e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, September 20, 2021
Home ఆరోగ్యం ఫంగస్‌, బ్యాక్టీరియాల.. ‘చెవి’ మెలి తిప్పండి!

ఫంగస్‌, బ్యాక్టీరియాల.. ‘చెవి’ మెలి తిప్పండి!

జోరువాన. చెవిలో హోరు! కొంతసేపటికి వర్షం తగ్గుతుంది. హోరుమాత్రం ఆగదు. అంతలోనే, వినికిడి శక్తి తగ్గినట్టు అనిపిస్తుంది. హఠాత్తుగా చెవిలో నొప్పి, వాపు, చీము. వానలకూ, చెవి రోగా లకూ దగ్గరి సంబంధం ఉందంటారు.. చెవి-ముక్కు-గొంతు వ్యాధుల నిపుణులు.

వానకాలం వచ్చిందంటే చాలు. చెవి రుగ్మతలు మొదలవుతాయి. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికైతే, చెవికి సంబంధించిన ఇన్‌ఫెక్షన్లు మరీ ఎక్కువ. దీనివల్ల విపరీతమైన నొప్పి, వినికిడి సమస్యలు ఎదురవుతాయి. ఇవి ప్రధానంగా రెండు రకాలు. ఒకటి.. చెవిలో నీరు చేరడం లేదా జలుబువల్ల వచ్చేవి. రెండు.. టీబీ, షుగర్‌, బీపీ, క్యాన్సర్‌ వంటి దీర్ఘకాలిక వ్యాధులవల్ల ఉత్పన్నం అయ్యేవి. వర్షకాలంలో వైరల్‌, బ్యాక్టీరియల్‌, ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్లు సాధారణమే. వైరల్‌ ఇన్‌ఫెక్షన్స్‌ వాటంతట అవే తగ్గిపోతాయి. చికిత్స అవసరం తక్కువ. కానీ ఫంగల్‌, బ్యాక్టీరియల్‌ ఇన్‌ఫెక్షన్స్‌కు మాత్రం చికిత్స తప్పనిసరి. సకాలంలో వైద్యం అందకపోతే వినికిడి సమస్యలు రావచ్చు.

- Advertisement -

చెవిలో నీరు చేరితే..
చెవికి సంబంధించి మూడు ప్రధాన భాగాలు ఉంటాయి. ఒకటి బయటి చెవి. ఇది బయటకు కనిపిస్తుంది. రెండోది మధ్య చెవి. దీనిలోనే కర్ణభేరి ఉంటుంది. మూడోది లోపలి చెవి. ఇక్కడ ‘కాక్లియా’ ఉంటుంది. కాక్లియా అనేది మనం శబ్దాలను వినేందుకు దోహదపడుతుంది. సాధారణంగా చెవిలో నీరు చేరతే రెండు రకాల ఫంగస్‌ ఇన్‌ఫెక్షన్స్‌ ఏర్పడతాయి. ఒకటి ‘అస్పర్‌జిల్లస్‌ నైగర్‌’, రెండోది ‘కాండిడా అల్బిక్యాన్‌’. వర్ష్షకాలంలో ఎక్కువ శాతం ‘అస్పర్‌ జిల్లస్‌ నైగర్‌’ అనే ఫంగస్‌ చెవిలో పోగవుతుంది. చూడ్డానికి ఇది తడిసిన న్యూస్‌ పేపర్‌లా ఉంటుంది. ‘కాండిడా అల్బిక్యాన్‌’ ఫంగస్‌ అయితే తెల్లని బూజులా కనిపిస్తుంది. చెవిలో నీరు చేరడం వల్ల, అక్కడున్న గుబిలి బయటకు రాకుండా పేరుకుపోతుంది. ఫలితంగా ఫంగస్‌ కాపురం పెడుతుంది. ఇది తీవ్రమైన నొప్పిని కలిగిస్తుంది. వినికిడి సమస్యలకూ దారితీస్తుంది. బయట చెవిలో చేరిన నీటివల్ల మధ్య, లోపలి చెవికి కూడా ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్స్‌ విస్తరించవచ్చు. పరీక్షల ద్వారా చెవిలో ఏ తరహా ఫంగస్‌ ఏర్పడిందో గుర్తిస్తారు. తగిన చికిత్సతో సమస్యను పరిష్కరిస్తారు.

జలుబు వల్ల….
ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. వర్ష కాలంలో వానలో తడుస్తాం. జలుబు బారిన పడతాం. ఈ కారణంగా కూడా చెవి సమస్యలు ఏర్పడతాయి. ముఖ్యంగా జలుబువల్ల బ్యాక్టీరియల్‌ ఇన్‌ఫెక్షన్స్‌కు ఆస్కారం ఎక్కువ. ముక్కునుంచి చెవికి ‘యుస్టేషన్‌ ట్యూబ్స్‌’ అనే రెండు గొట్టాలు అనుసంధానమై ఉంటాయి. జలుబు చేసినప్పుడు ముక్కు వెనుక ఉన్న ‘యుస్టేషన్‌’ ట్యూబ్‌ గుండా ఇన్‌ఫెక్షన్‌ మధ్యచెవికి విస్తరిస్తుంది. దీనివల్ల చెవి మూసుకుపోయినట్లు అనిపిస్తుంది. సరిగ్గా వినిపించదు. నొప్పి ఉంటుంది. ఈ దశలో వైద్యులను సంప్రదించి, మందులు వాడితే సమస్య తగ్గిపోతుంది.

నిర్లక్ష్యం చేస్తే మాత్రం..
చెవిలో ఇన్‌ఫెక్షన్‌కు సరైన చికిత్స తీసుకోవాల్సిందే. లేదంటే, అక్కడ బ్యాక్టీరియా తిష్టవేస్తుంది. క్రమంగా అది ద్రావణంలా మారుతుంది. దీంతో చెవిపై మరింత ఒత్తిడి పెరుగుతుంది. ఫలితంగా, మధ్యచెవిలోని కర్ణభేరికి రంధ్రం ఏర్పడుతుంది. అక్కడ నిండిపోయిన ద్రావణం కర్ణభేరికి ఏర్పడిన రంధ్రంలోంచి బయటకు వస్తుంది. దీన్నే మనం ‘చీము కారడం’అంటాం. ఈ దశలో విపరీతమైన నొప్పితోపాటు వినికిడి సమస్యా ఉంటుంది.

ఇన్‌ఫెక్షన్స్‌
ముఖ భాగంలోని గ్రంథులపై ఏర్పడిన ఇన్‌ఫెక్షన్స్‌ కారణంగా కూడా చెవి సమస్యలు రావచ్చు. ముఖ్యంగా ముక్కు వెనక భాగంలో ఉన్నటువంటి ‘ఎడినాయిడ్స్‌’ గ్రంథి వాచిపోవడం వల్ల, ఆ గ్రంథిపై ఏర్పడిన ఇన్‌ఫెక్షన్‌ వల్ల చాలాసార్లు సైనస్‌ వల్లకూడా చెవి సమస్యలు ఉత్పన్నమవుతాయి. కొన్ని దీర్ఘకాలిక రుగ్మతలు కూడా చెవి సమస్యలకు ఓ కారణం కావచ్చు. ముఖ్యంగా క్యాన్సర్‌, టీబీ, షుగర్‌, బీపీ తదితర వ్యాధులతో బాధపడుతున్న రోగులలో చెవి సమస్యలకు ఆస్కారం ఎక్కువ. దీర్ఘకాలిక రుగ్మతలున్నవారు నిత్యం వినియోగించే ఔషధాల దుష్ప్రభావాన్నీ విస్మరించలేం. ముఖ్యంగా క్యాన్సర్‌ మందులు రోగ నిరోధక శక్తిని తగ్గిస్తాయి. ఈ పరిస్థితుల్లో రోగి చెవి ఇన్‌ఫెక్షన్లకు గురికావచ్చు.

చికిత్సా పద్ధ్దతులు
సాధారణంగా చెవిలో వైరల్‌ ఇన్‌ఫెక్షన్స్‌ ఏర్పడినప్పుడు ఎలాంటి చికిత్సా అవసరం లేదు. సమస్య దానంతట అదే పరిష్కారం అవుతుంది. కానీ, కొంతమందిలో తీవ్రమైన నొప్పి, వినికిడి సమస్యలు ఏర్పడుతాయి. అలాంటివారు ఈఎన్‌టీ వైద్యులను సంప్రదించాలి. అనేక కారణాలవల్ల వచ్చే ఫంగస్‌ ఇన్‌ఫెక్షన్స్‌కు యాంటీ ఫంగల్‌ ఇయర్‌ డ్రాప్స్‌, బ్యాక్టీరియల్‌ ఇన్‌ఫెక్షన్స్‌కు యాంటీ బ్యాక్టీరియల్‌ మందులు వాడాల్సి ఉంటుంది. సమస్య తీవ్రంగా ఉన్నప్పుడు, పరీక్షలు నిర్వహించి తగిన చికిత్స అందిస్తారు. చెవి సమస్య ప్రారంభ దశలో ఉన్నప్పుడే ఈఎన్‌టి వైద్యులను సంప్రదిస్తే చిన్నపాటి చికిత్సతో, అతి సాధారణమైన మందులతో వ్యాధిని నయం చేస్తారు.

ఈ జాగ్రతలు తప్పనిసరి..

  • చెవిలో నీరు చేరకుండా జాగ్రత పడాలి. పొరపాటున చేరితే మాత్రం, వెంటనే సాధారణ కాటన్‌ బట్టతో లేదా దూదితో జాగ్రత్తగా శుభ్రం చేయాలి.
  • వర్షంలో తప్పనిసరిగా వెళ్ళాల్సి వస్తే, ఇయర్‌ ప్లగ్స్‌ పెట్టుకోవడం ఉత్తమం.
  • చలికాలంలో చెవులు కప్పి ఉంచేలా మంకీ క్యాప్‌, మఫ్లర్‌ వంటివి ధరించాలి
  • మార్కెట్లో లభించే కమర్షియల్‌ బడ్స్‌ వాడకూడదు.
  • సొంత వైద్యం, నాటు వైద్యం ప్రమాదకరం.

డాక్టర్‌ లోక సుదర్శన్‌రెడ్డి
ఈఎన్‌టీ విభాగాధిపతి, ఉస్మానియా వైద్యకళాశాల, ప్రభుత్వ ఈఎన్‌టీ దవాఖాన, హైదరాబాద్‌

… మహేశ్వర్‌రావు బండారి

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana