ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Zindagi - Feb 10, 2021 , 03:00:08

పచ్చళ్ల తులసి

పచ్చళ్ల తులసి

పచ్చళ్లంటే ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు? రోజూ భోజనంలో మొదటి రెండు ముద్దలు పచ్చడితో తింటే ఆ తృప్తే వేరు. అందులోనూ ఆ పచ్చళ్లలో రెండు చికెన్‌ ముక్కలు, మూడు రొయ్యలుంటే నాన్‌వెజ్‌ ప్రియులకు పండుగే. మామిడి, చింతకాయ అయితే ఏడాదికోసారి పెడితే సరిపోతుంది. నాన్‌వెజ్‌ అలా కాదు. నెలకోసారి పెట్టుకోవాల్సిందే. అంత ఓపిక, తీరిక ఎవరికి ఉంటుంది? అలాంటివాళ్ల కోసమే ఎంతో రుచికరంగా, పరిశుభ్రంగా పచ్చళ్లు పెడుతున్నది హైదరాబాద్‌లోని బీరంగూడకు చెందిన తులసి. తన పేరునే నాన్‌వెజ్‌ పచ్చళ్లకు బ్రాండ్‌గా మార్చుకున్నది. 

తులసి పదో తరగతి వరకు చదువుకున్నది. బాల్యమిత్రుడు సామ్‌సన్‌ని మతాంతర వివాహం చేసుకోవడంతో పుట్టింటికి దూరమైంది. చిన్న వయసులోనే భర్తతో కలిసి, పొట్టచేత్తో పట్టుకుని  హైదరాబాద్‌ మహానగరానికి వచ్చింది. ముందే కొత్త, పెద్దగా చదువుకోలేదు. దాంతో ఉద్యోగ ప్రయత్నాలేమీ చేయలేదు. భర్త సామ్‌సన్‌ వెబ్‌ డిజైనర్‌గా పనిచేస్తూ ఇంటిని వెళ్లదీశాడు. ఇద్దరు కొడుకులు పుట్టాక ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టాయి. దాంతో పిల్లలను చూసుకుంటూ, ఇంట్లోనే ఏదైనా వ్యాపారం చేయాలనుకున్నది. భర్త సలహాతో నాలుగేండ్ల క్రితం ‘తులసి పికిల్స్‌' మొదలుపెట్టింది. లేబుల్‌, స్టిక్కర్‌ తనే డిజైన్‌ చేసి ఇచ్చాడు.

ఇంటి పచ్చడికి తీసిపోదు 

తులసి ఎంతో ఇష్టంగా పచ్చళ్లు పెడుతుంది. పచ్చళ్లలోకి వాడే అల్లం-వెల్లుల్లి పేస్ట్‌ నుంచి గరం మసాలా వరకు అన్నీ ఇంట్లోనే తయారు చేస్తుంది. అందువల్లే తన పచ్చళ్లకు రెగ్యులర్‌ కస్టమర్లు ఉంటారు. “మొదట్లో నాపై నాకే నమ్మకం కలుగలేదు. కానీ మావారి ప్రోత్సాహంతో ధైర్యంగా అడుగు వేశాను. కొన్నిరకాల పచ్చళ్లు పెట్టి మా ఫ్యామిలీ ఫ్రెండ్స్‌కి, పక్కింటివాళ్లకు ఇచ్చాను. మంచి ఫీడ్‌బ్యాక్‌ రావడంతో నమ్మకం కుదిరింది. కారం, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా పొడి, అల్లం-వెల్లుల్లి పేస్ట్‌ నేనే స్వయంగా తయారు చేస్తాను. కారం, పసుపు తప్ప మిగతావన్నీ ఆర్డర్‌నిబట్టి ఎప్పటికప్పుడు తాజాగా సిద్ధం చేసుకుంటాను. ఆ తాజాదనం కారణంగానే చాలామంది నా పచ్చళ్లను ఇష్టపడతారు. లాక్‌డౌన్‌ ముందువరకూ విదేశాలకూ పంపించేదాన్ని” అంటున్నది తులసి.

సోషల్‌ మీడియాలో మార్కెటింగ్‌.. 

“గత మార్చి వరకు మా బిజినెస్‌ బాగా నడిచింది. లాక్‌డౌన్‌లో ఆర్థికంగా ఇబ్బంది పడ్డాం. అక్కడికీ చాలామంది ఫోన్లు చేసి పంపించమనేవారు. మేమే ధైర్యం చేయలేకపోయాం. ప్రస్తుతం, ఆన్‌లైన్‌ డెలివరీ మాత్రమే చేస్తున్నాం. కొత్త కస్టమర్లు వాట్సాప్‌, ఫేస్‌ బుక్‌లలో ఆర్డర్లు ఇస్తుంటారు” అని చెప్తున్నది తులసి. తనలాగే ఎంతోమంది ఆడవాళ్లకు సొంతంగా నాలుగు రూపాయలు సంపాదించాలని ఉంటుంది. కానీ వాళ్లు ముందడుగు వేసి విజయం సాధించాలంటే, భుజం తట్టే చెయ్యి కావాలి. తన బిజినెస్‌ బాగా నడిస్తే, చేతనైనంత మందికి ఉపాధి కల్పిస్తానంటున్నది తులసి సామ్‌సన్‌. 


VIDEOS

logo