మంగళవారం 02 మార్చి 2021
Zindagi - Feb 16, 2021 , 02:40:30

కోటి వృక్షార్చనకు సుముహూర్తం రేపే!

కోటి వృక్షార్చనకు సుముహూర్తం రేపే!

పచ్చని చెట్టు, చల్లని తల్లి.. ఒకటే! అమ్మ జన్మనిస్తుంది. చెట్టు ఫల, పుష్పాలు అందించి జీవితాన్నిస్తుంది. కాబట్టే, ప్రకృతిని కాంతతో పోల్చారు. వృక్షాన్ని మాతృమూర్తిగా భావించారు. క్షీరసాగర మథనంలో కల్పవృక్షం, లక్ష్మీదేవి ఉద్భవించడం వెనుక ఉన్న తత్వమూ ఇదే!  లోకం పచ్చగా ఉంటేనే, దేశం సుభిక్షంగా ఉంటుంది. అందుకే, తెలంగాణ పుడమిని హరితభరితం చేస్తున్నారు  ముఖ్యమంత్రి కేసీఆర్‌. ఆయన జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని హరిత విప్లవానికి మరోసారి అంకురార్పణ జరుగుతున్నది.  కోటి వృక్షార్చనకు సుముహూర్తం రేపే!

అనగనగా ఓ పేదరాలు. ఆమెకు ఇద్దరు ఆడపిల్లలు. ఆ పేదరికం నుంచి బయటపడటానికి చిన్న కూతురు కుముద ఓ సాహసానికి ఒడిగడుతుంది. ఆమెకి చెట్టుగా మారే ఓ వరం ఉంటుంది. తన అక్క సాయంతో, ఆ వరాన్ని ఉపయోగించి రోజూ అందమైన పూలచెట్టులా మారేది. ఆ చెట్టు నుంచి కోసిన పూలతో హారం కట్టి, రాజభవనానికి అమ్మేవాళ్లు. కాలం గడిచిపోతున్నది. చెట్టుగా మారే క్రతువులో ఏమాత్రం తేడా వచ్చినా, పూలు కోసేటప్పుడు కాస్త అశ్రద్ధగా ఉన్నా తన శరీరం గాయపడుతుందని కుముదకి తెలుసు. అయినా కుటుంబం కోసం ప్రమాదాలను లక్ష్యపెట్టలేదు. ఇంతలో ఆ అసాధారణమైన పూల గురించి రాకుమారుడికి అనుమానం రానే వస్తుంది. ఆ కుటుంబాన్ని రహస్యంగా వెంబడించి, కుముద గురించి తెలుసుకుంటాడు. ఆమె త్యాగానికీ, అందానికీ ముచ్చటపడి పెండ్లి చేసుకుంటాడు. 

కుముదతో తన అన్న వివాహాన్ని ఓర్చుకోలేని రాకుమారి, ఆ రహస్యం తెలుసుకుంటుంది.  తన కోసం కూడా చెట్టుగా మారమని కుముదని బలవంత పెడుతుంది. అలా మారిన తర్వాత  కసితీరా కొమ్మలనూ రెమ్మలనూ విరిచి పారేస్తుంది. ఈ కథ రకరకాల మలుపులు తిరిగి చివరికి సుఖాంతం అవుతుంది. దక్షిణ భారతదేశంలో వినిపించే ఈ జానపద గాథకు ప్రముఖ రచయిత ఎ.కె. రామానుజన్‌ ముగ్ధుడైపోయాడు. ‘ఎ ఫ్లవరింగ్‌ ట్రీ’ పేరుతో అక్షరరూపం ఇచ్చాడు. ఈ కథ విని, ముచ్చటపడిన గిరీష్‌ కర్నాడ్‌ ‘చెలివి’ పేరుతో సినిమా నిర్మించాడు. తరతరాలుగా చెట్లకూ, మహిళలకూ మధ్య ఊహిస్తూ వచ్చిన సారూప్యతకు సాక్ష్యమీ కథ. స్త్రీ పుష్పించే వృక్షం లాంటిది. పుష్ప, ఫల, పత్రాలతో సృష్టిని నడిపించే భూమిక తను. కానీ, ఆ వికాసం కారణంగానే సమాజం నుంచి అటు ప్రేమనీ, ఇటు క్రౌర్యాన్నీ చవి చూడాల్సి వస్తున్నది. ఎలాగైనా ఆమె మనసును సొంతం చేసుకోవాలనుకునే వాళ్లూ, ఆమె సంతోషాన్ని చూసి ఓర్వలేక నాశనం చేయాలనుకునే వాళ్లూ సమాజంలో అనేకమంది. మహిళలకూ, వృక్షాలకూ మధ్య ఇంతకంటే గొప్పగా, ఉద్వేగభరితంగా పొంతన చూపడం సాధ్యం కాదేమో!

పురాణాలే సాక్ష్యం

చెట్టూచేమలతో స్త్రీమూర్తికి ఉన్న అనుబంధానికి ఆదినుంచీ అక్షర సాక్ష్యాలెన్నో! పుడమి గర్భం నుంచి బయటపడిన సీతాదేవి భూమాతను తలపించే ఓర్పుతోనే కష్టాలను నెట్టుకొచ్చింది. అశోకవనంలోని శింశుపా వృక్షం నీడన, రాముని కోసం ఎదురుచూస్తుంది సీతమ్మ. ఇక, అందమైన బృందావనం రాధాకృష్ణుల రాసలీలకు వేదికలా గుర్తుండిపోతుంది. అందరికీ తెలిసిన ఇలాంటి కథలే కాదు, పరిచయం లేని గాథలెన్నో!  ‘విక్రమోర్వశీయం’ అనే కావ్యంలో..  పునర్వసుతో ప్రేమలో పడిన ఊర్వశి శాపవశాత్తు ఓ వృక్షంలా మారిపోతుంది. శాపవిమోచన కావడంతో ఆ ప్రేమకథ సుఖాంతం అవుతుంది. కాళిదాసు విరచిత ‘అభిజ్ఞాన శాకుంతలం’ కావ్యం ప్రకారం కణ్వ మహర్షి ఆశ్రమంలో పెరిగిన శకుంతల, అక్కడి అణువణువుతోనూ ప్రేమను పంచుకుంటుంది. శకుంతల ఆ ఆశ్రమాన్ని విడిచివెళ్లే సందర్భంలో ఆమె ఎడబాటుని సహించలేక, అక్కడి చెట్లు సైతం కన్నీరు కార్చాయని హృద్యంగా వర్ణించాడు కాళిదాసు. నాటి కాళిదాసు నుంచి నిన్నమొన్నటి జగదీష్‌ చంద్రబోసు వరకు ఎందరో భారతీయులు మొక్కలకూ ప్రాణం ఉందని ఊహించారు. అది అచ్చంగా స్త్రీ హృదయమే అని భావించారు. 

పర్యావరణమే ఆమె ప్రాణం

అనాదిగా ఆమె చెట్టుతో స్నేహం చేస్తూనే ఉన్నది. నీడను కల్పించడంలో, పిల్లల్ని కనడంలో, బిడ్డల ఆకలి తీర్చడంలో వృక్షాలదీ, తనదీ ఒకటే విధానం, అంతే తపన! అందుకే, తన నెచ్చెలి లాంటి చెట్టు కోసం ప్రాణమైనా అర్పించేందుకు సిద్ధపడింది. 1730లో రాజస్థాన్‌లోని బిష్ణోయ్‌ తెగకు చెందిన అమృతాదేవి చెట్లను నరికివేయడానికి వచ్చిన సైనికులను అడ్డుకోవడానికి తన ముగ్గురు కూతుళ్లతో కలసి అక్కడి వృక్షాలను కౌగిలించుకొంది. గొడ్డలి దెబ్బకు ప్రాణాలు విడిచింది. ‘మనిషి తల కంటే చెట్టు మొండెం చాలా విలువైంద’నే ఆమె మాటల్ని ఇప్పటికీ ఆ తెగవాళ్లు శిరసావహిస్తారు. 1973లో సంచలనం సృష్టించిన ‘చిప్‌కో’ ఉద్యమానికి అమృతాదేవే స్ఫూర్తి. చిప్‌కో ఉద్యమంలోనూ గౌరాదేవి, సురక్షాదేవి వంటి మహిళలు వనదేవత కోసం తమ ప్రాణాలను అడ్డు పెట్టేందుకు సిద్ధపడ్డారు. ఇదే బాటలో చెట్లకి రక్షణగా నిలుస్తున్నవారు ఎందరో. ఉద్యమాలు, ఉపన్యాసాలు, పుస్తకాలతో అరుదైన వృక్షసంపదను కాపాడే ప్రయత్నం చేస్తున్న ‘సునీతా నారాయణ్‌' వంటి మేధావులు కొందరైతే, పెద్దగా చదువు లేకపోయినా చెట్టే ఈ లోకానికి రక్షణ అని గుర్తించి వేలాది మొక్కలను కన్నబిడ్డల్లా సాకిన ‘సాలుమరద తిమ్మక్క’ వంటివారు మరికొందరు. ఆ వృక్ష యోధుల స్ఫూర్తి మరోసారి రగిలే సందర్భమిది. 

కేసీఆర్‌ కలలు కన్న తెలంగాణ ఇప్పుడు, జల తరంగిణులతో కళకళలాడుతున్నది. కాళేశ్వరం ప్రాజెక్టుతో ఊరూరా గోదారి గట్లు కనిపిస్తున్నాయి. ఆ గట్ల మీద చెట్లుండాలి. చెట్ల బారులుండాలి. వాటి పచ్చదనంలో ప్రకృతి ‘కాంత’ పరవశించాలి. తెలంగాణ తల్లి పులకరించాలి.

సంప్రదాయంలో..

 గృహ వైద్యంలో అమ్మలదే పైచేయి. తులసి రసం నుంచి వేప కషాయం వరకూ ఆమె హస్తవాసితో ఎన్నో రోగాలు తగ్గిపోతాయి. బతుకమ్మ పూల దగ్గర నుంచీ వినాయకుడి ఏకవింశతి పత్రాల వరకూ ప్రతి చెట్టూ, దాని ఔషధ  లక్షణాలూ ఆమెకు కరతలామలకమే! తులసిని లక్ష్మిగా, వేపని శీతలాదేవిగా భావిస్తుంది. క్షీరాబ్ది ద్వాదశి రోజున తులసి చెట్టుకూ, ఉసిరి కొమ్మకూ పెండ్లి చేస్తారు. సంసార సౌభాగ్యం కోసం చేసే కదళీ వ్రతం, పసుపు కుంకాల కోసం చేసే వట సావిత్రీ వ్రతం కూడా చెట్టులో దైవత్వాన్ని చూడటమే.

ఇదిగో వృక్షవేదం..

చెట్లు ఎండలో ఉంటూ నీడనిస్తాయి. ఇల్లాలు సైతం ఎన్నో కష్టనష్టాలకోరుస్తూ ఇంటిల్లిపాదినీ సంరక్షిస్తుంది. స్త్రీ గొప్పదనాన్ని, సౌందర్యాన్ని వివరించిన కావ్యాలన్నీ వృక్షాల ప్రాముఖ్యాల్నీ వివరించాయి. వాల్మీకి రామాయణం మొదలు కాళిదాసు ‘రుతు సంహారం’, హర్షుడి ‘గాథాసప్తశతి’ వరకు ఇలా ఎన్నో కావ్యాలు స్త్రీత్వాన్ని ప్రశంసిస్తూనే ప్రగతికి మెట్లు చెట్లేనని చాటిచెప్పాయి. చెట్టు గొప్పదనాన్ని వివరిస్తూ, తెలంగాణలోని పచ్చదనాన్ని ప్రస్తావిస్తూ ఇటీవల ఎంపీ జోగినిపల్లి సంతోష్‌కుమార్‌ సంకలనం చేసిన ‘వృక్షవేదం’ తరతరాలుగా తరులతో మనిషికి ఉన్న అనుబంధాన్ని అందంగా చెబుతుంది. పచ్చదనం ఆవశ్యకతను భావితరాలకు బోధిస్తుంది. 

VIDEOS

logo