e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, November 28, 2021
Home జిందగీ తప్పు చేశానేమో!

తప్పు చేశానేమో!

ఏడో తరగతిలోనే యాంకర్‌గా కెరీర్‌ ప్రారంభించింది మోనీషా.యాంకర్‌గా, నటిగా ఏ మంచి అవకాశం వచ్చినా వదులుకోలేదు.అలా అని, ప్రతి పాత్రనూ ఆమోదించలేదు. మంచిచెడుల బేరీజు
తనకు బాగా తెలుసు. ఏదో ఒకరోజు వెండితెర మీదా పేరు తెచ్చుకోవాలన్నది మోనీషా బంగారు కల! తన కెరీర్‌ కథను ‘జిందగీ’తో ఇలా పంచుకుంది.
నేను పుట్టిందీ పెరిగిందీ హైదరాబాద్‌లోనే. నాన్నది వైజాగ్‌, అమ్మది హైదరాబాద్‌. అమ్మకు చిన్నప్పటినుంచీ చదువు, పాటలు అంటే ఇష్టం. ఏదైనా సాధించి అందరిలో గుర్తింపు తెచ్చుకోవాలని అనుకునేది. కానీ, అప్పటి పరిస్థితుల్లో పెండ్లి, పిల్లలు.. అలా జీవితం సాగిపోయింది. తన ఆశ ఆశగానే మిగిలింది. నాకు చిన్నప్పటి నుంచీ డ్యాన్స్‌, మ్యూజిక్‌, ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాలు అంటే ఆసక్తి. స్కూల్లో ఏ ప్రోగ్రామ్‌ జరిగినా పాల్గొనేదాన్ని. ఏడో తరగతిలో ఉన్నప్పుడు (2006) ‘మా’ కేబుల్‌లో యాంకర్స్‌ కోసం ఆడిషన్స్‌ జరుగుతున్నాయని తెలుసుకుంది అమ్మ. నా ఫొటోలు పంపింది. వాళ్ల దగ్గర్నుంచి కబురు రాగానే ఆడిషన్స్‌కి తీసుకెళ్ళింది. ‘ఆడిషన్సే కదా! చూద్దాం లే’ అని బయల్దేరాను. కానీ, వెళ్ళగానే నాకు మేకప్‌ వేసి షూట్‌ చేశారు. స్కూల్‌కి వెళ్తూనే, వేసవి సెలవుల్లో కొన్ని ఎపిసోడ్స్‌ చేశాను. అలా అమ్మ ప్రోత్సాహంతో యాంకర్‌గా నా ప్రయాణం ప్రారంభించాను.
మూడేండ్ల అగ్రిమెంట్‌
‘మా కేబుల్‌’లో యాంకర్‌గా చేస్తున్నప్పుడే మా టీవీలోనూ అవకాశం వచ్చింది. కానీ, కొన్ని కారణాల వల్ల వెళ్ళలేకపోయాను. తర్వాత జీ తెలుగు ఆడిషన్స్‌కి ఫొటోలు పంపాను. జీ వాళ్లు నాతో ఏకంగా మూడేండ్ల అగ్రిమెంట్‌ తీసుకున్నారు. ఆ మూడేండ్లూ ఏ చానల్‌లోనూ పనిచేయకూడదు. సినీ పరిశ్రమతో ఏమాత్రం సంబంధం లేని నాకు, అదే గొప్ప వరంగా అనిపించింది. నటన, యాంకరింగ్‌లో మెలకువలు నేర్చుకున్నా. చాలామంది సెలెబ్రిటీలను ప్రత్యక్షంగా చూశాను. ఇంటర్వ్యూలు చేశాను. ఆ మూడేండ్లూ చాలా మంచి సమయమని చెప్పవచ్చు. బిజీబిజీగా ఉండేది షెడ్యూల్‌. అప్పుడే నాకు సినిమా అవకాశాలు కూడా వచ్చాయి. కానీ, చిన్నదాన్నే కదా, అప్పుడే సినిమాలు ఎందుకనే ఆలోచనతో ఒప్పుకోలేదు.
సీరియల్స్‌లోకి..
ఓవైపు యాంకరింగ్‌ చేస్తూనే సీరియల్స్‌లో నటించా. మా టీవీలో వచ్చిన ‘క్రాంతి’ నా మొదటి సీరియల్‌. జెమినీలో ‘సుడిగుండాలు’, ‘సిరిమల్లి’;మా టీవీలో ‘నాన్నకు ప్రేమతో’; ఈ టీవీలో ‘ముత్యమంత పసుపు’, ‘గోకులంలో సీత’; ఈ టీవీ ప్లస్‌లో ‘నందినీ వర్సెస్‌ నందినీ’.. ఇలా చాలా సీరియల్స్‌లో నటించా. ‘గోకులంలో సీత’,‘నందినీ వర్సెస్‌ నందినీ’ మంచి గుర్తింపునిచ్చాయి. ఒకే టైమ్‌లో రెండూ భిన్నమైన క్యారెక్టర్లు కావడంతో చాలా పేరు వచ్చింది. డైరెక్షన్‌ గురించి కూడా తెలుసుకున్నా. ప్రస్తుతం ‘కార్తీకదీపం’ సీరియల్‌ చేస్తున్న కాపుగంటి రాజేంద్రగారే ‘గోకులంలో సీత’ డైరెక్టర్‌. నాకు ఏదైనా తెలియదని చెబితే ఓపిగ్గా వివరించేవారు. ‘నందినీ వర్సెస్‌ నందినీ’లో కామిక్‌
రోల్‌కు అంతమంచి రెస్పాన్స్‌ రావడానికి కారణం డైరెక్టర్‌గారే. ‘తెలుగు రుచి’ కార్యక్రమానికి యాంకరింగ్‌ కూడా చేశా. దాదాపు మూడు సీరియల్స్‌ ఒకేసారి అయిపోయాయి. అప్పుడే, ఈ టీవీ ‘స్వాతి చినుకులు’లో అవకాశం వచ్చింది. అంతలోనే, పెండ్లయింది. కొంత గ్యాప్‌ తీసుకున్నా. బాబు పుట్టాక ‘మనసు మమత’తో సెకెండ్‌ ఇన్నింగ్స్‌ స్టార్ట్‌ చేశా.
క్యారెక్టర్‌ చిన్నదైంది
సీరియల్స్‌ చేస్తూనే అడపాదడపా సినిమాలూ అంగీకరించాను. ‘ప్రవరాఖ్యుడు’, ‘ఆకాశమే హద్దు’, ‘గాల్లో తేలినట్టుందే’.. ఇలా ఓ తొమ్మిది సినిమాల్లో నటించా. అయితే, చివరికొచ్చేసరికి నా పాత్ర అనేక కారణాల వల్ల తగ్గిపోతూ ఉండటంతో నిరాశ పడేదాన్ని. ఓ మంచి సినిమాలో ఎక్కువ నిడివి ఉన్న పాత్ర చేయాలనేది నా ఆశ. అలాంటి అవకాశం ‘హలో గురూ ప్రేమకోసమే’తో వచ్చింది. వెంటనే ఒప్పేసుకున్నా. హీరోయిన్‌ అక్క క్యారెక్టర్‌ అది. ైక్లెమాక్స్‌లో మంచి సీన్స్‌ రాశారు. అప్పటికే నేను నాలుగు నెలల గర్భవతిని. కొన్ని కారణాలవల్ల షూటింగ్‌ వాయిదా పడింది. దాంతో, నా పొట్ట పెద్దదిగా కనిపిస్తుందని ఆ సీన్స్‌ తీసేశారు. అలా అనుకోకుండా ఎంతో ప్రాధాన్యమున్న పాత్ర కాస్తా, అతి సాధారణంగా మిగిలిపోయింది. చాలా సందర్భాల్లో రకరకాల భయాలతో మంచి సినిమా అవకాశాలను కూడా వదులుకున్నాను. ఇప్పుడు ఆలోచిస్తే ‘అంత తెలివితక్కువగా ఆలోచించానా’ అనిపిస్తుంది. ఏ సీన్లో నటించినా, ఏ దుస్తులు వేసుకున్నా మనమేమిటో, మన వ్యక్తిత్వమేమిటో మనకూ, మన కుటుంబానికి తెలుసు కదా! ఎవరో ఏదో అనుకుంటారని వెనుకడుగు వేయడం మూర్ఖత్వమే. ఇప్పుడు మాత్రం ఆ తప్పు చేయను. మంచి పాత్రలు వస్తే తప్పకుండా చేస్తా. సినిమాల్లో మంచిపేరు తెచ్చుకోవాలన్నదే నా కల.
నా కోసం వచ్చేశారు
నా కెరీర్‌ ప్రారంభం నుంచీ అమ్మ తోడుగా ఉంది. నాకు ఇద్దరు చెల్లెళ్లు. చదువుకుంటున్నారు. నా భర్త పేరు సాగర్‌ ముఖి. మాకు 2018 మార్చి 1న పెండ్లయింది. ఒక బాబు. పేరు యుధ్‌వీర్‌ కనీష్‌ ముఖి. మా ఆయనది ఢిల్లీ. న్యూయార్క్‌లో స్థిరపడ్డారు. ఇండియా అమ్మాయిని పెండ్లి చేసుకోవాలనే ఇక్కడికి వచ్చారు. మ్యాట్రిమోనియల్‌ సైట్‌లో నా ఫొటో, వివరాలు చూశారట. ఇంటికొచ్చి అమ్మానాన్నతో మాట్లాడారు. నార్త్‌ ఇండియన్స్‌. తెలుగు రాదు. అయినా నన్ను ఎంతో ప్రేమగా చూసుకుంటారు. పెండ్లి కారణంగా, నా కెరీర్‌ ఆగిపోవడం ఆయనకు ఏమాత్రం ఇష్టం లేదు. నన్ను ప్రోత్సహించి మళ్లీ సీరియల్స్‌ చేయమన్నారు. నా కోసమే ఇక్కడ ఉంటున్నారు. ఆన్‌లైన్‌లో బిజినెస్‌ చూసుకుంటున్నారు. అంత మంచి మనిషి జీవిత భాగస్వామి కావడం నా అదృష్టం.

‘యాంకర్‌గా మంచిపేరు, గుర్తింపు తెచ్చుకున్నాను. చాలా సినిమా అవకాశాలూ వచ్చాయి. కానీ సినిమాల్లో హీరోయిన్‌గా చేయడమంటే రొమాన్స్‌ సీన్స్‌లో నటించాలి, వాళ్లు చెప్పిన దుస్తులు వేసుకోవాలి. అవన్నీ నావల్ల కాదనే ఉద్దేశంతో చాలా అవకాశాలు వదులుకున్నాను. ఆ సినిమాల పేర్లు చెబితే ఇప్పుడు ఎవరూ నమ్మరేమో. అలా నా కోసం నేను పెట్టుకున్న నిబంధనల ప్రకారమే ‘తేజం’ అనే ఓ సినిమా చేశా. ఈ చిత్రంలో హీరో క్యారెక్టర్‌ ఉండదు. రొమాన్స్‌ ఉండదు. అందరూ స్నేహితులే. అందుకే సరేనన్నా.’
-ప్రవళిక వేముల

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement