e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, October 23, 2021
Home ఆరోగ్యం Corona Gangrene | కరోనా కక్ష.. కొవిడ్‌ గ్యాంగ్‌లో.. గ్యాంగ్రీన్‌!

Corona Gangrene | కరోనా కక్ష.. కొవిడ్‌ గ్యాంగ్‌లో.. గ్యాంగ్రీన్‌!

ఎక్కడో తప్ప కనిపించని వ్యాధి, ఎవరినో తప్ప వేధించని సమస్య.. తరచూ ఇబ్బందిపెడుతున్నది. ప్రత్యేకించి, కరోనా నుంచి కోలుకున్న తర్వాత కక్షగట్టినట్టు కలవరపెడుతున్నది. పేగులను కుళ్లబొడిచి ప్రాణాంతకంగా మారుస్తున్నది. కొవిడ్‌ నుంచి బయటపడిన వారిలో గ్యాంగ్రీన్‌ లక్షణాలను తేలికగా తీసుకోలేం. ఏ చిన్న మార్పు కనిపించినా వైద్యులను సంప్రదించాలి. చికిత్స ప్రారంభించాలి.

కరోనా.. యావత్‌ ప్రపంచాన్నీ స్తంభింపజేసింది. దాదాపు రెండు సంవత్సరాలు భూగోళాన్ని వెనక్కి తిప్పినంత పనిచేసింది. మానవజాతిని ఆర్థికంగానూ, ఆరోగ్యపరంగానూ దెబ్బతీసింది. పిల్ల చచ్చినా, పురుటి కంపు పోలేదన్నట్టు.. వైరస్‌ వీడినా ఆ ప్రభావం మాత్రం రోగులను వెంటాడుతున్నది. బ్లాక్‌ ఫంగస్‌ గెరిల్లా దాడి ఒకవైపు.. గుండె, ఊపిరితిత్తులు, మూత్రపిండాలకు సంబంధించిన సమస్యలు మరోవైపు ఉక్కిరి బిక్కిరి చేస్తూనే ఉన్నాయి. మెదడును కూడా వదలడంలేదా మహమ్మారి. ప్రారంభంలో కరోనాను ఊపిరితిత్తుల వ్యాధిగానే భావించారు. రోజులు గడిచేకొద్ది వైరస్‌ అసలు రూపం బయటపడింది. ఒక్క శ్వాసకోశ వ్యవస్థనే కాదు, మొత్తంగా శరీరాన్ని నిస్తేజపరుస్తుందని అర్థమైంది. తొలి రెండు దశల్లో అనేక హఠాన్మరణాలు సంభవించాయి. వైరస్‌ రక్త నాళాలనూ దెబ్బతీస్తుందని తేలింది. రక్త నాళాల్లో రక్తం గడ్డకట్టడం వల్లనే హఠాన్మరణాలు సంభవిస్తున్నట్లు వైద్యులు గుర్తించారు. ఈ కారణంగానే కోలుకున్న తరువాత కూడా గుండెపోటు, ఊపిరితిత్తుల వైఫల్యం, మూత్రపిండాల మొరాయింపు, బ్రెయిన్‌ స్ట్రోక్‌.. వంటి సమస్యలతో రోగులు ఆకస్మికంగా మృత్యువుబారిన పడినట్లు తేల్చారు. దీనిపై అధ్యయనాలు జరుగుతుండగానే.. బ్లాక్‌ ఫంగస్‌ తెరమీదికి వచ్చింది. వైరస్‌ దెబ్బ నుంచి కోలుకున్న చాలా మందిని బ్లాక్‌ ఫంగస్‌ పట్టి పీడించింది. అంతలోనే, మరో పిడుగులాంటి వార్త.. గ్యాంగ్రీన్‌ ముప్పు. పోస్ట్‌ కొవిడ్‌, లాంగ్‌ కొవిడ్‌ రోగుల్లో ఈ సమస్య పొంచి ఉన్నట్టు నిజామ్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ నిపుణుల అధ్యయనంలో తేలింది.

- Advertisement -

గ్యాంగ్రీన్‌ అంటే…
పేగులు కుళ్లిపోవడాన్నే వైద్య పరిభాషలో ‘గ్యాంగ్రీన్‌’ అంటారు. ఈ సమస్య సాధారణంగా దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థుల్లో కనిస్తుంది. మామూలుగా, గ్యాంగ్రీన్‌ కేసులు చాలా అరుదుగా నమోదు అవుతాయి. నిమ్స్‌ దవాఖానకు అయితే సంవత్సరానికి ఆరు నుంచి ఏడు కేసులు మాత్రమే వస్తాయి. కానీ, ఇటీవలి కాలంలో వారం వ్యవధిలోనే ఆరు కేసులు నమోదు అయ్యాయి. వారిలో నలుగురు ఒడ్డున పడ్డారు. మిగతా ఇద్దరు మాత్రం మృత్యువాత పడ్డారు.

ఎందుకు కుళ్లిపోతాయి?
మొక్కలు బతకడానికి నీరు అవసరం. అలాగే, శరీరంలోని ప్రతి భాగానికి రక్తప్రసరణ అవసరం. నీళ్లు లేకపోతే మొక్కలు వాడిపోయి చనిపోతాయి. రక్త ప్రసరణ జరగకపోతే శరీరంలోని అవయవాలు కూడా శుష్కించి చనిపోతాయి. ఈ ప్రక్రియ క్రమక్రమంగా జరుగుతుంది. రక్తం బంద్‌ అయిన కొన్ని రోజులకు ఇన్‌ఫెక్షన్‌ సోకుతుంది. కొంచెంకొంచెంగా కుళ్లిపోవడం మొదలవుతుంది. సాధారణంగా పేగుల్లో రక్తం గడ్డకట్టడం వల్ల, రక్త ప్రసరణ నిలిచిపోయి ఆ ప్రాంతంలో పేగులు కుళ్లిపోతాయి. దీన్నే వైద్యభాషలో ‘గ్యాంగ్రీన్‌’ అంటారు. పెద్ద పేగు, చిన్న పేగు.. రెండూ ఈ సమస్యకు మినహాయింపు కాదు. కాకపోతే, పెద్దపేగు కంటే చిన్నపేగులోనే సమస్య అధికం.

ఎవరికి రావచ్చు?
సాధారణంగా గ్యాంగ్రీన్‌ దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థుల్లో కనిపిస్తుంది. ప్రొటీన్‌-సి, ప్రొటీన్‌-ఎస్‌ లోపం ఉన్నవారిలో, ఎర్ర రక్తకణాలు 10 మిలియన్ల నుంచి 15 మిలియన్ల మధ్యలో ఉన్నవారిలో, మధుమేహ రోగుల్లో, స్టిరాయిడ్స్‌ వినియోగించే వారిలో, ధూమపానం చేసేవారిలో గ్యాంగ్రీన్‌ సమస్య ఉత్పన్నం అవుతుంది.

కరోనా రోగుల్లో ఎందుకు?
ఈమధ్య, నిమ్స్‌లో చేరిన ఆరుగురు యువకులూ తీవ్రమైన కడుపునొప్పితోనే వచ్చారు. వారికి అన్నిరకాల వైద్య పరీక్షలు జరిపించారు. ఎవరికీ ఎలాంటి దీర్ఘకాలిక వ్యాధులు లేవు. వైద్య పరీక్షల్లో కూడా తీవ్ర సమస్యలు ఉన్నట్లు నిర్ధారణ కాలేదు. కానీ అందరికీ ఒకే రుగ్మత.. గ్యాంగ్రీన్‌. సాధారణంగా ఇది దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థుల్లోనే కనిపిస్తుంది. సంవత్సరం మొత్తానికి రావాల్సినన్ని కేసులు వారం రోజుల వ్యవధిలోనే నమోదు కావడం నిపుణులను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. ఎక్కడో ఏదో అనుమానం. రోగులు, వారి కుటుంబ సభ్యులకు కరోనా సోకిందా? అన్న కోణం నుంచి ఆరా తీశారు. అలాంటిదేమీ లేదన్న సమాధానం వచ్చింది. తమలో స్వల్ప లక్షణాలు కూడా కనిపించలేదని రోగులు స్పష్టం చేశారు. ఏ కారణం లేకుండా గ్యాంగ్రీన్‌ ఎలా వచ్చిందన్నది జవాబులేని ప్రశ్నగా మిగిలింది. రక్తం గడ్డకట్టడం అన్నది కరోనా రోగుల్లో ఈ మధ్య అధికంగా కనిపిస్తున్నది. నిమ్స్‌లో చేరిన ఈ రోగుల్లో సైతం రక్తం గడ్డకట్టి పేగులు కుళ్లిపోయే స్థితికి వచ్చాయి. వాళ్లు మాత్రం తమకు కరోనా సోకలేదనే అన్నారు. వెంటనే, ఆ ఆరుగురికీ యాంటీబాడీస్‌ టెస్ట్‌ చేయించారు. అందరిలో కరోనా యాంటీబాడీస్‌ ఉన్నట్లు తేలింది. అంటే, కరోనా వచ్చిపోయిందని అర్థం. ఆ ఆరుగురూ ‘ఎసింప్టమాటిక్‌’ (కరోనా లక్షణాలు బయటపడని) రోగులన్నమాట. కొవిడ్‌ వచ్చిపోయిన విషయం వారికే తెలియదు. సందేహం లేదు! వైరస్‌ దాడి వల్లనే పేగుల్లో రక్తం గడ్డకట్టింది. దీనివల్ల రక్త సరఫరా నిలిచిపోయి పేగులు కుళ్లిపోయాయి. ఆ కేస్‌ స్టడీస్‌ ఆధారంగా మరికొన్ని దవాఖానల రికార్డులను పరిశీలించారు. పోస్ట్‌ కరోనా రోగుల్లో గ్యాంగ్రీన్‌ సమస్యలు తలెత్తుతున్నట్లు తేలింది. దీని ఆధారంగా పోస్ట్‌ కొవిడ్‌ లేదా లాంగ్‌ కొవిడ్‌ రోగులకు గ్యాంగ్రీన్‌ ముప్పు పొంచి ఉన్నట్లు తేలిపోయింది.

ప్రధాన లక్షణాలు:

 • తీవ్రమైన కడుపు నొప్పి.
 • నలుపు రంగులో మలం.
 • వాంతులు.
 • పొట్ట ఉబ్బడం.

నిర్ధారణ పరీక్షలు:

 • సీటీ-స్కాన్‌.
 • సీటీ- యాంజియోగ్రామ్‌.

చికిత్సా పద్ధతులు:

 • వ్యాధిని తొలి దశలోనే గుర్తిస్తే ‘యాంటీ కొవలెంట్‌ డ్రగ్స్‌’ ద్వారా నయం చేయవచ్చు. అంటే పేగులు కుళ్లిపోకముందే, గడ్డ కట్టిన రక్తం పలుచబడేందుకు ఎకోస్ప్రిన్‌ వంటి ఔషధాలతో చికిత్స అందించవచ్చు. వ్యాధి ముదిరి చివరి దశకు చేరితే.. పేగులు కుళ్లిపోయే స్థితికి చేరితే.. శస్త్రచికిత్స ఒక్కటే మార్గం. పేగులు కుళ్లి
 • పోవడం మొదలైన తరువాత కూడా ఆలస్యం చేస్తే.. అంటే, 48 గంటల్లో చికిత్స అందించకపోతే ఇన్‌ఫెక్షన్‌ పెరిగిపోయి జీర్ణ
 • వ్యవస్థ దెబ్బతింటుంది. దీంతో రోగి మృత్యువాత పడే ప్రమాదం లేకపోలేదు.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు

 • కరోనా రోగులు వైరస్‌ నుంచి కోలుకున్న తర్వాత నీళ్లు బాగా తాగాలి.
 • రక్తం పలచబడేందుకు తోడ్పడే ‘బ్లడ్‌ థిన్నర్స్‌’ అధికంగా వాడాల్సి ఉంటుంది. అంటే, వైరస్‌ నుంచి కోలుకున్నాక కూడా, మూడు నెలల పాటు వాడటం వల్ల రక్తం గడ్డకట్టకుండా రక్షణ పొందవచ్చు.
 • మద్యానికి, ధూమపానానికి దూరంగా ఉండాలి.
 • డీహైడ్రేషన్‌కు గురికాకుండా జాగ్రత్త పడాలి.
 • వ్యాధి లక్షణాలు కనిపిస్తే, వెంటనే గ్యాస్ట్రోఎంటరాలజి వైద్యులను సంప్రదించాలి. అవసరమైన పరీక్షలు చేయించుకోవాలి.

… మహేశ్వర్‌రావు బండారి

డాక్టర్‌ బీరప్ప
సర్జికల్‌ గ్యాస్ట్రో ఎంటరాలజి విభాగ అధిపతి
నిజామ్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (నిమ్స్‌)

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement