e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, October 23, 2021
Home చింతన Pruthu history | పృథు అవతార ప్రశస్తి

Pruthu history | పృథు అవతార ప్రశస్తి

మనుస్మృతిలో వేనుడు మహా పాపిష్ఠివానిగా పేర్కొనబడ్డాడు. అయినా, అతని పార్థివదేహాన్ని మథించగా ఆవిర్భవించింది ఎవరు? పృథు రూప పురుషోత్తముడు. కాన, అత్యంత పాపి యందు కూడా పరమాత్ముడుంటాడు సుమా!- అన్నది పరమార్థం! మహాత్ముల గుణాలు తనయందు లేనందున తనను నందింప (స్తుతింప) వలదని వైన్యుడు (పృథువు) వారించినా వందిమాగధులు మునుల అనుజ్ఞపొంది వందనీయుడైన వేననందనుని వేనోళ్ల అభినందించారు.. ‘ధర్మ ప్రభువులకు తలమానికమైన ఈ పృథువర్మ ఇలపై ధర్మసేతువును కలకాలం కాపాడతాడు. సప్తద్వీపవతి అయిన సాగరమేఖల (భూమి)ను ఏకచ్ఛత్రాధిపతియై ఏలుతాడు. సాక్షాత్తు పురుషోత్తమ అవతారంగా ప్రజలు భావించే విధంగా పృథువు ప్రవర్తిస్తాడు.’

అపూర్వంగా భూమిని సంస్కరించి దానికి తన పేరిట ‘పృథివి’ (పృథ్వీ) అన్న ప్రసిద్ధిని ప్రసాదించిన పురుషార్థపరుడు పృథు చక్రవర్తి. చక్రపాణికి సాటి వచ్చే ఈ చక్రవర్తి మహీ (భూ)మండలం మీద ‘వ్యవసాయ వ్యవస్థ’ను ఏర్పరచిన మేటి మహీపతి, మొదటి రాజు. మైత్రేయుడు విదురునితో- ఆదిలోనే హంసపాదు అన్నట్లు ఆదిరాజు పృథువు పరిపాలనకు ప్రారంభంలోనే పృథివి సారహీనమైపోయింది. పంటలు అడుగంటి అతి భయంకరమైన అన్న సంకటం ఏర్పడింది. ప్రజలు అన్నార్తులై అవనీపతిని ఆశ్రయించారు. భూపతి ఉగ్రుడై వెంటనే వింటి బాణాన్ని సంధించి భూమికి గురిపెట్టాడు. భయంతో వణుకుతూ గోరూపం ధరించి పారిపోతున్న పృథివి వెంటపడ్డాడు పృథువు. ధరాదేవి ధరణీపతితో ఇలా అన్నది- ఓ ధర్మజ్ఞా! అఖిల ప్రాణులకు నావ వలె ఆధారంగా ఉన్న, అపరాధమెరుగని ఆడుదానికి ఎందుకు కీడు తలపెట్టావు? నన్ను నశింపజేస్తే నీ ప్రజలకు నివాసం ఉండదు కదా? పృథువు- ‘ఓ వసుంధరా! నీవు నా ఆజ్ఞను అతిక్రమిస్తున్నావు. గోరూపం ధరించి గ్రాసం (గడ్డి, తవుడు మొ॥) తింటూ కూడా పొదుగు నిండా నింపుకొన్న పాలు ఇవ్వకుండా నీలోనే దాచుకుంటున్నావు. పూర్వం బ్రహ్మదేవుడు నీలో సృష్టించిన వివిధ ఓషధీ ధాన్య బీజాలను బయటపెట్టకుండా ఉన్నావు. భూతదయ ఇసుమంత కూడా లేని నీవు వసుమతి (భూమాత)వి కావు. సుమతివి అంతకన్నా కావు. నీవు కేవలం మందమతివి. నిన్ను వధించినా నాకు పాతకం రాదు.’

- Advertisement -

కం॥ ధర విరులు గందకుండగ
సరసగతిం బూవుదేనె జవిగొను నిందిం
దిరవిభు కైవడి బుధుడగు
పురుషుడు సారాంశ మాత్మబూని గ్రహించున్‌

పృథివి-పుణ్యగుణసాంద్రా! ఓ వైన్య భూపాల చంద్రా!‘పువ్వులు కందిపోకుండాఎదలోని మధువును మృదువుగా తాగే తుమ్మెదలా.. పండితుడైన పురుషుడు దేనినీ నొప్పించకుండా అన్నిటినుంచి సారాన్ని నేర్పుగా గ్రహిస్తాడు.’మూలంలో యథామధుకరః (తుమ్మెద వలె) అని మాత్రమే ఉండగా, రససిద్ధుడు పోతన ఆ ఉపమానంలోని ఔచిత్యాన్ని- ఆ తుమ్మెద రసాస్వాదన స్వారస్యాన్ని, ఎంతో సరసంగా, సుకుమారంగా ఈ కందంలో నింపి మధురమైన మాకందంగా మనకందించాడు.

భూదేవి… భూపతీ! బ్రహ్మదేవుడు బహువిధ ఓషధులను సృష్టించిన మాట సత్యమే. అయితే, వాటిని స్వార్థపరులూ, నియమ భ్రష్టులైన దుష్టులూ స్వాహా చేశారు. మహారాజా! మనుషులంతా దొంగలు, దోపిడిగాండ్రుగా మారారు. ఇది గమనించి నేను ఆ ఓషధులను చోరులు దొంగిలించకుండా మింగాను. నాపై నింద మోపవద్దు. నాలో జీర్ణించిపోయిన ఆ ఓషధులను యుక్తితో మరల పొందవచ్చు. నాకు తగిన దూడను, పాత్రను, దోగ్ధ (పాలు పితుకు వానిని)ను సమకూర్చుకొని ఈ ప్రాణులకు తుష్టిని, పుష్టిని చేకూర్చే ఇష్టమైన కోరికలను పాల రూపంగా పిండుకో. మిట్టపల్లాలతో విషమంగా ఉన్న నన్ను సమంగా చదును చెయ్యి. నా విన్నపం మన్నించు’ అని విన్నవించుకున్నది. ఆలకించిన పృథువు ఆనంద పరవశుడై మనువును దూడగాను, తన హస్తమును పాత్రగాను చేసి తానే దోగ్ధయై ఓషధులను, ధాన్యాలను పూర్ణంగా పిదికాడు. అన్యులు కూడా తమకు అవసరమైన పదార్థాలను అనాయాసంగా ఆవిష్కరించుకున్నారు. సార్వభౌముడు పృథువు మిక్కిలి సంతసించి సర్వకామప్రదాయిని అయిన పృథ్విని తన పుత్రిగా స్వీకరించాడు. భూమిని సమతలంగా చేసి వ్యవసాయ యోగ్యంగా సంస్కరించాడు. పూర్వం లేని పుర, గ్రామ, పట్టణాదుల వ్యవస్థను కల్పించాడు.

చ॥ ఘనమగు దేవ! యీ వరమె కాదు మహాత్మక! వాగ్వినిర్గతం
బనదగు తావకీన చరణాంబుజ చారు మరందరూపమై
తనరిన కీర్తియున్‌ విని ముదంబును బొందగలేని మోక్ష మై
నను మదిగోర నొల్ల నఘనాశ! రమేశ! సరోజలోచనా!

పృథువు చేసిన అశ్వమేథ యాగానికి ఆనందించి అనుగ్రహించడానికి వచ్చిన శ్రీహరి వరం కోరుకోమనగా పృథువు ఇలా పలికాడు-‘వరదా! వాసుదేవా! నరక వాసులకు సైతం అనాయాసంగా లభించే క్షుద్రమైన ఐహిక సుఖాలను ఏ భద్ర పురుషుడు వేడుకుంటాడు? పాపహరణా! పద్మనయనా! రమా రమణా! ఘనమైన ఈ వరమే కాదు, మహాత్ములు గానం చేసే నీ పావన పాదారవింద మకరందమైననీ కథా కీర్తనం విని ఆనందించలేని అపవర్గా (మోక్షా)న్ని కూడా నేను
అభిలషించను.

కం॥ అదిగాన పద్మలోచన!
సదమల భవదీయ ఘనయశము వినుటకునై
పదివేల చెవులు కృప ని
మ్మిదియే నా యభిమతంబు నిపుడు ముకుందా!

‘అనఘా! అరవిందలోచనా! మదిలో మాధుర్యం నింపే ఇంపైన నీ ఘనకీర్తి వినటానికి కృపతో నాకు పదివేల చెవులు ప్రసాదించు. మురభంజనా! ముకుందా! ముమ్మాటికీ ఇదే నా మనోభిలాష (ముక్తి మొదలైన సుఖాలన్నీ భక్తిలో అంతర్భాగాలేనని భావం). పరమ పురుషా! రమాదేవి వలె నేను కూడా నిత్యం నిన్నే సేవిస్తా. నీ పాదసేవకై పోటి పడే మాకు కలహం రాకుండా వరం ప్రసాదించు. పంతానికి పోకుండా వంతుల వారీగా సేవాభాగ్యం అనుగ్రహించు. జగజ్జననితో జగడం జరిగినా నిన్నే జపిస్తా. నీకై తపిస్తా! లేదా నీ పాద ద్వంద్వంలో ఒకదానిని సదా నాకు కేటాయించు. భవ భంజనా! భక్త రంజనా! భక్తులను దరి జేర్చుకున్నట్లు నీవు భార్గవి (లక్ష్మి)ని కూడా ఆదరించవు కదా!’ అంటూ వైన్యుడు దైన్యంతో అర్థించాడు.
పృథువు పట్టపురాణి ‘అర్చి’- అనగా అర్చన లేక పూజ. నవ విధ భక్తులలో పృథువు ‘పూజన’ భక్తికి ప్రతీకం. పద్మాలయ (లక్ష్మి) ‘పాదసేవన’ భక్తికి సంకేతం. రాజర్షి పృథువుని అనుగ్రహించి పరమాత్మ ఆ భక్తుని మనస్సును హరించుచున్నవాని వలె వైకుంఠం వెళ్లాడట! ఇక్కడ ‘మనో హరణం’ కేవలం వాచారంభణం (మాట మాత్రం), కేవలం లోకోక్తి అని వ్యాఖ్యానం! ఎందుకనగా త్రికాలాలలో పృథువు మనస్సు పరమాత్మ అధీనమే! పరంధామానికి (స్వస్థలానికి) స్వామి వెళ్లాడనగా భగవద్ధామం భక్తుని హృదయమే! పుణ్యమూర్తి, ప్రథిత యశస్కుడైన పృథు చక్రవర్తి కూడా పరమానందంతో పరమపదం పొందాడు. సతీసాధ్వి ‘అర్చి’ పతిపాదాలను మతిలో నిలిపి సహగమనం చేసింది. (సశేషం)

తంగిరాల రాజేంద్రప్రసాద శర్మ
98668 36006

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement