e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, June 19, 2021
Home Top Slides హనుమ జన్మస్థలి.. అంజనాద్రి

హనుమ జన్మస్థలి.. అంజనాద్రి

దేహబుద్ధ్యాతు దాసోస్మి జీవబుద్ధ్యా త్వదంశకః ఆత్మబుద్ధ్యా త్వమేవాహం..హనుమంతుడు శరీర స్థాయిలో రామబంటు, ప్రాణస్థాయిలో రాముడిలో ఓ భాగం, ఆత్మస్థాయిలో రాముడే హనుమంతుడు, హనుమంతుడే రాముడు!అంజనాద్రి మీద జన్మించిన ఓ వానర బాలకుడు.. భవిష్యత్‌ బ్రహ్మ స్థాయికి ఎదిగిన తీరు ఓ స్ఫూర్తిదాయక ప్రయాణం! ఎదిగేకొద్దీ ఒదగడమే హనుమత్‌తత్వం. స్కాంద, వరాహ, పద్మ, బ్రహ్మాండాది పురాణాలు అంజనాద్రి బాలుడి జన్మ వృత్తాంతాన్ని వివరిస్తాయి. వాఙ్మయ, శాసన, చారిత్రక, భౌగోళిక ఆధారాలు కూడా నేటి జాబాలి తీర్థమే మహాబలి హనుమంతుడి జన్మస్థానమనీ, ఆ బంగారుకొండ ఏడుకొండలమీద ఆడి పాడాడనీ నిర్ధారిస్తాయి.

హనుమ జన్మస్థలి.. అంజనాద్రి

నరవీరుడు కేసరి. అతడి ఇల్లాలు అంజన. ఇద్దరి ముద్దుల బిడ్డ హనుమ. అంజనాదేవి అప్సర. అసలు పేరు పుంజికస్థల. శాపవశాత్తు వానరస్త్రీగా జన్మించింది. మహా సౌందర్యవతి. ఆ అందానికి ఆకర్షితుడై.. వాయువు తనలోని రుద్రతేజాన్నిచ్చి ఓ బిడ్డకు ఆయువు పోశాడు. సూర్యోదయ మహాఘడియలలో అంజనాద్రి మీద హనుమకు జన్మనిచ్చింది అంజనమ్మ! ముద్దులు మూట గట్టుకున్న ఆ చిన్నారి.. దివ్య కుండలాలతో, ఉపవీతంతో, కౌపీనంతో అచ్చం వామనుడిలా ఉన్నాడట. పుడుతూనే బిడ్డకు ఆకలి మొదలైంది. ఆకాశవృక్షానికి వేలాడుతున్న ఎర్రని పండులా కనిపించాడు ఉదయభానుడు. అంతే, వేంకటగిరి నుంచి ఉదయ గిరివైపు లంఘించాడు. ఏ అసురశక్తో అని భావించిన బ్రహ్మదేవుడు బ్రహ్మాస్ర్తాన్ని ప్రయోగించాడు. సూర్యుడికీ కోపం వచ్చింది. ఆ తర్వాత కానీ దేవతలకు వాస్తవం బోధ పడలేదు. బ్రహ్మాండ పురాణం ప్రకారం.. సంతానభాగ్యం కోసం పరితపిస్తున్న అంజనాదేవికి, వేంకటగిరిపై తపస్సు చేయమని ఓ సోదమ్మ సలహా ఇచ్చిందట. దానికి మతంగ మహర్షి సలహా కూడా తోడైంది. ఆ ప్రకారమే, అంజన ఆకాశగంగకు సమీపంలో కఠోర తపస్సు చేసింది. వాయుభక్షణం చేస్తూ వాయుదేవుడిని సేవించింది. ఆ నోముల పంటే ఆంజనేయుడు.

అంజనాచల ఇత్యేవ నాత్ర కార్యా విచారణా
ప్రసిద్ధిం యాతు శైలోయం అంజనే! నామతస్తవ‘అమ్మా! అంజనాదేవీ! నువ్వు శేషపర్వతం మీద తపస్సు చేసి విశేషగుణ సంపన్నుడైన బిడ్డను కన్నావు. ఆ కారణజన్ముడి వల్ల ముల్లోకాలకూ మంచి జరుగుతుంది. ఇకనుంచీ ఈ కొండ నీ పేరుతోనే సుప్రసిద్ధం అవుతుంది’ అంటూ దేవతలు కొన్ని వరాలిచ్చారు. ఆ వరాలమూటను తీసుకుని, తన వరాల మూటను చంకనెత్తుకొని తిరిగొచ్చిందా తల్లి. స్కాంద పురాణంలోని శ్రీ వేంకటాచల మహాత్మ్యం హనుమ జన్మస్థానాన్ని ‘సుమేరు’గా ప్రస్తావించింది. ఆ సుమేరు పర్వతమే వేంకటాచలమని ‘బ్రహ్మాండ పురాణం’ స్పష్టమైన వివరణ ఇచ్చింది. మేరు పర్వత పుత్రుడు సుమేరు. తననే వేంకటుడనీ అంటారు. హనుమద్వైభవాన్ని అనేక పురాణాలు ప్రస్తావించాయి. నిజానికి, ‘రామాయణం’లో ఉప-కథానాయకుడు హనుమంతుడే. తన జన్మకథను మారుతి అశోకవనంలోని సీతమ్మవారికి చెప్పాడు. కిష్కింధకాండలో జాంబవంతుడు హనుమకు మరొక్కసారి ఆ కథంగా గుర్తుచేశాడు. మహాభారతంలో, వాయుపుత్రుడే స్వయంగా భీముడికి వివరించాడు.

చతుర్వేది
పెరిగి పెద్దయిన తర్వాత సుగ్రీవుడి సచివుడిగా, వానర ముఖ్యయోధుడిగా హనుమ కార్యస్థలం కిష్కింధాపురికి మారింది. అయినా తన మూలాలను మరువలేదు. సీతాన్వేషణలో భాగంగా వేంకటగిరిని సందర్శించాడు. హనుమ వ్యక్తిత్వం మీద తల్లి అంజన ప్రభావం అపారం. హనుమ చతుర్వేది. వ్యాకరణ, తర్క, మీమాంసాది శాస్ర్తాలమీద పట్టున్నవాడు. కాబట్టే, వాల్మీకి మహర్షి హనుమ సుగుణాలనూ, వినయ సంపదనూ వేనోళ్ల కొనియాడాడు.

మహీధరః కొండంతవాడు. మహాతేజః తేజోమూర్తి. సంస్కార సంపన్నః సంస్కారవంతుడు.అంటూ.. మెచ్చుకోళ్లు సమర్పించాడు. రామాయణంలో హనుమంతుడి వర్ణన ఓమహాద్భుత ఘట్టం. ఆ రూపం అపురూపం.ప్రతిసూర్య ఇవోదితః – ఉదయిస్తున్న సూర్యుడిలా ఉంటాడు. దీప్తానలప్రభః – శత్రువులకు భగభగ మండే మంటలా కనిపిస్తాడు. ఉత్తములకు మాత్రం అశోక పుష్పాల గుచ్ఛంలా దర్శనమిస్తాడు. హనుమ మహాసుందరుడు. ఆ ముఖం ఎర్రని పగడంలా ఉంటుంది. అతని కండ్లు అప్పుడే శుద్ధి చేసిన బంగారంలా మెరుస్తుంటాయి. దంతాలూ వజ్ర సమానమే. రాక్షసుల పాలిట అవి పదునైన ఆయుధాలు కూడా. మారుతాత్మజుడు దర్పంగా నడుస్తుంటే, మేరు పర్వతమే అడుగులేస్తున్న భావన.

వినయభూషణుడు
హనుమ సదా బ్రహ్మచారి. ఆత్మనిగ్రహి. అంతటి బలవంతుడుకూడా పెద్దలముందు మాట్లాడేటప్పుడు దాసాంజనేయుడే. అణుకువతో ఉంటాడు. తనకు వ్యక్తిగతమైన కోరికలూ, ఐహికమైన లక్ష్యాలంటూ ఉండవు. ఏ పని చేసినా లోక కల్యాణం కోసమే. రామకార్యమే అతని రాచకార్యం! ఆ చిత్తశుద్ధికి సీతమ్మ సైతం అబ్బురపడింది. ‘శౌర్యం, జ్ఞానం, పరాక్రమం, తేజం, క్షమ, వినయం.. తదితర గుణాలు నీలో అపారం’ అని కొనియాడింది. శ్రీరాముడైతే, ‘నా విజయానికి కారకుడు ఇతడే’ అని మహర్షుల సమక్షంలోనే ప్రకటించాడు. నిజమే, రామరావణ యుద్ధంలో హనుమంతుడి శౌర్యపరాక్రమాలు ఎవరికి తెలియనివి? దశకంఠుడి రొమ్ముమీద పిడిగుద్దులు గుద్దుతుంటే.. పిడుగులు సైతం నోరెళ్లబెట్టుకుని చూశాయట. ఆ బాధను ఓర్చుకుంటూనే రావణుడు.. ‘కోతీ! శౌర్యం విషయంలో నేను పొగడదగిన శత్రువు నువ్వు’ అని నిజాయతీగా ప్రశంసించాడు. హనుమ ముష్ఠిఘాతాలు ఎంత శక్తిమంతమో, అతని మాటలు అంత సుకుమారం.ఆ పలుకు తేనెల సంభాషణా శైలిని చూసే వాల్మీకి ‘వాక్య కోవిదః’ అన్నాడు.

హనుమ వక్తృత్వ ప్రతిభే రాముడిని ముందుగా ఆకర్షించింది. తొలి పరిచయంలోనే ఆత్మీయుడిని చేసింది. ‘నాలుగు వేదాలూ నాలుకమీద నాట్యం చేస్తున్నవాళ్లే ఇలా మాట్లాడగలరు. వాక్కు అతని గుండెలో పుట్టి గొంతులో పలుకుతుంది’ అన్నాడు లక్ష్మణుడితో. సీతాన్వేషణకు హనుమ బయల్దేరుతున్నాడంటేనే, సగం కార్యం సిద్ధించినట్టు. ‘నిశ్చితార్థతరశ్చాపి హనుమాన్‌ కార్యసాధనే’ అంటూ తన నమ్మకాన్ని ప్రకటిస్తాడు రాముడు కిష్కింధ కాండలో. ఆ అంచనాలకు తగినట్ట్టుగానే సీతమ్మ జాడను కనిపెట్టాడు. వానరమూకతో లంకకు వారధి కట్టాడు. హనుమంతుడు రాజ్య తంత్రంలోనూ నిపుణుడే. కాబట్టే, ఆదికవి ‘సచివోత్తమః’ అని కొనియాడాడు. విభీషణుడు రాముడిని శరణు వేడినప్పుడు, పరిస్థితులను తూకమేసినట్టు విశ్లేషించాడు. ‘అతడి మాటల్లో ద్వేషభావం లేదు. ముఖం నిర్మలంగా ఉంది. ప్రస్తుత పరిస్థితుల కారణంగా, మీ సాయంతో లంకాధిపత్యం పొందడమే సరైన మార్గంగా భావించి ఉండవచ్చు’ అని రామచంద్రుడికి సలహా ఇచ్చాడు. ఆ మాట అక్షరాలా నిజమైంది. రావణ సంహారంలో, లంకా విజయంలో విభీషణుడి పాత్ర మరువలేనిది.

శ్రీరామ పట్టాభిషేక సమయంలో వాయుదేవుడు ఇంద్రుడిద్వారా ఓ ముత్యాలహారాన్ని పంపుతాడు. రాముడు ఆ దండను సీతమ్మకు ఇస్తాడు. ఆమె దాన్ని హనుమంతుడికి బహూకరించాలని భావిస్తుంది. అనుమతి కోసం పెనిమిటివైపు చూస్తుంది. ‘నువ్వు హనుమకు తప్పక ముత్యాలహారం ఇవ్వవచ్చు. అతడిలోని శక్తి, దృఢత్వం, ప్రసిద్ధ కౌశలం, యోగ్యత, వినయం ఎప్పుడూ కనిపిస్తూ ఉంటాయి’ అని చెబుతాడు. ఆ ముత్యాలహారంతో హనుమంతుడు, చంద్ర కిరణాలతో వెలుగొందే ప్రభామండలంలా మెరిసిపోతున్నాడట.

త్రేతాయుగంలో.. రామబంటుగా ప్రత్యక్ష సేవలు అందించాడు.ద్వాపర యుగంలో..పాండవుల జెండాపై కపిరాజుగా కృష్ణస్వామికి పరోక్ష సేవలు చేశాడు.కలియుగంలో..జాబాలి క్షేత్రంనుంచే గోవిందనామాలు వింటూ ఆనంద నృత్యాలు చేస్తున్నాడు ఆంజనేయుడు!

భౌగోళిక ప్రమాణాలు
అత్యంత ప్రామాణికమైన ‘వేంకటాచల మహాత్మ్యం’లో అంజనాద్రిని మేరుపర్వత పుత్రునిగా అభివర్ణించారు. ఈ గ్రంథంలోనే అంజనాద్రిని ‘వృషభాచలం’గా నిర్ధారించారు. దానిని ఎలా చేరుకోవాలో కూడా వివరించారు. ‘స్కాంద పురాణం’లో అంజన సంతానం కోసం మతంగ మహర్షి ఆశ్రమానికి వచ్చినప్పుడు, మహర్షి ఆమెకు వేంకటాచలానికి వెళ్లమని సూచిస్తాడు. “ఇక్కడికి దక్షిణ దిక్కున 10 యోజనాల దూరంలో నృసింహస్వామి నెలకొన్న ‘ఘనాచలం’ (అహోబిలం) అనే ప్రసిద్ధమైన పర్వతం వుంది. దానిపై ‘బ్రహ్మతీర్థం’ ఉంది. దానికి తూర్పు దిక్కున 10 యోజనాల దూరంలో ‘స్వర్ణముఖి’ నది ఉంది. ఉత్తరాన ‘వృషభాచలం’ ఉంది. ఈ కొండపైన ‘స్వామి పుష్కరిణి’ ఉంది. అక్కడకు వెళ్లి వరాహదేవుని సేవించి, అక్కడ్నించి ‘ఆకాశగంగ’కు వెళ్లు. ఆ తీర్థం వద్ద వాయుదేవుని గురించి వెయ్యేళ్లు తపస్సు చెయ్యి’ అంటూ మార్గాన్నీ
వివరించారు.
‘వరాహ పురాణం’లోని ‘వేంకటాచల మహాత్మ్యం’లోనూ ‘వైకుంఠ గుహ’ ప్రస్తావన కనిపిస్తుంది. త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు వానరవీరులతో కలిసి సేద తీరుతుండగా వానరులు ‘శేషా చలం’లోని ‘వైకుంఠ గుహ’ను సందర్శించినట్లు ఉంది. ఈ వైకుంఠగుహ స్వామి పుష్కరిణికి ఈశాన్య దిశలో సుమారు 2 కి.మీ. దూరంలో ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉంది.

సత్యం..సత్యం.. పునస్సత్యం!
వాఙ్మయ ప్రమాణాలు

  1. ‘కంబ రామాయణం’లోని ఓ పద్యంలో ‘..చెన్ఱార్‌ వేంకటత్తు ఇఱుత్త ఎైల్లె’ అని స్పష్టంగా ఉంది. ‘సీతను వెతుకుతున్న వానరులు వేంకటగిరికి వచ్చినట్లు’ ఈ పద్యభావం.
  2. క్రీ.శ. 1361 ప్రాంతంలో అణ్ణంకరాచార్యులు (‘ప్రతివాది భయంకరన్‌’గా ప్రసిద్ధి) తాను రాసిన ‘అంజనాద్రి నాథ స్తోత్రం’లో వేంకటాద్రి నాథుడిని పొగిడి, పరవశించారు.
  3. పదకవితా పితామహుడు తాళ్లపాక అన్నమాచార్యులవారు తన ‘షణ్ముఖ ప్రియ కీర్తనం’లో వేంకటాద్రిని అంజనాద్రిగానే భావించారు.‘అణురేణు పరిపూర్ణమైన రూపము/ అణిమాదిసిరి అంజనాద్రిమీది రూపము’ అన్న వాక్యాలే ఇందుకు నిదర్శనం.
  4. 17వ శతాబ్దానికి చెందిన శ్రీరంగ రామానుజాచార్యులు ‘కఠోపనిషత్‌ భాష్యానికి’ మంగళశ్లోకం రచిస్తూ, అంజనాద్రి నాథునికి నమస్కరించారు. (‘..అంజనాచల శృంగార మంజలిర్మమ గాహతాం’)
  5. స్ట్రాటన్‌ అనే బ్రిటిష్‌ అధికారి క్రీ.శ.1800 ప్రాంతంలో తిరుమల విశేషాలను సంకలన పరుస్తూ రాసిన ‘సవాల్‌-ఏ-జవాబ్‌’పుస్తకం లోనూ అంజనాద్రి అన్న మాటను విశ్లేషించారు.‘అంజనాదేవికి ఆంజనేయుడు జన్మించిన చోటు కావడం వల్ల అంజనాద్రి అని పిలిచారు’ అని వివరించారు.
  6. ‘అంజనాద్రి మహాత్మ్యం’ అనే అప్రకాశిత గ్రంథం ఒకటి లండన్‌లోని ‘ఇండియన్‌ ఆఫీస్‌ రికార్డ్‌ లైబ్రరీ’లో ఉంది. ఈ గ్రంథమూ ‘ఆంజనేయుడు వేంకటాద్రిలోనే పుట్టినటు’్ల తెలియజేస్తున్నది.

శాసన ప్రమాణాలు
‘వేంకటాచల మహాత్మ్యం’ పూర్తి ప్రామాణికమని నిరూపిస్తున్న రెండు శిలాశాసనాలు తిరుమల గుడిలో లభ్యమయ్యాయి. వాటిలో మొదటి శాసనం క్రీ.శ.1491 జూన్‌ 27 నాటిది. రెండవ శాసనం క్రీ.శ. 1545 మార్చి 6 నాటిది.
శ్రీరంగంలోని ఒక శిలాశాసనం కూడా ఇదే విషయాన్ని నొక్కి చెప్పింది. తురుష్కులు తమ దాడులలో శ్రీరంగనాథుని ఉత్సవబేరాన్ని తీసుకెళ్లారు. గోపణార్యుడనే విజయనగర ప్రతినిధి దానిని మళ్లీ శ్రీరంగంలో ప్రతిష్ఠించాడు. ఆ పరిణామాన్ని తెలియజేసే శిలాశాసనంలోని ఒక సంస్కృత శ్లోకం, మొదటి పాదంలోనే ‘వేంకటాద్రిని అంజనాద్రి’ అంటూ సంబోధించారు.
క్రీ.శ.16వ శతాబ్దానికి చెందిన ఎట్టూర్‌ లక్ష్మీకుమార తాతాచార్య రాసిన ‘హనుమద్వింశతిః’ స్తోత్రం కూడా ‘అంజనగిరి అంటే వేంకటగిరి’ అని పేర్కొంది. ఈ శాసనపూర్వక శ్లోకం కాంచీపురంలోని వరదరాజ స్వామి ఆలయంలో దర్శనమిస్తుంది.
తిరుపతిలోని అనేక శాసనాలు ఆంజనేయస్వామివిశేష ఆరాధనలను తెలియజేస్తున్నాయి.

హనుమ జన్మస్థలి.. అంజనాద్రి

జాబాలి తీర్థమే జన్మస్థానం!
హనుమంతుని జన్మస్థలం మాదంటే మాదంటూ అనేక ప్రాంతాల ప్రజలు వాదిస్తున్నారు. కానీ, తిరుమలలోని అంజనాద్రిపైనున్న ‘జాబాలి తీర్థమే’ పూర్తి సాధికారికమనీ, మిగిలినవాటికి ప్రామాణికమైన ఆధారాలు లేవనీ టీటీడీ పండిత కమిటీ స్పష్టం చేసింది.
కర్ణాటక హంపి క్షేత్రంలోని ఒక కొండను ‘అంజనాద్రి’గా పిలుస్తారు. ‘అక్కడే హనుమ జన్మించాడన్నది’ కేవలం స్థానిక విశ్వాసం. ఎలాంటి రుజువులూ లేవు. కన్నడ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు, తాళపత్ర విభాగ ఆచార్యులైన వాసుదేవన్‌ ఇదే అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు.
ఝార్ఖండ్‌ రాష్ట్రం గుమ్లా జిల్లా కేంద్రానికి 21 కి.మీ. దూరంలోని ‘అంజన’ అనే గ్రామంలో ఉన్న గుహ కూడా ఇలాంటిదే. ఈ ప్రదేశాన్ని సందర్శించిన అన్నదానం చిదంబరశాస్త్రి ఇదే విషయాన్ని నిర్ధారించారు. ‘హనుమంతుని జన్మస్థలం ఈ గుహ కాదని, వేంకటాచలంలోని అంజనాద్రియేనని’ ప్రసిద్ధ ఆధ్యాత్మిక వేత్త మహంతుస్వామి గోపాల ఆనందబాబా కూడా అభిప్రాయపడ్డారు. ఈ ఇద్దరు ప్రముఖుల అభిప్రాయాలు ఆ రాష్ట్రంలోని ‘కైవాయ సందేశ’ పత్రిక (2011)లో ప్రచురితమయ్యాయి.
గుజరాత్‌ నవసారి అనే ప్రాంతంలోని డాంగ్‌ ‘దండకారణ్యం’గా ప్రసిద్ధి చెందింది. అక్కడి ‘అంజన’ పర్వతంలోని ‘అంజని’ గుహ, హరియాణాలోని కైథల్‌, మహారాష్ట్రలోని నాసిక్‌ జిల్లా త్య్రంబకేశ్వరానికి 7 కి.మీ.దూరంలోని ‘అంజనేరి’ – ఈ మూడూ హనుమంతుని జన్మ స్థలాలని ప్రచారంలో ఉన్నా, అవన్నీ స్థానిక విశ్వాసాలే.
హంపి క్షేత్రం సమీపంలోని పర్వత ప్రాంతమంతా ‘కిష్కింధ’గా ప్రసిద్ధి చెందింది. ‘శ్రీమద్వాల్మీకి రామాయణం’ ప్రకారం హనుమంతుడు శ్రీరామలక్ష్మణులను ఇక్కడే కలిశాడు. హనుమంతుని జన్మస్థలాలుగా పైన పేర్కొన్న అన్ని ప్రదేశాలకంటే తిరుమలకే హంపి చాలా దగ్గరగా (363 కి.మీ.) ఉంది. కాబట్టి, ఆంజనేయుడు తన జన్మస్థలమైన తిరుమలలోని అంజనాద్రి నుండే హంపికి వెళ్లాడన్నది శాస్త్రీయం.

హనుమ జన్మస్థలి.. అంజనాద్రి
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
హనుమ జన్మస్థలి.. అంజనాద్రి

ట్రెండింగ్‌

Advertisement