కొవిడ్ కష్టకాలంలో ఇష్టమైన వాళ్లకు దూరంగా బతుకుతున్నాం. నలుగురూ ఓచోట చేరి సందడి చేయడానికి వీల్లేకుండా పోయింది. ప్రత్యేక సందర్భాల్లో చిన్న గిఫ్ట్ ఇచ్చేందుకూ కుదరడం లేదు. ఇకనుంచి ఆ బాధ ఉండదు. చేతిలో ఫోన్ ఉంటే చాలు, ఇ-గిఫ్ట్ పంపవచ్చు. ఓ కొరియన్ అమ్మాయి ఆలోచనకు రూపమే ఈ గిఫ్టింగ్ కంపెనీ. ‘గిఫ్టీఐకాన్ (GIFTIICON)’ పేరుతో ఇండియన్ మార్కెట్లోకి అడుగుపెట్టింది జి హ్యూన్ చోంగ్. తన తండ్రి నక్యూన్ చోంగ్‌తో కలిసి బహుమతుల వ్యాపారం చేస్తున్నది. గిఫ్టీఐకాన్ యాప్ ద్వారా నచ్చిన వారికి, తాము ఎంపిక చేసిన బహుమతి సమాచారాన్ని ఎస్ఎంఎస్ లేదా వాట్సాప్ మెసేజ్‌ద్వారా పంపవచ్చు. ఈ యాప్‌లో ప్రత్యేకత ఏమిటంటే, గిఫ్ట్‌ని ఎప్పుడు పంపాలన్నది కూడా షెడ్యూల్ చేసుకోవచ్చు. కాస్మెటిక్స్, హోమ్ డెకార్నుంచి పూలవరకు ఇందులో చాలా రకాల ఆప్షన్స్ ఉంటాయి. ఆ మొబైల్ ఓచర్‌తో వాళ్లు నేరుగా స్టోర్‌కి వెళ్లి గిఫ్ట్ అందుకోవచ్చు లేదా హోమ్ డెలివరీ ఆప్షన్ద్వారా ఇంటికే తెప్పించుకోవచ్చు. ఈ ఐడియా కొరియాలో సూపర్ హిట్! రెండు కోట్ల నలభై లక్షలమంది యూజర్స్ ఉన్నారు. ఇప్పుడు ఇండియాలోనూ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. బెంగళూరులో ఆఫీసు తెరిచారు.
పోస్ట్ కొవిడ్ ప్లాన్స్
‘మన భావాలను, అభినందనలను బహుమతి రూపంలో అందించడంలోని ఆనందం ఎందులోనూ దొరకదు. ఇదే కాన్సెప్ట్‌తో మేం బిజినెస్ మొదలుపెట్టాం. కొరియాలో సక్సెస్ అయినట్లే, ఇండియాలోనూ రాణించగలమన్న నమ్మకం ఉంది. కొందరికి ఎలాంటి గిఫ్ట్ ఎంచుకోవాలన్న విషయంలో అవగాహన ఉండదు. పైగా షాప్‌కి వెళ్లి సెలెక్ట్ చేసుకోవడం, దాన్ని అయినవాళ్లకు చేరవేయడం పెద్ద ప్రాసెస్. కానీ, మొబైల్ ఫోన్ ఉంటే చాలు, ఒక్క ఎస్ఎంఎస్తో కస్టమర్ల పని పూర్తి చేసే బాధ్యతను మేం తీసుకుంటాం. మరిన్ని బ్రాండ్స్‌తో టై-అప్ పెట్టుకోవాలని అనుకుంటున్నాం’ అని చెబుతున్నది జి హ్యూన్ చోంగ్.