ఆసనాల శాసనాలు పాటించకపోతే ఒళ్లు మాట వినకుండా పోతుందని హెచ్చరిస్తున్నారీ కథానాయికలు.భుజంగాసనం మొదలు గోముఖాసనం వరకు నిత్యం యోగాతో మమేకమవ్వడమే గొప్పఅదృష్ట యోగమని చెబుతున్నారు. అందాన్ని హెచ్చిస్తూ, ఆరోగ్యాన్ని రక్షించే
ఆసనాలను ప్రతి ఒక్కరూ సాధన చేయాలని సిఫారసు చేస్తున్నారు. ‘అంతర్జాతీయ యోగా దినోత్సవం’ (జూన్ 21) సందర్భంగా కథానాయికలకు నచ్చిన ఆసనాల సంగతులు వారి మాటల్లోనే..
లాక్డౌన్లో నేను ఆర్యోగంగా ఉండటానికి కారణం యోగా. తొలి సంధ్యవేళలో సూర్య నమస్కారాలు చేయడం నాకు ఇష్టం. ఆ తర్వాతే మిగతా ఆసనాలు. సూర్య నమస్కారాలవల్ల ఎనర్జీ వస్తుంది. మనసుకు ప్రశాంతత చేకూరుతుంది. శారీరక బలం కూడా పెరుగుతుంది. విటమిన్-డి అందుతుంది. శరీరం కాంతిమంతంగా తయారవడానికి ఇదొక ఉత్తమ మార్గం. సూర్య నమస్కారాలతో శరీరం బిగువుగా మారుతుంది.
–శిల్పాశెట్టి
యోగా నా దినచర్యలో భాగం. నిత్యం రకరకాల ఆసనాలు వేస్తుంటాను. అందులో, వీరభద్రాసనం ప్రత్యేకంగా అనిపిస్తుంది. దీనివల్ల శరీరం దృఢంగా తయారవుతుంది. బ్యాలెన్సింగ్ అలవాటు అవుతుంది. ఏకాగ్రత పెరుగుతుంది. పాదాలనుంచి నడుం వరకు బలోపేతం అవుతాయి. ఈ ఆసనంలో ఎంతసేపు ఉండగలిగితే అంత ప్రయోజనం. ఇదే నా గ్లామర్ రహస్యం కూడా!
–పూజా హెగ్డే
యోగాభ్యాసం నా దినచర్యలో భాగం. ముఖ్యంగా సూర్య నమస్కారాలు సహా ఐదు ప్రధాన ఆసనాలు వేస్తుంటాను. శీర్షాసనం, ఊర్ధ ధనురాసనం తప్పక వేస్తాను. ఊర్ధ ధనురాసనం అంత తేలిక కాదు. శరీరాన్ని వెనక్కి విల్లులా వంచడమే ఈ ఆసన ప్రత్యేకత. దీనివల్ల ఊపిరితిత్తుల సామర్థ్యం పెరుగుతుంది. వెన్నెముక బలపడుతుంది, పొత్తికడుపుపై ఒత్తిడి తగ్గుతుంది. థైరాయిడ్ సమస్యలు తగ్గుతాయి. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
–అదితీరావ్ హైదరీ
నాకు అత్యంత ఇష్టమైంది గోముఖాసనం. దీనిని వేయడం అంత తేలిక కాదు. శరీర భాగాలు, కండరాలు కదులుతాయి. నిత్య సాధన వల్ల భుజాలు, వాటి కింది భాగాలు, కండరాలు విస్తరిస్తాయి. రక్తప్రసరణ మెరుగవుతుంది. సాయంత్రాలు యోగా చేయడం నాకు అలవాటు.
–మలైకా అరోరా
శ్వాస, పేగు సంబంధిత వ్యాధులను అదుపులో ఉంచడంలో ఈ ఆసనం చాలా ఉపయోగపడుతుంది. రోజూ వ్యాయామం తర్వాత యోగాసనాలు వేస్తా. వీటిలో నాకు ఇష్టమైంది నటరాజాసనం. పరగడుపున వేయడం వల్ల బ్లాడర్, బౌల్ మూమెంట్ నార్మల్ అవుతుంది. జీర్ణశక్తి పెరుగుతుంది. ఈ ఆసనంతో శరీరం నాజూకుగానూ మారుతుంది.
–తమన్నా
ఈ ఆసనం వేయనిదే నాకు యోగా చేసినట్లే ఉండదు. రోజూ భుజంగాసనం వేయాల్సిందే. దీనివల్ల ఒత్తిడి తగ్గుతుంది. సయాటికా నొప్పిని ఈ ఆసనం ద్వారా దూరం చేసుకోవచ్చు. జీర్ణక్రియ మెరుగవుతుంది. రుతుక్రమ సమస్యలు తగ్గిపోతాయి. వెన్నెముక బలోపేతం అవుతుంది. భుజాలు, ఛాతీ కండరాలు విస్తరిస్తాయి. ఊపిరితిత్తుల సమస్యలకు ఈ ఆసనం ద్వారా చెక్ పెట్టొచ్చు. రోజూ ఉదయం భుజంగాసనంతో పాటు మరికొన్ని ఆసనాలు వేస్తాను. శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకుంటాను.
–రకుల్‌ప్రీత్ సింగ్