సోమవారం 08 మార్చి 2021
Zindagi - Jan 28, 2021 , 00:54:37

సువ్వీ సువ్వన్నెల్లారా!

సువ్వీ సువ్వన్నెల్లారా!

ఆ పాట.. కోయిలసొంటి పాట.. పల్లెపాట.  ఆ పాట.. పానాదులల్ల సెలయేర్లను పారిస్తది. సింగారి పూల వాసనతో చిలుకల కూత వినిపిస్తది. ప్రకృతినే పరవశింపజేసి పాయిరాల మోత మోగిస్తది. వేణువు చప్పుళ్లకు.. వెండి కడువల్లో పాలు నింపించి.. తేనె పుట్నాల తీపి చూపించే ఆ పాట.. మామిడి మౌనిక పాట!  ‘గడ్డిపూల చెట్లల్ల గవ్వలాట.. మల్లెపూల గట్లల్ల మువ్వలాట’ అంటూ ఆడి పాడించే అచ్చమైన జానపద రవ్వల మూట మౌనిక. 

మామిడి మౌనిక పాట వింటే మట్టితో మనకున్న సుట్టరికం యాదికొస్తది. మట్టిలోన కలిసిపోయేదాక హత్తుకునే బంధాలు యాదికొస్తయి. ఎనకకెల్లి ఎవరో పిలిసినట్ట్టు.. ఎంబడెంబడే నడిసినట్టు.. ఎండల్లో వానలు గొట్టినట్ట్టు అనిపిస్తది. జగిత్యాల ఊరవతలి గట్లల్లా.. ఊడూగూ సెట్లల్లా పాడిన ఆమె పాటలు ఇప్పుడు దేశదేశాన వినిపిస్తున్నయి. పులిసింతా పుట్టలల్లా.. అలిసింతా తోటలల్లా మొదలైన మౌనిక జానపదం  ప్రపంచం మెచ్చిన పల్లెపదంగా ప్రజల గుండెల్లో నిలిచింది. తేట తెలంగాణ జానపదాన్ని సంబురాల సంచిలో మోసుకొచ్చిన మౌనిక పాట సుట్టరికం గురించి ఆమె మాటల్లోనే.. 

నాకు చిన్నప్పటి నుంచే జానపదమంటే ఇష్టం. స్కూల్‌కి వెళ్లేటప్పుడే మస్తు పాడేదాన్ని. నాలుగో తరగతిలో ఉండంగనే పాట పాడిన. ‘మంచిగ పాడినవ్‌. ఎక్కడ నేర్సుకున్నవ్‌?’ అని టీచర్లు అనేటోళ్లు. మాది జగిత్యాల దగ్గర సోమన్‌పల్లి. ఆ ఊర్ల్లో మూడో తరగతి వరకు మాత్రమే ఉన్నా. అటెన్క బుగ్గారం మండలం చిన్నాపూర్‌ వచ్చేసిన. ఇది మా అమ్మమ్మోళ్ల ఊరు. నాకు అమ్మమ్మ అంటే చానా ప్రేమ. అందుకే మూడో తరగతి అయిపోంగనే అమ్మమ్మ దగ్గరికి వచ్చేసి ఇక్కడే ఉంటున్న. అమ్మమ్మతో కలిసి పొలానికి వెళ్లుడు.. ఆసరా అవ్వుడు అలవాటైంది. అమ్మలక్కలు పాడుకునే పల్లె పదాలు నాకు జానపదాలపై ఆసక్తి పెరిగేటట్లు చేసినయి. 


జానపద సంస్కృతి 

అమ్మమ్మతో కలిసి చిన్నప్పటి నుంచి ఉంటున్న కాబట్టి అచ్చ తెలంగాణ పదాలు, మట్టి మనుషుల మాటలు నాకు అర్థమయ్యేవి. జానపద సంస్కృతిలోని కట్టు, బొట్టులో నుంచి నేను బయటకు రాలేకపోయిన. ఒక రకంగా నేను పాటతో ప్రయాణం చేయనీకి ఇవే ప్రధాన కారణాలని చెప్పుకోవచ్చు. నన్ను మనవరాలిగా కాకుండా చిన్న బిడ్డె లెక్క చూసుకుండ్రు అమ్మమ్మ హన్మవ్వ, తాత భూమయ్య. మా చిన్నమామ పేరు భీమన్న. ఆయనకూడా పాటలు పాడేటోడు. మల్లిక్‌ మామయ్య.. భీమ్‌ మామయ్య ఇద్దరూ కలిసి పాటలు పాడుతుంటే నేను గమనిస్తుండేదాన్ని. వీళ్ల పాటలు వింటుంటే మరింత ఆసక్తి పెరిగింది. 

మొదటి పాట 

కుటుంబ పరిస్థితులవల్ల భీమ్‌ మామయ్య పాడటం ఆపేసిండు. తర్వాత గల్ఫ్‌కి వెళ్లిండు. ఆ స్థానాన్ని భర్తీ చేయాలె అనుకున్నా. జానపదాల్ని నిరంతరం అధ్యయనం చేసే మల్లిక్‌ మామయ్యకు నా ఆసక్తి గురించి చెప్పిన. ‘ఓకే నీ ఇష్టం’ అన్నడు. మా నాయినమ్మ కూడా జానపదాలు బాగా పాడేది. ఇవన్నీ నన్ను పల్లె పదాలవైపు మళ్లేలా చేసినయి. అప్పుడు నేను ఆరో తరగతి. స్కూల్లో ఏదో కార్యక్రమానికి.. ‘మౌనికా.. ఓ పాట పాడమ్మా’ అని సూర్యభవానీ మేడం అడిగిండ్రు. మిగతా సమయంలో కామ్‌గా ఉంటగనీ.. పాడమనేసరికి లేచి గంతేసినంత పని చేసేదాన్ని. దోస్తులు ఆశ్చర్యపోయేటోళ్లు.  ఆ రోజు.. ‘దుక్కిదున్నినాడమ్మా సందామామా రైతు.. ’ పాట పాడిన. చప్పట్ల మోతతో స్కూలంతా మార్మోగింది.  

అనుకోని అవకాశం 

ఒకరోజు మల్లిక్‌ మామయ్య.. ‘ఏరా మౌనికా! బాగా పాడుతున్నావ్‌. ఎంవీ మ్యూజిక్‌ తరపున పాట తీద్దామనుకుంటున్నం.. పాడ్తవా మరి?’ అన్నడు. ‘ఇది నిజమేనా?’ అనిపించింది నాకైతే. ఏదో అలా పాడుతున్నగానీ చానెల్‌లో పాడగలనా అనుకున్నా. కానీ మామయ్యే ‘నువ్‌ పాడగలవ్‌' అని ఎంకరేజ్‌ చేసిండు. అలా మొదటగా ‘నేనొస్తా బావో మల్లన్నాపేట.. నీకిస్తాలేవో ఆడి తప్పని మాట’ పాడిన. పాట రిలీజ్‌ అయినంక నా గొంతు విని పరవశించిపోయిన. పాటలో ఇంత కిక్కుంటదా అనిపించింది. నా పాటలు యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉండటం చూసి మరింత ఆనందమైతాంది. 

రాయడమూ వచ్చు 

పాడటం ఒక్కటేనా? రాయడమూ మొదలుపెట్టిన. నా డైరీలో రాసుకున్న పాటలు చాలా ఉన్నయి. కానీ అవన్నీ ఇంకా బైటికి తీస్కరాలేదు. ‘నేనొస్తా బావో’, ‘మనసిచ్చినోడా’ అనే పాటలు రాసిన. చిన్నప్పటి నుంచే నాకో అలవాటు ఉంది. ఏదైనా జానపదం బాగా నచ్చితే డైరీలో రాసి పెట్టుకుంటా. అసొంటివి ఇప్పటిదాంకా 200కు పైగా ఉన్నయి. నేను ఇప్పటివరకు ఇరవై పాటలు పాడిన. పాడటం తక్కువే అయుండొచ్చుగానీ నా పాటలన్నీ ప్రజల మనసు గెలిచినవే. అందరి నోళ్లలో వినిపించేవే. అప్పట్లో ‘నాకు పాడొస్తది. కానీ, ఎట్ల పాడాలె. ఎక్కడ పాడాలె’ అనే చింత ఉండేది. మల్లిక్‌ మామయ్య ఎంకరేజ్‌మెంట్‌ వల్ల ఆ బాధ లేకుండా పోయింది. 

మూలాలను యాది చేస్తది 

జగిత్యాలలోని రామకృష్ణ కాలేజీల నేను బయో టెక్నాలజీ డిగ్రీ చేసిన. స్కూల్‌ నుంచి ఇక్కడిదాంకా వచ్చినా నాలో పాట ధ్యాస అలాగే ఉంది. ‘ఈ జమాన్ల కూడా ఎన్కటి పాటలు పాడ్తవా? ఎన్కటి మనుషుల లెక్క ఉంటవా?’ అంటుంటరు కొంతమంది. స్కూల్‌లో చదువుకునే రోజులల్లనే, ఇలాంటి మాటలు వింటుంటే  చిత్రమనిపించేది. జానపద పాటలు పాడటం అంటే మన మూలాలను గుర్తుచేసుకోవడం. మన సంస్కృతికి జీవం పోయడం. నేను నా మూలాలను మర్చిపోదల్చుకోలేదు. ‘మదనా సుందారీ’.. ‘సువ్వీ సువ్వన్నెల్లారా’ పాటలు నాకు మంచి పేరు తీసుకొచ్చినయి. ‘సువ్వీ సువ్వన్నెల్లారా’ పాటకైతే ఒక్కరోజులోనే మిలియన్‌కు పైగా వ్యూస్‌ వచ్చినయంటే అర్థం చేసుకోవచ్చు, జనాలకు ఎంత రీచ్‌ అవుతున్నాయో నా పాటలు. చిన్నప్పుడే జానపదంతో ప్రయాణం మొదలైంది కాబట్టి , నాకు పాడటం కొత్త కాదు. కానీ షూటింగ్స్‌.. రికార్డింగ్‌.. ప్రమోషన్‌ వర్క్‌ మాత్రం కొత్తే. నాకు చెట్లంటే ప్రాణం. అందుకే నెలకో కొత్త మొక్కయినా నాటుతుంటా. అలా జానపద పాటలు కూడా. నెలకోటి కొత్త పాట పాడుతుంటా.  తాజాగా ‘ఎన్నీల..’ అనే పాట యూట్యూబ్‌లో పెట్టినం. 

ఫోక్‌ ఇండస్ట్రీలో.. ఓ స్థానం 

నేను ఇప్పటికి కూడా మా అమ్మమ్మతో పొలం పని చేస్తా. పొలాల్లోనో, చెరువు కట్టలకాడనో మాత్రమే వినిపించే జానపదం ఇప్పుడు హైటెక్‌ నగరాల్లోనూ హల్‌చల్‌ చేస్తాంది. సినిమా ఆర్టిస్టులను సైతం డ్యాన్స్‌ చేయిస్తాంది. ఏదైనా ఈవెంట్‌కి వెళ్లినప్పుడు.. ‘సెల్ఫీ కావాలి’ అని ఎవరైనా అడుగుతుంటే.. ‘జానపదానికి ఇంత క్రేజ్‌ ఉందా’ అనిపిస్తుంది. అమ్మమ్మ, తాతయ్య అయితే నన్ను టీవీలో చూసి చాలా సంతోషపడుతరు. నా పాటలు చూస్తుంటరు, వింటుంటరు. అప్పుడు వాళ్ల కండ్లల్ల తెలియని ఆనందం.. సంతృప్తి కనిపిస్తయి. సినిమా ఇండస్ట్రీ లెక్క ఫోక్‌ ఇండస్ట్రీ ఎదగాలనేది నా ఆశ. ఆ ఇండస్ట్రీలో నాకంటూ ఓ ప్రత్యేక స్థానం ఉండాలనేది నా కల. 

VIDEOS

logo