e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, June 18, 2021
Home జిందగీ బిడ్డలు భద్రమే!

బిడ్డలు భద్రమే!

బిడ్డలు భద్రమే!
  • ‘థర్డ్‌ వేవ్‌’లో.. ఇల్లే రక్షణ కవచం
  • కన్నవారే ‘రోగ నిరోధక శక్తులు’

ఫస్ట్‌ వేవ్‌.. వృద్ధులను వణికించింది.సెకండ్‌ వేవ్‌.. యువతను బలి తీసుకుంది.థర్డ్‌ వేవ్‌ .. బాల్యంపై గురి పెడుతుందా? అర్థం లేని కథనాలతో, అరకొర సమాచారంతో సామాజిక మాధ్యమాలు పసిబిడ్డల తల్లిదండ్రులకు కునుకు లేకుండా చేస్తున్నాయి. ముందు జాగ్రత్తగా పిల్లలకు ఏమైనా మందులు రాసివ్వమంటూ ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్న వారూ ఉన్నారు. అసలు, థర్డ్‌ వేవ్‌ వస్తుందా? వచ్చినా పిల్లలపైనే ప్రభావం చూపనుందా? అదే జరిగితే తల్లిదండ్రులు ఏం చేయాలి?

ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే థర్డ్‌ వేవ్‌ ‘ఖాయమనే’ అనిపిస్తున్నది. కాకపోతే, ఎప్పుడు వస్తుంది? ఎంత తీవ్రంగా ఉంటుంది? ఎవరిపై ఎంత ప్రభావం చూపుతుంది? అన్న దానిపై ఇంకా స్పష్టత లేదు. కచ్చితమైన ఆధారాలూ లేవు. సుమారు 130 కోట్ల జనాభా ఉన్న మన దేశంలో రానున్న రెండు, మూడు నెలల్లో కనీసం 60-70 శాతం జనాభాకు వ్యాక్సినేషన్‌ పూర్తయితే, థర్డ్‌ వేవ్‌ వచ్చినా పెద్దగా నష్టం ఉండదు. కొందరికి వ్యాక్సిన్‌తో ప్రొటెక్షన్‌ లభిస్తే, ఇంకొంతమందికి ఇప్పటికే ఇన్‌ఫెక్షన్‌ వచ్చి తగ్గడం వల్ల శరీరానికి ప్రతి రక్షకాల పహరా ఉండనే ఉంటుంది. ఫలితంగా, పాజిటివ్‌ వచ్చినా స్వల్ప లక్షణాలే ఉంటాయి. మరణాల రేటు చాలా తక్కువగా ఉంటుంది.

వైరస్‌ ప్రభావం?
కరోనా ఫస్ట్‌ వేవ్‌ వృద్ధులపై ప్రభావం చూపింది. ఆ సమయంలో అంతా అప్రమత్తమై చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. కానీ, సెకండ్‌ వేవ్‌కి ముందు అందరూ ఎంతో కొంత నిర్లక్ష్యంగా ఉన్నారు. వైరస్‌ పూర్తిగా పోయిందన్న అపోహలో జాగ్రత్తలు తీసుకోలేదు. దాంతో ఏ అనారోగ్యమూ లేని యువకులు కూడా తీవ్రస్థాయిలో ఇబ్బంది పడ్డారు. పైగా ఇప్పుడు వైరస్‌ పెద్దవాళ్లలో కూడా విస్తృతంగా వ్యాప్తి చెందడంతో, ఇంట్లోని పిల్లలూ ఆ మహమ్మారి బారిన పడుతున్నారు. ఫస్ట్‌ వేవ్‌లో కానీ, సెకండ్‌ వేవ్‌లో కానీ, అధిక శాతం పిల్లల్లో తేలికపాటి లక్షణాలే ఉన్నాయి. చాలామందిలో పాజిటివ్‌ వచ్చినా అసలు లక్షణాలే ఉండటం లేదు. 80 శాతం మందిలో జ్వరం మాత్రమే కనిపిస్తున్నది. కొందరిలో జలుబు, గొంతునొప్పి, వాంతులు, విరేచనాలు ఉంటున్నాయి. కొంత పెద్ద పిల్లలను తలనొప్పి, కడుపునొప్పి వంటివి ఇబ్బంది పెడుతున్నాయి.

తల్లిదండ్రుల బాధ్యత
థర్డ్‌ వేవ్‌ వస్తుందా? రాదా? అన్నది పక్కన బెడితే కన్నవాళ్లు, తమ పిల్లలూ కొవిడ్‌ జాగ్రత్తలు పాటించేలా చూడాలి. ప్రభుత్వం చేయాల్సిన పనులు చేస్తున్నది. వైరస్‌ వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా స్కూళ్లు, పార్కులు మూతబడ్డాయి. తీవ్రతనుబట్టి సర్కారు లాక్‌డౌన్‌ ప్రకటిస్తున్నది. కానీ, ప్రాథమికంగా తల్లిదండ్రులకంటే ఎక్కువగా ఎవరూ జాగ్రత్తలు తీసుకోలేరు. ఇంట్లో రెండేండ్లు పైబడిన పిల్లలకు మాస్క్‌ అలవాటు చేయాలి. చేతుల పరిశుభ్రత గురించి నేర్పించాలి. నోట్లో వేళ్లు పెట్టుకోకుండా చూడాలి. తరచూ సబ్బు లేదా హ్యాండ్‌వాష్‌తో చేతులు కడుక్కునేలా తర్ఫీదు ఇవ్వాలి. బయటినుంచి తెచ్చిన వస్తువులను శానిటైజ్‌ చేసేదాకా ముట్టుకోవద్దని చెప్పాలి. హ్యాండ్‌వాష్‌ అందుబాటులో లేనిచోట 60 శాతం ఆల్కహాల్‌ ఉన్న శానిటైజర్‌ని వాడటం నేర్పించాలి.

మంచి జీవనశైలి
పిల్లలు అడుగుతున్నారని జంక్‌ ఫుడ్‌ తినిపించకూడదు. ఇంట్లోనే ఏ పూటకు ఆ పూట వేడివేడిగా వండి వడ్డించాలి. తాజా ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు పెట్టాలి. రోజూ డ్రైఫ్రూట్స్‌ అందించాలి. వాళ్లకు శారీరక శ్రమ ఉండట్లేదు. దీంతో పిల్లలు అధిక బరువుతో ఇబ్బంది పడటం గమనిస్తున్నాం. ఇంటి ఆవరణలోనే ఏవైనా ఆటలు ఆడించడం మంచిది. అమ్మానాన్నలు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ చేసుకుంటూ, పిల్లలను ఎంగేజ్‌ చేయడానికి స్మార్ట్‌ఫోన్‌ లేదా ల్యాప్‌టాప్‌ ఇస్తున్నారు. దీనివల్ల వాళ్లలో కంటి సమస్యలతోపాటు మానసిక రుగ్మతలు పెరుగుతాయి. స్క్రీన్‌టైమ్‌ని తగ్గించి, పిల్లలతో కొంత సమయాన్ని గడపాలి.

సాధారణంగా పిల్లలు తల్లిపాల సత్తువ వల్ల ఏడాదిలోపు ఎలాంటి ఇన్‌ఫెక్షన్ల బారిన పడరు. రెండో సంవత్సరం బయటి వాతావరణంలోకి వెళ్లి, నలుగురితో ఆడుకోవడం మొదలుపెడతారు. అప్పుడే, మొదటిసారి ఇన్‌ఫెక్షన్‌ బారిన పడతారు. ఆ సమయంలో వాళ్ల శరీరంలో యాంటీబాడీస్‌ తయారై రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇలా రెండు మూడేండ్లలో జరగడం వల్ల, ఆ తర్వాత చాలాకాలం వరకూ త్వరగా ఇన్‌ఫెక్షన్ల బారిన పడే ఆస్కారం ఉండదు. కానీ, గత ఏడాది మార్చినుంచి స్కూళ్లు, ప్లే స్కూళ్లు లేవు. బయటి వాతావరణం తెలియకుండానే ఏడాది పిల్లలు రెండేండ్లకు, రెండేండ్ల పిల్లలు మూడేండ్లకు వచ్చేశారు. వీళ్లంతా ఇప్పటి వరకూ ఇన్‌ఫెక్షన్‌ ఎరుగరు. ఫలితంగా, ఆ చిన్నారుల శరీరాల్లో యాంటీబాడీస్‌ తయారు కాలేదు. రానున్న రోజుల్లో కరోనా వైరస్‌ ప్రభావం లేకపోయినా, రెండు మూడేండ్ల పిల్లలు సాధారణ ఇన్‌ఫెక్షన్లతో ఆస్పత్రులకు వెళ్తారు. డాక్టర్లమీద లోడ్‌ పెరుగుతుంది కూడా. ఈ పరిస్థితిని చాలామంది థర్డ్‌ వేవ్‌ అనుకునే ప్రమాదం ఉంది. కాబట్టి, పిల్లలున్న తల్లిదండ్రులు భవిష్యత్‌ గురించిన భయాలు వదిలేసి తగిన జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది.

పిల్లలకు ప్రమాదమా?
‘థర్డ్‌ వేవ్‌ వచ్చేసింది, అది పూర్తిగా పిల్లలపైనే ప్రభావం చూపిస్తుంది’ అన్నది నూరుపాళ్లు అసత్య ప్రచారమే. ఒకవేళ ఇప్పటికిప్పుడు థర్డ్‌ వేవ్‌ వచ్చినా, అది బాల్యంపైనే ఎక్కువ ప్రభావం చూపుతుందనడానికి ఎలాంటి ఆధారాలూ లేవు. విదేశాల్లో పిల్లలు ఎక్కువగా కరోనా బారిన పడకపోవడానికి కారణం, అక్కడ 18 ఏండ్లు నిండినవారికి వ్యాక్సినేషన్‌ ప్రక్రియ పూర్తయింది. తల్లిదండ్రులకు వైరస్‌ సోకే ఆస్కారం లేదు కాబట్టి, పిల్లలకూ రావట్లేదు. మన దగ్గర ఇంకా ఆ స్థాయిలో యువతీ యువకులకు వ్యాక్సినేషన్‌ జరుగలేదు కాబట్టి, ఇంట్లోని పిల్లలకూ విస్తరిస్తున్నది. రానున్న రోజుల్లోకూడా పరిస్థితి ఇలాగే ఉంటే పిల్లలకు సోకుతుంది తప్ప, థర్డ్‌ వేవ్‌లో కక్ష గట్టినట్టు పిల్లలకే ప్రత్యేకించి వైరస్‌ సోకడం అంటూ జరగదు.

కొవిడ్‌ తర్వాత?
పాజిటివ్‌ లక్షణాలు పిల్లలకు త్వరగానే తగ్గిపోతున్నాయి. దీనికి కారణం పిల్లల్లో వైరస్‌ను కణాలదాకా తీసుకెళ్లే ఏసీఈ2 రిసెప్టార్స్‌ తక్కువగా ఉండటం. దీనివల్ల వైరస్‌ తీవ్రత పిల్లల్లో పెద్దగా ఉండదు. అయితే, కొవిడ్‌ వచ్చి వెళ్లిన రెండు నుంచి నాలుగు వారాల మధ్య కానీ, ఆ తర్వాత కానీ కొంతమందిలో ‘మల్టీసిస్టమ్‌ ఇన్‌ఫ్లమేటరీ సిండ్రోమ్‌’ అనే సమస్య వస్తున్నది. పిల్లల్లో మొత్తంగా మూడు రకాల కొవిడ్‌ కేసులు ఉన్నాయి. లక్షణాలు ఉండటం వల్ల టెస్ట్‌ చేస్తే పాజిటివ్‌గా నిర్ధారణ కావడం, లక్షణాలు లేకపోయినా టెస్ట్‌ చేస్తే పాజిటివ్‌గా నిర్ధారణ జరగడం. ఇక మూడోది.. అసలు కొవిడ్‌ లక్షణాలు ఉండవు కాబట్టి, టెస్ట్‌ చేయాల్సిన అవసరమే రాదు. కానీ, ఆ తర్వాత ఏదో సందర్భంలో యాంటీబాడీ టెస్ట్‌ద్వారా కొవిడ్‌ వచ్చి వెళ్లినట్టు నిర్ధారణ కావడం. ఈ మూడు కేసుల్లోనూ కొందరు పిల్లలు ‘మల్టీసిస్టమ్‌ ఇన్‌ఫ్లమేటరీ సిండ్రోమ్‌’ బారిన పడే ఆస్కారం ఉంది. ఇన్‌ఫెక్షన్‌ పూర్తిగా తగ్గిపోయాక మళ్లీ జ్వరం రావడం, ఒళ్లు నొప్పులు, ఆయాసం, దద్దుర్లు, వాంతులు, విరేచనాలు, శ్వాసలో ఇబ్బంది, కడుపు నొప్పి, కళ్లలో ఎరుపుదనం, తలనొప్పి, కాళ్లు-చేతుల వాపు.. మొదలైనవన్నీ ఈ సిండ్రోమ్‌ లక్షణాలే. ఈ పరిస్థితికూడా చాలా తక్కువమంది పిల్లల్లో కనిపిస్తున్నది. ఇలాంటి వాళ్లకు లక్షణాలనుబట్టి చికిత్స అందిస్తారు. ఇప్పటి వరకు చాలా తక్కువ కేసుల్లోనే పిల్లలకు స్టెరాయిడ్స్‌ ఇచ్చారు. ఐసీయూలో వెంటిలేటర్‌మీద పెట్టాల్సిన పరిస్థితికూడా అరుదుగానే వచ్చింది. కాబట్టి, తల్లిదండ్రులు కానీ, పిల్లలు కానీ లేనిపోని భయాలకు గురి కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటే చాలు. ఒకవేళ పిల్లలకు పాజిటివ్‌ వచ్చినా, కంగారు పడకుండా డాక్టర్‌ను సంప్రదించి చికిత్స తీసుకుంటే సరిపోతుంది.

-నిఖిత నెల్లుట్ల

డాక్టర్‌ సురేందర్‌ రావు
పీడియాట్రిషియన్‌ అండ్‌
నియోనాటాలజిస్ట్‌ ,రెయిన్‌బో చిల్డ్రన్స్‌ హాస్పిటల్స్‌

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
బిడ్డలు భద్రమే!

ట్రెండింగ్‌

Advertisement