శుక్రవారం 05 మార్చి 2021
Zindagi - Feb 09, 2021 , 01:33:56

తెలంగాణ వెజ్‌ ఖజానా!

తెలంగాణ వెజ్‌ ఖజానా!

కరుణ పుట్టిందీ పెరిగిందీ సికింద్రాబాద్‌లోనే. హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సు చేశాక, కుటుంబ వ్యాపారమైన పార్క్‌లేన్‌ హోటల్‌ బాధ్యతలు తీసుకున్నారు. సోషియాలజీలో డాక్టరేట్‌ అందుకున్నారు.  క్లినికల్‌ న్యూట్రిషనిస్ట్‌గానూ పని చేస్తున్నారు. వీటన్నిటికి తోడు అమ్మమ్మల నాటి ఆరోగ్యకరమైన వంటకాల వివరాలతో ఓ సమగ్ర పుస్తకం తీసుకొచ్చారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే..

తెలంగాణ అనగానే నాన్‌వెజ్‌ గురించే మాట్లాడతారు. నిజమే.. నాన్‌వెజ్‌లో మన దగ్గర రకరకాల వంటకాలున్నాయి. గోలిచ్చిన మాంసం, నాటు కోడికూర, ఖీమా ముట్టీలు, చింత చిగురు మాంసం, చిక్కుడుకాయ మాంసం, సోయకూర పొట్టేలు మాంసం, బోటి ఫ్రై, తలకాయ కూర, కాళ్ల షోర్వ వంటివాటిని తెలంగాణ స్పెషల్స్‌గా చెప్పొచ్చు. వీటితో పాటు వెజ్‌ రకాలూ అనేకం. 

చిరుధాన్యాల రాజధాని: 1970లో ఐక్యరాజ్య సమితి మన దేశంలోని ఆరు రకాల పంటలపై పరిశోధన చేసింది. తెలంగాణను ‘మిల్లెట్‌ క్యాపిటల్‌ ఆఫ్‌ ఇండియా’గా గుర్తించింది. మనది తక్కువ వర్షపాతంతో, వేడి వాతావరణం ఉన్న ప్రాంతం. కాబట్టి, చిరుధాన్యాలు బాగా పండుతాయి. మన తాత ముత్తాతలంతా వాటినే తిన్నారు. అందుకే వందేండ్లు జీవించారు. అయితే, కొన్ని సంవత్సరాలుగా క్యాన్సర్‌, గుండె జబ్బులు, బీపీ, డయాబెటిస్‌ విపరీతంగా పెరుగుతుండటంతో జనం మళ్లీ జొన్నలు, సజ్జలు, రాగులు, కొర్రలు, సామలు, ఊదలు వంటి ధాన్యాలవైపు మొగ్గు చూపుతున్నారు. తెల్ల అన్నానికి బదులుగా రొట్టెలు, రాగి ముద్ద, జావ, కొర్రన్నం వంటివి తింటున్నారు. ఈ ధాన్యాలన్నీ గ్లూటెన్‌ ఫ్రీ, ప్రోబయోటిక్‌. వీటిలో ఫైబర్‌, యాంటీ ఆక్సిడెంట్స్‌, ఖనిజ లవణాలు పుష్కలంగా ఉండటంవల్ల బీపీ, డయాబెటిస్‌ రోగుల ఆరోగ్యాన్ని కాపాడుతాయి. బరువు తగ్గాలనుకునేవాళ్లు ఆహారంలో భాగం చేసుకొంటే మంచి ఫలితం ఉంటుంది. ఉదయం ఫైబర్‌ ఎక్కువగా, పొటీన్లు తక్కువగా ఉండే ఊదలు తినాలి. రాత్రిళ్లు తక్కువ ఫైబర్‌, ఎక్కువ ప్రొటీన్లు ఉండే కొర్రలు తీసుకోవాలి.

కూరగాయల్లో పోషకాలెన్నో: ఆనపుకాయ, బీరకాయ, పొట్లకాయ, కాకరకాయ, వంకాయ, దోసకాయ, టమాటా, దొండకాయ, బెండకాయ.. తెలంగాణలో వాడేవాటిలో 90శాతం నీరు ఎక్కువగా ఉండే కూరగాయలే. ఇక్కడ పాలకూర, గంగవాయిల కూర, బచ్చలికూర, పుంటికూర వంటి ఆకుకూరలు బాగా తింటారు. నిత్యం వండుకునే ఆలుగడ్డ, చామగడ్డ, మొరంగడ్డలలో కూడా పోషక విలువలు అపారం. మనది వేడి వాతావరణం కాబట్టి, చలువ చేసే ఉల్లిగడ్డల పచ్చిపులుసు, మజ్జిగ పులుసు తినడం అలవాటుగా వస్తున్నది. న్యూట్రిషనిస్ట్‌గా సలహా: మాది ఉమ్మడి కుటుంబం కావడం వల్ల అమ్మమ్మ, నానమ్మల చేతివంటలను తింటూ పెరిగాను. రకరకాల ఆరోగ్యకరమైన రెసిపీలు వాళ్లనుంచే నేర్చుకున్నాను. జొన్నలు, సజ్జలు, కొర్రలు వంటి చిరుధాన్యాలను రోజులో ఒక్క పూటైనా తినాలని నేను సిఫార్సు చేస్తారు. పిల్లలకు మార్కెట్లో దొరికే చిప్స్‌, బిస్కెట్స్‌ కాకుండా ఇంట్లోనే పల్లీల చిక్కీ, నువ్వుల లడ్డు, జొన్న చెక్కలు, సజ్జ స్వీట్లు వంటి స్నాక్స్‌ చేసి పెట్టమని  నా సలహా.   తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాకే మన భాషతోపాటు వంటల ప్రత్యేకతా ప్రపంచానికి తెలిసింది. అయితే ఎంతసేపూ సర్వపిండి, మలిద ముద్దలు, సకినాల గురించే మాట్లాడతారు తప్ప, వేరే వెజ్‌ వంటల ప్రస్తావన  రాదు. అందుకే, అన్ని ప్రాంతాల ప్రజలతో మాట్లాడి రకరకాల శాకాహార వంటకాలను ఒక్కచోట చేర్చాను. కొలతల్లో, చేసే విధానంలో కూడా  పాతకాలపు పద్ధతులనే అనుసరించాను. నా పుస్తకం ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంది. 

రోగులకు సంప్రదాయ ఆహారం

బాలింతలకు, ఆపరేషన్లు అయిన పేషెంట్లకు ఇచ్చే ఆహారంలో పోషకాలు అధికంగా ఉండేలా చూస్తారు మన పెద్దవాళ్లు. పాలిచ్చే తల్లులకు వెల్లుల్లి కారం, నువ్వుల అన్నం, బెల్లం-నువ్వుల ముద్దలు, జొన్న లడ్డు, పలుకుల పట్టీలు ఇవ్వడం వల్ల కావాల్సినంత క్యాల్షియం, ఐరన్‌, శక్తి లభిస్తాయి. అలాగే ఫ్రాక్చర్‌ అయిన పేషెంట్లకు పసుపు, ఉప్పు, మిరియాల పొడి వేసి ఉడికించిన మేక కాళ్ల షోర్వను తాగిస్తారు. ఆరు నెలలు నిండిన పిల్లలకు ఇంట్లోనే బియ్యం, రాగులు, కందిపప్పు, మినుపపప్పు, పెసరపప్పు, జీడిపప్పు, బాదం పప్పు వంటి వాటితో ఉగ్గు తయారు చేసి, నెయ్యి కలిపి తినిపిస్తారు. 

తెలంగాణ అనగానే నాన్‌వెజ్‌ మాత్రమే ఎందుకు గుర్తుకు రావాలి? 

మాంసాహార రుచులతో అద్భుతాలు సృష్టిస్తూనే.. మన నాయనమ్మలూ, జేజమ్మలూ రుచికరమైన శాకాహార వంటలు కూడా వండారు.  

వంటిల్లే ప్రయోగశాలగా తెలంగాణ మహిళ చేసిన ఆవిష్కరణలు ఒకటా, రెండా?

ఉల్లికాడల ఒడప్పా, చల్ల సేగు, మామిడికాయ ఉప్పిడి పిండి, సర్వ పిండి, కుడుములు, సియాలీ, మినుప రొట్టె, రైలు పలారం, శనగ గుడాలు, చల్ల ఖీర్‌, పుదీనా పులావ్‌ .భరితం (వంకాయతో), కలైగూర, గసాల్‌ (క్యాప్సికమ్‌తో), మామిడికాయ మెంతి, ముద్దగూర, బేసన్‌పిండి ఉల్లిపొరక, పుంటికూర పప్పు, మెంతెం కూర గోలీలు, కొబ్బరిపాల కూర, చామకూర చుట్టాలు,  దోసకాయ బరడా.బిళ్లల పులుసు, పచ్చి పులుసు, ముక్కల చల్లచారు, కొబ్బరి చారు, నీళ్ల చారు, దప్పడం, నారింజ పప్పుచారు.

మామిడికాయ పచ్చడి, ఉప్పుకాయ్‌, బెల్లంకాయ్‌, ఉడికిన తొక్కు, దోసకాయ పచ్చడి, ఎర్రపండ్ల తొక్కు, టమాటా తొక్కు, నువ్వుల సాగి.చట్నీ పొడి, దోసగింజల పొడి, గడ్డి నువ్వుల పొడి, మిరియాల కారం, ఎల్లిపాయ కారం.

ఈ చిట్టా తెలంగాణ చరిత్రంత విస్తారం. తెలంగాణ నేలంత వైవిధ్యం. ఏడు నెలలపాటు తెలంగాణలోని అన్ని ప్రాంతాల ప్రజలతో మాట్లాడి  మొత్తం 60 శాకాహార వంటలతో ‘కిచెన్‌ సీక్రెట్స్‌ ఆఫ్‌ తెలంగాణ’ పేరుతో పుస్తకం తీసుకొచ్చారు ఆంత్రప్రెన్యూర్‌,  క్లినికల్‌ న్యూట్రిషనిస్ట్‌ దండు కరుణ.

VIDEOS

తాజావార్తలు


logo