శనివారం 04 జూలై 2020
Zindagi - Jun 06, 2020 , 17:05:53

పాత ప్లాస్టిక్‌ బాటిల్స్‌ను సరికొత్తగా మార్చేద్దాం

పాత ప్లాస్టిక్‌ బాటిల్స్‌ను సరికొత్తగా మార్చేద్దాం

ఉదయం లేచినప్పటి నుంచి నిద్రపోయేంత వరకు. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ ఉపయోగించేది ప్లాస్టిక్‌. ఇది పర్యావరణానికి హాని కలిగిస్తాయని తెలిసినా వాడుతూనే ఉన్నాం. అవసరం తీరాక ప్లాస్టిక్‌ బాటిల్స్‌ను పడేస్తున్నారు. ఇకపై అలా చేయకుండా ఇంటి అవసరాలకు ఉపయోగపడేలా మార్చుకోండి. ఎలా అంటే కింద చిట్కాలు చదవండి.

పెన్‌ హోల్డర్‌ : కరెంట్‌ బిల్‌, పేపర్‌ బిల్‌ వచ్చినప్పుడు సంతకం చేయడానికి పెన్‌ తప్పనిసరి. అవసరానికి పెన్‌ కూడా కనిపించదు. లోపల బయట అంతా గిర్రున తిరుగుతుంటాం కాని పెన్‌ మాత్రం కనిపించదు. అందుకే కూల్‌డ్రింక్‌ పెట్ బాటిల్స్‌ను మంచి షేపులో కట్‌ చేసి పెన్‌ హోల్డర్‌గా మార్చి ఒక ప్రదేశంలో అమర్చండి. ఇలా చేయడం వల్ల అవసరమైనప్పుడు వెంటనే అక్కడికి వెళ్లి తీసుకోవచ్చు. 

స్నాక్స్‌ బాక్స్‌ :

కిచెన్‌లో ఎన్ని వస్తువులు ఉన్నా అవసరానికి ఒక డబ్బా కూడా ఖాళీగా కనిపించదు. అందుకే పికిల్స్‌, ఐస్‌క్రీమ్స్‌లాంటి పెద్ద ప్లాస్టిక్‌ డబ్బాలు ఉన్నప్పుడు వాటిని పడేయకుండా శుభ్రపరిచి పెట్టుకుంటే అవసరమైనప్పుడు న్నాక్స్‌ స్టోర్‌ చేసి పెట్టుకోవచ్చు.

మట్టి కుండీలు :

కూల్‌డ్రింక్‌, వాటర్‌ బాటిల్స్‌ ఇంట్లో దండిగా ఉంటాయి. వాటిని పడేయకుండా మూతి భాగంలో సన్నగా పిల్లి చెవులుగా కట్‌ చేసుకోండి. ఇప్పుడు బాటిల్‌కు పెయింట్‌ వేయండి. అలాగే చెవులకు కూడా. ఇప్పుడు బాటిల్‌కు పెయింట్‌తో కళ్లు, మూతి, పెదాలు వేసి అందంగా తీర్చిదిద్దండి. ఇప్పుడు ఇందులో మట్టివేసి చిన్న మొక్కలు పెంచుకుంటే ఇంటికే అందం చేకూరుతుంది.

వాటర్‌క్యాన్‌లా..

మొక్కలకు నీళ్లు జగ్గుతో పోసేకంటే వాటర్‌క్యాన్‌తో పోయడం మంచిది. ఇది లేనప్పుడు ఇంట్లో ఉండే ఖాళీ డిటర్జెంట్‌ డబ్బాలను శుభ్రంగా కడిగి దాని మూతకి చిన్న రంధ్రాలు చేసి వాటర్‌ క్యాన్‌లా వాడుకోవచ్చు. అయితే దీని మీదున్న చిన్న లేబుల్‌ని తీసేయడం మాత్రం మరిచిపోకండి. లేదంటే డిటర్జెంట్‌ వల్ల మొక్కలు చనిపోయే ప్రమాదం ఉంది.

ఛార్జింగ్‌ డాక్‌ :

డైలీ వాడే లోషన్‌ బాటిల్స్‌, షాంపూ బాటిల్స్‌ను మంచి షేపులో కట్‌ చేసి సాకెట్‌ దగ్గర అమర్చండి. చార్జింగ్‌ పెట్టేటప్పుడు ఫోన్‌ను ఈ బాటిల్‌లో పెట్టుకుంటే సరిపోతుంది. ఈ బాటిల్‌ను నచ్చిన రీతిలో కలర్స్‌ వేసుకుంటే కలర్‌ఫుల్‌గా ఉంటుంది. అంతేకాదు ఇంటికి కూడా మంచి లుక్‌ వస్తుంది.

పెయింటింగ్‌ :

పిల్లల్లో సృజనాత్మకతను పెంపొందించాలంటే ఇంట్లో ఉన్న ప్లాస్టిక్‌ డబ్బాలన్నీ ముందు పెట్టాలి. దీనితోపాటు కలర్స్‌ కూడా ఇవ్వండి. ఇక వారి ఇష్టానికి వదిలేయండి. గొప్ప గొప్ప అర్టిస్టులు మీ ఇంట్లోనే ఉన్నారని అర్థమవుతుంది.


logo