేటీఆర్‌ గారి జన్మదినం సందర్భంగా, మీరు ఆయనతో ఏం చెప్పదల్చుకున్నారు?
కేటీఆర్‌ గారు నాకు సోదర సమానులు. ఆయన చేపట్టే ప్రతీపనిలో విజయం చేకూరాలని కోరుకుంటున్నా. ఎల్లప్పుడూ ఆయన వెంట ఉంటా. ఒక్కఫోన్‌ కాల్‌ చేస్తే చాలు. ఆయనతో కలిసి పనిచేస్తా. కేటీఆర్‌ గారికి ప్రజల దీవెనలున్నాయి. ‘దయచేసి మీరు మీ మంచిపనులు కొనసాగిస్తూ ముందుకు వెళ్లండి. వీలైనంత త్వరగా మిమ్మల్ని మరోసారి కలుసుకోవాలని కోరుకుంటున్నా’

గత కొన్నేండ్లుగా హైదరాబాద్‌ నగరంలో జరిగిన అభివృద్ధ్దిపై మీ అభిప్రాయం?
హైదరాబాద్‌ అభివృద్ధ్ది అనేది నమ్మశక్యం కానంత వేగంగా ఉంది. దేశంలోని ఏ ప్రాంతంలోనూ ఇంత వేగంగా వృద్ధి జరుగలేదు. ఇది అద్భుతం.. మహాద్భుతం.. పరమాద్భుతం. గౌరవనీయ ముఖ్యమంత్రి కేసీఆర్‌ గారు, కేటీఆర్‌ గారు తెలంగాణ కోసం చేసిన కృషి కారణంగానే, ఇంతటి ప్రగతి సాధ్యమైంది. ఈ క్రెడిట్‌ వారిద్దరికే చెందుతుంది. కేసీఆర్‌, కేటీఆర్‌ల నాయకత్వం తెలంగాణ ప్రజలు చేసుకున్న అదృష్టం.

… ఓరుగంటి సతీశ్‌

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana