అద్దం ముందు నటించేదాన్ని!

గుంటుక రాధిక.. రూరల్ టాలెంట్‌కు ఒక నిర్వచనం. తెలంగాణ భాష, యాస, కట్టు, బొట్టుకు నిలువుటద్దం. సాదాసీదా జీవితం నుంచి స్టార్‌గా ఎదిగి.. యూట్యూబ్‌లో 500కు పైగా షార్ట్‌ఫిలిమ్స్‌లో నటించింది. మాట, పాటతో అందరినీ మెప్పిస్తున్నది. ఆమె పేరుతో ఫ్యాన్స్ అసోసియేషన్లు కూడా ఉన్నాయంటే రాధిక పాపులారిటీని అర్థం చేసుకోవచ్చు. యూట్యూబ్ సర్కిల్స్‌లో ‘సహజ నటి’గా గుర్తింపు పొంది సక్సెస్ఫుల్ కెరీర్‌ను సొంతం చేసుకున్న రాధిక మనోగతం ఆమె మాటల్లోనే..
ఒకప్పుడు మా ఇలాఖాల షూటింగ్‌లు జరుగుతున్నయంటె ఏడున్నా ఉరికేదాన్ని. యాక్టర్లతోని ఆటోగ్రాఫ్‌ల కోసం ఎగబడేదాన్ని. ఇప్పుడు నా షూటింగ్‌లు చూడనీకి జనం వస్తున్నరు. సెల్ఫీలు అడుగుతున్నరు. ఇలాంటి దినమొస్తదని ఎన్నడనుకోలె. మాది కరీంనగర్ జిల్లా. కరీంనగర్ టౌన్లోనే ఉంటం. అమ్మోళ్లది నిర్మల్. బాపు టీచర్‌గా పనిచేసేటోడు. మా ఇంట్లో అందరూ బాగా చదువుకున్నా.. మా కట్టూబొట్టూ మారలే. చిన్నప్పటి నుంచి రెండు జడలేసుకొని పల్లెటూరి పిల్ల లెక్క ఉండేదాన్ని. బాపు, అమ్మ మాకు ఏ లోటూ లేకుండా సాదిండ్రు. ఎట్లా కష్టపడాల్నో, పైకెట్లా రావాల్నో నేర్పించిండ్రు. అది ఇప్పుడు ఉపయోగపడుతున్నది. సినిమాలంటే నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం. సినిమాలు ఎట్ల తీస్తరో, యాక్టర్లు ఎట్ల నటిస్తరో అనుకునేదాన్ని. ఆ ఆసక్తే నన్ను ఇటువైపు నడిపించిందేమో!
పాటలు పాడేదాన్ని
నేను నిర్మల్‌లోనే డిగ్రీ చదివాను. కాలేజీ ప్రోగ్రామ్స్‌కి పాటలు పాడేదాన్ని. నా పాట కోసం అందరూ ఎదురుచూసేటోళ్లు. జానపదాలతోపాటు సిన్మా పాటలూ పాడుతుండే. పిల్లలకు పాటలు కూడా నేర్పిస్తుండే. ఒకసారి మా ఊళ్ల షూటింగ్ అయితుంటే చూద్దామని పోయిన. అందరు ఎగబడి చూస్తున్నరు. నేనూ పొయిన. ఎట్లనో అట్ల ఇంత జాగ దొరకవట్టి షూటింగ్ చూసిన. మస్తు అనిపించింది. టీవీల సీరియళ్లు చూసుడు తప్పితే.. అవ్వెట్ల షూటింగ్ చేస్తరో తెల్వదు. అందుకే షూటింగ్ అయిపోయిందాక అక్కడే కూసొని చూసిన. నటీనటులు యాక్టింగ్ ఎట్ల చేస్తరో చూసిన. నేనూ యాక్టింగ్ చేయాలని అప్పుడే డిసైడ్ అయిన. తెల్ల్లారింది మొదలు అద్దం ముందు నిల్సొని యాక్టింగ్ చేస్తూ మురిసిపోతుండే. ‘ఏం పన్లేదా’ అనేటోళ్లు ఇంట్ల. ఓరోజు ‘నేను యాక్టర్ అయితా’ అని చెప్పిన. ‘యాక్టింగ్, గీక్టింగ్ జాన్తానై. గమ్మున తిని కూసో’ అన్నరు.
ప్రోత్సాహం లేకుండె
నటించాలనే నా ఆశలపై ఇంట్లో వాళ్లు నీళ్లు జల్లిండ్రు. దాంతో చాన దినాలు గమ్మునున్న. కానీ, ఎన్నిరోజులని ఆలోచలను అణచుకొని ఉంటం! ‘ఇగ ఊరుకునేది లేదు’ అనుకుని నా ప్రయత్నాలు మొదలుపెట్టిన. నా టాలెంట్ పదిమందికి తెలిసి అవకాశాలు తలుపు తట్టినయి. ఇప్పుడు నేను 500కు పైగా షార్ట్ ఫిలిమ్స్‌లో నటించిన. మంచి పేరొచ్చింది. ఎక్కడికెళ్లినా నన్ను గుర్తువడ్తుండ్రు. సెల్ఫీలకు ఎగవడుతుండ్రు. ఒక చిన్న బాధ ఏందంటే ‘నేను యాక్టింగ్ చేస్తా’ అని చెప్పినప్పుడు ఎంకరేజ్ చేసి ఉంటే ఇవాళ ఇంకా మంచి పొజిషన్లో ఉండేదాన్నేమో అనిపిస్తుంటది. నేను ప్రత్యేకంగా ట్రైనింగ్ తీసుకున్నది లేదు. ప్రయత్నించిందీ లేదు. వయసు పెరుగుతున్నకొద్దీ.. జీవితం మారుతున్నకొద్దీ.. మనలోని కొత్త టాలెంట్ బయటపడుతుంది. కొత్తదారి ఎదురవుతుంది.
డబ్బులకు తిప్పలైంది
మా ఆయనది గ్రామీణ నేపథ్యమే అయినా ఈ కాలానికి తగ్గట్టు ఉంటడు. ఆయన కొరియోగ్రాఫర్‌గా పనిచేస్తడు. పెండ్లయిన కొద్దిరోజులకు మేం కరీంనగర్ నుంచి హైదరాబాద్‌కు వెళ్లినం. పరిస్థితులు అన్నిసార్లు ఒకేతీరుగా ఉండవు. సమస్యలు చుట్టుముడతయి. కుటుంబ కారణాల వల్ల మేం మళ్లీ ఊరికి వచ్చేశాం. మా ఆయన జాబ్ మానేసిండు. డబ్బులకు బాగా ఇబ్బంది అయ్యింది. నేను ప్రయివేట్ పాఠశాలలో టీచర్‌గా చేరిన. ప్రైవేటు స్కూళ చెప్తే ఎంతిస్తరు? మహా అంటే ఐదారు వేలు. నెల తిరిగే సరికి డబ్బులుండేటియి కాదు. ఎవరినన్నా అడుగుదామంటే ఆత్మాభిమానం అడ్డొచ్చేది. మా ఆయన ఇక్కడే డ్యాన్స్ క్లాస్‌లు చెప్తుండే. మా పరిస్థితి మారాలంటే యాక్టింగ్ ఒకటే మార్గం అనిపించి ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టిన.
విమర్శలు పట్టించుకోలేదు
నేను నటిస్తనంటే.. రకరకాల మాటలు అనేటోళ్లు మావోళ్లు. ఇక మా అమ్మయితే ‘ఏదో యూట్యూబ్‌లో నటించేస్తే సెలబ్రిటీ అయిపోతవా? ఊకె ఇస్కూళ్ల సదువు చెప్పుకుంట ఉండక’ అంటుండే. ఎవరెన్ని మాటలన్నా నేను మాత్రం పట్టించుకునేదాన్ని కాదు. ఎక్కువగా సత్తన్న-మల్లన్న చానల్, ఆర్ఎస్ నంద చానల్లో చేసేదాన్ని. ఇప్పుడున్నన్ని యూట్యూబ్ చానల్స్ అప్పట్ల లేవు. అయినా ప్రయత్నం ఆపలే. మెల్లమెల్లగా అవకాశాలు వచ్చినయ్. పల్లె నుంచి యూట్యూబ్ చానల్లో నటించిన తొలి మహిళ నేనే కావొచ్చు. పల్లెజనాలకు యూట్యూబ్ దగ్గరయ్యే కొద్దీ నాకూ ఆదరణ పెరిగింది. ఎప్పుడైనా ఊర్లపొంటి పోతే ‘ఓ అక్కా.. నువ్వు రాధికవు కదూ’ అని గుర్తువట్టేటోళ్లు. అట్లా ఫేమస్ అయిపోయిన. నన్ను ఆదర్శంగా తీస్కొని చాలామంది వచ్చిండ్రు తర్వాత.
సినిమాలు, సీరియళ్లు చేయాలె
ఇప్పటి వరకు 500కు పైగా షార్ట్ ఫిలిమ్స్‌లో నటించిన. మంచి పేరొచ్చింది. గుర్తింపొచ్చింది. డబ్బులు కూడా వస్తున్నాయి. ఇప్పుడిప్పుడే సినిమా అవకాశాలూ వస్తున్నయ్. విరాటపర్వం, ప్రేమలేఖ, గల్లీ కుర్రాళ్లు, భిక్ష, దొరసాని.. వంటి సినిమాల్లో నటించిన. సినిమాల్లో ఇంకా మంచి మంచి పాత్రలు చేయాలి. అట్లనే సీరియళ్లలో నటించాలనేది కూడా ఉంది. ఒకప్పడు కాలక్షేపం కోసం సీరియల్స్ చూసిన నేను, అదే టీవీల సీరియళ్లలో కనిపించాలి. ఇంకోటి సీరియళ్లలో నటనకు బాగా స్కోప్ ఉంటుంది. చూస్తున్న కదా? వాటిల్లో వచ్చే వదినె, మరదలు వంటి పాత్రలకు నేను బాగా సెట్టయితా. ‘సింగిల్ టేక్లనే సీన్ కంప్లీట్ చేసేంత సహజంగా నీ నటన ఉంటది’ అంటుంటరు డైరెక్టర్లు. అవకాశం వస్తే అక్కడ కూడా నిరూపించుకోవాలని ఉన్నది.
మా ఆయన ప్రోత్సాహం
ఫిల్మ్ ఇండస్ట్రీతోటి అనుబంధం ఉండటం వల్ల మా ఆయన నన్ను ఎంకరేజ్ చేసిండు. ‘నీకు యాక్టింగ్ అంటే ఇష్టం కదా? నీ టాలెంట్‌కు నేనెప్పుడూ అడ్డురాను. జాగ్రత్తగా చేసుకో’ అన్నడు. ఆయన అట్లా అన్నప్పుడు నా ఆనందం మాటల్లో చెప్పలేను. ఎందుకంటే ఆయన ఫిల్మ్‌సిటీలో కొరియోగ్రాఫర్‌గా చేసేటోడు కదా! ఈ రంగంలో వాతావరణం బాగా తెలుసు. అయినా నాపై ఉన్న నమ్మకంతో నన్ను ‘నటన’ వైపు ప్రోత్సహించిండు. తొలుత ‘శివం’ అనే షార్ట్ ఫిల్మ్‌లో యాక్టింగ్జేసిన. అది చూసిన వాళ్లు ‘యాక్టింగ్జేసినట్లు లేదు.. ఇంట్ల ఎట్లుంటవో అట్లనే ఉంది. బాగజేస్తున్నవ్. మంచి ఫ్యూచర్ ఉంది’ అని చెప్పడంతో ఇక వెనకకు తిరిగి చూడొద్దు అనుకున్న.
అన్నీ సెట్ చేసి వెళ్తా..
నాకు ఇద్దరు ఆడబిడ్డలు. ఇప్పుడు నాకు ప్రతిరోజూ ‘షూటింగ్స్' ఉంటున్నయ్. పొద్దున్నే లేవడం, ఇంటి పనిచేసుకోవడం, షూట్‌కి వెళ్లడం, తర్వాత వచ్చి ఇంటి పని చేయడం.. ఇదే నా ప్రపంచం. ఎంత బిజీ అయినా పిల్లలపై భారం పడకుండా చూసుకుంటా. వారికి అన్నీ సెట్ చేసి షూటింగ్‌కు పోతా. పిల్లలు కూడా నన్ను బాగా అర్థం చేసుకుండ్రు. నేను నటించిన షార్ట్ ఫిల్మ్స్ చూసి చానా హ్యాపీ అయితరు పిల్లలు. ‘బాగా చేసినవ్ మమ్మీ’ అంటుంటరు. వారి సహకారం మరువలేనిది.