కడలిని చూస్తేనే బడలిక తీరిపోతుంది. సముద్రంపై పది నిమిషాలు పడవలో విహరిస్తే ఆనందం వెల్లివిరుస్తుంది. అలాంటిది సంసారాన్ని సాగరంపై నడిపించే అవకాశం వస్తే.. సంద్రమంత సంతసం ఉండదా మరి! మరో ఏడాది దాటితే, అలాంటి మహద్భాగ్యానికి నోచుకోవచ్చు. ఫ్రాన్స్‌కు చెందిన షిప్ తయారీ సంస్థ ‘అంథెనెయా’ ఈ ఫ్లోటింగ్ గృహాలను రూపొందిస్తున్నది. ‘లగ్జరీ పాడ్స్’గా పిలిచే ఈ విచిత్ర గృహాలు కడలి అలలపై తేలుతూ ఉంటాయి. గుమ్మటం ఆకృతిలో ఉండే ఈ గృహాలను సర్వహంగులతో తీర్చిదిద్దారు. నలుగురు కుటుంబసభ్యులు హాయిగా ఉండొచ్చు. పది మంది ఆత్మీయులను ఆహ్వానించి, వారి మర్యాదకు భంగం రాకుండా ఆతిథ్యం ఇవ్వొచ్చు. డైనింగ్ హాల్, బెడ్ రూమ్, సిటవుట్, బార్ రూమ్.. ఇలా సకల వసతులూ ఇందులో ఉంటాయి. నడి సంద్రంలో కరెంట్ ఎక్కడి నుంచి వస్తుందన్న బెంగ అవసరం లేదు. ఈ గుమ్మటానికి అమర్చిన సోలార్ ప్యానల్స్ ద్వారా సౌరశక్తి విద్యుత్తుగా మారుతుంది. ప్రముఖ పర్యాటక దేశాల్లో ఇప్పటికే ఫ్లోటింగ్ పాడ్స్ వాడుకలోకి ఉన్నాయి. లగ్జరీ సూట్స్‌గా సందర్శకులకు ఆతిథ్యం ఇస్తున్నాయి. కొన్ని ఫ్లోటింగ్ రెస్టారెంట్లుగానూ వినియోగంలో ఉన్నాయి. వచ్చే ఏడాది కల్లా ఇండిపెండెంట్ గృహాల లిస్ట్‌లోకి వీటిని చేర్చనున్నారు తయారీదారులు. అలలపై తేలియాడే ఈ ఇంటి ధర సుమారు ఏడున్నర లక్షల డాలర్లు.