e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, June 24, 2021
Home జిందగీ కరోనా VS కరుణ!

కరోనా VS కరుణ!

కరోనా VS కరుణ!

ఒక అమ్మ.. కరోనానుంచి కోలుకొని ఇంటికెళ్లే ముందు గాంధీ హాస్పిటల్‌వైపు చూస్తూ దండం పెట్టింది. ఆ అమ్మకు దవాఖాన గుడిలా అనిపించింది. వైద్యం అందించిన డాక్టర్లు ధన్వంతరి స్వరూపాల్లా..సేవలు చేసిన నర్సులు ముక్కోటి దేవతల్లా కనిపించారు.ఈ ఆరోగ్య సంక్షోభ పరిస్థితుల్లో ప్రాణాలనుసైతం లెక్కచేయకుండా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు నర్సులు. నేడు ప్రపంచ నర్సుల దినోత్సవం సందర్భంగా ఆ కరుణామూర్తులకు నమస్సులతో..
నర్సులు.. తెల్లని నీడలు! అంబులెన్స్‌నుంచి ఐసీయూవరకు వెన్నంటే ఉంటారు. వెనుకడుగు వేయక సేవ చేస్తారు. ప్రాణం మనదే కావచ్చు కానీ, దాన్ని కాపాడే బాధ్యతను వారు తీసుకుంటారు. మనకు విశ్రాంతినిచ్చి వాళ్లు అవిశ్రాంతంగా శ్రమిస్తారు.మనల్ని వీలైనంత త్వరగా డిశ్చార్చి చేసి ఇంటికి పంపేందుకు, తాము మాత్రం కుటుంబాలకు దూరంగా ఉంటారు. మనమీద కరుణతో కరోనాపై పెద్ద యుద్ధమే చేస్తున్నారు.

మూలపుటమ్మ.. నైటింగేల్‌

అది 1853. తన నాయనమ్మకు ఆరోగ్యం బాగా లేదని ఫ్లోరెన్స్‌ నైటింగేల్‌కు తెలిసింది. జర్మనీనుంచి లండన్‌ వచ్చింది. కలరా మహమ్మారి విజృంభించి మరణాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్న సమయం. దవాఖానకు వెళ్లి వైద్యం చేయడానికి డాక్టర్లు భయపడుతున్నారు. నైటింగేల్‌ ఒక అడుగేసింది. ఎక్కడ కలరా రోగులుంటే అక్కడికి వెళ్లి సేవ చేసింది. 1854లో క్రిమియాలో ఘోరయుద్ధం జరిగింది. ఎందరో సైనికుల ప్రాణాలు పోయాయి. ఇంకెందరో గాయపడ్డారు. నర్సులను కూడగట్టి చావు బతుకుల్లో వున్న వేలాదిమంది సైనికులకు వైద్యం చేసింది. అనేక మందిని బతికించింది.
ఇప్పుడు, కరోనా మహమ్మారి.మళ్లీ ఆమె వారసులు కలిసికట్టుగా కదిలారు. ప్రాణాలను సైతం లెక్కచేయకుండా సేవలందిస్తున్నారు. జీవితాలనూ త్యాగం చేస్తున్నారు.

సేవా ‘స్వరూప’ం

‘అమ్మ చాలా జాగ్రత్తగా ఉండేది. ఇరవై ఏండ్లుగా నర్సింగ్‌ వృత్తిలో ఉంది. జహీరాబాద్‌నుంచి ప్రారంభమైన వైద్యసేవా ప్రస్థానం నిలోఫర్‌లో ఇలా ముగుస్తుందని అనుకోలేదు. ఈ విషాదాన్ని తట్టుకోలేక పోతున్నాం. ఎంతోమందిని తన సేవలద్వారా బతికించిన అమ్మ, తన ప్రాణాల్ని కాపాడుకోలేకపోయింది. పొద్దున లేస్తే హాస్పిటల్‌, హాస్పిటల్‌ అని పరుగులు పెట్టేది. ఇప్పుడు మా అమ్మను ఎక్కడని వెతుక్కోవాలి? ఎప్పట్లాగానే, ఆ రోజుకూడా ఉత్సాహంగా డ్యూటీకి వెళ్లింది. రెండు రోజుల తర్వాత డల్‌గా కనిపించింది. పరీక్ష చేయిస్తే ‘పాజిటివ్‌’. టిమ్స్‌కు తీసుకెళ్లాం. ‘ఓ నర్సుగా తాను అంతమంది ప్రాణాలకు భరోసాగా నిలిచినందుకైనా అమ్మ బతుకుతుందని అనుకున్నాం’ అని బాధను పంచుకున్నాడు స్వరూపరాణి కొడుకు సుచిత్‌ కుమార్‌. ఎలాంటి స్వార్థమూ లేని వృత్తి ఇది. డాక్టరు వైద్యం మాత్రమే చేస్తారు. మిగతా సేవలన్నీ పక్కన ఉండి చూసుకునే తల్లి నర్సు మాత్రమే.

నిలువెత్తు మానవత

సంగారెడ్డి ఆసుపత్రిలో గుండా సుజాత హెడ్‌ నర్స్‌. వేలాదిమందికి వైద్యసేవలు అందించింది. డ్యూటీలోనే ఆమెకు కరోనా సోకింది. మూడు రోజులు హాస్పిటల్‌లో చికిత్స తీసుకొంది. విషక్రిమితో పోరాడి మరణించింది సుజాత. భర్త గతేడాది సెప్టెంబర్‌లో చనిపోయాడు. ఒక్కడే కొడుకు. ‘ఇప్పుడు నాన్నలేడు, అమ్మా లేదు. అమ్మ మాకోసం కాకుండా డ్యూటీ కోసమే, ప్రజల కోసమే బతికింది. హాస్పిటల్స్‌లో పరిస్థితుల్ని చెబుతూ జాగ్రత్తగా ఉండమని సూచించేది. అందరికీ మంచి చేయాలనుకొనే అమ్మకే ఇలా కావడం బాధాకరం. తట్టుకోలేకపోతున్నా’ అని ఏడుస్తున్నాడు డిగ్రీ సెకండ్‌ ఇయర్‌ చదివే ఈనేష్‌. ఆపత్కాలంలో హాస్పిటల్‌కు వెళ్లే మనం బాధ్యతగా ప్రవర్తించి ఉంటే, ఇవాళ సుజాత మనతోనే ఉండేది. ‘ఓ రెండు గంటలు మాస్క్‌ పెట్టుకోవడానికే అపసోపాలు పడతామే. వాళ్లు గంటల తరబడి పీపీఈ కిట్‌లో ఎలా ఉంటారు? ఎవరికోసం అదంతా?’ ఆలోచించాల్సింది ప్రజలే.

కాలినడకనే కొండకోనల్లో..

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా రేగులగూడెం సబ్‌ సెంటర్‌లో నర్సుగా పనిచేస్తున్నది కుడుముల జ్ఞానేశ్వరి. బాధ్యతలో భాగంగా ఆమె ఇంటింటికీ తిరిగి జ్వర సర్వే చేస్తున్నది. కోవిడ్‌ లక్షణాలు ఉన్నవాళ్ల పేర్లు నమోదుకే పరిమితం కాకుండా వ్యాధిపట్ల అవగాహన కల్పిస్తున్నది. ఈ సబ్‌సెంటర్‌ కింద నాలుగు ఊర్లు ఉంటాయి. మద్దిమడుగు గ్రామం అడవిలో ఉంటుంది. ఆ ఊరికి వెళ్లాలంటే 8 కి.మీ. కాలినడకనే వెళ్లాలి. వాగులు పారుతుంటాయి. బైక్‌కూడా వెళ్లడానికి అవకాశం లేదు. 13 ఏండ్లుగా ఈ సెంటర్‌లో పనిచేస్తూ ప్రజల మనిషి అయిపోయింది జ్ఞానేశ్వరి. ‘నర్సింగ్‌ వృత్తిలో ఉన్నందుకు నేను గర్విస్తున్నాను. పౌష్టికాహారం, ఆరోగ్యం, బాల్య వివాహాలు, కాన్పులు, కరోనా వంటి విషయాల్లో ఇక్కడి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నా. రాత్రిళ్లుకూడా కాల్స్‌ వస్తుంటాయి. ఆశ వర్కర్లను అప్రమత్తం చేసి ఎవరికీ ఏ సమస్యా రాకుండా చూసుకుంటాం తప్పితే, కోపగించుకోం’ అంటున్నది జ్ఞానేశ్వరి.

వృత్తిపట్ల ప్రేమతో..

హిమాయత్‌నగర్‌కు చెందిన ఉమప్రియ నర్సింగ్‌ కాలేజీలో ఫ్యాకల్టీ. ఇప్పుడు కాలేజీల్లేవు. ఆమెకు జీవితాంతం కూర్చొని తినేంత స్థోమత ఉంది. ‘కానీ జనాలు కరోనా సోకి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుంటే ఇంట్లో టీవీ సీరియల్స్‌ చూస్తూ కూర్చోవాలా? నైటింగేల్‌ నుంచి నేను నేర్చుకున్నది ఇదేనా? కానేకాదు’ అనుకున్నది. ‘కాల్‌ ఆన్‌ డ్యూటీ’లో భాగంగా ఏ హాస్పిటల్‌లో నర్స్‌ సేవలు కావాలని పిలుపు వస్తే, అక్కడికి వెళ్లి కొవిడ్‌ వార్డుల్లో పనిచేస్తున్నది. ‘ఎవరో ఆపదలో ఉంటే మనకేమిటి అనుకోవడం తప్పు. మూడు నాలుగు రోజులు డ్యూటీ చేస్తాను. ఒకరోజు ఇంట్లో రెస్ట్‌ తీసుకుంటాను. ప్రత్యేకంగా ఒక గది ఉంది. డ్యూటీలో ఉన్నప్పుడు పేషెంట్స్‌ పానిక్‌ కాకుండా ఉండేందుకు చాలా ప్రయత్నిస్తున్నా. 65 ఏండ్ల ఓ పెద్దమనిషి డిశ్చార్జ్‌ అయ్యేటప్పుడు కాళ్లు పట్టుకునేందుకు వచ్చిండు. ఏ తల్లి కన్నబిడ్డవో మమ్మల్ని తల్లిలెక్క చూసుకున్నవ్‌ అని అన్నాడు. ఆ మాట చాలదా, నాకు తృప్తినివ్వడానికి’ అంటున్నది ఉమ.
స్వరూప రాణి, సుజాత, ఉమప్రియ, జ్ఞానేశ్వరి.. లాంటివాళ్లు కరోనానుంచి ప్రజలను కాపాడేందుకు అనుక్షణం పోరాడుతున్నారు. వారి ప్రాణాలను పణంగా పెడుతున్నారు. ఈ సమయంలో కొందరి నిర్లక్ష్యం వారికి శాపం కావద్దు. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ అందరూ బాధ్యతగా ఉంటేనే, వాళ్లు భద్రంగా ఉంటారు. నర్సింగ్‌ వృత్తిలో ఉంటూ కరోనా వార్డుల్లో సేవలు అందిస్తున్న వేలాదిమంది నర్సులకు ‘ప్రపంచ నర్సుల దినోత్సవం’ సందర్భంగా శుభాకాంక్షలు చెబుదాం. నర్సమ్మలూ మీరంతా సల్లం గుండాలె..!

దాయి శ్రీశైలం

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
కరోనా VS కరుణ!

ట్రెండింగ్‌

Advertisement