e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, June 13, 2021
Home జిందగీ దారాల హారాలు

దారాల హారాలు

దారాల హారాలు

ఫ్యాషన్‌ ప్రపంచంలో ఈరోజు ఉన్న ట్రెండ్‌ రేపు వుండదు. బంగారం, వెండి, ప్లాటినం నగలే ఒకప్పుడు ఫ్యాషన్‌. ఎంత ఖరీదైన ఆభరణం వేసుకుంటే అంత క్రేజ్‌. కానీ, ఇప్పుడు అందానికి, అలంకరణకు నిర్వచనం మారిపోయింది. ఖరీదుతో పని లేకుండా, ఆకర్షణీయంగా కనిపించే నగలవైపు మొగ్గు చూపుతున్నారు మహిళలు. అందుకే, సిల్క్‌ త్రెడ్‌ జువెలరీపై మనసు పడుతున్నారు. ఆ దారాల హారాల హంగులేంటో చూద్దాం.

కాలంతోపాటే ఫ్యాషన్లూ పరిగెడుతుంటాయి. కొన్నిసార్లు పాతవే కొత్త హంగులు దిద్దుకొని అలరిస్తాయి. అదే వరుసలో ఇప్పుడు నగల ప్రపంచంలో ‘త్రెడ్‌ జువెలరీ’ సందడి చేస్తున్నది. దారాల డిజైన్లు ఎప్పటి నుంచో ఉన్నవే! కానీ, అవే దారాలతో నగలు రూపొందిస్తున్నారు. సిల్క్‌ త్రెడ్‌ నగలు పసిడి నగలను తోసిరాజని అతివలకు వల విసురుతున్నాయి.

మ్యాచింగే ముందు

దారాల హారాలు

నగ నిగల్లో మ్యాచింగ్‌ తప్పనిసరి. చీర ఏదైనా వాటిపైకి సరిపోయేలా సిల్క్‌ త్రెడ్‌ జువెలరీని ఎంచుకుంటున్నారు ఇంతులు. పట్టుదారంతో తయారయ్యే ఈ ఆభరణాలు స్టడ్స్‌, పెండెంట్స్‌తో అలరిస్తున్నాయి. బ్రేస్‌లెట్స్‌, హారాలు సైతం రూపొందుతున్నాయి. బంగారం, వెండి రంగుల పూసలు, రాళ్లు జోడించి చేసే ఈ నగలు చూసేందుకు అసలైన ఆభరణాలకు ఏ మాత్రం తీసిపోవు.

మట్టిగాజులే ఆధారం

దారాల హారాలు

మట్టిగాజులకు సిల్క్‌ దారాన్ని చుట్టి పైన రంగురంగుల పూసలు అంటిస్తే చాలు, మహాముచ్చటగా కనిపిస్తాయి. రెండు మూడు గాజులను అతికించి, వాటికి సిల్క్‌ త్రెడ్‌ చుట్టి ఆకర్షణీయంగా తయారుచేస్తున్నారు. పట్టు, ఫ్యాన్సీ చీరలకు కొంచెం హుందాగా కనిపించేలా నాలుగునుంచి ఆరు గాజులు అతికించి, పైన వరుసలు వరుసలుగా పూసలు, కుందన్లు అమర్చి గ్రాండ్‌ లుక్‌ని తెస్తున్నారు. మోడ్రన్‌ డ్రెస్సులకూ నప్పేలా చాంద్‌బాలీ హ్యాంగింగ్స్‌, బుట్టల కమ్మలు, గొలుసు లాకెట్లు, ఫంకీ జువెలరీ.. ఇలా పలు రకాల ఆభరణాలను అలంకరించుకోవచ్చు.

ఆదాయ మార్గంగాను..

దారాల హారాలు

గృహిణులు కుట్లు, అల్లికలతో కాలం గడపటం మామూలే. చీరలు, డ్రెస్‌లపై రంగురంగుల దారాలతో రకరకాల డిజైన్లు సృష్టించే మహిళలు ఇప్పుడు అవే దారాలతో నగలు తయారు చేస్తున్నారు. సొంతంగా అలంకరించుకోవడానికి, బంధువులూ స్నేహితులకు బహుమతిగా ఇచ్చేందుకూ ఇవి చక్కగా ఉంటాయి. కొందరు గృహిణులు దీన్నే ఆదాయ మార్గంగానూ మలచుకుంటున్నారు. సామాజిక మాధ్యమాలు వేదికగా విక్రయాలు సాగిస్తూ లక్ష్మీకటాక్షం పొందుతున్నారు.

ఎంతో చౌక

దారాల హారాలు

బంగారం, వెండి నగలతో పోలిస్తే త్రెడ్‌ జువెలరీ చాలా చౌక. స్వర్ణాభరణాలైతే అన్ని చీరలపైకీ అవే వేసుకోవాలి. అదే త్రెడ్‌ జువెలరీ, ఏ రంగు చీరకు ఆ రంగు నగలు వేసుకోవచ్చు. సందర్భోచితంగా వెరైటీలూ ధరించవచ్చు. కాకపోతే, ఈ నగలను వేరుగా భద్రపరచాలి. నీళ్లు తగులకుండా జాగ్రత్తగా వాడుకుంటే మెరుపు తగ్గకుండా, మన్నికగా ఉంటాయి. ట్రెండీగానూ కనిపిస్తాయి.

ప్రవళిక వేముల

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
దారాల హారాలు

ట్రెండింగ్‌

Advertisement