e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, May 6, 2021
Home జిందగీ నాన్నను చూసి డాక్టరయ్యా!

నాన్నను చూసి డాక్టరయ్యా!

నాన్నను చూసి డాక్టరయ్యా!

ఒక్క మత్తు సూదీ, చిన్న కత్తిగాటుతో పురిటి గండం తప్పించుకుంటే ఆ కష్టం స్త్రీని జీవితాంతం వెంటాడుతుందని అంటారు డాక్టర్‌ ఎవిటా ఫెర్నాండెజ్‌. నార్మల్‌ డెలివరీ అంటే గగనం అనుకుంటున్న ఈ రోజుల్లో సాధారణ ప్రసవాలను ప్రోత్సహిస్తున్నారామె. ప్రత్యేక సందర్భాల్లో మినహా పెద్దాపరేషన్‌ మాటే ఉండదు. తల్లిదండ్రుల స్ఫూర్తితో వైద్యురాలయ్యారు. 70 ఏండ్ల కిందట వారు ప్రారంభించిన ఫెర్నాండెజ్‌ హాస్పిటల్స్‌ బాధ్యతలను 36 ఏండ్లుగా సమర్థంగా నిర్వహిస్తున్నారు. పెండ్లి చేసుకోకుండా వృత్తికే అంకితమయ్యారు. మహిళా సాధికారత, మహిళల ఆరోగ్య సంరక్షణ, సాధారణ ప్రసూతి తదితర అంశాల్లో అందించిన సేవలకుగానూ ఇటీవల 29వ యుధ్‌వీర్‌ స్మారక పురస్కారాన్ని ఆన్‌లైన్‌లో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సమక్షంలో అందుకున్నారు. ఈ సందర్భంగా ఫెర్నాండెజ్‌ ఫౌండేషన్‌ చైర్‌పర్సన్‌ డాక్టర్‌ ఎవిటా ఫెర్నాండెజ్‌ను ‘జిందగీ’ పలకరించింది. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే..

మేమే కాదు మా అమ్మానాన్నలు పుట్టి, పెరిగిందంతా హైదరాబాద్‌లోనే. మా తాతలు ఎప్పుడో గోవా నుంచి వచ్చి స్థిరపడ్డారు. నాన్న లెస్లీ ఫెర్నాండెజ్‌ మల్టీటాలెంటెడ్‌. ఆయన ఫిజీషియన్‌, పెయింటర్‌, సోషల్‌ వర్కర్‌. అమ్మ లార్డ్స్‌ ఫెర్నాండెజ్‌ గైనకాలజిస్ట్‌. మా తల్లిదండ్రులకు నలుగురం సంతానం. అన్నయ్యతోపాటు ముగ్గురం ఆడపిల్లలం. నాన్నకు మెడిసిన్‌ చేయాలని బాగా కోరిక. కాకపోతే ఆయనను పెద్ద చదువులు చదివించేంత స్తోమత మా తాతయ్య వాళ్లకు ఉండేది కాదట. అందుకే పెండ్లయ్యాక, మేము నలుగురం పుట్టాక తన 40 ఏండ్ల వయసులో మెడికల్‌ డిప్లొమా చేసి, డాక్టర్‌గా లైసెన్స్‌ సంపాదించారు నాన్న. మేము స్కూల్‌ నుంచి వచ్చేసరికి నాన్న పుస్తకాలు ముందేసుకొని ఉండేవారు. అమ్మ ఏమో టీచర్‌లా నాన్నను ప్రశ్నలు అడుగుతూ ఉండేది. మాకు ఇదంతా చిన్నప్పుడు అర్థమయ్యేది కాదు. కానీ, కాస్త పెద్దయ్యాక నాన్నను చూసి చాలా గర్వపడేవాళ్లం. తన స్ఫూర్తితోనే డాక్టర్‌ అవ్వాలని ఎనిమిదేండ్ల వయసులోనే నేను నిశ్చయించుకున్నాను.

ఇంట్లో ఇద్దరూ డాక్టర్లే..

అమ్మానాన్నలు బొగ్గులకుంటలో ఉండేవారు. కొన్నిరోజులకే ఆ ఇంటిదగ్గరే నాన్న ప్రోత్సాహంతో అమ్మ 1948లో ఒక క్లినిక్‌ ప్రారంభించింది. తర్వాత ఇద్దరూ కలిసి ఆ క్లినిక్‌ ఉన్న ప్రాంతంలో ఇప్పుడున్న భవనానికి పునాది వేశారు. ఆనాటి నుంచి ఈ రోజు వరకు మా హాస్పిటల్‌ విలువలతోనే నడుస్తున్నది. పేరుకు ప్రైవేట్‌ లిమిటెడ్‌ అయినా దాన్నెప్పుడూ నేను ప్రాఫిటబుల్‌ ఆర్గనైజేషన్‌గా చూడలేదు, చూడను కూడా. ఇప్పటికీ నేను అందరిలా జీతం మాత్రమే తీసుకుంటాను. ఒక్క రూపాయి కూడా ఎక్కువగా తీసుకోను. నాకు అమ్మానాన్న ఆదర్శం. అమ్మ ప్రతిరోజూ తన దగ్గరికి వైద్యం కోసం వచ్చిన రోగులు, అప్పుడే పుట్టిన పిల్లల గురించి చెబుతుండేది. అమ్మకు వైద్యవృత్తి అంటే అమితమైన ప్రేమ. ఎప్పుడూ పేషెంట్ల గురించే ఆలోచిస్తూ ఉండేది. నాన్న కూడా ఎంతగానో ప్రోత్సహించేవారు. నాకు తొమ్మిది నెలలు ఉన్నప్పుడు పీజీ చదవడానికి అమ్మను ఐర్లాండ్‌ పంపించారు నాన్న. నెలల పసిపాపను నాన్నే కంటికి రెప్పలా చూసుకున్నారు. చిన్నప్పుడు మాకు ఎలాంటి లోటు ఉండేది కాదు. రోజంతా అమ్మానాన్నలు బిజీగా ఉన్నా, రాత్రిళ్లు మాత్రం అందరం కలిసే భోజనం చేసేవాళ్లం.

నాలుగు గోడలు దాటి

పదహారేండ్లప్పుడు నాకు జీవితంపై కచ్చితమైన అవగాహన వచ్చింది. అప్పుడే ప్రసూతి వైద్యురాలినవ్వాలని నిర్ణయించుకున్నాను. కాన్పు పోయడంలో నిష్ణాతురాలుగా మారాలనుకున్నాను. అమ్మలా గైనకాలజిస్ట్‌ కాకుండా ఆబ్‌స్టట్రీషియన్‌ అయ్యాను. హైదరాబాద్‌లోని సెయింట్‌ ఆన్స్‌లో నా స్కూలింగ్‌ పూర్తయింది. తర్వాత ఇక్కడే మెడిసిన్‌ చేద్దామనుకున్నాను. కానీ, అదే సమయంలో 1969 తెలంగాణ ఉద్యమం ఊపందుకున్నది. కాలేజీలన్నీ మూతపడ్డాయి. దాంతో బెంగళూరులోని సెయింట్‌ జాన్స్‌ మెడికల్‌ కాలేజీలో చేరాను. మా కాలేజీలో విదేశీ విద్యార్థులూ ఉండేవాళ్లు. అందరితో కలివిడిగా ఉండటంతో రకరకాల భాషలు, ఆచారాలు, సంస్కృతి, సంప్రదాయాలపై గౌరవం పెరిగింది. హైదరాబాద్‌ వచ్చి గాంధీ మెడికల్‌ కాలేజీలో పీజీ చేశాను. ఆ తర్వాత అమ్మానాన్న కొన్నాళ్లు బయటి ప్రపంచాన్ని చూసి రమ్మన్నారు. ‘నీ వృత్తిలో నువ్వు సార్థకత సంపాదించాలంటే, నాలుగు గోడల మధ్య ఉంటే సరిపోదు. ప్రపంచంలోని అన్ని కోణాలూ తెలుసుకోవాలి’ అన్నారు నాన్న. అప్పుడు యూకే వెళ్లి రాయల్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఆబ్‌స్టట్రీషియన్‌ మెంబర్‌గా ఎంపికయ్యాను. సరిగ్గా పన్నెండు నెలలు బ్రిటిష్‌ హాస్పిటల్‌లో పనిచేసి, పరీక్ష పాసై ఇండియాకు వచ్చాను. ఆ ఏడాది కాలంలో నేను మెడికల్‌ నాలెడ్జ్‌ మాత్రమే కాదు, ఒక కాబోయే తల్లి వాళ్ల కుటుంబంతో ఎలా కమ్యూనికేట్‌ చేయాలన్న విషయం నుంచి వర్క్‌ మేనేజ్‌మెంట్‌ వరకు పూర్తిగా తెలుసుకున్నాను.

అనుకోకుండా బాధ్యతలు

స్వదేశానికి నేనొక విజన్‌తో తిరిగొచ్చాను. బాలింతకు, పుట్టిన బిడ్డకు ఏ సమస్య ఉన్నా వారికి ఒకేచోట పూర్తి వైద్యం అందాలన్నది నా ఆశ. గర్భవతిగా వచ్చింది మొదలు పండంటి బిడ్డకు జన్మనిచ్చే వరకు అన్ని సేవలు ఒకేచోట అందించాలన్న నా విజన్‌ని ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వచ్చాను. డాక్టర్‌ చదువు పూర్తికాగానే అందరికీ నాలా రెడీగా హాస్పిటల్‌ ఉండదు. ఈ విషయంలో నేను చాలా అదృష్టవంతురాలిని. 1984లో మా అమ్మ దగ్గరే పని చేయడం మొదలుపెట్టాను. మెలకువలూ నేర్చుకున్నా. కొన్నాళ్లకు మా కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. 1985లో అమెరికాలో ఉంటున్న మా అన్నయ్య తన 36 ఏండ్ల వయసులో మెదడులో రక్తస్రావం జరగడం వల్ల చనిపోయాడు. అప్పటికి మా అన్నయ్యకు ఇద్దరు కొడుకులు. అంతేకాదు, అప్పుడు వదిన మూడో బిడ్డను కడుపులో మోస్తున్నది. ఇదంతా మా ఫ్యామిలీకి పెద్ద షాక్‌. ఆ సమయంలో అమ్మానాన్నలను కంటికి రెప్పలా చూసుకున్నాం. అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో నేను ఫెర్నాండెజ్‌ హాస్పిటల్‌ పూర్తి బాధ్యతలను చేపట్టాను. అప్పట్నించి ఇప్పటివరకు నేను హాస్పిటల్‌కి సంబంధించి ఏ విషయంలోనూ కాంప్రమైజ్‌ కాలేదు.

కొన్నేండ్లుగా సాధారణ కాన్పుల కంటే సిజేరియన్‌ కాన్పులే ఎక్కువయ్యాయి. వీటి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతున్నది. వాస్తవానికి చాలామందిలో సాధారణ కాన్పుకే ఎక్కువ అవకాశం ఉంటుంది. తక్కువ కేసుల్లో మాత్రమే కాంప్లికేషన్లను బట్టి సిజేరియన్‌ చేయాల్సి వస్తుంది. ఈ విషయంపై మా వంతు బాధ్యతగా ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తూనే ఉన్నాం. మా దవాఖానలో అనవసరమైన టెస్టులు, స్కానింగ్‌లు చేయం. ఏ సమయానికి ఏది అవసరమో అదే చేస్తాం. మా టీమ్‌ మొత్తం ఒకే తాటిపై నిలబడతాం. మా ఫెర్నాండెజ్‌ హాస్పిటల్‌ ఫౌండేషన్‌ తరఫున ఎంతో మంది మిడ్‌వైవ్స్‌, నర్సులకు ట్రైనింగ్‌ ఇస్తుంటాం. ఎందుకంటే కాన్పు సమయంలో ముఖ్య పాత్ర పోషించేది వాళ్లే. అత్యంత అరుదైన కేసుల్లో మినహా మా దవాఖానల్లో దాదాపు అన్నీ నార్మల్‌ డెలివరీలే అవుతాయి. సాధారణ కాన్పు కన్నా గొప్పవరం తల్లికి ఏముంటుంది. బిడ్డను కంటికి రెప్పలా చూసుకునే తల్లి బాగుంటేనే కదా.. పుట్టిన బిడ్డకు మంచి జరుగుతుంది!

అమ్మ నా రోల్‌ మోడల్‌!

అమ్మ 24 గంటలూ పేషెంట్లు, డెలివరీల గురించే ఆలోచించేది. నేను హాస్పిటల్‌ బాధ్యతలు చేపట్టాక కూడా అమ్మ ప్రతి సోమవారం వచ్చి పేషెంట్లను చూసేది. అలా 83 ఏండ్ల వయసులో ఒకరోజు అమ్మ నాకు ఫోన్‌ చేసి, ‘రిటైర్‌ అవ్వాలనుకుంటున్నాన’ని చెప్పింది. నేను సంతోషంగా విశ్రాంతి తీసుకోమని చెప్పాను. అయితే తనకు మెంటల్‌గా బిజీగా ఉండటమంటే ఇష్టం. ఒకరోజు కంప్యూటర్‌ క్లాసులో చేర్పించమని అడిగింది. 2000 సంవత్సరంలో అమీర్‌పేట్‌లోని ఒక కంప్యూటర్‌ ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్‌ అయింది. ఆ వయసులోనూ చాలా చురుగ్గా క్లాసులకు వెళ్లి, ట్రైనింగ్‌తో పాటు సర్టిఫికెట్‌ సంపాదించింది. మనవళ్లు, మనవరాళ్లతో చాట్‌ చేస్తూ హ్యాపీగా, బిజీగా ఉండేది. నిజానికి అమ్మకు మనోధైర్యం చాలా ఎక్కువ.

… నిఖిత నెల్లుట్ల

Advertisement
నాన్నను చూసి డాక్టరయ్యా!
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement