బుధవారం 27 జనవరి 2021
Zindagi - Jan 14, 2021 , 01:13:57

గో కరోనా.. కమాన్‌ కేజీఎఫ్‌

గో కరోనా.. కమాన్‌ కేజీఎఫ్‌

సంక్రాంతి అనగానే.. వీధివీధినా రంగవల్లులు పలుకరిస్తుంటాయి. వినువీధుల్లో పతంగులు నర్తిస్తుంటాయి. చురుక్కుమనే ఎండలో తలపైకెత్తి చూస్తే గాలికి సయ్యాటలాడుతూ గాలిపటాలు ఒలకబోసే వయ్యారాలు చూడ ముచ్చటగా ఉంటాయి. ఈసారి మరింత వింత గాలిపటాలు 

చూపును కట్టిపడేస్తున్నాయి. సినిమాలతో ‘డీల్‌' కుదుర్చుకున్నవి కొన్నయితే.. కరోనాను ‘కీంచ్‌ కట్‌' చేస్తామని సందేశమిచ్చేవి మరికొన్ని.

సాదాసీదా పతంగులు పాత జమానా మాట. రెండున్నర దశాబ్దాల కిందటి నుంచీ గాలిపటాల మీద సినిమా పోస్టర్లు ఎక్కడం మొదలైంది. అప్పట్లో బాలీవుడ్‌ సంచలనం ‘ఖుదా గవా’ సినిమా పోస్టర్‌ గాలిపటంపై చక్కర్లుకొట్టింది. ‘మైనే ప్యార్‌ కియా’, ‘దిల్‌వాలే దుల్హనియా లేజాయేంగే’ పతంగులు అందరి మనసునూ దోచేశాయి. తెలుగు సినిమాల ప్రచార చిత్రాలు సైతం పతంగులపై ప్రత్యక్షమయ్యాయి. ఏ బొమ్మ సూపర్‌హిట్‌ అయితే.. ఆ బొమ్మున్న పతంగికి గిరాకీ ఎక్కువ ఉంటుంది. ఈసారి రిలీజ్‌కు ముందే ‘కేజీఎఫ్‌-2’ పతంగులు నీలాకాశం అంతా నిండుతున్నాయి. కేజీఎఫ్‌ కన్నా పెద్దహిట్‌గా ‘కరోనా’ నిలిచింది. ఈ సంక్రాంతి థీమ్‌ అంతా కరోనా చుట్టూ తిరుగుతున్నది. ‘గో కరోనా’, ‘సోషల్‌ డిస్టెన్స్‌', ‘మాస్క్‌ ధరించండి’.. తదితర కొటేషన్లున్న గాలిపటాలు విపరీతంగా అమ్ముడవుతున్నాయి. ప్రపంచ వాణిజ్య వ్యవస్థను కుదిపేసిన కొవిడ్‌ గాలిపటాల వ్యాపారులకు మాత్రం అంతోయింతో లాభం చేకూరుస్తున్నది.

పిల్లలకు కార్టూన్లు

పిల్లల విషయానికి వస్తే.. వారికిష్టమైన కార్టూన్లు గాలిపటాలపై ఎప్పటిలాగే కొలువుదీరాయి. ట్రెండింగ్‌లో ఉన్న చిట్టి క్యారెక్టర్లన్నీ ప్రత్యక్షమయ్యాయి. ‘చోటా భీమ్‌', ‘డోరేమాన్‌', ‘టామ్‌ అండ్‌ జెర్రీ’, ‘బగ్స్‌ బన్నీ’ మొదలైన కార్టూన్లున్న పతంగులు అధికంగా అమ్ముడవుతున్నాయి.


logo