e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, September 21, 2021
Home జిందగీ బధిరుల జ్యోతి!

బధిరుల జ్యోతి!

మనిషి రెండు చెవులు శబ్దాన్ని గ్రహిస్తాయి. నిశ్శబ్దాన్ని ఛేదిస్తాయి. కానీ, జీవితంలో అలికిడే తెలియని బధిరుల సంగతేమిటి? వాళ్లకు తానే చెవులుగా మారిపోయారు డాక్టర్‌ జ్యోతి. ఇప్పటి వరకూ పదివేల మంది పిల్లలకు గెలుపు గీతం వినిపించారామె. ఈ అంకితభావమే జ్యోతిని ఐక్యరాజ్యసమితి ‘1ఎం1బీ అంతర్జాతీయ టీచర్స్‌ అవార్డ్‌’కు నామినేట్‌ చేసింది.

కోపం, దుఃఖం, సంతోషం.. ఏ భావన అయినా ఇతరులతో పంచుకునే మాధ్యమం భాష. ఆ భాషకు ప్రాణం వినికిడి శక్తి. వినికిడి లోపమున్న పిల్లలు మాట్లాడలేరు. తమ భావాలను ఇతరులకు తెలిపేందుకు సైగలతో పడే కష్టం అంతా ఇంతా కాదు. ఆ ఇబ్బందిని తగ్గించడంలో తన వంతు కృషి చేస్తున్నారు ఆలియావర్‌ జంగ్‌ నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ స్పీచ్‌ అండ్‌ హియరింగ్‌ డిజెబిలిటీ రీజినల్‌ సెంటర్‌లో పనిచేస్తున్న డాక్టర్‌ వీఏ జ్యోతి. వందలాది దివ్యాంగ చిన్నారులను సాధారణ విద్యార్థుల స్థాయికి చేర్చడమే కాదు, వారి భవితకు బాటలు వేస్తున్నారామె.

- Advertisement -

డాక్టర్‌ వీఏ జ్యోతి జీవితమేమీ పూలబాట కాదు. ఆ ప్రయాణంలో ఎన్నో ముళ్లు. తల్లిదండ్రులు లలితాంబ-సచ్చిదానందరావు. తండ్రి నేవీలో ఉద్యోగం చేసేవారు. జ్యోతి కళ్లు తెరవకముందే అనారోగ్యంతో మరణించారు. దీంతో తల్లితోపాటు హైదరాబాద్‌కు వచ్చేసింది. ఆస్తిపాస్తులేమీ లేవు. అయినా, ఒక్కగానొక్క కూతుర్ని అన్నీ తానై పెంచి, పెద్ద చేసింది. ఇంటర్‌ కాగానే వివాహం చేసింది. చాలీచాలని జీతం భర్తది. అదనపు ఆదాయం కోసం రూ.150 జీతానికి తనూ ఓ ప్రైవేట్‌ స్కూల్‌లో టీచర్‌గా చేరింది. అటు తరువాత పెద్దమ్మ శారదాంబ ప్రోత్సాహంతో ఆలియావర్‌ జంగ్‌ నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ స్పీచ్‌ అండ్‌ హియరింగ్‌ డిజెబిలిటీ (ఏవైజేఎన్‌ఐఎస్‌హెచ్‌)లో డిప్లొమా ఇన్‌ హియరింగ్‌ ఇంపెయిర్డ్‌లో చేరింది. ఆరేళ్ల తరువాత ఇక్కడే టీచర్‌గా ఉద్యోగం వచ్చింది. అంతటితో ఆగకుండా దూరవిద్యలో బీఎస్సీ, బీఎడ్‌, ఎంఈడీ, పీహెచ్‌డీ పూర్తి చేసింది. ప్రస్తుతం ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల ప్రవర్తనలో మార్పును తెచ్చే స్పెషల్‌ ఎడ్యుకేటర్‌ అండ్‌ జనరల్‌ కౌన్సెలర్‌గా విధులను నిర్వహిస్తున్నది. జ్యోతి ఇద్దరు పిల్లలు అఖిలేష్‌, అవినాష్‌ ఇంజినీర్లుగా అమెరికాలో స్థిరపడ్డారు.

దివ్యాంగులకు బాసట
బధిరులు వినలేరు. కాబట్టి, మాట్లాడలేరు. ఈ విషయంపై చాలామంది తల్లిదండ్రులకు అవగాహన ఉండదు. సమస్య తెలియగానే పిల్లల పరిస్థితిని చూసి మానసికంగా కుంగిపోతారు. చిన్నారులు సైతం సమాజం నుంచి విడివడి ఒంటరిగా జీవిస్తుంటారు. కానీ, బిడ్డల్లో వినికిడి లోపాన్ని ముందుగానే గుర్తిస్తే, వారిని సాధారణ చిన్నారుల స్థాయికి తీసుకురావచ్చు. సమాజంతో మమేకం చేయవచ్చు. అదే ఆశయంతో, గత 40 ఏండ్లుగా డాక్టర్‌ జ్యోతి కృషి చేస్తున్నారు. ఇప్పటి వరకు సుమారు పదివేల మంది చిన్నారులకు కొత్త జీవితాన్ని ప్రసాదించారు. స్పీచ్‌ అండ్‌ హియరింగ్‌లో శిక్షణే కాదు, బధిరులకు కెరీర్‌ కౌన్సెలింగ్‌ ఇస్తూ అందుబాటులో ఉన్న విద్య, ఉద్యోగ వనరులను వివరిస్తూ, వారు ఆ దిశగా పయనించేందుకు మార్గదర్శనం చేస్తున్నారు. అలా, 300 మంది బధిరులు సాధారణ వ్యక్తులతో పోటీ పడి ఉద్యోగాలను సాధించారు. తల్లిదండ్రులకు సైతం మానసిక ధైర్యాన్నిచ్చి అండగా నిలుస్తున్నారు. స్వయంగా ప్రత్యేక శిక్షణా కార్యక్రమాన్ని కూడా ఆమె రూపొందించారు. ఇప్పుడది దేశవ్యాప్తంగా అమలు అవుతున్నది.

స్పెషల్‌ ఎడ్యుకేషన్‌లో..
ప్రత్యేక అవసరాలు కలిగిన చిన్నారుల హక్కులకోసమూ జ్యోతి కృషి చేస్తున్నారు. నేషనల్‌ కన్వెన్షన్‌ ఫర్‌ ఎడ్యుకేటర్‌ ఆఫ్‌ డెఫ్‌, అసోసియేషన్‌ ఆఫ్‌ సైకాలజీ అండ్‌ చైల్డ్‌ డెవలప్‌మెంట్‌ సభ్యురాలిగా కూడా ఉన్నారామె. ప్రత్యేక అవసరాల పిల్లల్లో భాషాభివృద్ధికి వివిధ నమూనాలను తీసుకొచ్చారు. మండల రిసోర్స్‌ ఎడ్యుకేషన్‌ సెంటర్లకు అవసరమైన స్పీచ్‌ థెరపీ మెటీరియల్‌ తయారీలోనూ కీలక భూమికను పోషించారు. క్షేత్రస్థాయిలో జిల్లా జిల్లాకూ తిరుగుతూ, స్థానిక పాఠశాలలను సందర్శిస్త్తూ ఉపాధ్యాయులకు స్పెషల్‌ ఎడ్యుకేషన్‌పై అవగాహన కల్పిస్తున్నారు. అంతేకాదు, వివిధ వేదికలద్వారా దివ్యాంగుల గొంతును వినిపిస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ పాఠశాలల్లో దివ్యాంగులకు సమాన అవకాశాలు లభించేలా కృషి చేస్తున్నారు. డా॥ జ్యోతి రాష్ట్ర, జాతీయ స్థాయిలో అవార్డులను అందుకున్నారు. తాజాగా ‘ఐక్యరాజ్యసమితి’ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అంతర్జాతీయ ఎన్‌జీవో 1ఎం1బీ (వన్‌ మిలియన్‌ వన్‌ బిలియన్‌) అందించనున్న ‘చేంజ్‌ మేకర్‌’ అవార్డ్‌కు నామినేట్‌ అయ్యారు. ప్రపంచవ్యాప్తంగా 100 మంది ఉపాధ్యాయులు ఈ అవార్డుకు పోటీ పడుతుండగా అందులో జ్యోతి ఒకరు కావడం విశేషం. … మ్యాకం రవికుమార్‌

భవిష్యత్తులోనూ..
ఎవరైనా ఒకేరోజులో అన్నీ నేర్చుకోలేరు. ప్రత్యేక అవసరాల చిన్నారులుకూడా అంతే. వాళ్లూ ఏదైనా నేర్చుకోగలరు. కానీ, వారిలోని లోపాలను, ముఖ్యంగా వినికిడి లోపాలను ముందుగానే గుర్తించాల్సి ఉంటుంది. అప్పుడే సరైన శిక్షణ ఇచ్చి, సాధారణ వ్యక్తులతో సమానంగా తీర్చిదిద్దవచ్చు. అందులో తల్లిదండ్రులు, సమాజం పాత్ర ఎంతో కీలకం. నా ఉద్యోగ విరమణ తర్వాతకూడా సేవలను కొనసాగిస్తా. కౌన్సెలింగ్‌ సెంటర్‌ను ఏర్పాటు చేస్తాను. ప్రత్యేక అవసరాల చిన్నారులకు, వారి తల్లిదండ్రులకు ఉచిత శిక్షణ ఇవ్వాలన్నదే నా ఆశయం.

డాక్టర్‌ వీఏ జ్యోతి

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana