e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, December 9, 2021
Home జిందగీ నగనిగలకు జాతిరత్నాలు

నగనిగలకు జాతిరత్నాలు

పుడమి ఒడిలో, సముద్ర గర్భంలో ఎన్ని రాళ్లున్నా.. జాతిరత్నాలకున్న ప్రాధాన్యం అంతాఇంతా కాదు. ఆదిత్యుని అనుగ్రహం కోసం కెంపులు, శనైశ్చరుడి చల్లని చూపు కోరి నీలాలు ధరిస్తుంటారు. అయితే, ఉంగరాల్లో పొదిగిన రత్నాలు జీవితాల్ని ఎంతవరకు మారుస్తాయో దైవానికెరుక! ఆభరణాల్లోకొలువుదీరిన నవరత్నాలు మాత్రం నగనిగలను అమాంతం పెంచేస్తాయి.కెంపుల సొంపులు సొగసరిని ఇంపుగా చూపుతాయి. పచ్చలపేరును నచ్చని వారుండరు. అందుకే నవరత్న ఖచిత నగనిగలు ఇప్పుడు ఫ్యాషన్‌ ట్రెండ్‌ అయింది. ఆ జాతిరత్నాల నగధగలేంటో మనమూ చూద్దాం..

గ్రహాల అనుకూలత కోసం నవరత్నాలు, రకరకాల రాళ్లను పొదిగిన ఉంగరాలు, ఆభరణాలను ధరిస్తుంటారు చాలామంది. అయితే కొన్ని వందల సంవత్సరాల క్రితమే ఏడు వారాల నగల పేరుతో నవరత్నాల నగలు తయారయ్యాయి. ఒక్కోరోజూ ఒక్కోరకం రత్నంతో చేసిన నగలను ధరించేవారు. నిండుగా కనిపించాలని అన్నిటినీ ఒకేరోజు ధరించేవారు కూడా లేకపోలేదు. సూర్యునికి ఇష్టమైన ఆదివారం కెంపుల నగలు, చంద్రుడు అధిపతిగా చెప్పే సోమవారం నాడు ముత్యాల హారాలు, కుజుడి వారమైన మంగళవారం పగడం, బుధవారం నాడు పచ్చ, గురువారం పుష్యరాగం, శుక్రవారం వజ్రాలు, శనివారం నీలంతో చేసిన హారాలు, గాజులు, ముక్కుపుడకలు ధరిస్తుండేవారు. ఇలా కాకుండా మొత్తం నవరత్నాలతో చేసిన కమ్మలు, ముక్కుపుడక, పాపిడ బిళ్ల, వంకీలు.. ఇలా అన్నిటినీ చేయించుకొని ధరించేవారు కూడా. ఇప్పటికీ సెలబ్రిటీ ఫొటో షూట్లు, జ్యువెలరీ ఫ్యాషన్‌ షోల్లోనూ నవరత్నాల నగలు తళుక్కుమంటూనే ఉంటాయి. 

- Advertisement -

విడివిడిగానూ&నవరత్నాలను ఒకే హారంలోనో, ఉంగరంలోనో పొదిగిన నగలే కాకుండా విడివిడిగానూ ఒక్కో రత్నంతో ప్రత్యేకంగా రూపొందిన డిజైన్లూ అందుబాటులో ఉన్నాయి. అభిరుచినీ, నమ్మకాన్ని బట్టి వీటిని ధరిస్తారు మహిళలు. ఎక్కువగా పెద్దవయస్సు వాళ్లు ముత్యాలు, పచ్చల హారాలు ధరిస్తారు. ఆధునికంగా కనిపించాలనుకునే స్త్రీలు కెంపులు, నీలం పొదిగిన నెక్లెస్‌లు, పెండెంట్‌లు ధరించి అందరినీ ఆకర్షిస్తారు. నవరత్నాలు పొదిగిన గాజులు సైతం మగువల మనసులను దోచేస్తున్నాయి. నల్లపూసల్లో వేసుకునే పెండెంట్‌లను కూడా నవరత్నాలతో చేయించుకుంటున్నారు. వజ్రాల నగలే కాకుండా కెంపులు, పచ్చలు పొదిగిన నెక్లెస్‌లు, హారాలను కూడా ఇష్టపడుతున్నారు ఆధునిక మహిళామణులు.

భద్రత ముఖ్యం

నవరత్నాలతో చేసిన నగలు వేసుకునేటప్పుడు, భద్రపరుచుకొనేటప్పుడు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. సూర్యకాంతి పడటం వల్ల కొన్ని రాళ్లు రంగు మారిపోతాయి. నవరత్నాల నగలను సబ్బునీటితో శుభ్రపరచకూడదు. వేడినీళ్లతో స్నానం చేసేటప్పుడు వీటిని పక్కన పెట్టాలి. లేకపోతే రంగు మారిపోవడమే కాదు, మెరుపు కూడా తగ్గిపోతుంది. ముందుగా దుస్తులు ధరించిన తర్వాతే ఈ నగలను ధరించాలి. ఎందుకంటే, కొన్ని దుస్తులకు అద్దే రంగుల్లో వాడే రసాయనాల వల్ల కూడా రత్నాల మెరుపు తగ్గుతుంది. అంతేకాదు, పలు రసాయనాలతో తయారయ్యే సెంటు కూడా వీటి మెరుపును తగ్గిస్తుంది. మెరుపు తగ్గిందనుకున్నప్పుడు కొంచం నీళ్లు పెట్టి మెత్తని బట్టతో తుడవాలి. మరీ నల్లగా మారాయనుకున్నప్పుడు మెరుగు పెట్టిస్తే సరి.

జ్యోతిషశాస్త్రం ప్రకారం నవగ్రహాలకు నవరత్నాలుంటాయి. ఒక్కో గ్రహం అనుగ్రహం కోసం ఒక్కో రత్నం ఉంగరంగా ధరిస్తుంటారు. ఫలితంగా ఆయా గ్రహాల దోషాలు తొలగిపోయి మేలు జరుగుతుందని కొందరి నమ్మకం. అయితే ఉంగరాల రూపంలో నవరత్నాలను ధరించడం పూర్వీకుల కాలం నుంచీ వస్తున్నదే! ప్రస్తుతం నవరత్నాలు పొదిగిన నెక్లెస్‌లు, హారాలు, చెవికమ్మలు, వడ్డాణాలు ఇలా రకరకాల ఆభరణాలు అందుబాటులో ఉంటున్నాయి. తాతల కాలంలోనూ ఈ ట్రెండ్‌ ఉన్నా.. ఈ మధ్యకాలంలో మళ్లీ ఊపందుకున్నది. ధగధగ మెరిసే రాళ్లతో పోలిస్తే సహజ కాంతితో ఆకర్షించే జాతిరత్నాల నగలపై మగువలు మక్కువ ప్రదర్శిస్తున్నారు.

కెంపు, ముత్యం, పగడం, పచ్చ, పుష్యరాగం, వజ్రం, నీలం, గోమేధికం, వైడూర్యం.. వీటిని నవరత్నాలు అంటారు. ప్రాచీనకాలంలో మహారాజులు, రాచరిక కుటుంబీకులు నవరత్నాల ఉంగరాలు, ఆభరణాలు ధరించేవారు. ఎక్కువగా వీటిని రాజముద్రికలుగా ఉపయోగించేవాళ్లు. ఈ నగలు ధరిస్తే అందంతోపాటు ధరించిన వ్యక్తి మానసిక స్థితి మెరుగుపడుతుందని భావించేవాళ్లు. నవరత్నాలు పొదిగిన నగలను ధరించడం వల్ల అదృష్టం కలిసి వస్తుందనీ విశ్వసించేవాళ్లు. 

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement