సినిమాల్లోనూ నిరూపించుకుంటా..!

చదివింది ఎంబీఏ.. చేస్తున్నది బ్యాంకు ఉద్యోగం. టంచనుగా అకౌంట్లోకి వచ్చిపడే జీతం. సంతృప్తికరమైన జీవితం. ఇవేవీ అతడిని మెప్పించలేకపోయాయి. లోలోపల ఉన్న నటుడిని బయటకు రాకుండా ఆపలేకపోయాయి. తన నటనతో ప్రేక్షకులకు దగ్గరవ్వాలనే ఒకే ఒక కోరికతో.. అన్నిటినీ వదిలేశాడు.హైదరాబాద్ బస్సు ఎక్కేశాడు. నటుడయ్యాడు, ఇప్పుడు నిర్మాతగా మారాడు. వరుస సీరియల్స్‌తో బుల్లితెర ప్రేక్షకులకు చిరపరిచితుడైన కల్కీ రాజా ప్రయాణంలో ఎన్నో పదనిసలున్నాయి. ఆ సంగతులన్నీ ‘జిందగీ’తో పంచుకున్నాడు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే..
నటుడవ్వాలన్నది నా కల. చదువుకునే రోజుల్లోనే డిసైడ్ అయ్యాను. అనుకున్నది సాధించిన తర్వాత గానీ, మనసుకు తృప్తి కలుగలేదు. మాది తూర్పుగోదావరి జిల్లా పాసర్లపూడి లంక. నాన్న కొబ్బరి వ్యాపారి. అమ్మ గృహిణి. ఆంధ్రా యూనివర్సిటీలో ఎంబీఏ పూర్తిచేశా. బ్యాంకులో ఉద్యోగం వచ్చింది. ఇంట్లో వాళ్లు హ్యాపీ. నాకు మాత్రం ఏదో వెలితి. జీవితం ఏ చీకూచింతా లేకుండా సాగిపోతున్నా.. నేను కోరుకున్నట్టుగా లేదనిపించేది. కాలేజీ రోజుల్లో స్టేజ్ షోల్లో నటించేవాణ్ని. అప్పుడంతా నన్ను తెగ మెచ్చుకునేవారు. మనసు ఉప్పొంగేది. ఏదో సాధించిన అనుభూతి కలిగేది. ఉద్యోగం చేస్తున్న రోజుల్లో ఎప్పుడూ అలా అనిపించేది కాదు. ‘ఉదయాన్నే వెళ్లడం, సాయంత్రం ఇంటికి రావడం.. ఇంతేనా జీవితమంటే?’ అని ప్రశ్నించుకున్నా. ఉద్యోగం ఏడాదైనా చేయకుండానే వదిలేశా. హైదరాబాద్ బస్సు ఎక్కేశా.
రెండు నెలలు తిరక్కుండానే..
భాగ్యనగరిలో నా భాగ్యాన్ని పరీక్షించుకుందామని ఫిక్సయ్యా. నటనలో ఆరు నెలల శిక్షణ కోసం దేవదాసు కనకాల గారి యాక్టింగ్ స్కూల్లో చేరా. రెండు నెలలు తిరక్కుండానే ఓ సీరియల్లో హీరోగా అవకాశం వచ్చింది. మా నాన్నగారికి తెలిసిన జయరాంగారు అప్పుడు జెమినిలో ‘చి.ల.సౌ. స్రవంతి’ సీరియల్ కో-డైరెక్టర్‌గా ఉన్నారు. ‘మా అబ్బాయి యాక్టింగ్ స్కూల్లో శిక్షణ తీసుకుంటున్నాడ’ని నాన్నగారు ఆయనతో చెప్పారట. ‘ముంబయి బేస్డ్ బోనీ-జైన్ ప్రొడక్షన్ వాళ్లు, మా టీవీతో చేస్తున్న ఓ ప్రాజెక్ట్‌లో హీరో కోసం వెతుకుతున్నార’ని ఆయన నాన్నతో చెప్పారట. విషయం తెలిసి ఓసారి ప్రయత్నిద్దామని ఆడిషన్స్‌కు వెళ్లా. వాళ్లిచ్చిన డైలాగ్స్‌ని వెంటనే చెప్పేశా. అనుకోకుండా ఆ హీరో అవకాశం నాకే దక్కింది. అలా మా టీవీ ‘క్రాంతి’ సీరియల్‌తో 2010లో బుల్లితెర హీరోనయ్యా. స్టార్‌ప్లస్ చానల్లో సీరియల్స్ తీసిన జర్బాజ్ఖాన్ దీనికి దర్శకుడు.
ఆరంభంలోనే హీరోగా అవకాశం
అవకాశం అయితే వచ్చింది కానీ, ఇంకా రెండు నెలల శిక్షణ కూడా పూర్తవ్వలేదు, నేను చేయగలనా అనిపించింది. ఏం చెయ్యాలో పాలుపోలేదు. శిక్షణ పూర్తి చేయడమా.. సీరియల్‌కి ఓకే చెప్పి ధైర్యంగా ముందడుగు వేయడమా..? నా మనసు రెండోదానికే ఓటేసింది. గురువుగారు దేవదాసు కనకాల శిక్షణ పూర్తిచేయమని సలహా ఇచ్చారు. అవకాశాలు వస్తూనే ఉంటాయి.. ముందు శిక్షణ పూర్తిచేయమన్నారు. కానీ వచ్చిన అవకాశం వదులుకోవాలనిపించలేదు. ఒకవేళ వాళ్లు వద్దంటే వచ్చి శిక్షణ పూర్తి చేస్తానని చెప్పి కెమెరా ముందుకెళ్లా. కొన్నాళ్లు నన్ను, నా నటనను పరిశీలించిన తర్వాత వాళ్లు ఓకే చెప్పారు. శిక్షణ పూర్తవ్వకుండానే హీరోనయ్యా. మా టీవీతో మొదలైన నా ప్రయాణం తర్వాత అన్ని చానల్స్‌లో సాగింది. జెమినిలో ‘మమతల కోవెల’, ఈ టీవీలో ‘పుత్తడి బొమ్మ’, ‘స్వాతి చినుకులు’ ‘నాపేరు మీనాక్షి’, మా టీవీలో ‘కుంకుమ పువ్వు’, ‘కొంగుముడి’, జీ తెలుగులో ‘చిన్నకోడలు’, ‘ముద్దుబిడ’్డ చేశా. ఇప్పుడు ‘గుండమ్మ కథ’లో హీరోగా చేస్తున్నా. జీ తెలుగులో ‘నాగభైరవి’లో రెండు వేరియేషన్స్ ఉన్న పాత్ర చేస్తూనే నా ఫ్రెండ్ ‘ముద్దమందారం’ ఫేమ్ పవన్సాయితో కలిసి ఆ సీరియల్ నిర్మాణ బాధ్యతలు కూడా చూసుకుంటున్నా.
సినిమాల కోసం రెండేండ్లు
సీరియల్స్ చేస్తూనే సినిమా అవకాశాలు వచ్చినప్పుడు వాటిలోనూ నటించా. ఇప్పటివరకూ 15 నుంచి 20 సినిమాల్లో చిన్నచిన్న పాత్రలు పోషించా. ‘మాయామాల్' సినిమాలో మెయిన్ విలన్‌గా నటించా. హీరో శ్రీకాంత్‌గారి ‘మల్లిగాడు మ్యారేజ్ బ్యూరో’లో సెకండ్ లీడ్ పాత్రలో నటించా. నాలుగేండ్ల క్రితం ‘కృష్ణుడికి వారసుడు’ అనే టైటిల్‌తో హీరోగా సినిమా ప్రారంభించాం. దాదాపు 60 శాతం షూటింగ్ కూడా పూర్తయింది. కానీ పెద్దనోట్ల రద్దుతో అంతా తలకిందులైంది. మంచి సబ్జెక్ట్, గ్రాఫిక్స్ బేస్డ్ సినిమా! కానీ, డీ మానిటైజేషన్‌తో ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. సినిమాల్లో మంచి పాత్రల కోసం ప్రయత్నిస్తూ దాదాపు రెండేండ్లు సీరియల్స్‌కి దూరమయ్యా. సినిమాల్లో ప్రయత్నిస్తూ చేతిలో ఉన్న సీరియల్స్‌ని వదులుకోవడం కరెక్ట్ కాదనిపించి మళ్లీ బుల్లితెరపై దృష్టిపెట్టా. ఇంకో పదేండ్ల తర్వాతైనా సినిమాల్లో మంచి ఆర్టిస్ట్‌గా ఎదిగే అవకాశం ఉంటుంది. దానికోసం ఇప్పుడు కెరీర్‌ని పాడుచేసుకోవద్దని చాలామంది సూచించారు. ఆ రెండేండ్ల గ్యాప్‌లో చాలామంది పెద్దపెద్ద డైరెక్టర్లు, ఆర్టిస్ట్‌లతో పరిచయం ఏర్పడింది. ఎప్పటికైనా సినిమాల్లోనూ మంచి పాత్రలు చేస్తాననే నమ్మకం ఉంది.
నమ్మినవాళ్లని చూసుకోవాలి
సమాజానికి ఏదైనా చేయాలనే కోరిక ఉంది. నాకు తోచినంత మేరకు అవసరం ఉన్న వాళ్లకి సాయం చేస్తూనే ఉంటా. నన్ను నమ్ముకున్నవాళ్లను చూసుకోవడం నా బాధ్యత అని నమ్ముతాను. నలుగురూ గుర్తించేలా సమాజానికేదైనా చేయాలనే ఆశ ఉంది. అవసరంలో ఉన్నవాళ్లకి సాయం చేయడంలో ఉండే ఆనందం ఇంక దేంట్లోనూ దొరకదు. అప్పుడప్పుడు చిన్నచిన్న సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నా. సాయం చేసేది ఆత్మసంతృప్తి కోసమేగాని పేరుకోసం కాదు. మంచి స్థాయికి చేరుకుని నలుగురికీ సాయపడాలన్నదే నా ఆశయం.
ప్రొడక్షన్ వైపు..
ప్రొడ్యూసర్‌గా మారాలనేది ఇప్పటికిప్పుడు తీసుకున్న నిర్ణయం కాదు. నా స్నేహితుడు పవన్‌సాయి, నేను ఏదైనా మంచి ప్రాజెక్ట్ చేద్దామని చాలా ప్రయత్నించాం. దాదాపు ఐదేండ్ల నుంచి ఎన్నో కథలు విన్నాం. జీ తెలుగులో ప్రసారం అవుతున్న ‘నాగభైరవి’తో అది నెరవేరింది. కంప్యూటర్ గ్రాఫిక్స్ బేస్డ్ సీరియల్ ఇది. మంచి రేటింగ్ సాధిస్తున్నది. మా ప్రొడక్షన్ హౌస్ బాధ్యతలు నా తరఫున నా భార్య సత్యవేణి చూసుకుంటుంది. తను నా ఎంబీఏ క్లాస్మేట్. మాది పెద్దలు ఒప్పుకున్న ప్రేమ వివాహం. మేము ప్రొడక్షన్ స్టార్ట్ చేయకముందు తను సాఫ్ట్వేర్కంపెనీలో హెచ్ఆర్ మేనేజర్‌గా పనిచేసేది. తన ఉద్యోగాన్ని సైతం కాదనుకొని ప్రొడక్షన్ పనులు చూసుకుంటూ నన్ను సపోర్ట్ చేస్తున్నది.
నాగబాబుగారు హెచ్చరించారు..
నాకు ఇండస్ట్రీలో నాగబాబు గారు గాడ్‌ఫాదర్. సినిమాల కోసం రెండేండ్ల గ్యాప్ తీసుకున్నప్పుడు చేతిలో ఉన్న సీరియల్స్‌ను వదులుకోవద్దని నన్ను హెచ్చరించారు. సినిమాలు వస్తే చేద్దువుగానీ అప్పటివరకు సీరియల్స్ మానొద్దని మందలించారు. సినిమాలా..సీరియల్సా? అనే సందిగ్ధంలో ఉన్నప్పుడు క్లారిటీ ఇచ్చి కెరీర్ దెబ్బతినకుండా కాపాడింది ఆయనే. ఈ రోజు నేనీ స్థాయిలో ఉన్నానంటే దానికి కారణం నాగబాబుగారే. నన్ను ప్రొడక్షన్‌పై దృష్టిపెట్టమని సలహా ఇచ్చింది కూడా ఆయనే. నాలో ఉన్న నెగెటివ్ ఆలోచనలన్నీ ఆయన మాటలతోనే పటాపంచలయ్యాయి. నాకు గైడ్, వెల్విషర్ నాగబాబుగారే.
తాజావార్తలు
- 'శివమొగ్గ పేలుడులో ఆరుగురు మృతి'
- ముత్తూట్ ఫైనాన్స్ చోరీ గుట్టురట్టు:
- ఆకట్టుకుంటున్న అరుదైన తెల్లని కంగారు పిల్ల
- హౌరాలో తృణమూల్xబీజేపీ ఘర్షణ, పలువురికి గాయాలు
- బర్డ్ ఫ్లూతో భయాందోళనలు వద్దు
- పార్లమెంట్ నార్త్‌బ్లాక్‌లో హల్వా వేడుక
- ఆండర్సన్ అరుదైన రికార్డు
- వీఐపీలా ఫోజిచ్చి రూ 1.43 లక్షలకు టోకరా
- స్టాలిన్ అసమర్థ నాయకుడు: పళనిస్వామి
- జమ్ముకశ్మీర్‌లో హైస్పీడ్ ఇంటర్నెట్పై నిషేధం పొడిగింపు